జాగ్వార్ రివ్యూ | jaguar telugu movie review

Teluguwishesh జాగ్వార్ జాగ్వార్ Jaguar telugu movie review. Product #: 78176 2 stars, based on 1 reviews
 • చిత్రం  :

  జాగ్వార్

 • బ్యానర్  :

  చన్నాంబిక ఫిల్మ్స్

 • దర్శకుడు  :

  మహదేవ్

 • నిర్మాత  :

  అనితా కుమారస్వామి

 • సంగీతం  :

  ఎస్.ఎస్.థమన్

 • సినిమా రేటింగ్  :

  22  2

 • ఛాయాగ్రహణం  :

  మనోజ్ పరమహంస

 • ఎడిటర్  :

  రుబెన్

 • నటినటులు  :

  నిఖిల్ దేవగౌడ, దీప్తి సతి, జగపతి బాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, సంపత్ రాజ్, ఆదిత్య మీనన్ తదితరులు

Jaguar Telugu Movie Review

విడుదల తేది :

2016-10-06

Cinema Story

మెడికల్ విద్యార్థి అయిన కృష్ణ(నిఖిల్ కుమార్) తన సీనియర్ ఆర్య(ఆదర్శ బాలకృష్ణ) తో ఎప్పుడూ గొడవ పడుతుంటాడు. అయితే అనుకోకుండా అతని చెల్లెలు ప్రియా(దీప్తి సతి) తోనే ప్రేమలో పడతాడు కృష్ణ. మరోవైపు ముసుగు వీరుడు జాగ్వార్ గా మారి ఓ జడ్జితోపాటు పోలీసాఫీసర్ ను చంపేస్తాడు కృష్ణ. ఈ కేసును ఓ సిన్సియర్ సీబీఐ ఆఫీసర్(జగపతి బాబు) కి అప్పజెప్పుతుంది ప్రభుత్వం. అసలు జాగ్వార్ వారిని ఎందుకు చంపుతాడు? అల్లరిగా తిరిగే కృష్ణ జీవితంలో చీకటి కోణం ఏంటి? చివరకు సీబీఐ జాగ్వార్ ను పట్టుకుంటుదా? లేదా? అన్నది కథ.

cinima-reviews
జాగ్వార్

ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాల జమానా నడుస్తోంది. అందుకే కాస్త క్రేజ్ ఉందంటే చాలూ కొత్త హీరోలపై కూడా కోట్లు ఖర్చు పెట్టేందుకు కూడా నిర్మాతలు వెనకాడటం లేదు. మరి మాజీ ప్రధాని మనవడు, పైగా ఓ మాజీ ముఖ్యమంత్రి తనయుడి అరంగేట్రం ఎలా ఉంటుందో ఊహించుకోవల్సిన పనిలేదు . అతనే నిఖిల్ కుమార్ గౌడ, దేవగౌడ మనవడు. నిఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ తానే స్వయంగా నిర్మాతగా మారి జాగ్వార్ ను తెరకెక్కించాడు కుమారస్వామి. సుమారు 70 కోట్ల బడ్జెట్ తో భారీగా తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు, కన్నడలో ఒకేసారి రూపుదిద్దుకుంది.

అప్పుడెప్పుడో బాలయ్యతో మిత్రుడు సినిమా తీసిన మహదేవ్ దర్శకత్వంలో తెరకెక్కింది జాగ్వార్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ, జగపతి బాబు, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లాంటి సీనియర్ నటులు నటిస్తుండటం, థమన్ మ్యూజిక్, తమన్నా ఐటెం సాంగ్, పైగా విజువల్ గా రిచ్ గా ఉండటంతో సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. మరి రాజకీయాలకు నెలవైన ఆ ఇంటి నుంచి వస్తున్న నిఖిల్ కుటుంబ ఇమేజ్ కి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా హిట్ కొట్టాడా చూద్దాం.

విశ్లేషణ:
హాలీవుడ్ సినిమాల ఇన్ స్పిరేషన్ తో జాగ్వార్ అంటూ పవర్ ఫుల్ టైటిల్ పెట్టుకున్న దర్శకుడు మహదేవ్ కథలో పాత చింతకాయ పచ్చడినే వడ్డించాడు. తన కళ్ల ముందు జరిగిన అన్యాయాలను చూడలేక ఓ కుర్రాడు ప్రతీకారం తీర్చుకోవటం అనే పాత రీళ్ల ఫిలాసఫీని తెరకెక్కించాడు. కాకపోతే సూపర్ హీరో, భారీ యాక్షన్ సన్నివేశాలతో నింపేశాడు. ఓ మాములు కుర్రాడు ఆ రేంజ్ లో స్టంట్స్ చేయటం, ఒక్కడే వందల మంది ఇరగదీయటం, ఆఖరికి సీబీఐ లాంటి నిఘా సంస్థను కూడా బకరాను చేయటం టూమచ్ గా అనిపించకమానదు. విజయేంద్ర ప్రసాద్ కథ కదా ఎమోషనల్ కంటెంట్ ఉందేమో అని వెళ్లే జనాలకు పెద్ద దెబ్బే తగులుతుంది. కథకు తగ్గట్లే స్క్రీన్ ప్లే కూడా తెరకెక్కటం ఇక్కడ మరో హైలెట్. ఫస్టాఫ్ ఏదో యావరేజ్ కంటెంట్ తో నడిచే ఈ సినిమా సెకండాఫ్ వచ్చే సరికి మరింత భయానకంగా అనిపిస్తుంది. ముఖ్యంగా జాగ్వార్ యాక్షన్ సన్నివేశాలను తట్టుకోలేం.

నటీనటుల విషయానికొస్తే... కొత్త కుర్రాడు అయిన నిఖిల్ గౌడ లుక్స్ పరంగానే కాదు.. అతడిలో నటుడు ఎదగాలంటే చాలా కష్టపడాలన్న అభిప్రాయానికి వస్తారు. యాక్షన్ సీక్వెన్సుల్లో, డాన్సుల్లో ఓకే అనిపించినప్పటికీ, ఎక్స్ ప్రెషన్లతో మాత్రం టార్చర్ పెట్టాడు. ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ కూడా భారీగా మార్చాల్సిన అవసరం ఉంది. హీరోయిన్ దీప్తి సతి గ్లామర్ పరంగా మాత్రమే ఆకట్టుకుంది. సీబీఐ ఆఫీసర్ గా జగపతి బాబు తన పాత్రకు న్యాయం చేశాడు. అతను కనిపించినప్పుడే ప్రేక్షకుడు కాస్త హ్యాపీగా ఫీలవుతాడు. రమ్యకృష్ణ జస్ట్ ఓకే. మిగతా వారంతా వారి వారి పాత్రలు కానిచ్చేశారు. మిల్కీ అందాలతో కాసేపు ఊరట చెందోచ్చు.

టెక్నికల్ అంశాల పరంగా... థమన్ పాటలు అంతగా గుర్తుండవు. లౌడ్ నెస్ తో కూడిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా సినిమాల్లో ఉన్నట్లే ఉంటుంది. మనోజ్ పరమహంస అందించిన సినిమాటోగ్రఫీ బాగా రిచ్ గా చూపిస్తుంది. ఎడిటింగ్, డైలాగులు ఫర్వాలేదు. ప్రోడక్షన్ వాల్యూస్ సినిమా కంటే చాలా ఎక్కువగా ఉన్నాయి.

ఫ్లస్ పాయింట్లు:
కెమెరా వర్క్
తమన్నా ఐటెం సాంగ్

 

మైనస్ పాయింట్లు:
రెగ్యులర్ కథ, కథనం
మ్యూజిక్
ఓవర్ యాక్షన్ సీక్వెల్స్

తీర్పు:
అవుట్ డేటెడ్ కథ, దానికి తగ్గట్లుగా స్క్రీన్ ప్లే తో జాగ్వార్ ను తెరకెక్కించిన మహదేవ్, అన్నింట్లోనూ విఫలమయ్యాడు. మాములు కథకి భారీ బడ్జెట్ అన్న ధైర్యంతో సూపర్ హీరో అంటూ ఎక్స్ ట్రా కలరింగ్ లు ఇవ్వటం తప్పించి కొత్తగా ఏం చూపించలేకపోయాడు. డెబ్యూ కోసమే అన్నట్లుగా నిర్మాతలు ఓ సాధారణ రివెంజ్ డ్రామాకి అంతగా ఖర్చు పెట్టం ఆశ్చర్యకరమైన విషయమే.

చివరగా... ఈ సూపర్ హీరో జాగ్వార్ తుస్సుమనిపించాడు.

Author Info

Bhaskar

పూర్తి పేరు భాస్కర్ గౌడ్ శ్రీపతి.  ఏ వార్త అయినా సరే సింపుల్ గా రాసేందుకు ప్రయత్నిస్తుంటాడు. సమకాలీన రాజకీయాలు, పరిస్థితులపై విశ్లేషణ చేసి వ్యాసాలు రాయటం అదనపు బాధ్యతగా నిర్వహిస్తున్నాడు.  సినిమాలు చూడటం అంటే ఇతనికి ఎక్కువ పిచ్చి.  స్టాంపుల సేకరణ, కాయిన్ కలెక్షన్ ఇతని హాబీలు. సోషల్ మీడియా అప్ డేట్లతో వార్తలు త్వరగతిన అందించడం ఇతని ప్రత్యేకత. అయాన్ రాండ్ నవలలు ఎక్కువగా చదువటం, కార్డూన్లు ఎక్కువ చూడటం చేస్తుంటాడు.