Ravi Teja's Nela Ticket movie review నేల టిక్కెట్టు రివ్యూ

Teluguwishesh నేల టిక్కెట్టు నేల టిక్కెట్టు In Nela Ticket, ‘Mass Maharaja’ Ravi Teja along with the story overdoes it at a decibel level that will make you miss Justin Beiber’s singing. Product #: 87784 2.25 stars, based on 1 reviews
 • చిత్రం  :

  నేల టిక్కెట్టు

 • బ్యానర్  :

  ఎస్ఆర్టీ ఎంటర్టైన్మెంట్స్

 • దర్శకుడు  :

  కల్యాణ్ కృష్ణ

 • నిర్మాత  :

  రామ్ తాళ్లూరి

 • సంగీతం  :

  శక్తికాంత్ కార్తీక్

 • సినిమా రేటింగ్  :

  2.252.25  2.25

 • ఛాయాగ్రహణం  :

  ముఖేష్.జీ

 • ఎడిటర్  :

  ఛోటా కే ప్రసాద్

 • నటినటులు  :

  రవితేజ, మాళవిక శర్మ, బ్రహ్మానందం, అలి, పోసాని, సుబ్బరాజు, తనికేళ్ల భరణి, జగపతిబాబు, ప్రియదర్శి, బ్రహ్మాజీ, పృధ్వీరాజ్, శివాజీ రాజా, అన్నపూర్ణ, సురేఖవాణి, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు త‌దిత‌రులు

Nela Ticket Movie Review

విడుదల తేది :

2018-04-25

Cinema Story

ఈ చిత్రం ఇద్దరు అనాధలకు సంబంధించిన చిత్రం. ఒకరు డబ్బును అర్జించడం.. తన పలుకుబడిని పెంచుకుంటూ తన కుటుంబం.. తన పరిపతి గురించి మాత్రమే అలోచించగా, మరోకరు డబ్బు, దస్కం కాకుండా తన చుట్టూ వున్నవాళ్లను ప్రేమిస్తూ.. అందరిలో ఒకడిగా వుంటూ.. అందరికోసం ఒకడిగా పాటుపడతాడు. ప్రతి మనిషిలో ఓ బంధాన్ని, బంధుత్వాన్ని చూసుకుంటూ... అందరినీ ఏదో ఒక వరుసలతో పిలుస్తాడు. బంధుత్వంతో పిలిస్తే ఎంత రిస్క్ తీసుకుని అయినా ఎదుటివ్యక్తి సహాయం చేసేస్తాడు. ఆ క్రమంలో విశాఖ సిటీ పోలీస్  కమీషనర్‌తో అతడికి చిన్న తిరకాసు ఏర్పడడంతో నెల రోజులు హైదరాబాద్‌లో వుంటే సమస్య పరిష్కారం అవుతుందని మకాం మారుస్తాడు.

హైదరాబాద్‌లో అడుగుపెట్టగానే హీరోయిన్ మాళవిక శర్మని చూసి ప్రేమలో పడతాడు. తరవాత హోమ్ మినిస్టర్ ఆదిత్య భూపతి (జగపతి బాబు) మనుషులతో వరుసగా గొడవలు పెట్టుకుంటాడు. డబ్బు సంపాదనే ధ్యేయంగా అధికార దాహంతో అడుగులు వేస్తున్న హోమ్ మినిస్టర్‌కి అడుగడుగునా అడ్డు తగులుతాడు. హీరో ఎందుకలా చేస్తుంటాడు? అసలు హీరోకి, హోమ్ మినిస్టర్‌కి సంబంధం ఏంటి? మధ్యలో హీరోయిన్ పాత్ర ఏంటి? 'చుట్టూ జనం... మధ్యలో మనం. అలా వుండాలి  లైఫ్ అంటే' అని చెప్పే జనం కోసం హీరో ఏం చేశాడు? అనేది చిత్రకథ.

cinima-reviews
నేల టిక్కెట్టు

‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్న కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వం నుంచి వచ్చిన మూడో సినిమా నేల టిక్కెట్టు. కానీ, గత రెండు చిత్రాల నైపుణ్యం వాటిల్లో చూపించిన ప్రతిభ ‘నేల టిక్కెట్టు’లో కనిపించకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కథలో కొత్తదనం లోపించింది. మంచికీ చెడుకీ మధ్య యుద్ధం ఎన్నో ఏళ్లుగా చూస్తున్నదే. ప్రతి సినిమాలోనూ అదే పాయింట్ ఉంటుంది. అదే కథను ఎంత కొత్తగా చూపించాం అన్నదే కీలకం. కానీ, కల్యాణ్ అటు వైపుగా ఆలోచించలేదు.

చుట్టూ జనం, మధ్యలో మనం అనే కాన్సెప్ట్ జనరంజకంగా తీయొచ్చు. కానీ అనుకున్న విధంగా కల్యాణ్ కృష్ణ ఈ సినిమాను డైరెక్ట్ చేశారా. అన్న సందేహాలు సగటు ప్రేక్షకుడికి కలిగేలా వుంది. ఇక రవితేజ లాంటి కథానాయకుడు దొరకడం కల్యాణ్ కు కలిసొచ్చిన విషయం. అయితే కాన్సెప్ట్ ని, రవితేజలోని బలాలను దర్శకుడు సరిగ్గా వాడుకోలేదనిపిస్తుంది. కథ ప్రారంభం నుంచి సన్నివేశాలు నడుస్తాయింటాయి కానీ, వాటికి అసలు కథకు సంబంధం ఉందా లేదా? అన్నది మాత్రం ప్రేక్షకుడికి అంతుచిక్కదు.

సెకండాఫ్ కూడా ఇలాగే ఉంది. లెక్కకు మించి సన్నివేశాలు, ఫ్రేమ్‌ పట్టనంత నటీనటులు ఉన్నా ఒక్క సందర్భంలోనూ ప్రేక్షకుడు కథలో లీనమవ్వలేడు. రవితేజ ఎనర్జీ, అతను అందించే వినోదం అక్కడక్కడా అప్పుడప్పుడూ ప్రేక్షకుల్లో ఉత్తేజాన్ని కలిగిస్తుంది. కానీ, అదే టెంపోను చివరి వరకూ కొనసాగించలేకపోయాడు దర్శకుడు. కథను ఎలా ముగించాలో తెలియక సన్నివేశాలను పొడిగించుకుంటూ వెళ్లాడు. పతాక సన్నివేశాల్లో ప్రతి నాయకుడు కూడా మారిపోవడం మరింత మెలో డ్రామాగా అనిపిస్తుంది. పాటలు, సందర్భానుసారంగా లేకపోవడంతో పాటు భాణీలు కూడా అకట్టుకునేలా లేకపోవడం గమనార్హం.

నటీనటుల విషయానికోస్తే..

రవితేజ ఎప్పటిలాగే హుషారుగా కన్పించడానికి ప్రయత్నించారు. ఆయనొక్కడే సినిమాను నెట్టుకురావడానికి శతవిధాలా ప్రయత్నించారు. కానీ, ఆయన నటనలోనూ కొత్తదనం ప్రేక్షకుడికి కనిపించలేదు. మునుపటి కంటే లుక్స్ పరంగా మరింత జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం వచ్చిందనే సంగతి ప్రతి సన్నివేశంలో అర్థమవుతుంటుంది. కథలో పాత్రలో బలం లేకపోవడంతో ఆయన కూడా ఏమీ చేయలేకపోయారు. మాళవిక శర్మ నటన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆమెకు నటించేంత స్కోప్ కూడా రాలేదు. రవితేజతో పాటు ఆమె కెమెస్ట్రీ అంతగా పండలేదనే చెప్పాలి.

జగపతిబాబు మరోసారి ప్రతినాయకుడి పాత్రలో కనిపించి, తన రోటిన్ విలన్ పాత్రను ఆయన చేసుకుంటూ వెళ్లారు. అయితే ఆయన పాత్రని డీల్‌ చేసిన విధానం సరిగ్గా లేదు. సీనియర్‌ నటులు చాలా మంది ఉన్నా, వాళ్లను దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేదు. బ్రహ్మానందం పాత్రకు ఒక్క డైలాగు లేకపోవడం ఇందుకు అద్దం పట్టింది. ఎప్పుడూ హీరో చుట్టూ అలీ, ప్రవీణ్.. విలన్ జగపతిబాబు చుట్టూ పోసాని, రఘుబాబు వుంటారు. కానీ, ఒక్కరి నటన కూడా ఆకట్టుకోదు. ఏదో సన్నివేశంలో వున్నారంటే వున్నారని అన్నట్టు వాళ్ల పాత్రలు వుంటాయి.

టెక్నికల్ అంశాలకు వస్తే..

శక్తినాథ్‌ సంగీతంలో మెరుపు తగ్గింది. ‘ఫిదా’కు సంగీతం అందించి ఈ సంగీత దర్శకుడేనా అనే సందేహం రేకెత్తించింది. పాటలేవీ చెవికి ఇంపుగా అనిపించలేదు సరికాదా పేలవంగా వున్నాయి. పాటల్లో దరువు ఎక్కువగా అనిపించింది. సాహిత్యం కనిపించలేదు. ఇక నేపథ్యం సంగీతంలో శక్తినాథ్ అకట్టుకోలేకపోయాడు. బడ్జెట్‌ పరిమితుల వల్లో ఏమో కానీ, సినిమాను చుట్టేసిన ఫీలింగ్‌ కలుగుతుంది. సినిమాటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ సినిమాకి చాలా కత్తెరలు వేయాలి.

నిర్మాణ విలువలు కొంతలో కొంత మేలు. సినిమాలో ఆర్టిస్టులు, లొకేషన్స్ చూస్తుంటే నిర్మాతలు ఎంత ఖర్చుపెట్టారో తెలుస్తుంది. కల్యాణ్‌ బలమైన కథను రాసుకోవాల్సింది. దాన్ని తీర్చదిద్దడంలో నైపుణ్యం కొరవడింది. ఒక్కటంటే ఒక్క సన్నివేశాన్ని కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీయలేకపోయాడు. తెరనిండుగా ఆర్టిస్టులు కనపడతారు. కానీ, ఎవరూ ఏమీ చేసినట్టు వుండదు. ఒక్క సన్నివేశంలోనూ డెప్త్ లేదు. అట్ట్రాక్ట్ చేసే ఎలిమెంట్ లేదు. దర్శకుడిగానే కాదు రచయితగానూ ఇంకా కసరత్తులు చేస్తే బాగుండేది. 'ముసలితనం అంటే చేతకానితనం కాదురా... నిలువెత్తు అనుభవం' అని చెప్పే సన్నివేశం తెరపై వస్తున్నా ప్రేక్షకుడిలో చలనం వుండదు. అంత పేలవంగా దర్శకత్వం వుంది.

తీర్పు:

కల్యాన్ కృష్ణ తాను తీసిన చిత్రాలను మరోసారి పరిశీలించాల్సిన అవసరం వుందనిపించేలా వుంది. రవితేజ కొత్తదనం లేని నటన, మాళవిక శర్మతో పండని కెమిస్ట్రీ.. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చన అవుతుందన్నట్లుగా కథలో పాత్రాలు ఎక్కువగా వున్నాయి తప్ప.. వాటికి బలంగా కథ మాత్రం లేదు. కనీసం వారికి డైలాగులు కూడా చెప్పుకోదగ్గ విధంగా లేవు. సినిమాలో ఊరికే నటించామంటే నటించామన్న పేరు తప్ప.. పాత్రాలకు ప్రాధాన్యత మాత్రం లేదు. ఈ చిత్రంలో అనేక సీన్లు ఎడిటింగ్ చేయాల్సి వున్నా ఎడిటర్ కూడా ఏం చేయాలో తెలియని విధంగా కథను కూర్పు చేశారు. మొత్తంగా ఈ చిత్రం రవితేజ అభిమానులను కూడా రంజింపచేయలేకపోయింది. మరి ఈ చిత్రాన్ని ప్రేక్షకుడు ఎంతలా అదరిస్తారో వేచి చూడాలి.

చివరగా.. నేల చూపులు చూస్తున్న ‘నేల టిక్కెట్టు’

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh