Five Ways to Stay Cool without Air Conditioning | ఏసీ లేకుండానే మీ ఇంట్లో చల్లదనం కోసం మార్గాలు

Stay cool without ac

Air Conditioning, Summer, Coolness, AC Less Cooling, Stay Cool without AC

Five Ways to Stay Cool without Air Conditioning. Cement Painting and Tress may set cool your house.

ఏసీ లేకున్నా చల్లదనానికి మార్గాలు

Posted: 02/28/2018 06:21 PM IST
Stay cool without ac

ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతున్నాయి. వాతావరణంలో వేడి బాగా పెరుగుతోంది. దాని నుంచి ఉపశమనం పొందడానికి ఇళ్లు, ఆఫీసుల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు ఉపయోగించాల్సిందే. వాటిని కొనడానికి అయ్యే ఖర్చుతోపాటు వాటి నిర్వహణ, విద్యుత్ ఖర్చు కూడా భరించాల్సిందే. అంతేకాదు పేదలు, మధ్య తరగతి వారు ఏసీలు, మంచి కూలర్లు కొనలేరు. ఏవైనా సాధారణ, తక్కువ ధరలో దొరికే అన్ బ్రాండెడ్ కూలర్లు మాత్రమే కొంటుంటారు. తద్వారా తగిన చల్లదనం ఉండదు.

అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పెద్దగా ఎలాంటి అదనపు ఖర్చు లేకుండానే.. మన ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు. వాటి వల్ల ఇంట్లో చల్లదనంతోపాటు ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వంటి వాటి వినియోగం కూడా తగ్గుతుంది. మరి అవేమిటో తెలుసుకుందామా..?

1. పైకప్పుపై కోటింగ్, టైల్స్...
ఒకే అంతస్తు ఉండే వ్యక్తిగత (ఇండివిడ్యుయల్) ఇళ్లు, అపార్ట్ మెంట్లలో అన్నింటికన్నా పై అంతస్తులో ఉండే ఫ్లాట్ల సీలింగ్ పైకి ఎండ నేరుగా పడుతుంది. అందువల్ల పైకప్పు (సీలింగ్) బాగా వేడెక్కి ఆ వేడి ఇంట్లోకి వస్తుంది. ముఖ్యంగా ఇలా పైకప్పు వేడెక్కి ఉన్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ వినియోగించడం వల్ల ఫ్యాన్ పైకప్పు వేడిని గదిలోకి విడుదల చేసి.. వేడి మరింత పెరుగుతుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే పైకప్పు పైన నేరుగా ఎండ పడే ప్రాంతంలో కూల్ సిమెంట్ కోటింగ్ లేదా రిఫ్లెక్టివ్ కోటింగ్ వేయించాలి.
కూల్ సిమెంట్ కోటింగ్ అంటే ఒక రకం క్రిస్టల్స్ కలిపి ఉన్న పొడి, సాధారణ సిమెంటు మిశ్రమం. తెలుపు రంగులో ఉండే ఈ మిశ్రమం సూర్యరశ్మిని ఏమాత్రం సంగ్రహించకుండా పరావర్తనం చెందిస్తుంది. అందువల్ల పైకప్పు వేడెక్కదు. ఇంటి లోపల చల్లగా ఉంటుంది.
కూల్ సిమెంట్ మిశ్రమం కాకుండా కేవలం తెలుపు రంగులో ఉండే సాధారణ రిఫ్లెక్టివ్ కోటింగ్ లు కూడా లభిస్తాయి. వాటి వల్ల కూడా ప్రయోజనం ఉంటుంది. తెలుపు రంగుకు ఉండే పరావర్తన గుణం వల్ల పైకప్పు తక్కువగా వేడవుతుంది.
ఇంటి లోపలి వైపు సీలింగ్ కు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో కోటింగ్ వేయిస్తే పైకప్పు వేడి ఇంట్లోకి ప్రవేశించకుండా ఉంటుంది.
ఇంట్లో పైకప్పుకు కొంచెం కిందుగా థర్మాకోల్ తో ఫాల్స్ సీలింగ్ ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా ఇంట్లో చల్లదనం నెలకొంటుంది. ముఖ్యంగా ఆఫీసులు, చిన్న చిన్న కార్యాలయాల్లో ఇవి ఎక్కువ ఉపయుక్తంగా ఉంటాయి.
డాబా పైన నేరుగా వదిలేయకుండా.. మొజాయిక్ టైల్స్ వంటివి వేయిస్తే కూడా పైకప్పు వేడవకుండా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో చల్లగా ఉంటుంది.
2. తెర చాపలతో ఎంతో ప్రయోజనం
ఇంట్లో కిటికీలు, తలుపుల వద్ద తెర చాపలను, నారతో తయారయ్యే చాపలను అమర్చుకోవడం వల్ల ఇంట్లోకి వేడి గాలి రాకుండా ఉంటుంది. ఈ చాపలు వేడిని అడ్డుకుంటాయి. దాంతో ఇంట్లోకి చల్లటి గాలి వీస్తుంది. ముఖ్యంగా ఇంట్లోకి గాలి వీచే దిక్కుల్లో ఉన్న కిటికీలు, తలుపుల వద్ద తెరచాపలు ఏర్పాటు చేసి, వాటిని తరచూ కొంత నీటితో తడుపుతూ ఉండడం వల్ల ఇంటి లోపలి ఉష్ణోగ్రత ఏకంగా నాలుగైదు డిగ్రీలు తగ్గే అవకాశం ఉంటుంది.
తెరచాపలే కాకుండా కూలర్లలో వినియోగించే తరహా గడ్డి చాపలు, మ్యాట్ లు కూడా లభిస్తాయి. అవి నీటిని ఎక్కువ సేపు పట్టి ఉంచుతాయి. దీంతో ఎక్కువ సేపు చల్లదనం ఉంటుంది.
తెర చాపలు, మ్యాట్ ల వంటివి లేకపోతే కాస్త మందమైన బెడ్ షీట్లు, పెద్ద సైజు టవల్స్ వంటివి కూడా నీటితో తడిపి తలుపులు, కిటికీల వద్ద కట్టుకోవచ్చు.
3. మొక్కలు పెంచితే ఎన్నో ప్రయోజనాలు
ఇంటి చుట్టూ ప్రదేశం ఉంటే మొక్కలు పెంచడం వల్ల చల్లదనం నెలకొంటుంది. అపార్ట్ మెంట్లు అయితే బాల్కనీలో కుండీలు పెట్టుకుని.. వాటిలో మొక్కలు పెంచొచ్చు. ముఖ్యంగా తీగ మొక్కలు పెంచడం వల్ల అవి ఎక్కువ వైశాల్యం విస్తరించి, చల్లదనాన్ని ఇవ్వగలుగుతాయి. ఇక ఇండివిడ్యువల్ ఇల్లు అయి ఉండి.. ఇంటి చుట్టూగానీ, ముందు, వెనుకగానీ ఖాళీ స్థలం ఉంటే చెట్లు పెంచడం ఎంతో మంచిది. వాటి వల్ల అన్ని కాలాల్లోనూ ప్రయోజనం ఉంటుంది.
ఇంటి పైకప్పుపై చిన్నపాటి తోటను పెంచడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీనినే రూఫ్ టాప్ గార్డెన్ అంటారు. డాబాపై వీలైనంత వరకు గార్డెన్ ను ఏర్పాటు చేసుకోవడం వల్ల పైకప్పు వేడెక్కకుండా.. ఇల్లు చల్లగా ఉంటుంది. అంతేగాకుండా మనకు కావాల్సిన కూరగాయలు, పూలు వంటివీ మనమే పండించుకున్నట్లూ ఉంటుంది.
మొక్కలు, చెట్లు ఉన్న ఇళ్లు, పరిసరాల్లో.. చుట్టూ ఉన్న ప్రాంతాల కంటే రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది.
4. ఈ జాగ్రత్తలతో మంచి చల్లదనం
సీలింగ్ వేడెక్కి ఉన్నప్పుడు ఇంట్లో సీలింగ్ ఫ్యాన్లను వినియోగించకుండా.. టేబుల్/పెడస్ట్రల్ ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వంటి వాటిని చల్లదనం కోసం వినియోగించడం బెటర్.
గదిలో నేలను నీటితో కడగడం వల్ల ఆ నీరు మెల్లగా ఆవిరవుతూ గదిలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. రెండు పూటలా ఇలా చేయడం వల్ల చల్లగా ఉంటుంది.
ఇంట్లో అవసరం లేనప్పుడు లైట్లు ఆర్పేయడం, ఎలక్ట్రానిక్ ఉపకరణాలను ఆఫ్ చేయడం మంచిది. లేకుంటే ఆ పరికరాలు నడుస్తున్నంత సేపూ వేడి వెలువడుతూనే ఉంటుంది. దీంతో ఇంట్లో ఉష్ణోగ్రతలు పెరిగిపోతాయి. అంతేకాదు ఎలక్ట్రానిక్ పరికరాలను ఆఫ్ చేయడం వల్ల విద్యుత్ బిల్లు కూడా తగ్గుతుంది.
ఇంట్లో నేరుగా ఎండ పడని దిశల్లో ఉన్న కిటికీలు, తలుపులు తెరిచి ఉంచడం వల్ల ఇంట్లోకి గాలి ప్రవాహం పెరుగుతుంది. దానివల్ల కూడా చల్లదనం కలుగుతుంది.
ఇదే సమయంలో ఎండ పడే దిశల్లో ఉన్న కిటికీలను మూసివేయడం, వీలైతే ఆ కిటీకీలకు బయటివైపు నుంచి కర్టెన్లు వంటివి ఏవైనా అడ్డుగా పెట్టడం మంచిది.
సాయంత్రం కాగానే కిటికీలను తెరిచి ఉంచాలి. అందువల్ల ఇంట్లోని వేడి బయటికి వెళ్లిపోయి.. చల్లగాలి లోపలికి వస్తుంది.
వేసవి సమయంలో ఇంటి పైకప్పుపై, బయటి గోడలకు తెలుపు రంగు వేయించడం వల్ల ఇంట్లో చల్లదనం ఉంటుంది.
ఇక ఇంట్లో ఎక్కువ వేడిని ఉత్పత్తి అయ్యేది వంట గదిలోనే. వంట గదిలోని వేడి బయటికి వెళ్లిపోయేలా వంట గదికి వెంటిలేటర్ ఉండేలా చూసుకోవాలి. ఈ వెంటిలేటర్లకు ఎగ్జాస్టింగ్ ఫ్యాన్లు అమర్చుకోవాలి. లేకుంటే వంట గదిలోని వేడి ఇంట్లో నిండిపోతుంది.
5. మంచు గడ్డలు, నీటితో మ్యాజిక్..
ఏసీ లేకున్నా.. ఇంట్లోని ఏదైనా గదిలో బాగా చల్లదనం కావాలనుకుంటే మంచు గడ్డలు, చల్లని నీటితో సులువుగా వేడిని తగ్గించుకోవచ్చు. ఫ్రిజ్ లోంచి తీసిన ఐస్ క్యూబ్ లను గానీ, చల్లటి నీటినిగానీ ఏదైనా వెడల్పాటి పాత్రలో పెట్టి.. నేరుగా ఫ్యాన్ గాలి తగిలేలా అమర్చాలి. కొద్దిసేపటిలోనే గదిలో ఉష్ణోగ్రత బాగా తగ్గిపోవడం గమనించవచ్చు. అయితే ఆ గదిలోకి బయటి నుంచి వేడి గాలి రాకుండా తలుపులు, కిటికీలు మూసి ఉంచాలి. అప్పుడు చల్లదనం ఎక్కువ సేపు ఉంటుంది.
మంచు లేకపోయినా సరే కేవలం సాధారణ నీటిని వెడల్పాటి పాత్రలో పోసి.. నేరుగా ఫ్యాన్ గాలి తగిలేలా పెట్టినా కూడా ఆ గదిలో రెండు మూడు డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలను తగ్గించుకోవచ్చు.
శరీరాన్నీ చల్లగా ఉంచుకోండి
మనం ఇంటిని చల్లగా ఉంచుకునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. మన శరీరం వేడిగా ఉంటే ప్రయోజనం ఉండదు. అటు ఇంటిని చల్లగా ఉంచుకునే పని చేస్తూనే.. శరీరాన్ని చల్లబరిచేందుకు చల్లటి నీళ్లు, నిమ్మరసం, జ్యూస్ ల వంటివి తాగడం బెటర్. దీంతోపాటు రుమాలు వంటి దానికి చల్లటి నీటిలో తడిపి.. శరీరంలో రక్త ప్రసరణ చాలా ఎక్కువగా ఉండే మణికట్టు, మెడ వంటి ప్రాంతాల్లో పెట్టుకోవడం ద్వారా శరీరం చల్లబడుతుంది.
ముఖ్యంగా ఎండాకాలంలో లేత రంగు కాటన్ వస్త్రాలు ధరించడం మేలు. అంతేగాకుండా వస్త్రాలు కొంచెం వదులుగా కూడా ఉండేలా చూసుకోవాలి. కాటన్ వస్త్రాల వల్ల గాలి బాగా ఆడి, చెమట ఆరిపోతుంది. తద్వారా శరీరం చల్లగా ఉంటుంది.
ఎండాకాలంలో చెమట ఎక్కువగా పట్టడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గిపోతుంది. ఇది ప్రమాదకర పర్యవసానాలకు దారితీస్తుంది. అందువల్ల నీరు ఎక్కువగా తాగాలి. తగినంత నీరు శరీరానికి అందితే.. చెమట కూడా ఎక్కువగా పట్టి శరీరం చల్లగా ఉంటుంది.
రాత్రి పడుకునేందుకు కూడా బెడ్ పై కాటన్ దుప్పట్లను, తలగడలకు కాటన్ తొడుగులకు వేయడం వల్ల చల్లటి అనుభూతి ఉంటుంది.
బాగా వేడిగా అనిపించినప్పుడుగానీ, రాత్రి నిద్రపోయే ముందుగానీ తల స్నానం చేయడం బెటర్. దీనివల్ల శరీరంలోని వేడి తగ్గిపోయి.. ఒకటి రెండు గంటల వరకు హాయిగా ఉంటుంది. నిద్రపోయే ముందు స్నానం చేయడం వల్ల శరీరం చల్లబడడంతోపాటు నిద్ర కూడా బాగా పడుతుంది.
పాలిమర్ పొరలు...
ఎండల నుంచి రక్షణ కల్పించి ఇంట్లో చల్లదనాన్ని కలిగించేలా ఇటీవలే శాస్త్రవేత్తలు కొత్త తరహా పాలిమర్ ను అభివృద్ధి చేశారు. అది సూర్యరశ్మిని చాలా వరకు పరావర్తనం చెందించే ఈ పాలిమర్ ధర కూడా తక్కువే ఉంటుందని చెబుతున్నారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాలు సహా అన్ని చోట్లా ఈ పాలిమర్ పొరను వినియోగించుకోవచ్చు. త్వరలో ఇవి అందుబాటులోకి రానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Digestive biscuits danger to health

    డైజెస్టివ్ బిస్కట్లు.. చాలా ప్రమాదం

    Mar 14 | మామూలుగా మనం తీసుకునే ఆహారంలో కాంబినేషన్లకు అధిక ప్రాధాన్యతను ఇస్తుంటాం. అది అల్పాహారమైనా, విందు భోజనమైనా సరే. అలాగే పొద్దునే చాయ్-బిస్కట్ కాంబినేషన్ కూడా అందరికీ సుపరిచితమే. చాలా ఇష్టం కూడా. మీరు డైజస్టివ్... Read more

  • Annam chapathi good for health

    అన్నం-చపాతీ.. ఏది ఉత్తమం?

    Feb 06 | అనారోగ్యాన్ని అధిగమించేందుకు కరెక్ట్ సమయంలో భోజనం చేయటం కన్నా.. ఉత్తమమైన మార్గం ఏదీ లేదని వైద్యులు సైతం చెబుతుంటారు. అయితే బాగా లావుగా ఉన్నవారు డైట్ పేరుతో రైస్ బదులు రోటీ తినటం చూస్తుంటాం.... Read more

  • Great exercises for diabetes people

    మధుమేహానికి.. ఆరోగ్యమే మహాభాగ్యం!

    Jan 23 | షుగర్ వ్యాధిగ్రస్తులకు హెల్త్ కేర్ ఎంతో అవసరం. వ్యాయామం అనేది షుగర్ వ్యాధిగ్రస్తుల జీవనంలో కీలక పాత్ర పోషిస్తుంది. పరిమితంగా చేస్తే ప్రయోజనం.. మోతాదు ఎక్కువైతే అనర్థం. అందుకే తగిన జాగ్రత్తల మేరకు వ్యాయామం... Read more

  • Energy drinks most dangerous

    ఎనర్జీ డ్రింక్స్.. అసలు మంచిది కాదు

    Dec 20 | ఎన‌ర్జీ డ్రింకులు అధికంగా తాగ‌డం వల్ల బ్రెయిన్ హెమ‌రేజ్ (మెదులో రక్తస్రావం) బారిన ప‌డే అవ‌కాశం ఉంద‌ని నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వెల్ల‌డించింది. అంతేకాకుండా హృద్రోగాలు, ర‌క్త‌నాళాల ప‌నితీరు మంద‌గించ‌డం వంటి ఆరోగ్య... Read more

  • Smart phone lock tips

    స్మార్ట్ ఫోన్ కి సెక్యూరిటీ పెట్టాల్సిందే!

    Oct 11 | స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో కనిపించేందే. తక్కువ ధరలో అడ్వాన్స్ అప్లికేషన్లతో లోకల్ బ్రాండ్లు కూడా ఫోన్లు మార్కెట్ లోకి దించేస్తున్నాయి. స్మార్ట్ ఫోన్లలోనూ దాదాపుగా 90 శాతానికి పైగా ఆండ్రాయిడ్... Read more