కృష్ణ(విశాల్) అనే కుర్రాడు తన తల్లితోపాటే వుంటూ.. ఫ్రెండ్స్ తో జాలీగా తన లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడు. ఇలా గడుపుతున్న నేపథ్యంలో కృష్ణ అనుకోకుండా ఓరోజు మాయ(హన్సిక)ను చూసి ప్రేమలో పడతాడు. ఎలాగోలా మాయ ప్రేమను దక్కించుకుంటాడు కానీ.. ఓ సంఘటన వల్ల వీరిద్దరూ విడిపోతారు.
ఆ తర్వాత తల్లి ద్వారా తన తండ్రి గతాన్ని తెలుసుకుంటాడు కృష్ణ. దీంతో తన తండ్రి కేశవరాజు(ప్రభు)ని వెతుక్కుంటూ వెళ్తాడు. కేశవరాజుని కలిసిన కృష్ణకు ఇద్దరు సొంత తమ్ముళ్లు కుమార్(వైభవ్), కిషన్(సతీష్) వున్నారని తెలుస్తుంది. అయితే ఈ ముగ్గురు కొడుకులను కేశవరాజు ఓ కోరిక కోరతాడు.
అదేంటంటే.. తన ముగ్గురు చెల్లెల్లు (రమ్యకృష్ణ, ఐశ్వర్య, కిరణ్ రాథోడ్) తనమీద కోపంతో వున్నారని, వారి కోపాన్ని పోగొట్టి.. వాళ్ల కూతుళ్లను మీరు ముగ్గురు పెళ్లి చేసుకోవాలని కోరతాడు. దాంతో ఈ ముగ్గురు కలిసి అత్తలని ఒప్పించడానికి తెనాలి వెళ్తారు.
ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ముగ్గురి పెళ్లిల్లు జరిగాయా? హన్సిక ఎవరు? హన్సిక, విశాల్ లు తర్వాత కలిసారా? వీళ్లు విడిపోవడానికి గల కారణం ఏంటి? వాళ్లు ముగ్గురు కలిసి తమ అత్తలను ఒప్పించగలుగుతారా..? ఈ విషయాలన్ని తెలియాలంటే వెండితె మీద చూడాల్సిందే.
తమిళంలో విశాల్, హన్సిక జంటగా నటించిన ‘అంబాల’ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయం సాధించింది. సుందర్.సి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని విశాల్ తన సొంత బ్యానర్ అయిన ‘విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ’పై నిర్మించాడు. రమ్యకృష్ణ, వైభవ్, మధురిమ, మాధవీలతలతో పాటు తమిళ భారీ తారగణం ఈ సినిమాలో నటించారు. విశాల్ కు టాలీవుడ్ లోనూ మంచి మార్కెట్ వుండటంతో ఈ చిత్రాన్ని తెలుగులో ‘మగమహారాజు’గా ఫిబ్రవరి 27న విడుదల చేశారు. మరి ఈ సినిమా తెలుగులో విశాల్ కు ఎలాంటి విజయం అందించనుందో ఒకసారి చూద్దామా!
పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విశాల్ అదరగొట్టాడు. కొన్ని యాక్షన్ సన్నివేశాలలో దుమ్ముదులిపేసాడు. విశాల్ యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ సన్నివేశాలలో అద్భుతంగా నటించాడు. ఇక తొలిసారిగా విశాల్ తో జతకట్టిన హన్సిక... మాయ పాత్రలో చక్కగా నటించింది. విశాల్, హన్సికల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. ఇక ఆండ్రియా కూడా తన పాత్రలో బాగానే నటించింది.
ఇక ఇతర నటీనటుల విషయానికొస్తే.. నటతిలకం ప్రభు తన పాత్రకు సరైన న్యాయం చేసాడు. అత్త పాత్రలలో రమ్యకృష్ణ, ఐశ్వర్య, కిరణ్ రాథోడ్ లు బాగా నటించారు. రమ్యకృష్ణ సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. విశాల్, రమ్యకృష్ణల మధ్య వచ్చే సీన్లు చాలా బాగున్నాయి. సంతానం కామెడీ, యాక్షన్ బాగున్నాయి. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు న్యాయం చేసారు.
ప్లస్ పాయింట్స్:
ఈ సినిమాకు విశాల్ మేజర్ ప్లస్ పాయింట్. పైన చెప్పినట్లుగా నటీనటులంతా సినిమాకు బాగా ప్లస్ అయ్యారు. ఇకపోతే కథ పరంగా కాస్త పాతదే అయినప్పటికీ... స్క్రీన్ ప్లే కు కాస్త కమర్షియల్, మాస్ మసాలాను జోడించారు. సంతానం కామెడీ అదుర్స్. తనదైన పంచ్ డైలాగ్స్, నటనతో కాసేపు నవ్వించాడు. పూనం బజ్వా స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాకు పెద్ద మైనస్ పాయింట్ స్టోరీ, స్క్రీన్ ప్లే. కొన్ని కొన్ని సన్నివేశాలలో తరువాత వచ్చే సీన్ల గురించి ప్రేక్షకులు ముందుగానే చెప్పేయవచ్చు. కథనంలో ఎలాంటి కొత్తదనం లేకుండా యాక్షన్ సన్నీవేశాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇక సెకండ్ హాఫ్ మరీ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. భారీ యాక్షన్ సన్నీవేశాలు మరీ దారుణంగా వున్నాయి.
సాంకేతిక వర్గ పనితీరు:
ఈ సినిమాకు గోపి అమర్నాథ్ అందించిన సినిమాటోగ్రఫి సూపర్బ్. ప్రతి విజువల్ చాలా గ్రాండ్ గా వున్నాయి. ఇక విశాల్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా నిర్మించినట్లుగా కనిపిస్తోంది. సినిమాకు గ్రాండ్ లుక్ ను తీసుకొచ్చారు.
శశాంక్ వెన్నలకంటి డైలాగ్స్ బాగున్నాయి. హిప్ హాప్ తమిజా సంగీతం పర్వాలేదు. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మరీ ఎక్కువ అయ్యింది. ఇక ఎడిటర్ శ్రీకాంత్ ఎడిటింగ్ పనిలో మరింత శ్రద్థ తీసుకుంటే బాగుండేది. ఇక దర్శకుడు సుందర్.సి పాత కథనే కొత్తగా చూపించాలనుకొని దారుణంగా విఫలమయ్యాడు. కథ పాతదే అయినా కథనంలో కాస్త కొత్తగా చూపించి వుండుంటే... తెలుగులో కూడా ఈ సినిమా ఘనవిజయం సాధించేది.
చివరగా:
మగమహారాజు: విశాల్ నుంచి వచ్చిన మరో బిలో యావరేజ్ సినిమా!