Thimmarusu Movie Review ‘తిమ్మరసు’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘తిమ్మరసు’ ‘తిమ్మరసు’ Get information about Thimmarusu Telugu Movie Review, Satyadev Thimmarusu Movie Review, Thimmarusu Movie Review and Rating, Thimmarusu Review, Thimmarusu Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 95578 2.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ‘తిమ్మరసు’

 • బ్యానర్  :

  ఈస్ట్ కోస్ట్ ప్రోడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్

 • దర్శకుడు  :

  శరణ్ కొప్పిశెట్టి

 • నిర్మాత  :

  మహేష్ కోనేరు, సృజన్ యరబోలు

 • సంగీతం  :

  శ్రీచరణ్ పాకాల

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  అప్పు ప్రభాకర్

 • ఎడిటర్  :

  బి.తమ్మిరాజు

 • నటినటులు  :

  సత్యదేవ్, ప్రియాంక జవాల్కర్, బ్రహ్మాజీ, ఝాన్సీ, అంకిత్, బాలకృష్ణన్ తదితరులు

Thimmarusu Movie Review Weak Narrative With Contrived Screenplay

విడుదల తేది :

2021-07-30

Cinema Story

కరోనా రెండవ దశ లాక్ డౌన్ విరామం తర్వాత ఎట్టకేలకు తెరుచుకున్న థియేటర్లకు ప్రేక్షకుడు వస్తాడా.? రాడా.. అన్న అనుమానాలు చుట్టుముట్టిన క్రమంలో  ప్రేక్షకుడిని రప్పించే చిత్రం విడుదల కావాలని అందరూ కోరుకున్నారు. వెండితెరపై వెలుగులు విరబూసేలా ఉండాలని సినీపరిశ్రమ యావత్తు కోరుకుంది. వారి అంచనాలకు తగ్గట్టుగానే ఇవాళ విడుదలైన ‘తిమ్మరసు’ ప్రేక్షకుడిని థియేటర్లకు రప్పించింది. 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య'తో నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన సత్యదేవ్‌ న్యాయవాదిగా మారి సత్యమేమ జయతే అంటూ చాటిన చిత్రమే తిమ్మరసు.

'నాంది', 'వకీల్‌ సాబ్‌' వంటి కోర్టు రూమ్‌ డ్రామా చిత్రాలు బాగా ఆడటంతో తను నటించిన 'తిమ్మరుసు' సినిమా కూడా తప్పకుండా విజయం సాధిస్తుందని కొండంత ధీమా పెట్టుకున్నాడు సత్యదేవ్‌. మరి అతడి నమ్మకం నిజమైందా? అసలు తిమ్మరుసు అన్న టైటిల్‌ ఈ చిత్రానికి ఇమిడిందా? అసలే బాలీవుడ్‌లోనూ కాలు మోపబోతున్న అతడికి ఈ సినిమా ప్లస్‌గా మారనుందా? మైనస్‌ అవనుందా? అనే విషయాలన్నీ కింది రివ్యూలో ఓ రౌండేద్దాం..

కథ

శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలోని తిమ్మరుసు చాలా తెలివైన వ్యక్తి. అతడి పేరును టైటిల్‌గా పెట్టుకున్నారంటేనే తెలిసిపోతోంది హీరో చాలా తెలివైనవాడని. ఈ సినిమాలో సత్యదేవ్‌ ఇంటెలిజెంట్‌ లాయర్‌గా నటించాడు. అతడు ఎనిమిదేళ్ల క్రితం జరిగిన క్యాబ్‌ డ్రైవర్‌ మర్డర్‌ కేసును రీఓపెన్‌ చేస్తాడు. అతడి హత్య వెనకాల ఉన్న మిస్టరీని చేధించే పనిలో పడతాడు. ఈ క్రమంలో ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కుర్రాడికి ఆ హత్యకు ఎలాంటి సంబంధం లేదని తెలుసుకుంటాడు.

మరి ఇందులో ఆ అబ్బాయిని ఎవరు? ఎందుకు ఇరికించారు? ఇందులో పోలీసుల ప్రమేయం ఎంతమేరకు ఉంది? అసలు ఆ క్యాబ్‌ డ్రైవర్‌ను ఎందుకు హత్య చేస్తారు? ఈ చిక్కుముడులను అన్నింటినీ ఒక్కొక్కటిగా విప్పుకుంటూ వెళ్లే రామచంద్ర చివరాఖరకు కేసు గెలుస్తాడా? అతడు ఇంతలా ఇన్వాల్వ్‌ కావడానికి ఆ కేసుతో ఇతడికేమైనా సంబంధం ఉందా? ఆ కేసు స్టడీ చేసే రామచంద్రకు పోలీసులు ఎందుకు సహకరించరు? అన్న వివరాలు తెలియాలంటే బాక్సాఫీస్‌కు వెళ్లి బొమ్మ చూడాల్సిందే!

cinima-reviews
‘తిమ్మరసు’

విశ్లేషణ

‘థ్రిల్లర్’ అని ట్యాగ్ వేసుకుని.. మధ్యలో ఒక ట్విస్టు.. చివర్లో ఒక ట్విస్టు ఇచ్చేసి థ్రిల్లర్ అనిపించుకుంటున్న చిత్రాలు ఎక్కువగా వస్తున్న ఈ రోజుల్లో.. ‘తిమ్మరసు’ రూపంలో నూటికి నూరుపాళ్ల థ్రిల్లర్ మూవీ చూసే అవకాశం దక్కింది. కన్నడలో విజయవంతమైన బీర్బల్ చిత్రాన్ని తీసుకుని.. మాతృకలోని ఆసక్తిని ఏమాత్రం తగ్గనివ్వకుండా.. ఆద్యంతం ఎంగేజింగ్ గా తీర్చిదిద్దింది శరణ్ కొప్పిశెట్టి అండ్ కో. ఆరంభంలో మామూలు సినిమాలా అనిపించినా.. ముందుకుసాగే కొద్దీ ఉత్కంఠభరిత మలుపులు తిరుగుతూ.. ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ.. చివరికి మంచి సినిమా చూసిన అనుభూతిని మిగులుస్తుందీ చిత్రం.

‘తిమ్మరసు’ ప్రేక్షకులను ‘థ్రిల్’కు గురి చేయడమే లక్ష్యంగా సాగుతుంది. ఆత్యంతం ఉత్కంఠతో నిండిన చిత్రం.. ఎక్కడా కూడా టెంపో మిస్ కాకుండా చూడటంలోనే ‘తిమ్మరసు’ విజయం దాగి ఉంది. కథలో అత్యంత కీలకమైన క్రైమ్ ఎలిమెంట్ చూపించి హీరోను పరిచయం చేశాక రొటీన్ సన్నివేశాలే పడతాయి. సీనియర్ లాయర్ దగ్గర ప్రాక్టీస్.. అక్కడ కేసులు లేక గోళ్లు గిల్లుకోవడం.. అక్కడి నుంచి వేరే కంపెనీలో చేరడం.. అక్కడో కేసు టేకప్ చేయడం.. ఈ సీన్లన్నీ సాధారణంగా అనిపిస్తాయి. బ్రహ్మాజీ రాకతో అక్కడక్కడా కొంచెం నవ్వులు పండినా కూడా తొలి ముప్పావు గంటలో కథనంలో వేగం కనిపించదు.

హీరో సీరియస్ గా కేసులో ఇన్వాల్వ్ అయి లోతుగా పరిశీలించడం మొదలుపెట్టాక.. ఒక్కో చిక్కుముడి వీడుతున్న కొద్దీ ఆసక్తితో పాటు ఉత్కంఠ పెరుగుతుంది. ఇంటర్వెల్ దగ్గర మంచి ట్విస్టుతో ద్వితీయార్ధంపై క్యూరియాసిటీ పెరుగుతుంది. ‘తిమ్మరసు’కు పెద్ద బలం రెండో అర్ధమే. మర్డర్ మిస్టరీకి సంబంధించి ఒక్కొక్కరి వెర్షన్లో కథ చెప్పడం.. ప్రతి దాంట్లోనూ ఒక ట్విస్టో.. లేదంటే మిస్సింగ్ ఎలిమెంటో ఉండటంతో ప్రేక్షకుల్లో తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి పెరుగుతుంది. పూర్తిగా థ్రిల్లర్ రూపం సంతరించుకున్న ‘తిమ్మరసు’.. అసలు నేరస్థుడు ఎవరనే ఉత్కంఠను పెంచుతుంది. చివర్లో అన్ని ప్రశ్నలకూ సమాధానం చెప్పడంతో పాటు ఈ కేసుతో తనకున్న సంబంధమేంటో హీరో రివీల్ చేయడంతో డబుల్ థ్రిల్లవుతారు ఆడియన్స్.

హీరో పాత్ర పేరు రామచంద్ర అయితే.. ఈ సినిమాకు ‘తిమ్మరసు’ అనే టైటిల్ పెట్టడం వెనుక కారణమేంటో కూడా చివర్లోనే తెలుస్తుంది. అది కూడా ఇంట్రెస్టింగ్ పాయింటే. ప్రథమార్ధంలో ఓ అరగంట బోర్ కొట్టించినా.. అక్కడక్కడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నా కూడా.. ఓవరాల్ గా ‘తిమ్మరసు’ ప్రేక్షకులకు సంతృప్తినిస్తుంది. కథలో ఉన్న మలుపులు.. కథనంలోని వేగం.. బ్రహ్మాజీ పాత్రతో పండించిన నవ్వులు.. సినిమాకు ప్లస్. థ్రిల్లర్లు.. సీరియస్ సినిమాలు చూసేవాళ్లకు ‘తిమ్మరసు’ నచ్చుతుంది. మళ్లీ థియేటర్ల వైపు నడవడానికి ఇది మంచి ఛాయిసే.

నటీనటుల విషాయానికి వస్తే..

సత్యదేవ్ ప్రతిభ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఏ పాత్ర ఇచ్చినా దానికి పూర్తి న్యాయం చేయడానికి చూస్తాడు. లాయర్ రామచంద్ర పాత్రలోనూ అతను సిన్సియర్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. లుక్స్ పరంగా ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో ‘ది బెస్ట్’ అనిపించేలా కనిపించిన సత్యదేవ్.. తన నటనతో ప్రతి సన్నివేశంలోనూ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడానికి చూశాడు. కొన్ని చోట్ల సన్నివేశాల బలం తగ్గినా సత్యదేవ్ తన నటనతో కవర్ చేశాడు. ఏదో చేయాలనే అతడి తపన ప్రతి సన్నివేశంలోనూ కనిపిస్తుంది. ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ పాత్రకు మిస్ ఫిట్ అనిపిస్తుంది. మరీ మోడర్న్ గా అనిపించే ఆమె లుక్స్ ఈ పాత్రకు సరిపోలేదు.

‘ట్యాక్సీవాలా’ సమయంలో ఆమెలో ఉన్న క్యూట్నెస్ ఇప్పుడు కనిపించడం లేదు. లుక్స్ విషయంలో ఆమె కొంచెం జాగ్రత్త పడాల్సిందే. హీరో తర్వాత ఎక్కువ ఆకట్టుకునేది బ్రహ్మాజీనే. ‘తిమ్మరసు’ సీరియస్ మూవీ అయినప్పటికీ.. బ్రహ్మాజీ అక్కడక్కడా చక్కటి పంచులతో నవ్విస్తూ రిలీఫ్ ఇచ్చాడు. సినిమా నడతకు తగ్గట్లే సటిల్ గా సాగింది అతడి హ్యూమర్. చేయని నేరానికి హత్య కేసులో జైలు శిక్ష అనుభవించే కుర్రాడిగా అంకిత్ ఆకట్టుకున్నాడు. మెయిన్ విలన్ గా చేసిన కొత్త నటుడి గురించి పెద్దగా చెప్పుకోవడానికేమీ లేదు. ‘30 వెడ్స్ 21’ ఫేమ్ చైతన్యరావు.. ఝాన్సీ.. అజయ్.. ప్రవీణ్.. హర్ష.. బాలకృష్ణన్.. వీళ్లంతా బాగానే చేశారు.టెక్నికల్ అంశాలకు వస్తే..

బడ్జెట్ పరిమితుల దృష్ట్యా ‘తిమ్మరసు’లో ప్రొడక్షన్ వాల్యూస్ అంత గొప్పగా అనిపించవు. కానీ కథా కథనాలు ఆసక్తికరంగా సాగడంతో ప్రేక్షకులు ఈ లోపాన్ని పట్టించుకోరు. పాటలు లేని ఈ సినిమాకు శ్రీ చరణ్ పాకాల నేపథ్య సంగీతం ప్లస్ అయింది. థ్రిల్లర్ సినిమాలకు పేరు పడ్డ అతను ఉత్కంఠ రేకెత్తించే ఆర్ఆర్ తో సన్నివేశాల బలం పెంచాడు. కొన్ని చోట్ల నేపథ్య సంగీతం లౌడ్ అనిపించినా.. ఓవరాల్ గా ఓకే.

అప్పు ప్రభాకర్ ఛాయాగ్రహణం సినిమా శైలికి తగ్గట్లు సాగింది. ఆరంభం నుంచే ఒక మూడ్ క్రియేట్ చేయడంలో కెమెరామన్ కీలక పాత్ర పోషించాడు. స్క్రిప్టు విషయానికి వస్తే కన్నడలో వచ్చిన దీని ఒరిజినల్లోనే మంచి విషయం ఉంది. దాన్ని అడాప్ట్ చేసుకోవడంలో.. ఆసక్తికరంగా నడిపించడంలో దర్శకుడు శరణ్ కొప్పిశెట్టి విజయవంతం అయ్యాడు. ప్రథమార్ధంలో కొంచెం బోర్ కొట్టించినా.. ముందుకు సాగేకొద్దీ చిక్కు ముడులు ఒక్కోటి విప్పడంలో.. ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేయడంలో శరణ్ పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే.

తీర్పు: కరోనా-2 అన్ లాక్ తో తెరుచుకున్న థియేటర్లలో థ్రిల్లర్ ఎంజాయ్ మెంట్ ‘‘తిమ్మరసు’’

చివరగా.. కిరాక్ థ్రిల్లర్ ‘తిమ్మరసు’

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh