Sita Ramam Movie Review Rating Story Cast and Crew ‘సీతారామం’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘సీతారామం’ ‘సీతారామం’ Get information about Sita Ramam Telugu Movie Review, Dulquer Salmaan Sita Ramam Movie Review, Sita Ramam Movie Review and Rating, Sita Ramam Review, Sita Ramam Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 98390 3.25 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘సీతారామం’

  • బ్యానర్  :

    వైజయంతీ మూవీస్

  • దర్శకుడు  :

    హను రాఘవపూడి

  • నిర్మాత  :

    అశ్వనీ దత్

  • సంగీతం  :

    విశాల్ చంద్రశేఖర్

  • సినిమా రేటింగ్  :

    3.253.253.25  3.25

  • ఛాయాగ్రహణం  :

    పీఎస్ వినోద్, శ్రేయాస్‌ కృష్ణన్‌

  • ఎడిటర్  :

    కోటగిరి వెంకటేశ్వరరావు

  • నటినటులు  :

    దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన, సుమంత్, గౌతమ్ మేనన్, ప్రకాష్ రాజ్, తదితరులు

Sita Ramam Review Dulquer Salmaan, Mrunal Thakur, Rashmika S Film Is Sensational Hit

విడుదల తేది :

2022-08-05

Cinema Story

అందాల రాక్ష‌సి, ప‌డి ప‌డి లేచె మ‌న‌సు వంటి చిత్రాల‌తో సున్నిత‌మైన భావాల‌తో అంద‌మైన ప్రేమ క‌థ‌ల్ని రూపొందిస్తార‌నే పేరు తెచ్చుకున్నారు ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి . కాస్త విరామం త‌ర్వాత ఆయ‌న “సీతారామం” ప్రేమ‌క‌థ‌తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చారు. అగ్ర నిర్మాణ సంస్థ వైజ‌యంతీ మూవీస్ తెర‌కెక్కించిన సినిమా కావ‌డం, రొమాంటిక్ హీరోగా ద‌క్షిణాదిలో తిరుగులేని ఇమేజ్ ఉన్న దుల్క‌ర్ స‌ల్మాన్ క‌థానాయ‌కుడిగా న‌టించ‌డంతో ఈ సినిమా నిర్మాణం నుంచే ప్రేక్ష‌కుల్లో ఆసక్తిని పెంచింది. పాట‌లు, ట్రైల‌ర్ మ‌రింత ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేశాయి. పాజిటివ్ బ‌జ్‌తో రిలీజ్ అయిన “సీతారామం” ప్రేక్ష‌కుల్ని ఎంత వ‌ర‌కు మెప్పించిందో చూద్దాం.

లెఫ్ట్‌నెంట్ రామ్ ఓ అనాథ‌. క‌శ్మీర్‌లో సైనికుడిగా ప‌నిచేస్తుంటాడు. దేశం ప‌ట్ల విధేయ‌త‌, మాన‌వ‌త్వంపై మ‌మ‌కారంతో విధులు నిర్వ‌ర్తిస్తుంటాడు. పాకిస్థాన్ ఉగ్ర‌వాదులు వేసే ప‌న్నాగాల‌ను తిప్పి కొడుతూ త‌న దేశ‌భ‌క్తిని చాటుతుంటాడు. అనాథ అయిన అత‌నికి సీతామ‌హాలక్ష్మీ పేరుతో ఉత్త‌రాలు వ‌స్తుంటాయి. తిరిగి జవాబు రాద్దామంటే ఆ ఉత్త‌రాలకు చిరునామా ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో సీతామ‌హాల‌క్ష్మి ని వెతికి ప‌ట్టుకుంటాడు రామ్‌. హైద‌రాబాద్‌లో వారి ప‌రిచ‌యం క్ర‌మంగా ప్రేమ‌గా మారుతుంది.

పెళ్లి చేసుకుందామ‌నుకుంటున్న త‌రుణంలో వారిద్ద‌రికి అనూహ్య ప‌రిస్థితులు ఎదుర‌వుతాయి. ఇద్ద‌రు విడిపోతారు. రామ్ క‌శ్మీర్ వెళ్లిపోతాడు. అనంత‌రం రామ్ ఓ మిలిట‌రీ ఆప‌రేష‌న్ నిమిత్తం పాకిస్థాన్ భూభాగంలోకి అడుగుపెడ‌తాడు. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? సీత కోసం రామ్ రాసిన ఉత్త‌రాన్ని చేర‌వేసే బాధ్య‌త‌ను అఫ్రిన్ (ర‌ష్మిక మంద‌న్న‌) ఎందుకు స్వీక‌రించాల్సి వ‌చ్చింది? ఇర‌వై ఏళ్ల అనంత‌రం సీత‌ను చేరిన ఆ ఉత్త‌రంలో ఏముంది? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానంగానే మిగ‌తా క‌థ న‌డుస్తుంది.

cinima-reviews
‘సీతారామం’

విశ్లేషణ

ఆర్మీ నేప‌థ్యంలో సాగే ఓ పీరియాడిక‌ల్ ప్రేమ‌క‌థా చిత్రమిది. చాలా రోజుల త‌ర్వాత తెలుగులో రూపుదిద్దుకున్న ప్రేమ‌క‌థ కావ‌డం.. అది కూడా ఆర్మీ నేప‌థ్యంలో సాగ‌డంతో ప్రేక్షకుల‌కు ఓ స‌రికొత్త అనుభ‌వాన్ని పంచుతుంది. పాత్రల్ని, వాటి నేప‌థ్యాన్ని ప‌రిచ‌యం చేసే క్రమంలో అస‌లు క‌థ‌లోకి వెళ్లడానికి స‌మ‌యం తీసుకున్నాడు ద‌ర్శకుడు. సీతారామం మిష‌న్‌లో భాగంగా బాలాజీ (త‌రుణ్ భాస్కర్‌)తో క‌లిసి ఆఫ్రిన్ రంగంలోకి దిగ‌డంతో అస‌లు క‌థ మొద‌ల‌వుతుంది.

ఫ్లాష్ బ్యాక్ మొద‌ల‌య్యాక.. సీత కోసం రామ్ చేసిన ప్రేమ‌ప్రయాణం, ఆమెను క‌లిశాక ఇద్దరూ ద‌గ్గర‌య్యే తీరు, ఒక‌రిని విడిచి మ‌రొక‌రు ఉండ‌లేనంతగా అనుబంధం ఏర్పడిన వైనం, ఆ త‌ర్వాత క‌థ‌లో చోటు చేసుకునే సంఘ‌ర్షణ ఆక‌ట్టుకుంటుంది. ఈ క్రమంలో కొన్ని స‌న్నివేశాలు సుదీర్ఘంగా సాగుతున్నట్టు అనిపిస్తాయి. రామ్‌, సీత‌ల ప్రేమ‌క‌థ‌ను ఉత్తరాలతో మొద‌లుపెట్టిన తీరు ఆక‌ట్టుకుంటుంది. విరామ స‌మ‌యంలో వ‌చ్చే మ‌లుపు క‌థ‌ని మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారుస్తుంది.

ద్వితీయార్ధం విష‌యంలో త‌డ‌బాటుకి గుర‌వుతుంటార‌నే ఫిర్యాదు ద‌ర్శకుడు హ‌ను రాఘ‌వ‌పూడిపై ఉంది. కానీ.. ఈ సినిమాకి మాత్రం రివర్స్ అయ్యింది. ప్రథ‌మార్ధంలో స‌న్నివేశాలు ప్రేక్షకుడి ఊహ‌కు త‌గ్గట్టుగా, నత్తన‌డ‌క‌గా సాగిన‌ట్టు అనిపించినా.. ద్వితీయార్ధంపై మాత్రం మంచి ప‌ట్టు ప్రద‌ర్శించారు. ఇంత‌కీ రామ్ రాసిన లేఖ‌లో ఏముంది?  సీతామ‌హాల‌క్ష్మి, రామ్ ఒక్కట‌య్యారా? లేదా? ఆఫ్రిన్ ఎవ‌రు? అనే విష‌యాలు సెకండాఫ్‌లో కీల‌కం. ప‌లు పార్శ్వాలుగా క‌థ‌ని రాసుకుని, అంతే ప‌క‌డ్బందీగా న‌డిపించారు ద‌ర్శకుడు. ర‌చ‌న‌, మేకింగ్‌లో క‌వితాత్మక‌త ఉట్టిప‌డుతుంది. ప‌తాక స‌న్నివేశాలు సినిమాకి మ‌రో హైలైట్‌గా నిలుస్తాయి. సినిమా ప్రేక్షకుల మ‌న‌సుల్ని హ‌త్తుకునేలా ఉంటుంది.

నటీనటుల విషాయానికి వస్తే..

దుల్క‌ర్ స‌ల్మాన్ లెఫ్టినెంట్ రామ్ పాత్ర‌లో జీవించారు. దేశ‌భ‌క్తి క‌లిగిన సైనికుడిగా, సీత‌ను ప్రాణ‌ప్ర‌దంగా ప్రేమించే రామ్‌గా భిన్న కోణాల్లో ఆయ‌న న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. హృద్య‌మైన క‌థ‌తో పాటు దుల్క‌ర్ న‌ట‌న ఈ సినిమాకు ప్ర‌ధాన‌బ‌లంగా నిలిచింది. మృణాల్‌ఠాకూర్ అందంగా క‌నిపించింది. క‌ళ్ల‌తోనే చ‌క్క‌టి భావాల్ని ప‌లికించింది. సీత పాత్ర‌లో చ‌క్క‌గా ఒదిగిపోయింది. తెలుగులో ఆమెకిది ప‌ర్‌ఫెక్ట్ డెబ్యూగా చెప్పొచ్చు. ఇక ప్రేమికుల‌ను క‌లిపే వార‌ధిగా ర‌ష్మిక మంద‌న్న న‌ట‌న ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది.

సుమంత్ ఆర్మీ అధికారి విష్ణుశ‌ర్మ‌గా క‌థాగ‌మ‌నంలో కీల‌క‌మైన పాత్ర‌లో మెప్పించారు. మిగ‌తా న‌టీన‌టులు త‌మ ప‌రిధుల మేర‌కు న్యాయం చేశారు. ఇక సాంకేతికంగా ప్ర‌తి విభాగంలో ఉన్న‌తంగా అనిపిస్తుందీ చిత్రం. ఛాయాగ్ర‌హ‌ణం క‌శ్మీర్ అందాల్ని అద్బుతంగా ఒడిసిప‌ట్టింది. క‌వితాత్మ‌క భావ‌ల క‌ల‌బోత‌గా కొన్ని సంభాష‌ణ‌లు బాగున్నాయి. విశాల్‌చంద్ర‌శేఖ‌ర్ పాట‌లు మెలోడియ‌స్‌గా ఆక‌ట్టుకున్నాయి. నేప‌థ్య సంగీతం బాగుంది. ఇక నిర్మాణప‌రంగా వైజ‌యంతీ మూవీస్ ప్ర‌మాణాలేమిటో ప్ర‌తిఫ్రేమ్‌లో క‌నిపించాయి.



టెక్నికల్ అంశాలకు వస్తే..

ప్రేమకథలకు సంగీతం.. ఛాయాగ్రహణం అత్యంత కీలకం. ఈ రెండు విషయాల్లో సీతారామం టాప్ నాచ్ అనిపిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ వీనుల విందైన పాటలు.. హృద్యమైన నేపథ్య సంగీతంతో సినిమాకు ప్రాణం పోశాడు. శ్రావ్యమైన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వాహ్ వా అనిపిస్తోంది. చాయాగ్రహకులైన పీఎస్ వినోద్-శ్రేయస్ కృష్ణ.. హను ఆలోచనలకు అందమైన దృశ్యరూపం ఇచ్చారు. ప్రొడక్షన్ డిజైన్ కూడా చాలా బాగుంది. 60 80 దశకాల్లోని వాతావరణాన్ని చక్కగా చూపించారు. ఎక్కడా తేడాగా అనిపించలేదు. చిత్రనిర్మాణం అత్యంత ఉన్నతంగా ఉంది.

హను ట్రాక్ రికార్డు చూడకుండా ఈ కథకు పూర్తి మద్దతు ఇచ్చి రాజీ లేకుండా నిర్మించిన స్వప్న-ప్రియాంకలను అభినందించాలి. ఇక రైటర్ కమ్ డైరెక్టర్ హను రాఘవపూడి.. ఈ ఒక్క సినిమాతో ఎన్నో మెట్లు ఎక్కేశాడు. ఇంత కాలం మణిరత్నంను అనుకరిస్తాడని.. సగం సినిమానే సరిగా తీస్తాడని.. రకరకాల కామెంట్లు ఎదుర్కొన్న హను.. ఈ చిత్రంతో వాటన్నింటినీ మరిపించేశాడు. రచయితగా.. దర్శకుడిగా ఉత్తమ ప్రతిభ చాటుతూ.. ఒక క్లాసిక్ ప్రేమకథను అందించాడు. రాతలో.. తీతలో అతను పడ్డ కష్టమంతా తెరపై కనిపిస్తుంది.

తీర్పు: ప్రతీ ఒక్కరిలో ఇమిడిపోయిన ప్రేమభావాల్ని తట్టిలేపే.. భావాత్మక, కవితాత్మక చిత్రం ‘సీతారామం’.!

చివరగా.. మనసుల్ని కదిలించే.. అందమైన ప్రేమకథ ‘సీతారామం’!!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh