2 Countries Telugu Movie Review and Rating | 2 కంట్రీస్ మూవీ రివ్యూ

Teluguwishesh 2 కంట్రీస్ 2 కంట్రీస్ 2 Countries Telugu Movie Review and Rating. Sunil and Manisha Raj Starrer Directed by N Shankar. Product #: 86273 1.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  2 కంట్రీస్

 • బ్యానర్  :

  మహాలక్ష్మీ ఆర్ట్స్

 • దర్శకుడు  :

  ఎన్ శంకర్

 • నిర్మాత  :

  ఎన్ శంకర్

 • సంగీతం  :

  గోపీసుందర్

 • సినిమా రేటింగ్  :

  1.75  1.75

 • ఛాయాగ్రహణం  :

  సి రామ్ ప్రసాద్

 • నటినటులు  :

  సునీల్, మనీషా రాజ్, థర్టీ ఇయర్స్ పృథ్వీ, శ్రీనివాసరెడ్డి, దేవ్ గిల్, షాయాజి షిండే, చంద్రమోహన్, సితార, నరేష్, రాజా రవీంద్ర తదితరులు

2 Countries Telugu Movie Review

విడుదల తేది :

2017-12-29

Cinema Story

ఉల్లాస్ కుమార్ (సునీల్) అనే గ్రామీణ యువకుడికి డబ్బంటే పిచ్చి. అందుకోసం కుటుంబాన్ని సైతం రిస్క్ లో పెట్టడం అతని నైజం. ఈ క్రమంలో తమ ఊళ్లో పటేల్ అనే పెద్ద మనిషి చెల్లెలికి కాళ్లు లేకపోయినా పెళ్లి చేసుకునేందుకు ముందుకు వస్తాడు. అంతలో అంతకంటే డబ్బున్న తన చిన్ననాటి స్నేహితురాలైన లయ (మనీషా రాజ్) టచ్ లోకి వస్తుంది. ఆమెకు లేని పోని అబద్ధాలు చెప్పి తనతో పెళ్లికి ఒప్పిస్తాడు. ఇక ఉల్లాస్ గురించి తెలిశాక ఆమె అతన్ని అసహ్యించుకుని విదేశాలకు వెళ్లిపోతుంది. డబ్బు కోసం ఆమె వెంటే ఉల్లాస్ కూడా బయలుదేరుతాడు. ఆ క్రమంలో లయతో పెళ్లి తర్వాత ఆమె గురించి సంచలన విషయాలు తెలుస్తాయి. భార్యను మెప్పించి చివరికి ఉల్లాస్ ఎలా కథను సుఖాంతం చేస్తాడు?.

cinima-reviews
2 కంట్రీస్

సునీల్ గత కొంత కాలంగా వరుస వైఫల్యాలతో సతమతమవుతున్నాడు. అతడి చివరి సినిమా ‘ఉంగరాల రాంబాబు’ ఎప్పడు వచ్చిపోయిందో కూడా ప్రేక్షకులకు సరిగ్గా గుర్తులేదు. దీంతో అప్పుడెప్పుడో జై బోలో తెలంగాణ చిత్రంతో వెలుగులోకి వచ్చిన దర్శకుడు శంకర్ తో ‘2 కంట్రీస్’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మళయాళ 2 కంట్రీస్ చిత్రానికి ఇది రీమేక్. మరి ఇది ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్లి చూద్దాం.

విశ్లేషణ:

మళయాళంలో ‘2 కంట్రీస్’ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. కేవలం కామెడీ కంటెంట్ మీదే ఆ చిత్రం అంత హిట్ అయ్యింది. అయితే తెలుగులో ‘2 కంట్రీస్’ ఆ విషయంలో చాలా దూరంలో నిలిచింది. సునీల్ లాంటి కామెడీ టైమింగ్ ఉన్న నటుడితో పేలవమైన చిత్రాన్ని అందించాడు శంకర్.

లాజిక్ తో సంబంధం లేకుండా ఇష్టానుసారం కథను తెరకెక్కించిన దర్శకుడు ప్రేక్షకుల కన్విన్స్ అనే పాయింట్ ను పూర్తిగా పక్కన పెట్టేశాడు. వెరసి టూ కంట్రీస్ ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తుంది. అసలు ‘2 కంట్రీస్’ కథలో ఏమాత్రం లాజిక్ లేదు. కొత్తదనమూ లేదు. మళయాళంలో కామెడీ వర్కవుట్ అయి ఉండొచ్చు కానీ.. ఇక్కడ మాత్రం నవ్వించేందుకు చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. ఔట్ డేట్ అయిపోయిన లౌడ్ కామెడీతో చికాకు పుట్టించాడు. ప్రథమార్ధంలో బావుంది అనిపించే మూమెంట్ కోసం బూతద్దం పెట్టి వెతికినా కనిపించదు. ద్వితీయార్ధమంతా యూఎస్ నేపథ్యం.. రిచ్ లొకేషన్లలో సాగుతుంది. చివర్లో కొంచెం ఎమోషనల్ గా కథ పండించినప్పటికీ... కథాకథనాల్లో ఎలాంటి ప్రత్యేకత లేకుండా పోయింది. పైగా ఇంగ్లిష్ యాక్సెంట్ తో తెలుగు మాట్లాడించటం చాలా విసుగుపుట్టిస్తుంది.

ఇంతకుముందు లాగా డ్యాన్సులు.. ఫైట్లతో వీర విన్యాసాలు చేయకపోయినా.. అతను డిజైనర్ డ్రెస్సులేసుకుని అమెరికాలో హీరోయిన్ చుట్టూ తిరుగుతుంటే ఎంత మాత్రం కన్విన్సింగ్ గా అనిపించదు. హీరో సహా అందరూ గోల గోల చేస్తూ ఆ డైలాగుల్ని పలికి తెర మీద గందరగోళాన్ని సృష్టించారు. అంతకు మించి ప్రత్యేకంగా చెప్పుకునే అంశాలేమీ లేవు.

 

నటీనటుల విషయానికొస్తే.. సునీల్ కథల ఎంపికలో మరోసారి ఫెలయ్యాడు. డ్యాన్సులు.. ఫైట్ల పెద్ద హడావుడి లేకుండా సాధారణ క్యారెక్టరైజేషన్ తో వచ్చినా పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయాడు. నటుడిగా తన వంతు ప్రయత్నం చేసుకుపోయాడు. హీరోయిన్ మనీషా రాజ్ అందంగా ఉంది. కానీ, నటిగా ఎలాంటి ముద్రా వేయలేకపోయింది. ఇక సినిమా నిండా బోలెడంత తారాగణం ఉన్నా ఎవరూ ఆకట్టుకోలేకపోయారు.

టెక్నికల్ అంశాల విషయానికొస్తే... గోపీసుందర్ లాంటి మంచి సంగీత దర్శకుడి మ్యూజిక్ కూడా సాదాసీదాగా అనిపిస్తుంది. నేపథ్య సంగీతం కూడా అంతంతమాత్రమే. రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం బాగానే ఉంది. విలేజ్ తోపాటు యూఎస్ ఎపిసోడ్ మొత్తాన్ని రిచ్ గా తీశాడు. నిర్మాతగా కూడా అయిన శంకర్ బాగానే ఖర్చు చేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్ కు ఢోకా లేదు. ఎక్కడా రాజీ పడలేదు.

తీర్పు :

అరిగిపోయిన కథ.. దానికి తగ్గట్లు నరేషన్ తో ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టాడు. దర్శకుడు శంకర్ శైలికి నప్పని సినిమా ఇది. అలాగే ఈ కథకు సునీల్ ను ఎంచుకోవడమూ కరెక్ట్ కాదేమో అనిపించకమానదు.

చివరగా.. ‘2 కంట్రీస్’ కొత్తదనం.. లాజిక్ లేని ప్రయత్నం