Sreekaram​ Movie Review ‘చెక్’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘శ్రీకారం’ ‘శ్రీకారం’ Get information about Sreekaram​ Telugu Movie Review, Sharwanand Srikaram Movie Review, Sreekaram​ Movie Review and Rating, Sreekaram​ Review, Check Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 94831 3.25 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ‘శ్రీకారం’

 • బ్యానర్  :

  14 రీల్స్ ప్లస్

 • దర్శకుడు  :

  బి. కిశోర్

 • నిర్మాత  :

  రామ్ ఆచంట, గోపీ ఆచంట

 • సంగీతం  :

  మిక్కీ జె.మేయర్‌

 • సినిమా రేటింగ్  :

  3.253.253.25  3.25

 • ఛాయాగ్రహణం  :

  జె.యువరాజ్‌

 • ఎడిటర్  :

  మార్తాండ్‌ కె.వెంకటేశ్‌

 • నటినటులు  :

  శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్, సాయికుమార్, రావు రమేష్, వీకే నరేష్, మురళి శర్మ, సత్య, సప్తగిరి తదితరులు

Sreekaram​ Movie Review

విడుదల తేది :

2021-03-11

Cinema Story

‘శంకర్ దాదా ఎంబీబీఎస్’తో నటనకు ‘శ్రీకారం’ చుట్టిన శర్వానంద్.. హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ శర్వానంద్ సినిమా అంటే విభిన్నమైన కథ లేదా కథాంశం.. లేదా ఏదో పాయింట్ ఉంటుందని ప్రేక్షకులు నమ్మేలా అభిమానం పెంచుకున్నారు. బి. కిషోర్ అనే నూతన దర్శకుడికి అవకాశం కల్పిస్తూ.. ఈ సారి విభిన్నమైన రైతుల కథను ఎంచుకున్నాడు. పల్లెలు అనగానే దేశానికి మాత్రమే పట్టుగోమ్మలు కాదు.. దేశ సంస్కృతికి, సంప్రదాయానికి, ఆప్యాయత, ప్రేమ, అనురాగాలకు కూడా అవాసాలని చెప్పనక్కర్లేదు. అయితే ఎన్ని వున్నా రైతులను కష్టనష్టాలు వివరిస్తూ శ్రీకారం సినిమాతో మహా శివరాత్రి రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చారు శర్వానంద్. ఇందులో వ్యవసాయం గురించి ఏం చెప్పారు?.. రైతు బిడ్డగా శర్వానంద్ ఏ మేరకు మెప్పించాడు?.. అసలు సినిమా ఎలా ఉంది? అనేది తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం..

కథ

కార్తీక్ (శ‌ర్వానంద్) ఓ రైతు కుటుంబానికి చెందిన యువ‌కుడు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగంలో రాణిస్తాడు. అయితే అదే సమయంలో ఎన్నో వ్యయప్రయాసలకోర్చిన ఆయన తండ్రి కేశ‌వులు(రావు ర‌మేష్‌) వ్యవసాయం చేసి అది సవ్యంగా సాగక.. అప్పుల్ని కూడా చేస్తాడు. కార్తీక్ తన తండ్రి అప్పులను కూడా తీర్చేస్తాడు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్. తన పనితనంతో ఆఫీస్‌లో అందరి మన్ననలు పొందుతాడు. అంతేకాదు అంద‌మైన అమ్మాయి చైత్ర (ప్రియాంక అరుళ్ మోహ‌న్‌) మ‌న‌సును కూడా దోచేస్తాడు. ఒక ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతం చేయడంతో కంపెనీ యాజమాన్యం అతన్ని అమెరికా పంపించేందుకు డిసైడ్ అవుతుంది.

రెడ్ కార్పెట్ పై తిరిగే స్థాయిలో ఉన్న కార్తీక్ ఉన్న‌ట్టుండి ఉద్యోగం మానేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంటాడు. ఊరెళ్లి వ్య‌వ‌సాయం చేస్తానంటూ ప‌ట్నం నుంచి ప‌ల్లెటూరికి వ‌చ్చేస్తాడు. ఇంకోప‌క్కేమో కార్తీక్ తండ్రి కేశ‌వులు త‌న కొడుకు అమెరికా వెళ్ల‌బోతున్నాడ‌ని గొప్ప‌గా చెప్పుకుంటుంటాడు. కార్తీక్ నిర్ణయంతో తన తండ్రి కేశవులు షాక్ అవుతారు. వ్యవసాయం దండగ అని వదిలేసిన కొంత మంది రైతులతో కలిసి ఉమ్మడి వ్యవసాయం మొదలు పెడతాడు కార్తీక్. ఉమ్మడి వ్యవసాయం అంటే ఏంటి? అందులో ఎదురైన సమస్యలను కార్తిక్‌ ఎలా పరిష్కరించాడు? టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయాన్ని ఎలా లాభసాటిగా మలిచాడు అనేదే మిగతా కథ. మ‌న‌సిచ్చిన అమ్మాయి ఏం అంటుంది?  ఇంత‌కీ అత‌ను వ్య‌వ‌సాయం చేయాల‌ని సంక‌ల్పించుకోవ‌డం వెన‌క కార‌ణ‌మేమిటి? మ‌రి వ్య‌వ‌సాయంలో ఫ‌లితాలు అందుకున్నాడా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

cinima-reviews
‘శ్రీకారం’

విశ్లేషణ

వ్యవసాయం.. పేరులోనే సాయం ఉంది. కానీ దానికి అయ్యే వ్యయాన్ని రైతు భరించలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పులు చేసి పెట్టుబడి పెట్టి పంట పండించినా గిట్టుబాటు ధర రాక మరింతగా అప్పుల పాలు అవుతున్నాడు. పాత పద్ధతుల్లోనే వ్యవసాయం చేస్తూ నష్టాలు తెచ్చుకుంటున్నాడు. అయితే చదువుకున్న యువకులు వ్యవసాయం చేస్తే ఎంత లాభం ఉంటుందో తెలియజేసే కథే ‘శ్రీకారం’. వ్యవసాయం, రైతు యొక్క గొప్పతనాన్ని తెరపై చక్కగా చూపించాడు దర్శకుడు బి.కిశోర్‌. కష్టపడి పొలం పని చేసి పంటను పండించిన రైతు.. తన పంటను అమ్ముకోలేక ఎన్ని కష్టాలు పడుతున్నాడో ఈ  సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. అలాగే రైతులకు అప్పులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు.. వారిని ఎలా పీక్కుతింటారనేది వాస్తవానికి దగ్గరగా చూపించాడు. మంచి సందేశాత్మక కథ అయినప్పటికీ.. ఇది అందరికి తెలిసిన సబ్జెక్టే.

రైతుల కష్టం నేపథ్యంలో ఇప్పటికే బోలెడు చిత్రాలు వచ్చాయి. కథ అందరికీ తెలిసినా దాన్ని కొత్త పద్ధతిలో చూపించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ కిశోర్. అయితే సినిమాలో స్లో నెరేషన్‌ ఒకటే ప్రేక్షకుడిని కాస్త ఇబ్బంది పెడుతుంది. మిగతా అంతా చక్కగా ఉంది. పల్లెటూళ్లలో పరిస్థితులు ఎలా ఉంటాయనేది కళ్లకు కట్టినట్లు చూపించాడు దర్శకుడు. తన ఊళ్లో తాను చూసిన క్యారెక్టర్లనే కథలో పెట్టానని సినిమా ప్రమోషన్స్‌లో చెప్పిన దర్శకుడు.. నిజంగా అలాగే తీశాడు. మిక్కీ జె. మేయర్ సంగీతం పర్వాలేదనిపించేలా ఉంది. పెంచలదాస్ రాసి పాడిన ‘వస్తానంటివో’ పాట తప్ప మిగతావన్ని అంతంతమాత్రంగానే ఉన్నాయి. పాటల సంగతి పక్కన పెడితే ఎమోషన్స్ పండించే విషయంలో దర్శకుడు వంద శాతం సక్సెస్ అయ్యాడని చెప్పాలి. హృదయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఫస్ట్ ఆఫ్‌లో కానీ, సెకెండాఫ్‌లో కానీ ఏదో ఒక సీన్‌లో కన్నీళ్లు రాక మానవు.

డాక్టర్ కొడుకు డాక్టర్, యాక్టర్ కొడుకు యాక్టర్, పొలిటీషన్ కొడుకు పొలిటీషియన్.. ఇలా అన్ని రంగాల వాళ్ల పిల్లలు ఆయా రంగాల్లోకి వెళ్లాలని కోరుకుంటారు. అయితే ఒక్క రైతు కొడుకు మాత్రం రైతు కావడానికి ఇష్టపడడు. పొలంలో తన తండ్రి పడే కష్టం చూసి ఏ సాప్ట్‌వేర్ జాబో చూసుకుందామని అనుకుంటాడు. అలాగే తల్లిదండ్రులు కూడా తాము పడుతున్న కష్టాన్ని తమ పిల్లలు పడకూడదని అప్పులు చేసైనా చదివిస్తారు. అలా చదువుకున్న వాళ్లు వ్యవసాయం చేస్తే అన్నిటికంటే లాభసాటిగా ఉంటుందని చెప్పేదే ఈ శ్రీకారం ప్రధాన ఉద్దేశం. ఇక ఈ సినిమాకు ప్రధాన బలం బుర్రా సాయి మాధవ్‌ డైలాగ్స్‌.  ‘తినేవాడు నెత్తి మీద జుట్టంత ఉంటే.. పండించేవాడు మూతి మీద మీసం అంత కూడా లేరు’అనే ఒక్క డైలాగ్ ఆలోచించేలా చేస్తుంది. తన పవర్‌ఫుల్ సంభాషణలతో రైతుల దీనగాథను వివరించారు. అలాగే ‘పనిని పట్టి పరువు.. పరువుని పట్టి పలకరింపు’, ‘ఉద్యోగం వస్తే అమ్మని బాగా చూసుకుందాం అని అనుకున్నానురా.. ఇప్పుడు ఉద్యోగం తప్ప ఇంకేం చూసుకోలేకపోతున్నా’అనే డైలాగ్స్‌ యువతను ఆలోచింపజేస్తాయి. స్క్రీన్‌ప్లే బాగుంది. ఎడిటర్‌ మార్తండ్‌ కె వెంకటేశ్‌ తన కత్తెరకు కాస్త పనిచెప్పాల్సింది. సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా బాగున్నాయి.

నటీనటుల విషాయానికి వస్తే..

శర్వానంద్ అటు సాప్ట్ వేర్ ఇంజనీర్ గా ఇటు వ్యవసాయదారుడిగా రెండు పాత్రలలోనూ తన నటనతో మెప్పించాడు. కంప్యూటర్‌ ముందు యంత్రంలా పని చేసే యువ సాఫ్ట్‌వేర్‌ పొలంలోకి దిగితే ఎలా ఉంటుందన్నది కళ్లకు కట్టినట్లు చూపించారు. సాధారణ రైతు కుటుంబానికి చెందిన కార్తిక్‌ పాత్రలో శర్వానంద్‌ ఒదిగిపోయారు. తనకు ఉన్న అనుభవంతో కొన్ని ఎమోషనల్‌ సీన్లను కూడా చక్కగా పండించారు. కథనంతా తన భూజాన వేసుకొని శ్రీకారం సినిమాను నడిపించారు శర్వానంద్. ఈ సినిమాతో ఆయన నటన మరింత మెరుగుపడిందని చెప్పాలి.

చైత్ర పాత్రలో ప్రియాంకా అరుళ్‌ మోహన్ నటన పరంగాను, గ్లామర్ పరంగాను ఆకట్టుకుంది. ఇక ఈ సినమాకు మరో ప్రధాన బలం హీరో తండ్రి కేశవులు పాత్ర చేసిన రావు రామేశ్‌ది‌. నిరుపేద రైతు పాత్రలో రావు రమేశ్‌ ఒదిగిపోయారు. ఆయన డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. కళ్లతోనే కొన్ని ఎమోషన్స్ పలికించారు. ఇక మంచితనం ముసుగు కప్పుకొని జనాన్ని మోసం చేసే ఏకాంబరం పాత్రలో సాయి కుమార్‌ కూడా ఆకట్టుకున్నారు. హీరో తల్లిగా ఆమని తన పాత్రలో ఒదిగిపోయారు. ఇక వీకే నరేశ్‌ ఈ సినిమాకు మరో ముఖ్య పాత్ర. కార్తీక్ మామ పాత్రలో ఎమోషన్స్ పండించారు. మురళి శర్మ, సత్య, సప్తగిరి తదితరులు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.టెక్నికల్ అంశాలకు వస్తే..

సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. చిత్ర నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి, యువ‌రాజ్ కెమెరా ప‌నిత‌నం, మిక్కీ జె.మేయ‌ర్ సంగీతం, బుర్రా సాయిమాధ‌వ్ సంభాష‌ణ‌లు చిత్రానికి బ‌లం. పాట‌లు, వాటి చిత్ర‌ణ కూడా అర్థ‌వంతంగా, సందర్భోచితంగా సాగుతాయి. రాజీలేని నిర్మాణ తెర‌పై క‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడు కిషోర్ క‌థ‌ని నిజాయ‌తీగా చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. క‌మ‌ర్షియ‌ల్ అంశాల కోసం ఎక్క‌డా  నేల‌విడిచి సాము చేయ‌లేదు.

తీర్పు: అధునాతన సాంకేతిక పరికరాలతో ఉమ్మడి వ్యవసాయంతో ఐక్యంగా చేసే సాగు పండగకు ‘‘శ్రీకారం’’

చివరగా.. ఎమోషన్స్ పండించే ‘శ్రీకారం’

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh