Kondapolam Movie Review Rating Story Cast and Crew

Teluguwishesh ‘కొండ పోలం’ ‘కొండ పోలం’ Get information about Kondapolam Telugu Movie Review, Vaisshnav Tej Kondapolam Movie Review, Kondapolam Movie Review and Rating, Kondapolam Review, Kondapolam Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 96161 3 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘కొండ పోలం’

  • బ్యానర్  :

    ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌

  • దర్శకుడు  :

    క్రిష్‌ జాగర్లమూడి

  • నిర్మాత  :

    సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి

  • సంగీతం  :

    ఎమ్‌ ఎమ్‌ కీరవాణి

  • సినిమా రేటింగ్  :

    333  3

  • ఛాయాగ్రహణం  :

    జ్ఞాన శేఖర్ వీఎస్

  • ఎడిటర్  :

    శ్రావన్ కటికనేని

  • నటినటులు  :

    వైష్ణవ్‌ తేజ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, కోట శ్రీనివాసరావు, సాయిచంద్‌, హేమ, అంటోని, రవిప్రకాశ్‌, మహేశ్ విట్ట, రచ్చ రవి తదితరులు

Kondapolam Movie Review Life Lessons From The Wild

విడుదల తేది :

2021-10-08

Cinema Story

‘ఉప్పెన‌’ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంతొ మెప్పించిన మెగా మేనల్లుడు పంజా వైష్ణ‌వ్ తేజ్‌.. రెండో చిత్రంలో పూర్తిగా నటనకు ప్రాధాన్యమున్న చిత్రంలో నటించాడు. అదే ‘కొండపొలం’. క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మరోమారు నవలా సాహిత్యాన్ని వెండితెర మీదకు తీసుకొచ్చింది. గతంలో యండమూరి వీరేంద్రనాథ్ సహా పలువురు రచయితలు రచించిన నవలలు తెరకెక్కాయి. అయితే రానురాను నవలా కథాంశాలకు భిన్నమైన కథలను, కథనాలను కోరుకుంటున్న తెలుగు ప్రేక్షకుడి పల్స్ పట్టుకున్న దర్శకుడు ఆ దిశగానే పయనించారు.

అయితే ఈ తరహా అనవాయితీని మరోమారు వెండితెరకు పరిచయం చేసిన ఘనత క్రిష్ దే. ఈ సినిమా ద్వారా మానవీయ విలువల పరిరక్షణ, సామాజిక సందేశం ఆవిష్కృతం కావాలని తపించారు క్రిష్. రాయలసీమ నేపథ్య కొండపొలం నవలను కథాంశంగా తీసుకొని అదే పేరుతో సినిమాను తెరకెక్కించారు. చాలా విరామం తర్వాత తెలుగులో వచ్చిన నవలా చిత్రం కొండపొలంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఇవాళ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు ఆకట్టుకుందో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే..  

కథ

కడప జిల్లాకు చెందిన కఠారు రవీంద్ర యాదవ్‌ అలియాస్‌ రవీంద్ర(వైష్ణవ్‌ తేజ్‌) బీటెక్‌ పూర్తి చేసి, ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వెళ్తాడు. ఇంగ్లీష్‌ భాషలో ప్రావీణ్యం లేకపోవడంతో అతనికి ఉద్యోగం లభించదు. దీంతో అతను తిరిగి పల్లెకు వస్తాడు. నాలుగేళ్లుగా ఉద్యోగం కోసం ప్రయత్నించి విఫలమైన రవీంద్రకు తాత రోశయ్య(కోట శ్రీనివాసరావు) ఓ సలహా ఇస్తాడు. కరువు కారణంగా అల్లాడుతున్న ఊరి గొర్రెల మందతో కొంతమంది కొండపొలం(గొర్రెల మందలను తీసుకొని అడవుల్లోకి వెళ్లడం)చేస్తున్నారని, తమ గొర్రెలను కూడా తీసుకొని వారితో నల్లమల అడవుల్లోకి వెళ‍్లమని చెబుతాడు.

పెద్ద చదువులు చదివిన రవీంద్ర.. తాత సలహాతో నాన్న గురప్ప (సాయి చంద్‌)కు సహాయంగా అడవికి వెళ్తాడు. అదే గ్రామానికి చెందిన ఓబులమ్మ (రకుల్ ప్రీత్ సింగ్) కూడా తన గొర్రెల మందతో వీరికి తోడవుతుంది. ఈ బృందానికి అడవిలో ఎదురైన పరిస్థితులు, ఎన్నో ప్రతికూలతల నడుమ బతుకు పోరును సాగించిన వైనం ఏమిటన్నది తెరపై చూడాల్సిందే. దాదాపు 45 రోజుల పాటు అడవితో సహజీవనం చేసిన రవీంద్రలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ అడవి అతనికి నేర్పిన పాఠాలేంటి? తన చదువు కోసం తండ్రి పడిన కష్టాలేంటి? ‘కొండపొలం’అనుభవంతో జీవితంలో ఎదురైన కష్టాలను ఎదుర్కొని ఏవిధంగా ఫారెస్ట్‌ ఆపీసర్‌ అయ్యాడు? అనేదే మిగతా కథ.

cinima-reviews
‘కొండ పోలం’

విశ్లేషణ

సుదూరంగా కనిపించే అరణ్యం హరితశోభతో కళకళలాడుతున్నట్లుగా కనిపిస్తుంది కానీ..ఆ అడవి గర్భంలో అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉంటాయి. అక్కడ ప్రతిక్షణ బతుకు పోరాటమే అనే అంశాల్ని బలమైన తాత్వికత మేళవించి చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు క్రిష్‌. అడవిలో గొర్రెల మందలతో వెళ్లిన రవీంద్రనాథ్‌ బృందానికి అక్కడి క్రూర మృగాల నుంచే కాకుండా అడవిని చెరబట్టే విధ్వంసకర శక్తుల నుంచి ప్రమాదాలు ఎదురవుతుంటాయి. వాటిపై అతిసాధారణ మనుషులు, నిరాయుధులైన గొర్రెలకాపరులు ఎలా పోరాటం, ఈ క్రమంలో వారిలో జరిగే సంఘర్షణను హృద్యంగా, ఉత్కంఠగా ఆవిష్కరించారు.

ప్రథమార్థంలో కథానాయకుడు రవీంద్రనాథ్‌లో జరిగే పరివర్తనను అర్థవంతంగా తెరపై తీసుకొచ్చారు. స్వతహాగా భయస్తుడైన రవీంద్రనాథ్‌ అడవిలో జరిగిన కొన్ని సంఘటనలతో భయాన్ని ఎలా జయించాలో తెలుసుకుంటాడు. అడవిలో ఎర్రచందనం స్మగ్లర్లతో.. గొర్రెల దొంగలతో చేసిన పోరు అతనిలో తెలియని ధైర్యాన్ని ప్రోదిచేస్తుంది. బతకాలంటే ప్రమాదాలకు ఎదురీదాలనే నిజాన్ని తెలుసుకుంటాడు. ద్వితీయార్థంలో కథను మరింత వేగంగా నడిపించారు. పులిని ఎదిరిస్తూ చేసే పోరాటఘట్టాలు ఉత్కంఠను పంచుతాయి. అయితే పులి తాలూకు గ్రాఫిక్స్‌ వర్క్‌పై మరింత దృష్టిపెడితే బాగుండేదనిపిస్తుంది. ప్రతి పాత్రకు ప్రాధాన్యతనిస్తూ కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది.

కొండపొలం అనే సాహసయాత్ర నేపథ్యంలో అడవిని, ప్రకృతి సంపదను పరిరక్షించుకోవాలనే అంతర్లీన సందేశం ఆకట్టుకుంటుంది. అడవిలో సాహసయాత్రకు బయలుదేరిన యువకుడు తిరిగి అదే అడవికి ఫారెస్ట్‌ అధికారిగా రావడం, అతనిలో పరివర్తన తీసుకొచ్చిన అంశాలను చక్కగా ఆవిష్కరించారు. అయితే ‘కొండపొలం’ నవలలో లేని ఓబులమ్మ పాత్రకు సినిమా కోసం సృష్టించారు. వాణిజ్య అంశాలను బేరీజు వేసుకొని ఆ పాత్రను తీసుకొచ్చారనే భావన కలుగుతుంది. అయితే నాయనాయికల మధ్య ప్రేమకథను అందంగా ఆవిష్కరించడం మెప్పిస్తుంది.

ఈ సినిమా ద్వారా అడవి పట్ల ప్రేమను చూపిస్తూనే మనిషి భయాల్ని జయించాలనే ఓ సందేశాన్ని అందించే ప్రయత్నం చేశారు దర్శకుడు క్రిష్‌. అడవి నేపథ్యంలో ఇలాంటి కథాంశాలు రావడం భారతీయ సినిమాలో చాలా అరుదనే చెప్పొచ్చు. ముఖ్యంగా దట్టమైన అడవిలో చిత్రీకరణ చేయడం..గొర్రెల మందల నేపథ్యంలో సన్నివేశాల్ని చిత్రించడం దర్శకుడికి సినిమా పట్ల తపనను తెలియజేస్తుంది. ‘అడవి పెద్ద బాలశిక్ష..ఇక్కడ ప్రతి చెట్టుకు, పుట్టకు ఓ కథ ఉంటుంది’ ‘నిటారుగా నిలబడ్డ మనిషిని చూసి పులి అడుగులు వెనక్కి వేసింది’ వంటి సంభాషణలు బాగున్నాయి. ఈ సినిమాను ఓ వ్యక్తిత్వ వికాస పాఠంలా దర్శకుడు తీర్చిదిద్దాడనిపిస్తుంది.

నటీనటుల విషాయానికి వస్తే..

రెండో సినిమా అయినా తన నటనలో చక్కటి పరిణితి కనబరిచాడు వైష్ణవ్‌ తేజ్‌. త‌న న‌ట‌న‌తో మ‌రోసారి ఆక‌ట్టుకున్నారు. గొర్రెల కాప‌రుల కుటుంబానికి చెందిన యువ‌కుడిగా పాత్ర‌లో ఒదిగిపోయాడు. రాయ‌ల‌సీమ యాస ప‌లికిన విధానం కూడా మెప్పిస్తుంది. పులితో చేసే పోరాట ఘ‌ట్టాల్లోనూ, క‌థానాయిక‌తో క‌లిసి చేసిన స‌న్నివేశాల్లోనూ ఆయ‌న న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఓబుల‌మ్మ‌గా ర‌కుల్ చాలా స‌హ‌జంగా న‌టించింది. సాయిచంద్‌ తన పాత్రకు ప్రాణప్రతిష్ట చేశారు. గురప్పగా సహజసిద్ధమైన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన పాత్ర గుర్తుండిపోయేలా ఉంది. కోటా శ్రీనివాసరావు పాత్ర చిన్నదే అయినా తనదైన శైలితో మెప్పించారాయన. ర‌విప్ర‌కాశ్, మ‌హేశ్ పాత్ర‌లు కూడా హ‌త్తుకునేలా ఉంటాయి.



టెక్నికల్ అంశాలకు వస్తే..

ఇక సాంకేతికంగా అన్ని విభాగాలు బాగా కుదిరాయి. జ్ఞానశేఖర్‌ సినిమాటోగ్రఫీ అడవి అందాల్ని చక్కగా బంధించింది. కీరవాణి పాటలు, నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా చెప్పొచ్చు. సంభాషణలన్ని చక్కటి రాయలసీమ యాసలో సహజంగా అనిపించాయి. తక్కువ రోజుల్లో చిత్రీకరణ పూర్తిచేసినా నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడలేదు అనిపిస్తుంది. ఓ నవలా ఇతివృత్తాన్ని కథగా ఎంచుకోవడం దర్శకుడు క్రిష్‌కున్న సాహిత్యాభిలాషను తెలియజేస్తుంది. తనదైన ఫిలాసఫికల్‌ పంథాలో ఈ సినిమాను ఆవిష్కరించారాయన. భవిష్యత్తులో మరిన్ని నవలలు వెండితెర దృశ్యమానం కావడానికి ఈ సినిమా ప్రేరణగా నిలుస్తుందని చెప్పొచ్చు.

తీర్పు:  ఓ ప్రయోజనం, పరమార్థం ఉన్న సందేశాత్మక చిత్రం ‘‘కొండపొలం’’

చివరగా.. అడవులు నేర్పిన పర్సనాలిటీ డెవలప్ మెంట్ క్లాస్ ‘కొండపొలం’

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh