Jersey Movie Review Rating Story Cast and Crew ‘జెర్సీ’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘జెర్సీ’ ‘జెర్సీ’ Get information about Jersey Telugu Movie Review, Nani Jersey Movie Review, Jersey Movie Review and Rating, Jersey Review, Jersey Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 90262 3.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ‘జెర్సీ’

 • బ్యానర్  :

  సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌

 • దర్శకుడు  :

  గౌత‌మ్ తిన్న‌నూరి

 • నిర్మాత  :

  సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ

 • సంగీతం  :

  అనిరుద్ ర‌విచంద్ర‌న్‌

 • సినిమా రేటింగ్  :

  3.753.753.75  3.75

 • ఛాయాగ్రహణం  :

  సాను వర్గీస్‌

 • ఎడిటర్  :

  న‌వీన్ నూలి

 • నటినటులు  :

  నాని, శ్ర‌ద్ధా శ్రీనాథ్, స‌త్యరాజ్‌, రోనిత్ క‌మ్ర‌, రావు ర‌మేష్‌, బ్ర‌హ్మాజీ, శిశిర్ శ‌ర్మ‌, సంప‌త్‌, ప్ర‌వీణ్ త‌దిత‌రులు

Jersey Moive Review

విడుదల తేది :

2019-04-19

Cinema Story

అర్జున్‌(నాని) రంజీ ట్రోఫీలో ఆడిన క్రికెట‌ర్‌. అత‌ను సారా (శ్ర‌ద్ధా శ్రీనాథ్‌)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వారికి నాని అని ఒక కొడుకు పుడ‌తాడు. 26 ఏళ్ల‌ప్పుడు క్రికెట్ కి దూరంగా వెళ్లి, ఫుడ్ కార్పొరేష‌న్‌లో ఉద్యోగంలో చేర‌తాడు నాని. సంతోషంగా గ‌డుపుతున్న వారి జీవితంలోకి అనుకోని ఇబ్బందులు వ‌చ్చి ప‌డుతాయి.లంచం ఇచ్చి ఉద్యోగంలో చేరార‌న్న పేరుతో ఒక బ్యాచ్ ఫుడ్ కార్పొరేష‌న్ ఉద్యోగుల మీద స‌స్పెన్ష‌న్ వేటు ప‌డుతుంది. అందులో నాని కూడా ఉంటాడు.

దాదాపు ప‌దేళ్లు క్రికెట్‌కి దూరంగా ఉన్న అత‌ను... తెలిసిన వాళ్లంద‌రి ద‌గ్గ‌ర అప్పులు తీసుకుని గ‌డుపుతుంటాడు. ఒక సంద‌ర్భంలో కొడుకు అడిగిన చిన్న గిఫ్ట్ కూడా కొనివ్వ‌లేక‌పోతాడు. దాని కోసం అర్జున్ ఏం చేశాడు? కొడుకు దృష్టిలో హీరోగా మిగ‌ల‌డం కోసం అత‌ను చేసిన ప్ర‌య‌త్నాలేంటి? చివ‌రికి తీర్చ‌గ‌లిగాడా? లేదా? అత‌ని జీవితం చివ‌రికి ఏమైంది? సారా కి నాని పూర్తిగా ఎప్పుడు అర్థ‌మ‌య్యాడు వంటి విష‌యాల‌న్నీ ఈ సినిమాలో స‌స్పెన్స్.

cinima-reviews
‘జెర్సీ’

విశ్లేషణ

తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకున్నవాడు గర్వంగా ఫీలవుతాడే తప్ప విజయాన్ని అస్వాదించలేడు. అదే విజయానికి ఆమడదూరంలో నిలిచి ప్రయత్నాలు చేస్తూ.. చేస్తూ.. చివరాఖరున విజయాన్ని అందుకునే వాడు గెలుపును అస్వాధించగలడు. సరిగ్గా జెర్సీ కథ కూడా అలాంటిదే. సక్సెస్ అయిన ఒక్కడికి సంబంధించిన కథ మాత్రమే కాదు. సక్సెస్ అవ్వకపోయినా ప్రయత్నిస్తూ మిగిలిపోయిన 99 మంది కథ కూడా ఈ చిత్రమే. విజయమా ఎక్కడ నీ చిరునామా అంటూ వెతికే ప్రతీ చోట చిత్కారాలు, అవమానాలు.. హేళన చూపులు, వీటంన్నింటి నుంచి వచ్చే గెలుపే నిజమైన గెలుపు.

ఎక్కడ పోగోట్టుకున్నామో అక్కడే వెతకాలి తప్ప.. మరో చోట వెతికితే ఏం లాభం అన్న సూక్తిని కూడా ఇమిడివున్న కథ ఇది. విజయం కోసం చేసే ప్రయత్నాల్లో ఎన్నిసార్లు ఓడిపోయినా తప్పు లేదు కానీ, అసలు ప్రయత్నమే చెయ్యకపోతే.. ప్రయత్నిస్తే పోయేదేమీలేదు.. గెలుపు వశమవ్వడం తప్ప.. అన్న నానుడి కూడా ఇమిడివున్న చిత్రం. న్యాచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన మోస్ట్ ఎమోషనల్ చిత్రం ‘జెర్సీ’లో.. క్రికెట్ నేపథ్యంలో జీవిత పాఠంతో కూడిన ఎమోషన్స్ ను కలగలిపిన భావోద్వేగాలతో ప్రేక్షకుల కళ్ల చెమర్చేలా చేయడంలో దర్శకుడు గైతమ్ తిన్ననూరికి ఫుల్ మార్క్ పడ్డాయి.

‘జెర్సీ’ కథకు మూలం.. సారా, అర్జున్‌కు పుట్టిన కొడుకు నాని. తన బర్త్ డే నాడు సంపాదన లేని తన తండ్రిని రూ. 500 పెట్టి ‘ఇండియన్ జెర్సీ’ కొని ఇవ్వమని కొడుకు అడగడం.. భార్య సంపాదనపై ఆధారపడ్డ నాని.. జెర్సీ కొనడం కోసం అనేక ప్రయత్నాలు చేసి.. ఆ ప్రయత్నాల్లో విఫలమై చివరికి పదేళ్ల క్రితం ఆపేసిన క్రికెట్ ప్రయత్నాన్ని మళ్లీ మొదలు పెడతాడు. ఇంతకీ నాని 26 ఏళ్ల వయసులో చేయలేనిది 36 ఏళ్ల వయసులో చేయగలిగాడు? అప్పుడు క్రికెట్‌ను వదిలేయడానికి కారణం ఏంటి? ఇంతకీ క్రికెటర్ అర్జున్ ప్రయత్నంలో విజయం సాధించాడా? ఓడిపోయాడా? అన్న భావోద్వేగ జర్నీని తెరపై చూడాల్సిందే.

ఈ సినిమాను చూసిన తరువాత గుండె బరువెక్కిన ఫీలింగ్ కలుగుతుంది.  దర్శకుడు తను చెప్పాల్సిన పాయింట్‌ ఎక్కడా మిస్‌ కాకుండా, సైడ్‌ ట్రాక్‌లను నమ్ముకోకుండా, నిజాయతీగా చెప్పే ప్రయత్నం చేశాడు. ఒక ఓడిపోయిన వ్యక్తి గెలిస్తే, ఎలా ఉంటుందో ఈ కథ కూడా అలానే ఉంటుంది. అయితే, తండ్రీ కొడుకుల సెంటిమెంట్‌, పతాక సన్నివేశాలు ఇందులో అదనంగా కనిపిస్తాయి. ఇటీవల కాలంలో రెండున్నర గంటల పాటు ఒకే ఎమోషన్‌ చుట్టూ నడిచే సినిమా ‘జెర్సీ’నే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

నటీనటుల విషాయానికి వస్తే..

నాని తన కెరీర్‌లో తొలిసారి భిన్నమైన పాత్ర పోషించాడు. ఒక విధంగా చెప్పాలంటే నాని వన్ మెన్ షో అని చెప్పవచ్చు. ఎమోషనల్‌ సీన్లలో తను ఎంత బాగా నటించగలడో ఈ సినిమాతో మరోసారి రుజువైంది. ఒక క్రికెటర్‌గా‌, ఒక ప్రేమికుడిగా ఎంత చక్కగా నటించాడో.. ఒక తండ్రిలా అంతే బాగా నటించాడు. ఒక కొడుకు కోసం సగటు తండ్రి పడే తపనను అద్భుతంగా చూపించాడు. ఇక  హీరోయిన్ శ్రద్దా శ్రీనాథ్ పాత్ర కూడా చాలా బలంగా ఉంటుంది. గ్లామర్‌ తో పాటు నటన, కథలోని కీలక సన్నివేశాల్లో ఆమె హావభావాలు బాగా పలికించింది.

ఈ సినిమాలో మరో ప్రధాన హైలైట్. నానికి కొడుకుగా నటించిన నాని (రోనిత్). ఈ బుదతడు స్క్రీన్‌పై కనిపించిన ప్రతిసారి ఎమోషన్స్‌ని వరదలా పారించాడు. ముఖ్యంగా నాని కాంబినేషన్ సీన్లలో ఏడిపించేశారు. ‘నాన్న నిన్ను హీరోగా చూడాలని ఉంది.. క్రికెట్ ఆడు.. నువ్ బాగా ఆడుతావ్’ అంటూ చెప్పిన డైలాగ్‌తో పాటు.. జెర్సీ కొనమని అడిగే సీన్.. నాని కోప్పడి కొట్టిన సందర్భంలో తన తల్లికి బాల్ తగిలిందని అబద్ధం చెప్పే సీన్‌లలో ఆడియన్స్‌ని ఏడిపించేశారు. అర్జున్‌ కోచ్‌గా కనిపించిన సత్యరాజ్‌ తన కెరీర్‌లో మరో మంచి పాత్ర చేశాడు. సత్యరాజ్‌, నానిల మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. రోనిత్ క‌మ్ర‌, రావు ర‌మేష్‌, బ్ర‌హ్మాజీ, శిశిర్ శ‌ర్మ‌, సంప‌త్‌, ప్ర‌వీణ్ త‌దిత‌రులు కూడా తమతమ పాత్రల పరిధి మేరకు బాగా రాణించారు. ప్రేక్షకులను అకట్టుకున్నారు.

టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నిర్మాణ విలువలు ఉన్నతస్థాయిలో వున్నాయి. సానువర్గీస్ ఛాయాగ్రహణం సినిమాకు అదనపు బలంగా నిలించింది. 1986 నాటి పరిస్థితులతో.. పీరియాడిక్‌ నేపథ్యంలో సాగినా ఈ కథకు ఆర్ట్ వర్క్‌తో పాటు.. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా జాన్ వర్గీస్ కెమెరా జిముక్కులతో రెండున్నర గంటల క్రికెట్ వినోదాన్ని అందించారు. నిజంగా క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫీల్ కలిగించారు.

అనిరుధ్‌ రవిచంద్రన్‌ అందించిన సంగీతం చాలా బాగుంది. సినిమాలో డ్యూయట్‌లు‌, హీరో పరిచయగీతాలు అస్సలు కనిపించవు. దాదాపు ప్రతి పాట కథలో భాగంగానే వినిపిస్తుంది. నేపథ్య సంగీతంతో సినిమా మరింత రక్తికట్టింది. ఎమోషన్స్ సీన్స్‌లో అనిరుధ్ మంచి నేపథ్య సంగీతం అందించి సీన్స్ పండేలా చేశారు. ఇక చిత్రానికి బావోద్వేగాలను జతపర్చింది ముఖ్యంగా మాటలు, డైలాగులు. ప్రతి ఎమెషనల్ సీన్ లోనూ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసేందుకు దర్శకుడు రాసుకున్న మాటలు, ప్రేక్షకుడిపై ఎంత ప్రభావం చూపుతున్నాయన్నది చిత్రం చూసిన తరువాత మీరే చెప్పాలి.

తీర్పు..

ఓటమి అంచున నిలబడి విజయం కోసం ప్రయత్నాలు చేస్తూ.. పట్టువదలని విక్రమార్కుడిలా గెలుపును వశపర్చుకున్న వ్యక్తికి అతని భావోద్వేగాలకు ప్రతిబింభమే ఈ చిత్రం..

చివరగా... భావోద్వేగాల బ్లాక్ బస్టర్..!

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh