దేవ (నాగార్జున) పెద్ద డాన్. ఎవరికీ అతనెలా ఉంటాడో తెలియదు. కానీ అందరినీ భయపెడుతుంటాడు. దాస్ (నాని) డాక్టర్. ప్రాణాల విలువ తెలిసిన వ్యక్తి. తన నిజాయతీ వల్ల ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో ఇమడలేక బయటికి వచ్చేస్తాడు. అతనికి వాళ్ల ధూల్‌పేటలోని ఓ ఆసుపత్రిలో డాక్టర్‌గా అవకాశం దొరుకుతుంది. అనుకోకుండా పోలీసుల కాల్పుల్లో బుల్లెట్ దిగిన దేవ, వెతుక్కుంటూ దాస్ ఆసుపత్రికి వస్తాడు. అతని దగ్గర పేషెంట్ అవుతాడు. క్రమంగా ఇద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. అది స్నేహంగా మారుతుంది.
పూజ (రష్మిక)ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు దాస్. యాంకర్ జాహ్నవి అంటే దేవకి చాలా ఇష్టం. ఇద్దరి ఫ్రెండ్షిప్, జీవితాలూ సుఖంగా సాగుతుండగా ఓ ఘటన జరుగుతుంది. దాని వల్ల దాస్.. దేవకి దూరమవుతాడు.. అయితే వారిద్దరినీ కలిపిన అంశాలేంటి? చివరికి దేవకి ఏమయింది? అనేది ఆసక్తికరం. మరి సినిమా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసి ప్రేక్షకులను మెప్పించిందా? లేదా? అని తెలుసుకోవాలంటే వేచి చూడాల్సిందే.
విశ్లేషణ
నలుగురు ప్రాణాలు తీయడంలో లేని ఆనందం ఒక ప్రాణాన్ని కాపాడటంలో ఉంటుంది. ఒకరిని ఒకరు చంపుకోవడం కాదు.. వీలైతే ఒక ప్రాణాన్ని కాపాడగలగాలి. ఇదే ఈ సినిమా ప్రధానాంశం. కథలో పెద్దగా బలం లేకపోయినా కథనాన్ని దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య బాగానే నడిపించారు. తరవాత ఏం జరగబోతోందో ప్రేక్షకుడి ఊహకు అందుతున్నప్పటికీ సరదా సరదా సన్నివేశాలు వినోదాన్ని పంచుతాయి. నాగార్జున, నాని స్టార్డమ్ సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమా మొత్తాన్ని వీళ్లిద్దరూ తమ భుజస్కందాలపై నడిపించారు. నాగ్, నాని మధ్య వచ్చే ప్రతి సన్నివేశం చాలా బాగుంది. కామెడీ, ఎమోషన్ అన్నీ పండాయి.
ఫస్టాఫ్‌లో దాస్-దేవ స్నేహం, అలాగే దాస్-పూజ లవ్ ట్రాక్‌ను చూపించిన దర్శకుడు.. సెకండాఫ్‌లో దేవా ఎలా మారాడో చూపించారు. ఫస్టాఫ్‌లో కామెడీ, లవ్ ట్రాక్, పాటలతో ఆహ్లాదరకంగానే ఉంటుంది. ఇంటర్వల్లో వచ్చే చిన్న ట్విస్ట్ సెకండాఫ్ ఎలా ఉండబోతుందో అనే ఆసక్తిని ప్రేక్షకుడిలో కలుగజేస్తుంది. కానీ ఆ ఆసక్తి సెకండాఫ్‌లోకి అడుగుపెట్టాక ఎంతసేపో ఉండదు. ఎందుకంటే అప్పటికే సినిమా ఎటు వెళ్తుందో ప్రేక్షకుడికి అర్థమైపోతుంది.
దేవ-జాహ్నవి లవ్ ట్రాక్ కూడా అంత ఆసక్తికరంగా ఏమీ లేదు. అయితే ఒక చిన్న పిల్లాడి మరణం దేవాలో మార్పుతీసుకొచ్చిన సన్నివేశం ప్రేక్షకుడితో కంటతడి పెట్టిస్తుంది. ఆ పిల్లాడు చనిపోయే ముందు దేవాతో చెప్పే మాటలు ప్రేక్షకుడిని భావోద్వేగానికి గురిచేస్తాయి. ఇక అన్ని కమర్షియల్ సినిమాల్లో ఉన్నట్టే ఆఖర్లో ఒక ఫైట్, విలన్‌ను చంపేయడం కామన్. కాకపోతే క్లైమాక్స్‌లో ఆసక్తికర సన్నివేశం ఉంది. అదేంటో థియేటర్లోనే చూడాలి.
నటీనటుల విషానికి వస్తే
ఈ సినిమా నాగార్జున, నాని కోసమే తీసినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ పాత్రల్లో వీళ్లిద్దరూ అంత బాగా నటించారు. మంచితనం, నిజాయతీ, ఎవరికీ హాని తలపెట్టని తత్వం కలిగిన డాక్టర్ పాత్రలో నాని నటన అద్భుతం. తన అమాయకత్వంతోనే హాస్యాన్ని పండించారు. నాని కనిపించే ప్రతి సన్నివేశం నవ్వు తెప్పిస్తుంది. ఇక డాన్ పాత్రలో నాగార్జున అదరగొట్టారు. సుమారు అరవయ్యేళ్ల వయసులోనూ కండలు తిరిగిన బాడీతో కింగ్ అనిపించుకున్నారు. అక్కినేని అభిమానులకు ఇది ఫుల్ ఫీస్ట్. ఆ స్టైల్, గ్లామర్, కాస్ట్యూమ్స్.. నాగ్ ఈజ్ బ్యాక్ అనిపిస్తాయి.
‘నువ్వు చదివే స్కూలుకి నేను హెడ్ మాస్టర్ని రా’ అంటూ విలన్‌తో నాగ్ చెప్పే డైలాగ్ విజిల్స్ వేయిస్తుంది. ఇక రష్మిక మందన తన క్యూట్ లుక్స్‌తో కట్టిపడేసింది. ఆమె పాత్రకు కూడా మంచి ప్రాధాన్యతే ఉంది. టీవీ యాంకర్ జాహ్నవిగా ఆకాంక్ష మెప్పించింది. ప్రధాన విలన్ పాత్రలో నటించిన బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ చూడటానికి బాగున్నాడు. అయితే నటించడానికి ఆయనకు పెద్దగా స్కోప్ లేదు. శరత్ కుమార్, మురళీశర్మ, నరేష్, సత్య, రావు రమేష్, నవీన్ చంద్ర, వెన్నెల కిషోర్ తమ పాత్రల పరిధి మేర నటించారు.
టెక్నికల్ అంశాలకు వస్తే..
సాంకేతికంగా సినిమా చాలా రిచ్‌గా ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చుకు ఎక్కడా వెనకాడకుండా సినిమాను నిర్మించినట్లు నిర్మాత సి.అశ్వినీదత్ చెప్పారు. సినిమా చూస్తే అది నిజమే అనిపిస్తుంది. ప్రతి సన్నివేశం చాలా కలర్ఫుల్గా ఉంటుంది. పాటల చిత్రీకరణ కూడా అద్భుతంగా ఉంది. శ్యామ్ దత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయ్యింది. మణిశర్మ అందించిన పాటలు బాగానే ఉన్నాయి. నేపథ్య సంగీతం సినిమా స్థాయిని పెంచింది. ముఖ్యంగా నాగార్జున స్టైల్‌గా నడుచుకుంటూ వచ్చే ప్రతిసారి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సూపర్. సినిమా నిడివి కాస్త ఎక్కువగానే ఉంది. ఎడిటర్ ప్రవీణ్ పూడి తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పుంటే బాగుండేది.
తీర్పు..
నవరసాలను కాంక్షించే ప్రేక్షకులకు ఈ చిత్రం అంత అశాజనకంగా అనిపించదు. అయితే కేవలం కామెడీ కోసం వెళ్లే వారికి మాత్రం ఈ సినిమా బోర్ కొట్టదు. హాస్యం, సహజ నటన కలగలిపిన కమర్షియల్ మల్లీస్టారర్ ‘దేవదాస్’.
చివరగా.. ప్రేక్షకులను హస్యంతోనే కట్టిపడేసిన దేవదాస్..