గౌతమీపుత్ర శాతకర్ణి రివ్యూ | Gautamiputra Satakarni review.

Teluguwishesh గౌతమీపుత్ర శాతకర్ణి గౌతమీపుత్ర శాతకర్ణి Gautamiputra Satakarni telugu movie review. Product #: 80257 3.5 stars, based on 1 reviews
  • చిత్రం  :

    గౌతమీపుత్ర శాతకర్ణి

  • బ్యానర్  :

    ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్స్

  • దర్శకుడు  :

    క్రిష్

  • నిర్మాత  :

    సాయి బాబు జాగర్లమూడి, వై.రాజీవ్ రెడ్డి, సుహసిని పంగలూరి

  • సంగీతం  :

    చిరంతన్ భట్

  • సినిమా రేటింగ్  :

    3.53.53.5  3.5

  • ఛాయాగ్రహణం  :

    జ్నానశేఖర్ వీఎస్

  • ఎడిటర్  :

    సూరజ్ జగ్తప్, రామకృష్ణ అర్రం

  • నటినటులు  :

    బాలకృష్ణ, శ్రీయా, హేమా మాలిని, కబీర్ బేడీ తదితరులు

Gautamiputra Satakarni Movie Review

విడుదల తేది :

2017-01-12

Cinema Story

కథ:

సుమారు 2000 ఏళ్ల క్రితం కృష్ణా నదీ తీరాన అమరావతిని రాజధానిగా చేసుకోని శాతావాహనులు పాలిస్తున్న కాలం. ఆ వంశంలో 22వ రాజైన శాతావాహనుడు అశ్వమేథ యాగం చేసి తన రాజ్యాన్ని విస్తరిస్తుంటాడు. మహరాణి గౌతమీదేవి(హేమా మాలిని) కొడుకు శాతకర్ణి లేదా శాలివాహనుడు (బాలకృష్ణ)ని అల్లారు ముద్దుగా పెంచుతుంటుంది. అయితే యువరాజు కేవలం తల్లిచాటు బిడ్డగానే పనికొస్తాడు తప్ప, సమరానికి పనికి రాడని ప్రజలు గుసగుసలాడుకుంటారు. ఇంతలో రాజ్య విస్తరణలో ఉన్న మహరాజు ఓ యుద్ధంలో మరణిస్తాడు. తండ్రి ఎక్కడికి వెళ్లాడన్న ప్రశ్నకు తల్లి సమాధానం చెబుతుంది. అంతే తండ్రి ఆశయాలకు అనుగుణంగా మహా సామ్రాజ్యంను తాను ఏర్పాటు చేస్తానని తల్లికి ప్రతిన బూని కదన రంగంలోకి దిగుతాడు శాతకర్ణి. అక్కడి నుంచి జైత్రయాత్ర ఎలా జరిగింది? భార్య వశిష్ట దేశి(శ్రీయా) తో జరిగే మానసిక సంఘర్షణ ఏంటి? రాజ్య కాంక్షతో భరతమాత పైకి దండెత్తి వచ్చిన విదేశీ శక్తుల నుంచి మాతృభూమిని ఎలా రక్షించాడు? అన్నదే స్తూలంగా కథ. 

cinima-reviews
గౌతమీపుత్ర శాతకర్ణి

నందమూరి వంశ నటనకు వారసుడిగా కొనసాగుతూ తన ప్రస్థానంలో 99 చిత్రాలు దిగ్విజయంగా పూర్తి చేశాడు బాలకృష్ణ. ఇక తన వందో చిత్రం చరిత్రలో నిలిచిపోయేదిగా ఉండాలనుకున్నాడు. అంతే ఎవరూ ఊహించని రీతిలో సాఫ్ట్ చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేతికి పగ్గాలు అందించాడు. ఎవరూ ఊహించని రీతిలో ఓ తెలుగు చక్రవర్తి జీవితగాథను సినిమాగా తీసేందుకు సిద్ధమయ్యాడు. చారిత్రకం, ప్రతిష్టాత్మకం, పైగా బాలయ్య నటన కెరీర్ కు కీలకం కావటంతో అంతే జాగ్రత్తగా తెరకెక్కించానని చెప్పుకోచ్చాడు క్రిష్. కేవలం 79 రోజుల్లోనే సినిమాను తీసి అందరూ నోళ్లు వెళ్లబెట్టేలా చేశాడు.

తెలుగు ప్రజలకు తెలియని ఓ యుద్ధ వీరుడు, మహా చక్రవర్తి జీవిత గాథ కావటం, పైగా ట్రైలర్ లు చూశాక ఈ విజువల్ మూవీపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. మరి ఆ మార్క్ ను క్రిష్ అందుకున్నాడా? తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లాల్సిందే...

విశ్లేషణ:

దేశం మీసం తిప్పే గొప్ప చిత్రం, ప్రతీ తెలుగువాడు తెలుసుకోవాల్సిన చిత్రం. ఇది రిలీజ్ కు ముందు దర్శకుడు క్రిష్ చెప్పిన మాటలు. చారిత్రక వాస్తవంతో ఓ పవర్ ఫుల్ ప్రాజెక్ట్ ని చేతపట్టి క్రిష్ దానిని అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమా ఎలా అయితే ఉంటుందని అంచనాలు వేశారో.. వాటిని అందుకున్నాడనే చెప్పొచ్చు. ఓ తెలుగు వాడి గొప్పదనాన్ని జనరేషన్ల కతీతంగా తెలుగు వారికి తెలియజెప్పాలని చేసిన ప్రయత్నం నిజంగా అభినందనీయం. స్వేచ్ఛ తీసుకుని కాస్త కల్పితం జోడించినప్పటికీ, ఎక్కడా కథను చెడగొట్టకుండా తీశాడు. సినిమా ప్రారంభమే యుద్ధంతో మొదలవ్వగా, శాతకర్ణి వీరోచిత పోరాటాలు, ప్రభువుగా ప్రజల మన్ననలు అందుకోవటం, తల్లి, భార్యలతో వచ్చే ఎమోషనల్ సీన్లు, ఆఖరికి శాతకర్ణి కొడుకు శత్రువు చంపాలని చూసే సమయంలో కళ్లలోకి కళ్లు పెట్టి చూడటం ఇలాంటి గూస్ బంప్స్ సీన్లు ఎన్నో ఉన్నాయి. కేవలం 2 గంటల 15 నిమిషాల్లో క్రిష్ ఆవిష్కరించిన ఈ అద్భుతానికి సలాం.

నటీనటుల విషయానికొస్తే.. పౌరాణిక పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన బాలయ్య మరోసారి చెలరేగిపోయాడు. 99 సినిమాలు ఒక ఎత్తు, శాతకర్ణి ఒక ఎత్తు అన్నంతగా చేశాడు. డైలాగ్ డెలివరీలో, ఎమోషనల్ సన్నివేశాల్లో నటనతో సినిమాను పీక్స్ కి తీసుకెళ్లాడు. 60 ఏళ్ల వయసు దగ్గర పడుతున్నా వార్ సీన్లలో చేసిన రిస్కీ స్టంట్లు ఆశ్చర్యపరుస్తాయి. మొత్తానికి తన మైలు రాయి చిత్రంలో నట విశ్వరూపమే చూపాడు బాలయ్య.

ఇక వశిష్టి దేవీగా శ్రీయా సరిగ్గా సరిపోయింది. రొమాంటిక్ సన్నివేశాలలోనే కాదు, యుద్ధ వీరుడైన భర్తకు ఏం జరుగుతుందోనని కంగారుపడే భార్య రోల్ లో చక్కని నటన కనబరిచింది. రాజమాతగా, గౌతమీ బాలశ్రీగా హేమా మాలిని సరిగ్గా సరిపోయింది. నహాపనాగా కబీర్ బేడీ, గ్రీకు రాజుగా చేసిన పాత్రలు గుర్తుంటాయి. మిగతా పాత్రలు కూడా బెస్ట్ ఫెర్ ఫార్మెన్స్ నే అందించారు. శాత‌క‌ర్ణి జీవిత చ‌రిత్ర‌ను వివ‌రిస్తూ శివ‌రాజ్‌కుమార్ చేసే సాంగ్‌ హైలెట్ గా నిలిచింది.


శాతకర్ణి కోసం క్రిష్ ఎంచుకున్న టెక్నీషియన్స్ టీం పనితీరు మహద్బుతం. పాటలతోనే కాదు, బ్యాగ్రౌండ్ స్కోర్ తోనూ చిరంతన్ భట్ మ్యాజిక్ చేశాడు. సిరివెన్నెల అందించిన సాహిత్యం, దానికి భట్ స్వరాలు సినిమాను ఓ రేంజ్ కి తీసుకెళ్లాయి. వార్ సీన్లలో బీజీఏం రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. భూపేష్ భూప‌తి ఆర్ట్ వ‌ర్క్‌ను వ‌ర్ణించ‌డానికి మాట‌లు చాల‌వు. శాత‌వాహ‌న సామ్రాజ్యం, క‌ళ‌లు, శిల్పాలు, ఇలా ఉండేవా అన్నంతగా చూపించాడు. జ్నానశేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తక్కువ నిడివితో ఎడిటింగ్ బాగా చేశారు రామకృష్ణ, సూరజ్ లు,

ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే సాయి మాధవ్ బుర్రా అందించిన డైలాగులు సినిమాకు ప్రధాన బలం. మ‌నం క‌థ‌లు చెప్ప కూడ‌దు…మ‌న క‌థ‌లు జ‌నం చెప్పుకోవాలి. నేను బొట్టు పెట్టింది నా భ‌ర్త‌కు కాదు…. ఓ చ‌రిత్ర‌కు అంటూ శ్రీయ చెప్పే డైలాగ్. శాత‌క‌ర్ణి ఒక్క‌డు మిగిలి ఉంటే చాలు… మ‌న‌లో ఒక్క‌డు కూడా మిగ‌ల‌డు డైలాగులు విజిల్స్ వేయిస్తాయి. ఇలాంటివి ఇంకా బోలెడు ఉన్నాయి. మొత్తానికి క‌థ‌, హైలెవ‌ల్ టేకింగ్‌, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ అన్ని తిరుగులేకుండా డీల్ చేశాడు క్రిష్.


ఫ్లస్ పాయింట్లు:
కథ, కథనం, క్రిష్ దర్శకత్వం
బాలయ్య నటన
యుద్ధ సన్నివేశాలు
టెక్నిషియన్లు పనితీరు

 

మైనస్ పాయింట్లు:
యుద్ధ సన్నివేశాలు కాస్త సాగదీసినట్లు ఉండటం

 

తీర్పు:

తాను ఏదైతే చెప్పాలనుకున్నాడో దానిని సూటిగా సుత్తి లేకుండా అంద‌రికి అర్థ‌మ‌య్యేలా చెప్పాడు దర్శకుడు క్రిష్. నాలుగు యుద్ధ సన్నివేశాలు ఉన్నప్పటికీ, ఎక్కడా బోర్ అనే ఫీలింగ్ రానివ్వకుండా ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా రక్తి కట్టించాడు. కమర్షియల్ హంగులకు పోయి అనవసరమైన ఎలిమెంట్స్ ఇరికించకుండా, తక్కువ రన్ టైంలోనే పతాక సన్నివేశాలను, యుద్ధ సన్నివేశాలను బ్యాలెన్స్ చేశాడు. టోటల్ గా తెలుగు వారి మీసం తిప్పుతూ సగర్వంగా సినీ జగత్ లో చిర‌కాలం నిలిచే పోయే సినిమా అందించాడు.


చివరగా... గౌతమీపుత్ర శాతకర్ణి... ప్ర‌తి తెలుగువాడు త‌ప్ప‌నిస‌రిగా చూడాల్సిన సినిమా.

 

 

 

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.