రివ్యూ: ఘాజీ ... ఓ అరుదైన సినిమా | Ghazi movie review.

Teluguwishesh ఘాజీ ఘాజీ Ghazi telugu movie review. Product #: 80978 3 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ఘాజీ

 • బ్యానర్  :

  పీవీపీ సినిమాస్, మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్

 • దర్శకుడు  :

  సంకల్ప్ రెడ్డి

 • నిర్మాత  :

  పొట్లూరి వరప్రసాద్

 • సంగీతం  :

  కృష్ణ కుమార్

 • సినిమా రేటింగ్  :

  333  3

 • ఛాయాగ్రహణం  :

  మంది

 • ఎడిటర్  :

  ఏ శ్రీకర్ ప్రసాద్

 • నటినటులు  :

  రానా దగ్గుబాటి, తాప్సీ, కేకే మీనన్; అతుల్ కులకర్ణి, ఓంపురి, నాజర్, సత్యదేవ్, రవివర్మ తదితరులు

Ghazi Movie Review

విడుదల తేది :

2017-02-17

Cinema Story

కథ:

1970 దశకంలో బంగ్లాదేశ్ విముక్తి పోరాటాన్ని అణచివేయడానికి పాకిస్థాన్ సైనిక చర్యను చేపడుతుంది. దాంతో సైన్యం దాడుల నుండి ప్రాణాలకు కాపాడుకోవడానికి అక్కడి ప్రజలు భారతదేశానికి వలస రావడం ప్రారంభించారు. బంగ్లాదేశ్‌కు భారత్ అండగా నిలుస్తుంది. ఈ సహాయాన్ని హర్షించని పాకిస్థాన్ ప్రభుత్వం భారత్ ను దెబ్బ కొట్టేందుకు భారీ విధ్వంసానికి కుట్ర పన్నుతుంది. తూర్పవైపు ఉన్న తీర ప్రాంతంలోని ఓ రేవు పట్టణాన్ని నాశనం చేసి దృష్టి మళ్లీంచి ఆపై యద్ధం చేయాలన్న ఆలోచన చేస్తుంది. ఈ క్రమంలో తెలుగు ప్రాంతమైన విశాఖపట్నం ను టార్గెట్ చేస్తూ సబ్‌మెరైన్ ఘాజీని పంపిస్తుంది. 

 

అయితే పాకిస్థాన్ దాడులకు సంబంధించిన సమాచారం ఇండియన్ నేవీ దళానికి అందుతుంది.  దాడులను తిప్పికొట్టే బాధ్యతను కెప్టెన్ రణ్ విజయ్‌సింగ్(కేకేమీనన్), లెఫ్టినెంట్ కమాండర్ అర్జున్(రానా) లకు అప్పగిస్తుంది. దేశంలో అత్యంత శక్తివంతమైన ఐఎన్‌ఎస్ విక్రాంత్ సబ్‌మెరైన్ ద్వారా ఆపరేషన్ ఘాజీని నిర్వహిస్తుంది. అయితే టీంలో ఉన్న ఆవేశపరుడైన రన్‌విజయ్ సింగ్, ఆలోచన పరుడైన అర్జున్‌కు మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుంటాయి. అయినప్పటికీ యుద్ధంలో పాల్గొంటూనే ఉంటారు. మరి ప్రాణాలకు తెగించి నేవీ అధికారులు 18 రోజుల పాటు సముద్రగర్భంలో ఎలాంటి పోరాటాన్ని సాగించారు?   చివరకు ఎలా విజయవంతమయ్యారు? విక్రాంత్ కన్న ఎన్నో రేట్లు శక్తివంతమైన ఘాజీ సబ్‌మెరైన్‌ను ఎలా ధ్వంసం చేశారన్నదే కథ... 

cinima-reviews
ఘాజీ

తెలుుగులో టాప్ హీరోలతో సహా ఇప్పుడిప్పుడే ప్రయోగాల వైపు అడుగులు వేస్తున్నారు. ఆ లిస్ట్ లో రానా కూడా చేరిపోయి ఘాజీ అనే ఓ ఢిఫరెంట్ జోనర్ సినిమాతో వచ్చాడు. ఇండియాలోనే ఫస్ట్ టైం సబ్ మెరైన్ వార్ డ్రామాతో ఓ సినిమా తెరకెక్కింది. అదే ఘాజీ. సంకల్ప్ రెడ్డి అనే యూట్యూబ్ సెన్సేషన్ కుర్రాడు ఈ సినిమాకు దర్శకుడు. భారీ బడ్జెట్ పీవీపీ తెలుగు, హిందీ, తమిళ్ లో ఏక కాలంలో తెరకెక్కించింది. మరీ ప్రయోగం ఎంత వరకు సక్సెస్ అయ్యిందనేది ఇప్పుడు తెలుసుకుందాం.

విశ్లేషణ:

మరుగుపడిన మన చరిత్రను కళ్ళకు కట్టే యత్నమే ఈ ఘాజీ. వార్ నేపథ్యంలో, ముఖ్యంగా మనకు తెలీని పరిస్థితులను నేపథ్యాంశంగా ఎంచుకోవటం నిజంగా పెద్ద సాహసం. అయితే దానిని కమర్షియల్ హంగులనే చెత్త చెదారంతో చెడగొట్టకుండా ఎంగేజింగ్ గా తెరకెక్కించాల్సి ఉంటుంది. సరిగ్గా ఘాజీ విషయంలో అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఇది వరకు హిస్టరీ పుస్తకాల్లో పెద్దగా కనిపించని, వినిపించని ఈ విజయగాథను సినిమాటిక్ గా చూపించే యత్నం విజయవంతం అయ్యిందనే చెప్పుకోవాలి.

నిజానికి చరిత్రలో ఘాజి కు మరియు ఎస్ 21 కు మధ్య జరిగిన యుద్ధం గురించి ఇరు దేశాల మధ్య భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఘాజీ ఎలా పేలిపోయిందన్న దానిపై ఎక్కడా క్లారిటీ లేదు. అది ఇప్పటికీ మిస్టరీయే. అయినప్పటికీ ఆ యధార్థ గాథ పాయింట్ కథగా తీసుకోవటమే ఇక్కడ ఆసక్తి రేకెత్తించింది. కేవలం ఒక్క సబ్ మెరైన్లో సాగే స్టోరీ, పైగా భారీ సెట్స్ తో హంగులు, అయినప్పటికీ కథ, కథనం నిదానించకుండా ముందుకు వెళ్లిపోతూనే ఉంటుంది. అనవసరంగా పాటలు, కామెడీ సీన్స్ ఇరికించకపోవటం కూడా సినిమా స్థాయిని మరింత పెంచింది. అప్పటి పరిస్థితులు, పరిసరాలు, సబ్ మెరైన్ లోపలి వాతవరణం.. నావల్ ఆఫీసర్లు వాడే భాష ఇలాంటి విషయాల్లో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా జాగ్రత్తగా డీల్ చేసిన విధానంను అభినందించి తీరాలి. అయితే సెకండాఫ్ లో వచ్చే యుద్ధ సన్నివేశాలు ఎమోషనల్ గా సాగినప్పటికీ, రియాల్టీ లోపించటంతో ఆ డ్రామా కాస్త ఎక్కువైనట్లు అనిపిస్తుంది.

నటీనటుల విషయానికొస్తే... ఘాజీ సినిమాతో రానా మరో మెట్టు పైకి ఎక్కాడనే అనుకోవచ్చు. లెఫ్టినెంట్ కమాండెంట్ అర్జున్ వర్మ పాత్రలో రానా నటన అద్భుతం. అతుల్ కులకర్ణి, ఓంపురి, కేకే మీనన్ లాంటి నటులు ఉండటంతో కాస్త శ్రద్ధ పెట్టి నటించాడు. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో రిస్క్ తీసుకుని మరీ చేశాడు. అధికారుల ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే సిన్సియర్ అధికారిగా, మరోవైపు దేశం కోసం ప్రాణత్యాగానికైనా వెనకాడని పాత్రలో ఆకట్టుకున్నాడు. తాప్సీ లిమిటెడ్ రోల్ తో ఆకట్టుకుంది. అయితే సినిమాకు కీలకం మాత్రం కే కే మీనన్ రోల్ అనే చెప్పుకోవచ్చు. ఓవైపు ఆవేశం, మరోవైపు ఆలోచన ఉన్న కెప్టెన్ పాత్రలో ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఇక అతుల్ కులకర్ణి రోల్ కూడా అదే స్థాయిలో పండింది. ముఖ్యంగా మీనన్, అతుల్, రానా మధ్య వచ్చే సీన్లు పతాక స్థాయిలో ఉన్నాయి. కీ రోల్స్ లో నాజర్, ఓంపురి, సబ్ మెరీన్ లో సహాయకులుగా సత్యదేవ్, రవివర్మ, ప్రియదర్శి మిగతా వారు పాత్రలు పరిధి మేర నటించారు.


టెక్నికల్ టీం పనితనం... పాటలు లేని సినిమాకు బ్యాగ్రౌండ్ స్కోర్ బలాన్ని ఇచ్చింది. ముఖ్యంగా వార్ సీన్ల సమయంలో వెంట్రుకను నిక్కబొడుచుకొనేలా కృష్ణ కుమార్ అందించిన బీజీఎం ఆకట్టుకుంది. మది అందించిన సినిమాటోగ్రఫీ సినిమాను హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టింది. యుద్ధం అంటే ఇప్పటి వరకూ మనము చూసిన వాటికీ ఈ జలాంతర్గాముల యాక్షన్ సన్నివేశాలకు చాల వ్యత్యాసం కనిపిస్తుంది. ఇక నటుల నటనతో పాటు సందర్భానుచితంగా వచ్చే మంచి డైలాగులు అలరించాయి. దర్శకుడు గంగరాజు గుణ్ణం వీటిని అందించటం విశేషం.

ఇలాంటి చిత్రాలకు ముఖ్యంగా ఆర్ట్ డిపార్ట్ మెంట్ ను స్పెషల్ గా అభినందించాలి. పాతకాలం నాటి జలాంతర్గాములు సెట్ వేయడం మరియు వాటికి సంబందించిన సెట్ లు నిర్మించిన ఆర్ట్ డిపార్ట్మెంట్ కి హాట్పాఫ్. సబ్‌మెరైన్, అండర్‌వాటర్ సన్నివేశాలు సన్నివేశాలను తమ సాంకేతిక పరిజ్ఞానంతో అచ్చం కళ్ళముందు నిజంగా జరుగుతున్నట్టు చూపిన వి ఎఫ్ ఎక్స్ టీం కి కూడా. ఆర్ట్, ఎడిటింగ్, రీ రికార్డింగ్లు దర్శకుడి ఆలోచన మరింత గొప్పగా తెరమీదకు వచ్చేందుకు హెల్ప్ అయ్యాయి. పీవీపీ నిర్మాణ విలువలు చాలా రిచ్ గా ఉండి సినిమాను నిలబెట్టాయి.

ఫ్లస్ పాయింట్లు:
లీడ్ రోల్స్ నటన
కథ, కథనం, డైలాగులు
విజువల్ ఎఫెక్ట్స్

 

మైనస్ పాయింట్లు:
స్లో నారేషన్


తీర్పు:

తెలుగులోనే కాదు ఇండియాలోనే ఓ కొత్త జోనర్ ను పరిచయం చేశాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. దీన్ని ఆధారంగా చేసుకుని ఫ్యూచర్ లో మరిన్ని ఇలాంటి ప్రయోగాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎక్కడా హంగులకు పోకుండా ఓ ప్లెయిన్ అండ్ ఫెయిర్ స్టోరీగా సినిమా ను తెరకెక్కించి మెప్పించాడు. సరిగ్గా సరిపోయిన తారగణం, దానికి తోడు దేశ భక్తి డైలాగులు, అదే సమయంలో యుద్ధ సన్నివేశాలు.. వెరసి సగటు సినిమా మైండ్ సెట్ ను పక్కన పెట్టి చూస్తే ఘాజీ నిజంగా ఓ గొప్ప సినిమా. ఓ మంచి సినిమా చూడాలని కోరుకునే ప్రతి ప్రేక్షకుడు ‘ఘాజీ’ని తప్పక చూడాల్సిందే!

చివరగా... ఘాజీ ... కథను మాత్రమే నమ్మి చేసిన ఓ వైవిధ్యమైన ప్రయత్నం

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.