Republic Movie Review Rating Story Cast and Crew ‘రిపబ్లిక్’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘రిపబ్లిక్’ ‘రిపబ్లిక్’ Get information about Republic Telugu Movie Review, Sai Tej Republic Movie Review, Republic Movie Review and Rating, Republic Review, Republic Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 96115 2.75 stars, based on 1 reviews
  • చిత్రం  :

    ‘రిపబ్లిక్’

  • బ్యానర్  :

    జీ స్టూడియోస్‌, జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

  • దర్శకుడు  :

    దేవా క‌ట్టా

  • నిర్మాత  :

    జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు

  • సంగీతం  :

    మ‌ణిశ‌ర్మ

  • సినిమా రేటింగ్  :

    2.752.75  2.75

  • ఛాయాగ్రహణం  :

    ఎం.సుకుమార్‌

  • ఎడిటర్  :

    కె.ఎల్‌.ప్రవీణ్

  • నటినటులు  :

    సాయిధరమ్‌ తేజ్, ఐశ్వర్యా రాజేశ్‌, జ‌గ‌ప‌తిబాబు, రమ్యకృష్ణ, సుబ్బరాజు, రాహుల్ రామ‌కృష్ణ, పోసాని కృష్ణముర‌ళి తదితరులు

Republic Movie Review Deva Katta Sekhar Kammula Delivers A Heart Touching Ode To Love

విడుదల తేది :

2021-10-01

Cinema Story

కరోనా రెండవ దశ లాక్ డౌన్ కారణంగా వాయిదా పడి.. తీరా విడుదల తేదీ సమీపంచే తరుణంలో కథలోని హీరో సాయి ధరమ్ తేజ్ దుర్గంచెరువు వద్ద కేబుల్ బ్రిడ్జిపై తన బైక్ పై నుంచి అదపుతప్పి కింద పడి చికిత్స చేయించుకుని కోలుకుంటున్నాడు. ఈ తరుణంలోనే ఆయన నటించిన చిత్రం రిపబ్లిక్ విడుదల కావడంలో ప్రేక్షకుల ముందుకువచ్చింది. ఇక ప్రస్తానం చిత్రంతోనే రాజకీయ నేపథ్య కథాంశాలను ఎంచుకుని ఎలాంటి వివాదాలకు తావులేకుండా తెరకెక్కించడంలో ప్రస్తానం చిత్రంతో దిట్టగా నిరూపించుకున్న దేవ కట్టా ‘రిపబ్లిక్’ చిత్రాన్ని కూడా రూపోందించారు.

తన మార్కు రాజకీయ నేపథ్యమున్న చిత్రంతో మరోమారు సమకాలిన రాజకీయ వ్యవస్థలోని లోతుపాత్రుల్ని అవిష్కరిస్తూ ఆయన రూపోందించిన చిత్రం రిపబ్లిక్. ఈ చిత్రం ఎలావుంది.? హీరో సాయి తేజ్ తో పాటుగా దర్శకుడు దేవ కట్టా కమర్షియల్ సక్సెన్ ను అందుకోగలగా.? రోటీన్ చిత్రాలకు భిన్నంగా హీరో సాయి తేజ్ నటించిన చిత్రం ప్రేక్షకులు రీచ్ అయ్యిందా.? యువ ఐఏఎస్ అధికారి పాత్రలో తేజ్ ఎలా నటించాడు.? వ్యవస్థలోని శక్తినంతా కూడగట్టుకున్న రాజకీయ నేతలకు ఎదురుగా ఎలా పోరాడాడు. మరి ఈ చిత్రం అంచనాలను అందుకుందా.? తెలుసుకోవాలంటే కథలోకి ఎంట్రీ కావాల్సిందే.

కథ

చిన్నప్పట్నుంచే తెలివైన విద్యార్థి పంజా అభిరామ్ (సాయిధ‌ర‌మ్ తేజ్‌). కళ్ల ముందు అన్యాయం జరిగితే సహించని మనస్తత్వం. ఆయనలోని ఈ మనస్తత్వం అయనతో పాటు పెరిగి పెద్దదవుతుంది. అంతే వ్యవస్థని, వ్యవస్థలోని తప్పుల్ని ప్రశ్నించడం మొదలుపెడతాడు. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేసే తన తండ్రి దశరథ్‌(జగపతిబాబు) అవినీతికి పాల్పడి లంచాలు తీసుకోవడం నచ్చకపోవడంతో అతడిని ద్వేషిస్తుంటాడు. చదువును పూర్తిచేసుకొని అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న అభిరామ్‌ ఓ ఐఏఎస్‌ అధికారితో జరిగిన గొడవలో తన ఆలోచనను మార్చుకుంటాడు. ఇదే క్రమంలో త‌న చుట్టూ జ‌రిగే పలు సంఘ‌ట‌న‌లు అత‌డిని క‌ల‌చివేస్తాయి. అనుకున్నట్టుగానే అభిరామ్ ఐఏఎస్ అవుతాడు.

కొన్ని ప్రత్యేక అధికారాల‌తో ఏలూరు క‌లెక్టర్ గా బాధ్యతలు చేపడతాడు. వెంట‌నే తెల్లేరు స‌ర‌స్సు స‌మ‌స్యపై దృష్టిపెడ‌తాడు. కొన్నేళ్లుగా తెల్లేరుపై పెత్తనం చలాయిస్తూ అక్రమాల‌కు పాల్పడుతున్న రాజ‌కీయ నాయ‌కురాలు విశాఖ‌వాణి (ర‌మ్యకృష్ణ)తో అభిరామ్ కి పోరాటం మొద‌ల‌వుతుంది. విశాఖవాణికి భయపడిన ప్రభుత్వాధికారులందరూ ఆమె చెప్పినట్లుగా వింటుంటారు. విశాఖవాణి చేస్తున్న అక్రమాల్ని వెలుగులోకి తీసుకురావడానికి అభిరామ్‌ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అతడి లక్ష్యసాధనలో ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయి?నిజాయితీకి విలువనిచ్చే అభిరామ్‌ తండ్రి దశరథ్‌ ఎందుకు అవినీతి పరుడిగా మారాడు?రాజకీయ కుట్రలకు బలైన మైరా హాండ్సన్‌(ఐశ్వర్యరాజేష్‌) కు అభిరామ్‌ ఎలా అండగా నిలిచాడు.?త‌దిత‌ర విష‌యాల్ని వెండితెర‌పై చూడాల్సిందే.

cinima-reviews
‘రిపబ్లిక్’

విశ్లేషణ

ప్రజాస్వామ్యానికి నాలుగు మూలస్థంబాలైన శాసన, న్యాయ, పాలన, పాత్రికేయ వ్యవస్థలని అందరికీ తెలిసిందే. అయితే వీటిలో ఏ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోయినా వాటి ప్రభావం మిగతా వ్యవస్థలపై పడుతుందన్నది తెలిసిందే. అయితే మరీ ముఖ్యంగా శాసన, న్యాయ, పాలనా వ్యవస్థల్లో ఏ ఒక్కటి గాడి తప్పినా.. దాని తప్పుల్ని సరిదిద్దాల్సిన బాధ్యత మిగతా వ్యవస్థలపై వుంటుందన్నది దర్శకుడి దేవ కట్టా మూల కథ. అయితే శాసన వ్యవస్థలోని రాజకీయ నేతలు తమకున్న అపరిమితమైన అధికారాలతో మిగతా వ్యవస్థలను కూడా ప్రభావితం చేసి.. తమ గుప్పెట్లో పెట్టుకుని పని చేయిస్తే.. వారి ఆటలను పాలనా వ్యవస్థలోని అధికారి ఎలా సరిదిద్దుతారో చూపించే చిత్రం ఇది.

ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నా నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వ అధికారులు తమ మనస్సాక్షిగా విరుద్ధంగా ఎలా పనిచేస్తున్నారో చూపించే ప్రయత్నం చేశారు. రాజకీయాల పట్ల ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని పావులుగా వాడుకుంటూ తమ స్వార్థ ప్రజయోజనాల కోసం నాయకులు వారిని ఎలా బలిపశువులను చేస్తారనే పాయింట్‌ను కమర్షియల్‌ పంథాలో చెప్పేందుకు కృషిచేశారు. తన ఓటును ఎవరో ఇతరులు ఎలా వేస్తారని ప్రశ్నించే సాధారణ యువకుడిగా కథనాయకుడు పోలింగ్ బూత్ దగ్గర ప్రశ్నించడం నుంచి ప్రారంభమయ్యే కథ.. ప్రధమార్థం కాస్త నిదానంగా సాగుతుంది.

అభిరామ్ ఐఏఎస్ అధికారి నిమాయకం కావ‌డం నుంచి అస‌లు క‌థ పరుగులు పెడుతుంది. తెల్లేరు కుళ్లు వెన‌క ఉన్న పెద్దమనుషలు బాగోతాలను అడ్డుకుంటూనే.. రైతుల ప‌క్షాన ఉంటూ పోరాటానికి శ్రీకారం చుట్టే తీరు ఆక‌ట్టుకుంటుంది. వ్యవ‌స్థల‌న్నింటినీ త‌న చెప్పు చేతల్లో పెట్టుకున్న విశాఖ‌వాణికీ, అభిరామ్‌కీ మ‌ధ్య డ్రామా ఆక‌ట్టుకుంటుంది. న్యాయ వ్యవ‌స్థ కూడా ప్రభావితం అయ్యే నేపథ్యంలో అభిరామ్ వినిపించిన గ‌ళం, ఆ త‌ర్వాత జ‌రిగే ప‌రిణామం ప‌తాక స‌న్నివేశాల్లో హైలైట్‌. ద‌ర్శకుడు నిజాయ‌తీగా క‌థ‌ని చెప్పే ప్రయ‌త్నం చేశారు. తెలుగు తెర‌పై ద‌ర్శకుడు చేసిన ఓ కొత్త ప్రయ‌త్నంగా మాత్రం ఈ చిత్రం గుర్తింపు పొందుతుంది.

నటీనటుల విషాయానికి వస్తే..

ప్రజలకు మంచి చేయాలని తపించే యువ కలెక్టర్‌ అభిరామ్ పాత్రలో సాయిధరమ్‌తేజ్‌ మూర్తీవభించినట్లుగానే వుంది. నిత్యం కమర్షియల్ ఎలిమెంట్లతో కామేడీని మిక్స్ చేసిన రోమాంటిక్ చిత్రాలలో నటించే సాయి తేజ్.. అందుకు పూర్తి భిన్నంగా చక్కని పాత్రలో ఒదిగిపోయారు. యువ కలెక్టరుగా అత్యంత బాధ్యతాయుతమైన పాత్రలో సీరియస్ గా తన పని గురించి అలోచించే అధికార పాత్రలో సాయితేజ్ కరెక్టుగా సైటయ్యారు. డైలాగ్‌ డెలివరీలోనూ సాయితేజ్ వైవిధ్యతను కనబరిచాడు. విశాఖవాణిగా ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో రమ్యకృష్ణ పాత్ర శక్తివంతంగా సాగింది. కొన్ని చోట్ల నరసింహాలోని నీలాంబరిని పాత్రను ఆమె గుర్తుతెచ్చింది.

ఇక అవినీతికి పాల్పడే గ్రూప్‌ 1 అధికారి దశరథ్ పాత్రలో జగపతిబాబు ఎప్పటిమాదిరే పరకాయప్రవేశం చేశాడు. అద్భుత ప‌ర్‌ఫార్మెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇక తప్పిపోయిన అన్నయ్యను వెత్తుకుంటూ అమెరికా నుంచి ఇండియా వచ్చిన యువతి మైరా(ఐశ్వర్య రాజేశ్‌) తన పాత్రకు న్యాయం చేసింది. అవినీతి ఎస్పీగా శ్రీకాంత్‌ అయ్యంగార్‌, కలెక్టర్‌గా సుబ్బరాజ్‌, జగపతిబాబు భార్యగా ఆమని, తదితర సీనియర్ నటీనటులు తమ పాత్రలకు తగు న్యాయం చేశారు.



టెక్నికల్ అంశాలకు వస్తే..

ప్రజాస్వామ్య మూలస్థంబాలతో ముడిపడిన కథ.. ఈ వ్యవస్థల పరిధి చాల పెద్దది కావడంతో దేవా కట్టా కొంత మేర విజయం సాధించారని చెప్పవచ్చు. కథకుడిగా, సంభాషణల రచయితగా దేవా కట్టా రిపబ్లిక్ ద్వారా తన ప్రతిభను మరోమారు చాటుకున్నారు. గాంధీని, హిట్లర్ ను నాయకులు చేసింది ప్రజలే.. అజ్ఞానం గూడు కట్టిన చోటే మోసం గుడ్లు పెడుతుంది..లాంటి సంభాషణలు ఆలోచనను రేకెత్తిస్తాయి. ప్రేక్షకుడికి సూటిగా, సుత్తి లేకుండా తాను అనుకున్న ప్రతీ మంచి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు.
నిజాయితీగా కథను తెరపై ఆవిష్కరించారు.

సాంకేతికంగా చిత్రం ఉన్నత నిర్మాణ విలువలతో రూపోందించారు. సందేశాత్మక కథాంశానికి మణిశర్మ సంగీతం చక్కగా కుదిరింది. జానపదశైలిలో ప్రతి పాటను వినూత్నంగా కంపోజ్‌ చేశారు. రెండు పాటలు ప్లస్ థీమ్ సాంగ్స్‌లో తన పనితనం చూపించారు. ఎం. సుకుమార్ ఫొటోగ్రఫీ సినిమాకి ప్లస్ అయ్యింది. విజువల్స్ రిచ్‌గానే కాకుండా.. దర్శకుడి విజన్‌ని అర్థం చేసుకుని ఆయన తీసిన సింబాలిక్ షాట్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. సినీ విమర్శకుల నుంచి చక్కని సందేశాత్మక చిత్రంగా రిపబ్లిక్ చిత్రం ప్రశంసలను అందుకోనుంది. కాగా, కమర్షియల్‌ హంగులు లేకపోవడం మైనస్‌గా మారింది.

తీర్పు: సమకాలీన రాజకీయాల్లో ఉన్న లోపాల్ని ఎత్తిచూపిన సందేశాత్మక చిత్రం ‘‘రిపబ్లిక్’’

చివరగా.. మూలస్థంబాలపై గురిపెట్టిన ‘రిపబ్లిక్’

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh