Major Movie Review Rating Story Cast and Crew 'మేజర్' మూవీ రివ్యూ

Teluguwishesh 'మేజర్' 'మేజర్' Get information about Major Telugu Movie Review, Adivi Sesh Major Movie Review, Major Movie Review and Rating, Major Review, Major Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 97965 3.25 stars, based on 1 reviews
 • చిత్రం  :

  'మేజర్'

 • బ్యానర్  :

  సోని పిక్చర్స్, జీఎంబి ఎంటర్ టైన్మెంట్స్, ఎ ప్లస్ ఎస్ మూవీస్

 • దర్శకుడు  :

  శశికిరణ్ తిక్క

 • నిర్మాత  :

  సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్, జీఎంబి ఎంటర్ టైన్మెంట్స్, ఎ ప్లస్ ఎస్ మూవీస్

 • సంగీతం  :

  శ్రీచరణ్ పాకాల

 • సినిమా రేటింగ్  :

  3.253.253.25  3.25

 • ఛాయాగ్రహణం  :

  వంశీ పచ్చిపులుసు

 • ఎడిటర్  :

  ఎస్ వినయ్ కుమార్, పవన్ కల్యాణ్

 • నటినటులు  :

  అడివి శేష్, సయీ మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ, శోభిత ధూళిపాళ్ల తదితరులు

Major Movie Adivi Sesh Movie Gets Phenomenal Response From Audience

విడుదల తేది :

2022-06-03

Cinema Story

కథ

విభిన్నమైన సినిమాలతో తన పేరును ఒక బ్రాండుగా మార్చుకున్న హీరో అడివి శేష్. హీరోయిజానికి అనుగూణంగా కథ కాకుండా.. విభిన్నమైన కథను ఎంచుకుని.. తన పాత్రకు అనుగూణంగా తనను తాను ములుచుకుని నటించే నటుడు అడవి శేష్. అతడి సినిమా అంటే కొత్తగా.. ప్రత్యేకంగా ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఏర్పడింది. అదే ఆయనను మేజర్ చిత్రం తీసేందుకు ప్రేరణ కల్పించింది. 26/11 ముంబయి దాడుల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపోందిన విషయం తెలసిందే.

‘మేజర్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. మరి ఈ చిత్రం అంచనాలను ఏమేర అందుకుంది.. శేష్ బ్రాండును ఏమేర నిలబెట్టింది.. అన్నది తెలుసుకోవాలంటూ కథలోకి ఎంటర్ కావాల్సిందే.. సందీప్ (అడివి శేష్) ఇస్రో అధికారి అయిన ఉన్నికృష్ణన్ తనయుడు. తన కొడుకు బాగా చదువుకుని డాక్టరో ఇంజినీరో కావాలన్నది ఉన్నికృష్ణన్ కోరిక కాగా.. సందీప్ మాత్రం ఎయిర్ ఫోర్స్ లో చేరాలని అనుకుంటాడు. అందులో అవకాశం రాకపోయేసరికి సైనికుడు కావాలని నిర్ణయించుకుంటాడు. తండ్రికి ఇష్టం లేకపోయినా.. తాను కోరుకున్నట్లే సైన్యంలో చేరతాడు సందీప్.

తర్వాత తాను కాలేజీ రోజుల్లో ప్రేమించిన ఇషా (సయీ మంజ్రేకర్)ను పెళ్లి చేసుకుంటాడు. ఐతే కుటుంబం కంటే కూడా సైనికుడిగా దేశాన్ని రక్షించడమే ముఖ్యం అనుకునే సందీప్ కు వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు తలెత్తుతాయి. తన భార్యకు దూరం కావాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆ సమయంలోనే ముంబయిలో తాజ్ హోటల్ మీద ఉగ్రవాదులు దాడి జరిపారని.. హోటల్లో వందల మందిని బందీలుగా తీసుకున్నారని సందీప్ కు తెలుస్తుంది. తన టీంతో కలిసి అక్కడ అడుగు పెట్టిన సందీప్ ఉగ్రవాదులతో ఎలా పోరాడాడు.. బందీలను ఎలా రక్షించాడు.. ఈ పోరాటంలో అతను ఎలా వీరమరణం పొందాడు అన్నది మిగతా కథ.

cinima-reviews
'మేజర్'

విశ్లేషణ

ముంబైలోని హోటల్ తాజ్ పై జరిగిన ఉగ్రదాడిలో సందీప్ ఉన్నికృష్ణన్ ప్రాణత్యాగం చేయడమే కాదు.. ఆయన బాల్యం .. టీనేజ్ .. ప్రేమలో పడటం .. తన కుటుంబ సభ్యులతో తనకి గల అనుబంధం .. దేశం పట్ల ఉన్న భక్తిని గురించి చాలామందికి తెలియదు. 'ఆయన ఎలా చనిపోయారనేది అందరికీ తెలుసు .. ఎలా బ్రతికారనేది ఈ సినిమా చూపిస్తుంది. నిజంగానే హోటల్ తాజ్ ఆపరేషన్ కి ముందు సందీప్ అంటే ఏమిటనే ప్రశ్నకి సమాధానంగానే ఈ కథ నడుస్తుంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం సన్నివేశాల అధారంగా రూపోందిన ఈ చిత్రం ప్రతీఒక్కరినీ కదిలిస్తుంది. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అన్న మాటకు అర్థం చెప్పిన

దర్శకుడు శశికిరణ్ తిక్కా .. ఈ కథను ఎక్కడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా రాసుకున్న తీరు బాగుంది. కథని ఎక్కడి నుంచి ఎలా చెప్పాలో .. అక్కడి నుంచి అలాగే మొదలుపెట్టి .. ఎక్కడ ఆపాలో అక్కడే ఆపాడు. ఈ మధ్యలో సందీప్ లవ్ ..  ఎమోషన్స్ .. యాక్షన్ ను సహజత్వానికి చాలా దగ్గరగా ఆవిష్కరించాడు. చాలా తక్కువ సమయంలో  పాత్రల నుంచి మంచి ఎమోషన్స్ ను రాబట్టాడు. హోటల్ తాజ్ లో నిజంగా జరుగుతున్న సన్నివేశాలను చూసినట్టుగా ఉంటుందే తప్పా, సినిమా చూస్తున్నట్టుగా ఎక్కడా అనిపించదు. అయితే కథ పుంజుకోవడానికి కాస్త సమయం తీసుకున్నాడు. అక్కడ ఫీలింగ్స్ ను రాబట్టినప్పటికీ .. కాస్త స్లో అయినట్టుగా అనిపిస్తుంది.  

హోటల్ తాజ్ పై దాడి ఎపిసోడ్ లో, చుట్టూ భయాందోళనల్లో జనాలు .. ఎటు చూసినా కాల్పుల మోతలు .. బాంబుల శబ్దాలు .. హోటల్లో తీవ్రవాదుల బారిన పడకుండా మిగతా వారిని రక్షించాలి .. అదే సమయంలో తీవ్రవాదులను మట్టుబెట్టాలి .. అందు కోసం ఒక స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. కొడుకు ఈ ఆపరేషన్ లో ఉన్నాడని తెలిసి తల్లిదండ్రుల టెన్షన్ .. మరో వైపున సందీప్ భార్య ఆందోళన .. ఇలా అన్నివైపుల నుంచి అన్ని పాత్రల వైపు నుంచి సీన్స్ ను టైట్ చేస్తూ .. ప్రేక్షకులను ఉత్కంఠకు .. ఉద్వేగానికి లోనయ్యేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.

నటీనటుల విషాయానికి వస్తే..

‘క్షణం.. గూఢచారి.. ఎవరు సినిమాలతో ఇప్పటికే ప్రేక్షకులకు బాగా చేరువ అయిన అడివి శేష్.. ఈ సినిమాతో వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదిస్తాడు. సందీప్ పాత్రలో ఒదిగిపోయిన అతను.. నిజంగా ఆ వ్యక్తినే చూస్తున్న భావన కలిగించాడు. ఒక సైనికుడు ఎలా ఉంటాడో అలా కనిపించాడు. చాలా త్వరగా అతడి పాత్రకు అలవాటు పడేలా చేయడంలో అతను విజయవంతం అయ్యాడు. పాత్రకు అవసరమైన ఫిజిక్ తో కనిపించడమే కాక.. ఎక్కడా మోతాదు మించకుండా కొలిచినట్లుగా హావభావాలు పలికిస్తూ ఆద్యంతం ఆకట్టుకున్నాడు.

తన పాత్రతో ప్రేక్షకులు ప్రయాణం చేసేలా.. దాంతో ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా చేయడంలో శేష్ పాత్ర కీలకం. నటుడిగా అతడి కెరీర్లో నిలిచిపోయే పాత్రల్లో ఇదొకటనడంలో సందేహం లేదు. ‘గని’ సినిమాలో చాలా పేలవంగా కనిపించిన సయీ మంజ్రేకర్.. ఇందులో చాలా భిన్నంగా కనిపించింది. తనకు సూటయ్యే మంచి పాత్రలో ఆకట్టుకుంది. ప్రకాష్ రాజ్ తన అనుభవాన్ని చూపించాడు. పతాక సన్నివేశాల్లో స్పీచ్ ఇచ్చేదగ్గర తనకు తానే సాటి అనిపించాడు. రేవతికి పెద్దగా అవకాశం దక్కలేదు. ఉన్నంతలో బాగానే చేసింది. సందీప్ పై అధికారి పాత్రలో మురళీ శర్మ బాగా చేశాడు. ఆ పాత్రలో ఆయన పర్ఫెక్ట్ అనిపించాడు.టెక్నికల్ అంశాలకు వస్తే..

‘మేజర్’లో సాంకేతిక నిపుణులంతా గొప్ప ఔట్ పుట్ ఇచ్చారు. థ్రిల్లర్ సినిమాలకు నేపథ్య సంగీతం అందించడంలో మంచి నైపుణ్యం ఉన్న శ్రీ చరణ్ పాకాల.. తన కెరీర్లోనే ది బెస్ట్ అనదగ్గ ఔట్ పుట్ ఇచ్చాడు. ఉగ్రవాదుల దాడి మొదలైన దగ్గర్నుంచి ఆర్ఆర్ వేరే లెవెల్ కు వెళ్లిపోయింది. ప్రేక్షకుల్లో ఉద్వేగం.. ఉత్కంఠ రేకెత్తించేలా అద్భుతమైన నేపథ్య సంగీతంతో అతను సన్నివేశాలను పరుగులు పెట్టించాడు. ప్రొడక్షన్ డిజైన్.. యాక్షన్ కొరియోగ్రఫీ.. ఎడిటింగ్ కూడా అత్యుత్తమ ప్రమాణాలతో సాగాయి. నిర్మాణ విలువల విషయంలో ఎక్కడా రాజీ లేదు. సినిమాకు అవసరమైన మేర ఖర్చు చేశారు. రిచ్ గా తీర్చిదిద్దారు.

అబ్బూరి రవి మాటలు ఆకట్టుకుంటాయి. కథ-స్క్రీన్ ప్లే సమకూర్చిన శేష్.. రచయితగానూ బెస్ట్ ఔట్ పుట్ ఇచ్చాడు. కేవలం సందీప్ జీవితం గురించి తెలుసుకుంటే సరిపోదు.. ఉన్న సమాచారంతో కథాకథనాలను తీర్చిదిద్దడంలో శేష్ చూపించిన నైపుణ్యం ప్రశంసనీయం. అతడితో చక్కటి సమన్వయం ఉన్న శశికిరణ్ తిక్కా.. ‘గూఢచారి’ తర్వాత మరోసారి దర్శకుడిగా తన పనితనాన్ని చూపించాడు. సాంకేతిక నిపుణుల నుంచి గొప్ప ఔట్ పుట్ రాబట్టుకోవడంతో పాటు.. పేపర్ మీద ఉన్నదాన్ని అత్యుత్తమంగా తెరపై ప్రెజెంట్ చేశాడు.

తీర్పు: భారతమాత కోసం ప్రాణాలు తృణప్రాయమన్న సందీప్ ఉన్నికృష్ణన్ కథ.. అందరినీ కదలిస్తుంది..!

చివరగా.. దేశభక్తిని చాటే అమరవీరుడి కథ.. ‘మేజర్..!!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh