Bheemla Nayak Movie Review Rating Story Cast and Crew 'భీమ్లా నాయక్‌' మూవీ రివ్యూ

Teluguwishesh 'భీమ్లా నాయక్‌' 'భీమ్లా నాయక్‌' Get information about Bheemla Nayak Telugu Movie Review, Pawan Kalyan Bheemla Nayak Movie Review, Bheemla Nayak Movie Review and Rating, Bheemla Nayak Review, Bheemla Nayak Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 97251 3.5 stars, based on 1 reviews
 • చిత్రం  :

  'భీమ్లా నాయక్‌'

 • బ్యానర్  :

  సితారా ఎంటర్ టైన్మెంట్స్

 • దర్శకుడు  :

  సాగర్ కె చంద్ర

 • నిర్మాత  :

  సూర్యదేవర నాగవంశీ

 • సంగీతం  :

  ఎస్ తమన్

 • సినిమా రేటింగ్  :

  3.53.53.5  3.5

 • ఛాయాగ్రహణం  :

  రవి కె చంద్రన్

 • ఎడిటర్  :

  నవీన్ నూలీ

 • నటినటులు  :

  పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి,నిత్య మీనన్, ఐశ్వర్య రాజేష్’, ఇతర ప్రధాన పాత్రల్లో రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి తదితరులు

Bheemla Nayak Movie Review A Massy And Racy Version Of The Original

విడుదల తేది :

2022-02-25

Cinema Story

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మ్యాచో స్టార్ రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన 'భీమ్లా నాయక్' సినిమా ఈ రోజు విడుదలైంది. చూసివాళ్లంతా సినిమా మాస్ ఫీస్ట్ అంటున్నారు. మరికొందరు శివరాత్రి వరకూ థియేటర్లలో పవన్ కల్యాణ్ శివ తాండవం అని , పవన్ విధ్వంసాన్ని ఆపలేరని  చెప్తున్నారు. అసలు సినిమా ఎలా ఉంది.. లా.. లా భీమ్లా.. అదరగొట్టు.. దంచికొట్టు.. ఒడిసిపట్టు.. అడవి పులి.. అంటూ తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటినుంచో వినబడుతున్నా.. ఇవాళ తారాస్థాయిలో వినిపించే పాట ఇదే. స్మార్ట్ ఫోన్ల నుంచి హోటళ్లు, అటోలు.. కార్లు.. ఇలా ఎక్కడ విన్నా ప్రతిధ్వనించే పాట ఇదే.

ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు ఎంతో అసక్తిగా ఎప్పుడెప్పుడా అంటూ గత కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్న చిత్రం భీమ్లానాయక్ ఇవాళ విడుదలైంది. ఇంతకుముందే ‘వకీల్ సాబ్’ వంటి సక్సెస్ ఫుల్ సినిమా వచ్చినా.. అందులో అభిమానులకు కావాల్సినంత మాస్ మసాలా లేదు. దీంతో మలయాళంలో ఘన విజయం సాధించిన 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' చిత్రం రీమేక్‌ చేయడంతో పాటు దానికి మాస్ హంగులతో పాటు అభిమానులు ఆశించే అన్ని కోణాలు పుష్కలంగా ఇమిడ్చారు దర్శకుడు. అటు పవన్ అభిమానులతో పాటు ఇటు దగ్గుబాటి రానా అభిమానులను కూడా సంతృప్తిపర్చేలా కథను తీర్చిదిద్దాడు.

ఓరిజినల్ మళయాలం చిత్రం 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌' కన్నా రెట్టింపు ఉత్సాహం అందించే స్థాయిలో రూపోందించారు. ఈ బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. ఈ చిత్రానికి మరోమారు మాటలు, డైలాగులు అందించారు. దీంతో పవన్ నుంచి చానాళ్ల తరువాత వస్తున్న చిత్రం కావడంతో పవన్ ఫ్యాన్స్ , మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కరోనా కారణంగా వాయిదాలమీద వాయిదా పడుతూ వస్తున్న భీమ్లా నాయక్ ఎట్టకేలకు ఈ రోజు రిలీజ్ కావడంతో పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఈ నేపద్యంలో థియోటర్స్ లో ఉత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. పవన్ కటౌట్ లకు అభిమానులు పాలాభిషేకాలు చేస్తున్నారు, బాణాసంచా కాల్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.  


కథ

ఇద్దరు నిజాయితీ గల వ్యక్తుల మధ్య సాగిన ఇగో డ్రామాను తెరెకెక్కిస్తే అదే భీమ్లా నాయక్ చిత్రం. భీమ్లా నాయక్‌(పవన్‌కల్యాణ్‌)కర్నూలు జిల్లా హఠకేశ్వర్‌ మండలం పోలీస్‌ స్టేషన్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌. నిజాయతీ కలిగిన అధికారి. డానియల్‌ శేఖర్‌(రానా) ఆర్మీలో పనిచేసి రిటైర్‌ అవుతాడు. రాజకీయంగా పలుకుబడి కలిగిన కుటుంబానికి చెందిన వ్యక్తి. రిటాయర్డ్ హవల్దార్ డాని, డానియల్ శేఖర్ ఒక రోజు రాత్రి కార్ లో తన సొంతూరుకు వెళుతూ ఉంటాడు. కారు డ్రైవర్ నడుపుతూంటే .. తను వెనుక సీట్లో నిద్రపోతాడు. ఈ లోగా ఓ చెక్ పోస్ట్ దగ్గర  ఆ కార్ ని పోలీస్ లు ఆపుతారు. అది లిక్కర్ ఫ్రీ జోన్. అనుకోకుండా పోలీసుల చెకింగ్ లో డానీ కార్ లో లిక్కర్ బాటిల్స్ దొరుకుతాయి. తాను రిటైర్డ్ హవల్దార్ నని, తనకు అవి కోటాలో వచ్చాయని చెప్పినా ఎవరూ పట్టించుకోరు.  ఆ ఏరియాలో మధ్య నిషేధం ఉండడంతో.. పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా..డానీ  వారిమీద తిరగబడతాడు. అది పోలీస్ లకు కోపం తప్పిస్తుంది. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో అక్కడే డ్యూటీలో ఉన్న భీమ్లానాయక్‌.. డానియల్‌ను కొట్టి స్టేషన్‌కు తీసుకెళ్తాడు. దీంతో అతడి అహం దెబ్బతింటుంది. డానీ హర్ట్ అవుతాడు. చాలా అవమానంగా ఫీలవుతాడు.

పోలీస్ లు ఎప్పటిలాగే డానీ ఫోన్ లాక్కుని , అతడి కార్ ను సీజ్ చేసి కేస్ బుక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఈలోగా అక్కడే ఉన్న ఓ  కానిస్టేబుల్ అతడి ఫోన్ ను చెక్ చేస్తూంటే.. డానీకు పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఉన్నాయని అర్దమవుతుంది.  అయినా తన డ్యూడీ ప్రకారం అతడి మీద కేస్ ఫైల్ చేసి అతడ్ని కోర్ట్ కు సబ్ మిట్ చేసే తీరతానని చెబుతాడు. దాంతో డానీకు మండిపోతుంది. భీమ్లానాయక్‌ను ఎలాగైనా దెబ్బ కొట్టాలని భావిస్తాడు. అందుకు డానియల్‌ శేఖర్‌ ఏం చేశాడు? భీమ్లానాయక్‌ ఉద్యోగం ఎందుకు పోయింది? ఒకరినొకరు చంపుకొనేంత వరకూ దారితీసిన పరిస్థితులు ఏంటి? ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు? ఈ గొడవలో సుగుణ(నిత్యామీనన్) ఎలా సఫరైంది..చివరికి భీమ్లా, డానీ శత్రుత్వాన్ని విడిచిపెట్టారా..ఫైనల్ గా ఏమైంది అన్నదే మిగతా కథ.

cinima-reviews
'భీమ్లా నాయక్‌'

విశ్లేషణ

ఇద్దరు బలమైన వ్యక్తుల అహం దెబ్బతిన్న కారణంగా ఉత్పన్నమయ్యే పరిణామాలు చోటు చేసుకున్నాయన్నదే ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్ర కథ. అదే పాయింట్‌ను ‘అహంకారానికి - ఆత్మగౌరవానికి మధ్య మడమ తిప్పని యుద్ధం’ అంటూ ‘భీమ్లానాయక్‌’ సినీ యూనిట్ ప్రచార చిత్రాల్లోనే చెప్పింది. ఒక భాషలో విజయవంతమైన చిత్రాన్ని మరో భాషలో ప్రేక్షకులకు దగ్గరయ్యేలా తీర్చిదిద్దడం అంటే మామూలు విషయం కాదు. మరీ ముఖ్యంగా మాస్‌లో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉన్న పవన్ కల్యాణ్ లాంటి నటుడిని దృష్టిలో పెట్టుకుని సినిమా తీయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ విషయంలో ‘భీమ్లానాయక్‌’ టీమ్‌ విజయం సాధించింది. పవన్ నుంచి ఆయన అభిమానులు ఏం ఆశిస్తారో అన్ని అంశాలను మేళవించి సినిమాను తీర్చిదిద్దింది.

మాతృకలో మాదిరిగానే పవన్‌, రానా పాత్రలను పరిచయం చేస్తూ సినిమాను ప్రారంభించిన దర్శకుడు అక్కడితో పోలిస్తే రెండు పాత్రలు, వాళ్లకున్న నేపథ్యాన్ని మరింత ఎలివేట్‌ చేస్తూ చూపించారు. ఇద్దరు బలమైన వ్యక్తుల (ఎంతవరకైనా వెళ్లే తత్వం) మధ్య యుద్ధం జరగబోతోందని ప్రేక్షకుడికి ముందే చెప్పేశారు. దీంతో వాళ్లకెదురయ్యే పరిస్థితుల్లో ఎవరెలా స్పందిస్తారన్న ఆసక్తిని ప్రేక్షకుడిలో కలిగించారు. దీనికి తోడు త్రివిక్రమ్‌ సంభాషణలు ప్రతి సన్నివేశాన్ని మరింత ఎలివేట్‌ చేసింది. ముఖ్యంగా భీమ్లానాయక్‌ పలికే సంభాషణలు అభిమానులతో విజిల్స్‌ వేయించేలా ఉన్నాయి. విరామ సన్నివేశాల ముందు వచ్చే యాక్షన్‌ సీన్లు మరింత మెప్పిస్తాయి.

ద్వితీయార్ధంలో కథకు మరిన్ని పార్శ్వాలు జోడించారు.  ఒరిజినల్‌ కథకు అదనపు హంగులు జోడించి పూర్తిగా పవన్‌ కల్యాణ్‌ మాస్‌ ఫాలోయింగ్‌కు అనుగుణంగా సన్నివేశాలను తీర్చిదిద్దారు. ఇవే కాస్త నిడివిని పెంచాయా? అనిపిస్తాయి. తన ఉద్యోగం పోవడానికి కారణమైన డానియల్‌తో భీమ్లానాయక్‌ చేసే పోరాటానికి మాస్‌ ఎలిమెంట్స్‌ జోడించి తెరకెక్కించిన విధానం ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రతి సన్నివేశం నువ్వా-నేనా అన్నట్లు సాగుతుంది. ఇరువురి మధ్య జరిగే పోరాటాలు ఉత్కంఠగా సాగుతాయి. రెండు బలమైన శక్తులు ఢీకొన్నప్పుడు దాని వల్లే జరిగే పరిణామాలు వారికే పరిమితం కావు అని విషయాన్ని కూడా చక్కగా తెరకెక్కించి చూపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

ఈ ఈగో ఘర్షణల మధ్య తమకు చుట్టూ ఉన్నవారు ఎలా ప్రభావితం అవుతారు.? ఎంతలా భాధపడతారన్న విషయాలను ఇతర పాత్రల ద్వారా ఎమోషనల్‌గా రూపోందించారు. దానికి తోడు సెకండాఫ్‌లోనూ పవన్‌ నుంచి వచ్చే డైలాగ్‌లు ప్రేక్షకులతో విజిల్స్‌ వేయిస్తాయి. ప్రతి సన్నివేశం ఒకదానిని మించి మరొకటి ఉండేలా రూపొందించారు. తెరపై ప్రధానంగా పవన్‌-రానాలే కనిపిస్తారు. క్లైమాక్స్‌ ముందు వచ్చే ట్విస్ట్‌ మెప్పిస్తుంది. ఒక బలమైన ఎమోషన్‌తో సినిమాను ముగించిన విధానమూ బాగుంది. ‘భీమ్లా నాయక్‌’ టైటిల్‌ పెట్టడంతో కేవలం పవన్‌ పాత్రను మాత్రమే ఎలివేట్‌ చేస్తారని అంతా భావించారు. కానీ మాతృకలో మాదిరిగానే  రానా పాత్రకూ న్యాయం చేసేలా సన్నివేశాలను తీర్చిదిద్ది విమర్శకులకు చెక్‌ పెట్టారు.

నటీనటుల విషాయానికి వస్తే..

భీమ్లానాయక్‌ చూసిన తర్వాత ఆ పాత్రలో పవన్ ను తప్ప మరొకరిని ఊహించుకోలేం. అంతలా పాత్రను ఆకళింపు చేసుకున్నారు. ఆయన సంభాషణలు పలికే విధానం, సవాళ్లు విసరడం ‘బద్రి’ నాటి రోజులను గుర్తు చేస్తాయి. పవన్‌ అభిమానులకైతే సినిమా మొత్తం కనుల విందే. పవన్‌కల్యాణ్ తెరపై కనిపిస్తే మరొక పాత్ర మరుగున పడిపోతుంది. కానీ, అందుకు భిన్నంగా ప్రతి సన్నివేశంలో పవన్‌కు దీటుగా డానియల్‌ శేఖర్‌గా రానా తనదైన నటనతో మెప్పించాడు.

రాజకీయంగా అండదండలు ఉన్న వ్యక్తి ఏవిధంగానైతే అహంకారాన్ని ప్రదర్శిస్తాడో చివరి వరకూ రానా అదే టెంపోను కొనసాగించాడు. ఇక ఇరువురి మధ్య పోరాట సన్నివేశాలు.. సింహం, మదపుటేనుగు ఢీకొన్నట్లు ఉంటాయి. భీమ్లానాయక్‌ భార్య సుగుణగా నిత్యా మేనన్‌ కనిపించింది. మాతృకతో పోలిస్తే ఈపాత్ర స్క్రీన్ స్పేస్‌ను పెంచారు. సీఐ కోదండరాంగా మురళీశర్మ, డానియల్‌ భార్యగా సంయుక్త మేనన్‌, అతడి తండ్రిగా సముద్రఖని తమ పరిధి మేరకు నటించారు. బ్రహ్మానందం తళుక్కున మెరిశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సినిమా కేవలం ఇద్దరి మధ్య నటవిశ్వరూప ప్రదర్శన అని చెప్పవచ్చు.టెక్నికల్ అంశాలకు వస్తే..

టెక్నికల్ గా ‘భీమ్లా నాయక్’లో ఉన్నత ప్రమాణాలు కనిపిస్తాయి. సినీనిర్మాతలు క్వాలిటీ విషయంలో రాజీపడకూడదని మాతృకకు మించిన స్థాయిలో సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం బాగుంది. ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధంలో నేపథ్య సంగీతం ప్రతి సన్నివేశాన్ని ఎలివేట్‌ చేసింది. పాటలు ఓకే. 'లాలా.. భీమ్లా' థియేటర్‌లో విజిల్స్‌ వేయిస్తుంది. రవి కె.చంద్ర సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. యాక్షన్‌ సన్నివేశాలు హైలైట్‌ అని చెప్పవచ్చు. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ షార్ప్‌గా ఉంది. కథకు ఏది అవసరమో అంతే ఉంచారు.

ఈ సినిమాకు త్రివిక్రమ్‌ వెన్నెముక అంటూ పవన్‌ చెప్పారు. అది వందశాతం నిజం. మలయాళ 'అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌'ను తెలుగు ప్రేక్షకులకు, అదీ పవన్‌ అభిమానులను మెప్పించేలా తీర్చిదిద్దడంలో ఆయన మార్కు కనిపించింది. సంభాషణలు, స్క్రీన్‌ప్లే సినిమాకు ఆయువు పట్టు అయ్యాయి. త్రివిక్రమ్‌ స్కిప్ట్‌ను అదే స్థాయిలో చూపించడంలో యువ దర్శకుడు సాగర్‌ కె.చంద్ర విజయం సాధించారు. టేకింగ్‌లో తనదైన ఫ్లేవర్‌ చూపించారు. చిత్ర నిర్మాణం విషయంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎక్కడా రాజీపడలేదు. ప్రతి సన్నివేశానికి రిచ్‌లుక్‌ వచ్చేలా ఖర్చు పెట్టారు.

తీర్పు:  అభిమానుల నవవసంతాల నిరీక్షణ.. ఆకాశాన్నే హద్దుగా మార్చిన పవర్ ప్యాక్డ్ ‘భీమ్లా నాయక్’.!

చివరగా.. ‘‘భీమ్లా నాయకుడే..’’

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh