మీ బ్రౌజింగ్ ఎవరూ చూడకుండా ఎలా చేసుకోవచ్చంటే... | Secret Browsing To r Details

Tor web secrets details

Tor Browser, Tod Browser, Tod Details, Dark Web Details

Tor Found a Way To Make the Dark Web Even More Secret.

సీక్రెట్ బ్రౌజర్ టార్ గురించి...

Posted: 08/16/2017 05:05 PM IST
Tor web secrets details

ఇంటర్నెట్ లో మీరు చేసే ప్రతి పనిని ఎంతో మంది గమనిస్తుంటారు. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల నుంచి సంబంధిత వెబ్ సైట్ల దాకా మీ ఇంటర్నెట్ బ్రౌజింగ్ ను ట్రాక్ చేస్తూ ఉంటాయి. మీరెక్కడున్నారు, ఇంటర్నెట్ సర్ఫింగ్ కోసం మీరు వాడుతున్న బ్రౌజర్ ఏమిటి, సెర్చ్ చేస్తున్న పదాలేమిటి, ఏయే వెబ్ సైట్లు చూస్తున్నారు, ఏ కంటెంట్ కోసం వెతుకుతున్నారు.. వంటి ప్రతి విషయం వారికి తెలిసిపోతూ ఉంటుంది. ఇక కొన్ని ప్రాంతాలు, దేశాల్లో కొన్ని రకాల వెబ్ సైట్లపై నిషేధం ఉంటుంది. ఎంత ప్రయత్నించినా అవి ఓపెన్ కావు.. మరి మనను ఎవరూ ట్రాక్ చేయకుండా ఇంటర్నెట్ ను వినియోగించుకోవడానికి, మనకు కావాల్సిన వెబ్ సైట్లను ఓపెన్ చేసుకోవడానికి ఓ అవకాశం ఉంది. అదే టార్ బ్రౌజర్. దీనికి సంబంధించిన విశేషాలు తెలుసుకుందామా..

ఏమిటీ టార్ బ్రౌజర్?
ఇంటర్నెట్ వినియోగదారుల గుర్తింపు, వారి ప్రాంతం, ఆన్ లైన్ లో వారి యాక్టివిటీలు ట్రాకింగ్ కు గురికాకుండా రక్షణ కల్పించే ఉద్దేశంతో రూపొందినదే ‘టార్’ ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో భాగంగా రూపొందించినదే టార్ బ్రౌజర్. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ నే టార్ ప్రాజెక్టుకు అనుగుణంగా మార్చి, అభివృద్ధి చేసి టార్ బ్రౌజర్ ను రూపొందించారు. ఇది యూజర్ కు, టార్గెట్ డెస్టినేషన్ కు మధ్య సమాచారాన్ని ఎన్ క్రిప్ట్ చేసి, వివిధ మార్గాల గుండా మళ్లించి అందిస్తుంది. 

ఉదాహరణకు హైదరాబాద్ లో ఉన్న మీరు టార్ బ్రౌజర్ ద్వారా ఓ వెబ్ సైట్ ను ఓపెన్ చేశారనుకోండి. టార్ బ్రౌజర్ మొదట మీ రిక్వెస్టును, సమాచారాన్ని వివిధ పొరల్లో ఎన్ క్రిప్ట్ చేసి ఏ జర్మనీ, స్వీడన్, స్విట్టర్లాండ్, నెదర్లాండ్స్, బెల్జియం వంటి దేశాల ద్వారా మళ్లించబడుతుంది (రూటింగ్ చేయబడుతుంది). మధ్యలో ఒక్కో ఎన్ క్రిప్షన్ తొలగించబడి.. చివరికి మీరు ఓపెన్ చేయదల్చుకున్న వెబ్ సైట్ సర్వర్ కు కనెక్ట్ అవుతుంది. అంటే మీరు ఆయా దేశాల్లో ఏదో ఒక దేశం నుంచి ఆ వెబ్ సైట్ ను చూస్తున్నట్లన్న మాట. ఇంటర్నెట్ ప్రొటోకాల్ (ఐపీ) అడ్రస్ కూడా అక్కడిదే కనిపిస్తుంది. కొంత సమయం తర్వాత ఈ రూటింగ్ మారిపోతూ ఉంటుంది కూడా. తద్వారా మీరు, మీ బ్రౌజింగ్ ట్రాక్ కాకుండా ఉంటుంది.

ఎవరు రూపొందించారు?
టార్ అసలు పేరు ‘ది ఆనియన్ రూటర్’ ప్రాజెక్టు. దీనికి కీలకమైన ‘ఆనియన్ రూటింగ్’ విధానాన్ని 1990వ దశకంలో అమెరికన్ నావల్ రీసెర్చ్ లేబొరేటరీ ఉద్యోగులు పాల్ సైవర్సన్, మైఖేల్ జి.రీడ్, డేవిడ్ గోల్డ్ స్ల్కాగ్ లు అభివృద్ధి చేశారు. ఆన్ లైన్ లో అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనికేషన్స్ ను సురక్షితంగా ఉంచుకోవడం, ట్రాకింగ్ కు వీలు లేకుండా ఉండడం కోసం దీనిని రూపొందించారు. ఆ తర్వాత వ్యక్తిగత సమాచార రక్షణ, ఆన్ లైన్ ట్రాకింగ్ నిరోధం, రహస్య సమాచార తస్కరణను నిరోధించడం, భద్రత కోసం కోసం ‘టార్’ ను అభివృద్ధి చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 7 వేల వలంటీర్ నెట్ వర్క్ ల సహాయంతో టార్ నెట్ వర్క్ పనిచేస్తుంది.

పూర్తిగా ఉచితం..
టార్ ప్రాజెక్టు పూర్తిగా ఓపెన్ సోర్స్ విధానంలో కొనసాగుతోంది. టెక్నాలజీ తెలిసిన, సహాయం చేయగల ఎవరైనా దీని అభివృద్ధిలో పాలుపంచుకోవచ్చు. టార్ బ్రౌజర్ ను, నెట్ వర్క్ ను వినియోగించుకోవడం పూర్తిగా ఉచితం. ఎవరైనా డొనేషన్లు ఇచ్చి నెట్ వర్క్ ల నిర్వహణలో సహాయం చేయవచ్చు.

పూర్తి రహస్యం మాత్రం కాదు
టార్ బ్రౌజర్ ను వినియోగిస్తే వ్యక్తిగత, రహస్య సమాచారానికి భద్రత ఉండడం, ట్రాకింగ్ కు దొరకకపోవడం వాస్తవమేగానీ... ఇది పూర్తిగా రహస్యం మాత్రం కాదు. కచ్చితంగా తెలుసుకోవాలని నిపుణులు ప్రయత్నిస్తే ఎక్కడి నుంచి వినియోగించినదీ గుర్తించడం పెద్ద కష్టం కాదు. అంతేగాకుండా అత్యాధునిక నిఘా విధానాలు, మన బ్రౌజింగ్ అలవాట్ల వంటివాటితో సులువుగానే ట్రాక్ చేయవచ్చు.

స్లోగా ఉంటుంది..
సాధారణంగానే టార్ బ్రౌజర్ కొంత వరకు స్లోగా పనిచేస్తుంది. ఎందుకంటే యూజర్ వద్ద సమాచారాన్ని ఎన్ క్రిప్ట్ చేయడం.. దానిని ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సర్వర్ల ద్వారా రూటింగ్ చేయడం.. మళ్లీ డేటాను ఎన్ క్రిప్ట్ చేసి, యూజర్ కు చేరవేయడం వంటివన్నీ జరిగేందుకు కొంత సమయం పడుతుంది. అంతేగాకుండా టార్ బ్రౌజర్ పనిచేసేందుకు కొంచెం ఎక్కువగా సిస్టం వనరులను వినియోగించుకుంటుంది. దీనివల్ల కూడా కొంచెం స్లోగా పనిచేస్తుంది.

దేశాలనూ మార్చుకోవచ్చు
టార్ బ్రౌజర్ తో మనం బ్రౌజింగ్ చేస్తున్నప్పుడు వివిధ దేశాలు, ప్రాంతాల ద్వారా జరిగే రూటింగ్ ను కూడా మనం నిర్ణయించుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు మనం ఏదైనా వెబ్ సైట్ ఓపెన్ చేసినప్పుడు స్విట్జర్లాండ్, ఫిన్లాండ్, అమెరికాల మీదుగా టార్ నెట్ వర్క్ కనెక్ట్ అయి ఉంటే.. దానిని మనం నెదర్లాండ్స్, జర్మనీ, స్వీడన్ల మీదుగా రూటింగ్ ను మార్చుకోవచ్చు. దీని ద్వారా కొన్ని దేశాల్లో ఉండే నియంత్రణలు, వెబ్ సైట్లపై ఉండే నిషేధాల వంటి వాటిని తప్పించుకోవచ్చు. టెక్నాలజీ నిపుణులకు ఈ సదుపాయం బాగా తోడ్పడుతుంది. దీనికి ఇన్ స్టలేషన్ అవసరం లేదు..టార్ బ్రౌజర్ ను మన కంప్యూటర్/ల్యాప్ టాప్ లో ఇన్ స్టాల్ చేయవలసిన అవసరం లేదు. ఎలాంటి రిజిస్ట్రీ ఎంట్రీల వంటివి అవసరం లేకుండానే ఇది పనిచేస్తుంది. టార్ బ్రౌజర్ ఇన్ స్టలేషన్ ఫైల్ ను డౌన్ లోడ్ చేసుకున్న తర్వాత.. దానిని కంప్యూటర్ లో ఎక్కడ ఇన్ స్టాల్ చేయాలని అడుగుతుంది. వాస్తవానికి అది ఇన్ స్టలేషన్ కాదు.. కేవలం కంప్రెస్ గా ఉన్న ఫైళ్లన్నింటినీ ఎక్స్ పాండ్ చేయడం మాత్రమే. 

ఓపెన్ కాని వెబ్ సైట్లూ చూడొచ్చు
సాధారణంగా ఏదైనా దేశంలోగానీ, ఏదైనా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ఐఎస్ పీ) పరిధిలోగానీ, చివరికి ఏదైనా ఆఫీసులోగానీ కొన్ని రకాల వెబ్ సైట్లపై నియంత్రణ ఉంటుంది. వారు ఇంటర్నెట్ కు కనెక్ట్ అయి ఉన్నవారు పంపుతున్న, డౌన్ లోడ్ చేసుకుంటున్న డేటాను స్కాన్ చేస్తూ ఉంటారు. నిషేధిత, నియంత్రిత సమాచారం అందులో ఉంటే.. బ్లాక్ చేసేస్తారు. అదే టార్ లో ఆనియన్ రూటింగ్ టెక్నాలజీ ద్వారా డేటా వివిధ లేయర్లుగా ఎన్ క్రిప్ట్ అవుతుంది కాబట్టి.. టార్ ద్వారా వెళ్లే సమాచారం ఏమిటో ఎవరూ గుర్తించలేరు. అందువల్ల ప్రపంచంలోని అన్ని వెబ్ సైట్లను కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అయితే చాలా సార్లు అథెంటికేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది.

స్క్రిప్టులు, ఫ్లాష్ కంటెంట్ తో జాగ్రత్త..
చాలా వరకు వెబ్ సైట్లు స్క్రిప్టులను రన్ చేస్తూ ఫ్లాష్ వీడియోలు, ఇతర మల్టీమీడియా కంటెంట్ ను ప్రదర్శిస్తుంటాయి. ఈ స్క్రిప్టులు ఆయా వెబ్ సైట్లలో మనం ఏ అంశాన్ని చూస్తున్నాం, దేని గురించి వెతుకుతున్నామనే అంశాలతోపాటు మన కంప్యూటర్ లొకేషన్, డెస్క్ టాప్ రెజల్యూషన్ వంటి వివరాలను ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. ఈ కారణంగానే టార్ బ్రౌజర్ లో ఇన్ బిల్ట్ గా స్క్రిప్టులు బ్లాక్ చేయబడి ఉంటాయి. అయితే ఇలా స్క్రిప్టులను బ్లాక్ చేయడం వల్ల చాలా వెబ్ సైట్లు సరిగా ఓపెన్ కావు. కంటెంట్ కూడా సరిగా కనిపించదు. దీంతో ఆయా వెబ్ సైట్లు ఓపెన్ చేసినప్పుడు తాత్కాలికంగా స్క్రిప్టులను రన్ చేయడానికి అవకాశం ఇవ్వాల్సి వస్తుంది.

ఆండ్రాయిడ్ మొబైల్స్ కోసం ‘ఆర్బోట్ (Orbot), ఆర్ ఫాక్స్ (Orfox)’ రూపంలో.. కంప్యూటర్ తరహాలో మన మొబైల్ ఫోన్ లో అనానిమస్ (రహస్యం)గా ఇంటర్నెట్ ను బ్రౌజింగ్ చేసేందుకు తోడ్పడేవే ‘ఆర్బోట్, ఆర్ ఫాక్స్’. ఆర్బోట్ లో ఆర్ వెబ్ (Orweb) అనే బ్రౌజర్ ను వినియోగిస్తారు. దీనిని ఆండ్రాయిడ్ లో ఇన్ బిల్ట్ గా అందించే వెబ్ బ్రౌజర్ ఆధారంగా అభివృద్ధి చేశారు. అయితే ఇది కంప్యూటర్ టార్ బ్రౌజర్ తరహాలో పూర్తి స్థాయిలో అనానిమిటీని అందించలేదు. కానీ సులువైన ఇంటర్ఫేస్ తో, సులభంగా వినియోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఇక టార్ బ్రౌజర్ లో వాడిన సోర్స్ కోడ్ సహాయంతోనే ఆర్ ఫాక్స్ ను రూపొందించారు. ఇది కూడా ఫైర్ ఫాక్స్ ఆధారంగా రూపొందించినదే. ఇది దాదాపుగా టార్ బ్రౌజర్ స్థాయిలో అనానిమిటీని అందించగలుగుతుంది. దీనిని గూగుల్ ప్లేస్టోర్ నుంచి దీనిని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

కొన్ని ఇబ్బందులూ ఉంటాయి..
టార్ బ్రౌజర్ తో ఫేస్ బుక్, గూగుల్ వంటి కొన్ని వెబ్ సైట్లను ఓపెన్ చేసినప్పుడు.. అథెంటికేషన్ అడుగుతాయి. ఎందుకంటే వాటిల్లో మనం క్రియేట్ చేసుకున్న ఖాతాలు ఏయే దేశాలు, ఏయే ప్రాంతాలకు చెందినవనే వివరాలు ఆయా వెబ్ సైట్ల వద్ద ఉంటాయి. మనం టార్ ద్వారా వేర్వేరు దేశాల నుంచి ఆ వెబ్ సైట్లను ఓపెన్ చేసి, మన ఖాతాల్లోకి లాగిన్ కావడానికి ప్రయత్నించినప్పుడు.. లాగిన్ అవుతున్నది మనమేనా? అనే సందేహం వస్తుంది. ఒకవేళ ఖాతాలు హ్యాకింగ్ కు గురై ఉండొచ్చని, లేదా మరెవరైనా ఐడీ పాస్ వర్డ్ లను తస్కరించి ఉండొచ్చనే ఉద్దేశంతో మన ఖాతాకు సంబంధించి అథెంటికేషన్ అడుగుతాయి. అందులో సరైన వివరాలను ఎంటర్ చేయడం ద్వారా, ఎంపిక చేసుకోవడం ద్వారా మన ఐడీ లోకి లాగిన్ కావొచ్చు. దీనివల్ల పెద్ద ఇబ్బందులు, సమస్యలేమీ ఉండవు.

టార్ వినియోగం చట్ట విరుద్ధమా?
ఇంటర్నెట్ లో వ్యక్తిగత సమాచార పరిరక్షణ, ఐపీ అడ్రస్ ను రహస్యంగా ఉంచుకోవడం తప్పేమీ కాదు. అందువల్ల టార్ బ్రౌజర్ వినియోగించడం చట్ట విరుద్ధమేమీ కాదు. రహస్యమైన సమాచారాన్ని పంపుకోవడం కోసం, రహస్యంగా సంప్రదింపుల కోసం టార్ బ్రౌజర్ ను చాలా కాలం నుంచి వినియోగిస్తున్నారు. అయితే ఇటీవలి కాలంలో చట్ట విరుద్ధమైన పనుల కోసం ‘టార్’ను వినియోగించడం పెరిగింది. అందువల్ల కొన్ని చోట్ల టార్ ను నిషేధించాలి, నియంత్రించాలన్న డిమాండ్లూ ఉన్నాయి. కానీ వ్యక్తిగత కోణంలో చూస్తే టార్ ఎంతో ప్రయోజనకరమైనది. దీనిని అసాంఘిక, చట్ట విరుద్ధమైన కార్యకలాపాలకు వినియోగించి.. తాము పట్టుబడబోమన్న భావనలో ఉండడం తప్పు. ఆధునిక టెక్నాలజీని, సాంకేతికతతో సులువుగానే గుర్తించే అవకాశముంది.

బ్రౌజింగ్ అలవాట్లూ మార్చుకోవాలి..
ఇంటర్నెట్ లో మనల్ని ఎవరూ ట్రాక్ చేయకూడదు, మన వివరాలు తెలుసుకోగూడదు అంటే మన బ్రౌజింగ్ అలవాట్లను కూడా చాలా మార్చుకోవాలి.
బ్రౌజర్ విండోను ఫుల్ స్క్రీన్ లో కాకుండా కొంత తక్కువకు మార్చుకోవాలి. ఎందుకంటే బ్రౌజర్ ఫుల్ స్క్రీన్ లో ఉన్నప్పుడు మనం చూసే వెబ్ సైట్లు మన కంప్యూటర్ స్క్రీన్ రిజల్యూషన్ వివరాలను తెలుసుకోగలుగుతాయి. తద్వారా ట్రాకింగ్ కూడా చేస్తాయి.
ఏవైనా వెబ్ సైట్ల నుంచి వర్డ్, ఎక్సెల్ వంటి డాక్యుమెంట్లను డౌన్ లోడ్ చేసుకోగానే.. ఓపెన్ చేస్తే వాటిలో రన్ అయ్యే స్క్రిప్ట్ ల సహాయంతో ట్రాకింగ్ కు వీలవుతుంది.
డౌన్ లోడ్ చేసుకున్న ఫొటోల ద్వారా కూడా లొకేషన్ వివరాలు తెలిసిపోతాయి.
కంప్యూటర్ లో తప్పనిసరిగా అప్ డేటెడ్ యాంటీ వైరస్ లు ఉండడం మంచిది. ఎందుకంటే కీలాగర్లు, రూట్ కిట్, యాడ్ వేర్ లు, మాల్ వేర్ల వంటివి కంప్యూటర్ లో తిష్టవేసి ఉండి.. మనకు సంబంధించిన సమాచారాన్ని ట్రాక్ చేస్తుంటాయి. కీబోర్డులో మనం టైప్ చేసే అక్షరాలు, మౌస్ కదలికలు, క్లిక్ లను రికార్డు చేసి.. హాకర్లకు పంపుతుంటాయి. దానివల్ల మన వ్యక్తిగత సమాచారం లీకయ్యే అవకాశం ఉంటుంది.

ఎవరికి పనికొస్తుంది?

  •    మీరు, మీ కుటుంబ సభ్యులు, పిల్లలు, స్నేహితులు, బంధువుల వంటివారు తమ వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా పంచుకోవడానికి టార్     తోడ్పడుతుంది. ఆయా సమాచారం ఇతరుల చేతుల్లో పడుతుందన్న సమస్య ఉండదు.
  • వ్యాపార, వాణిజ్య సంస్థలు తమ సమాచారాన్ని గోప్యంగా ఉంచుకునేందుకు టార్ పనికొస్తుంది. ప్రాంతీయ కార్యాలయాల నుంచి సమాచారం, రహస్య నివేదికలు, వ్యూహాల వంటివి బయటకు పొక్కకుండా, ఆన్ లైన్ లో ఎవరూ ట్రాక్ చేయలేకుండా పంపుకోవచ్చు.
  • పలు కీలక, సమస్యాత్మక ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉద్యమకారులు, గూఢచారులు, నిఘా వర్గాలు, జర్నలిస్టులు ఎవరికీ అనుమానం రాకుండా సమాచారం చేరవేయడానికి టార్ తోడ్పడుతుంది.
  • మిలటరీ వంటి కీలకమైన దళాలు వ్యూహాత్మక అంశాలను, రహస్యాలను ఇతర ప్రాంతాల్లోని వారితో పంచుకోవడానికి, సమాచారాన్ని చేరవేయడానికి టార్ తో వీలవుతుంది.
  • సాధారణ బ్రౌజర్లలోనూ రక్షణ, పూర్తి స్థాయిలో ప్రైవసీ లభించాలంటే, ట్రాకింగ్ నుంచి తప్పించుకోవాలంటే టార్ బ్రౌజర్ ను వినియోగించడమే ఉత్తమం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Secret Browser  Tod Details  Dark Web Sites  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Stay cool without ac

    ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

    Feb 28 | ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more