Padayatras of political leaders and its benefits

pada yatras, political games, political parties, political gains, politicians, gandhi, anna hazare

pada yatras of political leaders and its benefits to the parties and common man

padayatra-benefits.gif

Posted: 02/16/2013 12:59 PM IST
Padayatras of political leaders and its benefits

     padayatras

     పాదయాత్రలు, నిరాహారదీక్షలతో రాజకీయ ప్రక్షాళనపాదయాత్రలు చెయ్యటం, దీక్షలకు పూనుకోవటం వలన రాజకీయాల్లో ఫలితాలెలా ఉన్నా, ముందు ఆరోగ్యంలో మార్పు వస్తుంది.  శారీరక ఆరోగ్యం వలన మనసుకూడా నిర్మలమవుతుంది.  దానితో నాయకుల నిర్ణయాలు ప్రజాక్షేమంలో జరుగవచ్చు.  ఎక్కడో కూర్చుని వారికి అందే సమాచారంతో పరిస్థితిని సమీకరించేదానికంటే, ప్రజల  బాగోగులను, కష్టసుఖాలను స్వయంగా వీక్షించి వాటికనుగుణంగా తమ తమ విధానాలలో మార్పులు తీసుకునిరావటమనేది చాలా మంచి పని, ప్రగతిమార్గంలో మంచి అడుగు.
 
     పెద్ద నాయకుడు ఈ పనికి పూనుకున్నప్పుడు అనుచరులు కూడా ఆ బాటను అనుసరిస్తారు.  అందుకే పూర్వకాలంలో కూడా రాజ్యాన్ని పాలించే రాజులు కూడా వేట పేరుతో వివిధ ప్రాంతాలను సందర్శించటం, మారువేషాలలో తిరుగుతూ సమాచారాన్ని సేకరించటం చేసేవారని చెప్తుంటారు.  స్వాతంత్ర్యానికి ముందు మహాత్మా గాంధీ దగ్గర్నుంచి ప్రారంభమైందీ పద్ధతి.  నిరసనగా దీక్షలకు పూనుకోవటం, పాదయాత్రలతో సామాన్యుని చెంతకు పోవటం ప్రారంభించింది ఆయనే.
 
     అయితే, భద్రతా ఏర్పాట్ల మూలంగా నిజంగా వారికెంత నిజమైన సమాచారం అందుతోంది, వారు నిర్భయంగా నిజాన్ని చెప్పేవారిని కలిసి మాట్లాడగలుగుతున్నారా అన్నది ఇంకా సందేహమే.  వారు తిరిగే ప్రాంతాలలోని ప్రజాప్రతినిధులు నాయకులకు చూపించినంతే చూస్తున్నారా అన్న అనుమానం కలుగకమానదు.
 
     ఆనాడు రాజశేఖర రెడ్డి, తర్వాత ఆయన కుమారుడు జగన్ మోహన రెడ్డి, ఇప్పుడు ఆయన కూతురు షర్మిల, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేస్తున్న యాత్రల వలన మేలు కలిగిందా, కలుగుతుందా అంటే ప్రతి పనిలోనూ ప్రయోజనమనేది తప్పక ఉంటుంది.  కాకపోతే అది ఎవరికి అన్న ప్రశ్న ఉదయిస్తుంది.  నాయకులకు రాజకీయ పరంగానా లేకపోతే సామాన్య ప్రజానీకానికి సంక్షేమపరంగానా అన్నది ప్రతివారినీ సందేహంలోకి నెడుతుంటుంది.  రాజశేఖరరెడ్డ చేసిన పాదయాత్ర అప్పుడు కాంగ్రెస్ కి మేలు చేసిందనటంలో సందేహం లేదు.   అంతకు ముందు అన్నగారు ఎన్టీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా చేసిన యాత్రలు కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో పెరికివేస్తే, వైయస్ఆర్ చేసిన యాత్రల వలన వేళ్ళూనిందనుకున్న తెలుగుదేశం తిరిగి ప్రతిపక్షానికి పరిమితమైపోయింది.  అందుకే ఒక పార్టీ నాయకుడు ఆ పనికి పూనుకుంటే మిగతా పార్టీల లోనివారు వారిని నిరసించటం కూడా జరుగుతుంటుంది.  ప్రజల మీద ప్రేమ కాదు, గద్దె మీద మక్కువ అంటూ నోరు చప్పరించేస్తారు, ఎద్దేవా చేస్తుంటారు. కొందరు పాదయాత్రల వలన జరుగుతున్న ధన నష్టం గురించి మాట్లాడుతారు.  నెలల తరబడి యాత్రలంటూ అంతంత డబ్బు తగలేస్తున్నారంటూ విమర్శిస్తుంటారు.  పెట్రోల్ డీజిల్ కి ఇంత, అంతమందికి అన్నం వార్చి వడ్డించటాలు, ప్రచార సామగ్రి, వీటన్నిటికీ అవుతున్న ఖర్చు కోట్లలోకి పోతోంది.  ఎవరు తిన్నట్టూ, అదే పేదలకు పంచి పెడితే వాళ్ళన్నా బాగుపడతారు కదా అని అంటారు.  ఖర్చు పెడితే మంచిదే కదా.  ఎవరో ఒకరికి ఉపాధైతే దొరుకుతున్నది కదా.  పార్టీ నిధుల్లోంచో, లేక వ్యక్తిగత ఖాతాల్లోంచో ఖర్చు పెడితే తప్పేంటి.  అదే ప్రభుత్వం సొమ్ముని ఖర్చు పెడుతూ, అధికారం ఉంది కదా అని తమ పార్టీ ప్రచారానికయ్యే ఖర్చునంతా ప్రభుత్వ ఖజానా నుంచి తీసి వాడుతున్నట్లయితే అది విమర్శనకు గురి అవటం సరైనదే కానీ అధికారంలో లేని పార్టీ తమ సొంద డబ్బు ఖర్చు పెడితే అందులో విమర్శించాల్సిందేమీ లేదు కదూ.  ఆ ఖర్చు పెట్టే డబ్బుని పేదలకు పంచితే, అన్నది కూడా సరైన వాదన కాదు.  ఎందుకంటే అలా ఇచ్చుకుంటూ పోతే అది కూడా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ గెలవటంకోసం డబ్బు ఎర చూపుతున్నారనే అంటారు.  ఏం చేసినా పార్టీ ప్రయోజనం కోసమే చేస్తున్నారనే విమర్శకు గురికాక ఎవరికీ తప్పదు.
 
     అయితే పార్టీ విజయం ప్రజల విజయమే కదా, పార్టీ ఉన్నది ప్రజలకోసమే కదా, మాకు అవకాశమిస్తేనే కదా మేము మా వంతు సేవ చెయ్యగలిగేది అన్నది రాజకీయ నాయకుల వాదన.  తమ దగ్గరికి వచ్చిన నాయకుడిని ప్రజలు తప్పక గుర్తు పెట్టుకుంటారు.  అంత పెద్దవాడు మనదగ్గరకు వచ్చాడు అనే భావన వారిలో చెలరేగి వారిమీద జాలి, ప్రేమ కలుగజేస్తుంది ముఖ్యంగా మన తెలుగు వారికి.  మంచి పనైంది కాళ్ళు వాచాయి, మోకాలికి దెబ్బ తగిలింది, దీక్ష వలన ఆరోగ్యం చెడిపోయింది, ఎప్పుడూ ఎసిలో ఉండేవాడికి తిక్క కుదిరింది అని అనుకునే మనస్తత్వం ఇతర ప్రాంతలలో మనం చూస్తాం కానీ మనలో లేదు.    అందువలన నాయకులకు ఇలాంటి కార్యక్రమాల వలన మంచే జరుగుతుందనటంలో పొరపాటు లేదు.
 
     కాకపోతే అలా యాత్రలు చేస్తున్న సమయంలో మాట్లాడే మాటలు ప్రజలను పరామర్శస్తూ వారి బోగోగులను తెలుసుకోవటం కాకుండా సందర్భం దొరికింది కదా అని ఇతర పార్టీలను దుయ్యబట్టటం, తమ పార్టీ ప్రతిష్టను పెంచుకునే దిశగా మాట్లాడటం వలన ప్రజలలో చులకన భావం ఏర్పడే అవకాశం ఉంది.  అంతే కాకుండా, ఎన్నికలకు ముందు ఇలాగే వస్తారు కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మా ముఖాలు చూడరు అనే అభిప్రాయం బాగా వుంది.  ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి పనుల్లో వారు వ్యస్థులైవుంటారు కాబట్టి ఇలా తీరిగ్గా పాదయాత్రలతో గడపటానికి సమయం ఎక్కడిది అనుకుంటారు కానీ, ఈ పద్ధతిని ఆ తర్వాత కూడా కొనసాగించవచ్చు.  ప్రజా వేదికలను నిర్వహించటం, సమాచార వ్యవస్థ ఇప్పుడు ఎంతో అందుబాటులో ఉంది కాబట్టి, ఎక్కడున్నా మిగిలినవారితో మంతనాలు కొనసాగించవచ్చు, నిర్ణయాలను తీసుకుని వాటిని అమలు పరచటానికి ఆఙలను జారీ చెయ్యవచ్చు కాబట్టి, పదవులు చేతికివచ్చిన తర్వాత కూడా ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించవచ్చు.  నిజంగా నాయకులు పగ్గాలు చేత చిక్కిన తర్వాత కూడా ఇదే పద్ధతిలో నడుస్తూ, ఇంకా పారదర్శకంగా వ్యవహరిస్తూ, పాలనను ప్రజాహితంలో చేసినట్లయితే రాజకీయాల రంగే మారిపోతుంది.  కానీ అప్పడు వారికుండే చికాకులు వారికుంటాయి.  పదవులు రాకముందు అందరూ కలిసి పనిచేస్తారేమో కానీ, పార్టీకి పగ్గం చేతికి వచ్చిన తర్వాత పదవుల పందేరాలలో పెద్ద చిక్కే వచ్చిపడుతుంది.  ఈ లోపులో ప్రతిపక్షాల ఎత్తులకు పై ఎత్తులను ఆలోచించటం, చేస్తున్న ప్రతి పనీ ప్రజల ప్రయోజనం కోసమే నని చెప్తూ, ఇతర పార్టీలు విమర్శించే అవకాశమివ్వకుండా నేర్పుతో నెట్టుకురావటం, కేంద్ర ప్రభుత్వంతో వ్యవహారాలు వీటన్నిటి మధ్యా నలిగి సతమతమయ్యే నాయకులకు తీరిగ్గా తిరగటానికి తీరికెక్కడుంటుంది.
 
     నిజానికి నాయకులకు తీరిక ఉంటుంది.  వారికి తీరిక దొరకటం కోసం ఉన్నదే ప్రభుత్వ యంత్రాంగం.  కేవలం ప్రజాహితంలోనే పనిచెయ్యాలనుకునేవారికి తీరిక ఉంటుంది కానీ, తమ పదవిని కాపాడుకోవటం కోసం కూడా అప్రమత్తులై వుండటానికి రోజుకి 24 గంటల కాలం సరిపోదు.  కానీ అంతకంటే ఎక్కువ ఎవరికీ లభించదు.  అదీ వచ్చిన తంటా.  మరి మేమున్నది అందుకే కదా, అధికార పార్టీని ప్రతి విషయంలోనూ విమర్శించకపోతే ప్రతిపక్షమెలా అవుతుంది అంటారు.  అలా విమర్శించకపోతే మరి ప్రతి పక్షమేం చేస్తోంది అని నిలదీసేవారూ ఉన్నారు.  వీటన్నిటికీ మందు ఒక్కటే. రాజకీయాల్లోంచి ధనమనే వస్తువు బైటికి వెళ్ళిపోవటం.
 
     డబ్బుతో రాజకీయాలకు ఎటువంటి సంబంధమూ ఉండకుండా ఉండటమే మార్గాంతరం.  పందెంలో ఒడ్డే స్టేక్ ఎక్కువగా ఉన్నప్పుడే గట్టి పోటీలకు దారితీస్తుంది.  ఎందుకంటే పోయేది ఎక్కువ ప్రమాణంలో ఉంటుంది కాబట్టి.  డబ్బు చిన్న ప్రమాణంలో ఉండి, బాధ్యత పూర్తిగా ఉన్న చోట అసలు పోటీకి నిలబడటానికే ముందుకు వచ్చేవారు తక్కువ.  రెసిడెన్షియల్ కాలనీలలో మెయింటెనెన్స్ వసూలు చేసి కాలనీని లేక అపార్ట్ మెంట్ ని నిర్వహించే మేనేజ్ మెంట్ లో పదవిని కట్టబెడతామంటేనే వద్దు నాకు టైం లేదు అనేవారుంటారు.  ఎందుకంటే దానికి సమయాన్ని కేటాయిస్తే వారు వారి ఆదాయానికి కేటాయించవలసిన సమయం చిక్కిపోతుంది కాబట్టి.  ఎందుకొచ్చిన గొడవ ఎవరో ఏదో అడిగితే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అగత్యం నాకేమిటి అని ప్రతివారూ ఆ బాధ్యతలను తీసుకోవటానికి వెనకాడుతారు.
 
     దేశ రాజకీయాల్లో కూడా కేవలం వారి జీతాలవరకే వారి చేతికి చిక్కే విధానం ఉంటేగనక, నాయకులు అవుతానంటూ ముందుకొచ్చేవారి సంఖ్య గణనీయంగా పడిపోయి కేవలం సేవాదృక్పథం ఉన్నవారికే పరిమితమౌతుంది.  నాయకుడయ్యేది అధికారం కోసమే అని అనుకున్నా తప్పులేదు.  అధికారం ఉంటే చాలు అనే అహం పెద్దగా చెడు చెయ్యదు కానీ నేటి రాజకీయాలు డబ్బుతో ముడిపడి ఉండటంతో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలలో నిలుచోవటమే సామాన్యుడికి అందుబాటులో లేనిది.  ఫలానా హోదా రావాలంటే ఇంత డబ్బు ఖర్చు పెట్టాల్సివుంటుంది అన్న పరిస్థితులు కలిగినప్పుడు అందరికీ అది సాధ్యమయ్యే పనీ కాదు, అలా చేసినవారు వారు పెట్టుబడిగా పెట్టిన సొమ్ముని ధర్మవడ్డీతో సహా వసూలు చేసుకోకా మానరు.
  
     ఇలాంటి చక్రభ్రమణంలో చిక్కుకోవటం వలన రాజకీయాలు కొందరికే పరిమితమవటం, గెలిచే గుర్రం మీదనే పందెం కాచినట్టు గెలుపుకి అవకాశమున్న పార్టీకే మద్దతునివ్వటం, గెలిచిన తర్వాత తాము చేసిన మద్దతుకి ప్రతిఫలాన్ని కోరుకోవటమన్నది సర్వసామాన్యమైపోయింది.  అదే సరైన పద్ధతి, ఆచరించవలసిన రాజకీయం అని అందరికీ మనస్సులో ముద్రించుకుపోయింది.
 
     padayatraఇందులోంచి బయటపడాలంటే తక్కువ కాలం వరకే అయినా ప్రజలను ఉత్తేజపరచి, అవినీతికి ఎదురు నిలిచి, ఏదో మఁచి జరగబోతోంది అన్న నమ్మకం, అందుకు మావంతు సాయం చెయ్యటానికి, పూర్తి మద్దతునివ్వటానికి సిద్ధమని ప్రజలను సమాయత్తం చేసిన అన్నా హజారే లాంటి వాళ్ళు ముందుకొస్తేనే ఇది సాధ్యమవుతుంది.  ఒక్కసారి రాజకీయలలో ధనప్రమేయం లేకుండా పోతే ఇక ఆ తర్వాత ప్రజాస్వామ్యం రామరాజ్యమే అవుతుంది.  రాజకీయం వ్యాపారమో, లేక జూదంలో కాసే పందెంలా కాకుండా పోయినప్పుడే నిజమైన ప్రక్షాళన జరిగినట్టు.ఈ లోపులో, ప్రస్తుతం నాయకులు చేసే పాదయాత్రలూ, దీక్షలూ ప్రజలకు ఏదో మేలు చేస్తాయని ఆశపడటంలో తప్పులేదు, అలా ఆశపడటానికి ప్రతివారికీ స్వేచ్ఛ ఉంది.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Police department sexual harassment in andhra pradesh
Dasari narayana rao sensational comments  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Kcr breifing about meeting with ap cm chandrababu naidu

    కలిసి పంచుకుందామని బాబుకు చెప్పా - కేసీఆర్

    Aug 18 | ఇద్దరు చంద్రులు ఒక చోటకు చేరారు. నిత్యం ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకునే తెలుగు సీఎంలు కలుసుకున్నారు. ఇద్దరు చంద్రులను రాజ్ భవన్ కలిపింది. సమస్యలపై చర్చించుకునేందుకు సమావేశం కావాలన్న గవర్నర్ రాయబారం ఫలించింది.... Read more

  • Sanjay dutt back home for 30 days

    సంజయ్ దత్ భార్య కోసం 30 రోజులు జైలు బయట

    Dec 21 | పుణె ఎర్రవాడ జైల్లో ఖైదీగా శిక్షను అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ తన భార్య కోసం 30 రోజులు జైలు బయట కాపురం చేస్తున్నాడు. సంజయ్ దత్ జైల్లో ఖైదీగా ఉన్నప్పటికి ఆయనకు... Read more

  • Dhoom3 record reasons

    కత్రినా ప్యాంటీ తో దున్నేస్తున్న అమీర్ ఖాన్

    Dec 21 | ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూసిన ధూమ్ 3 అభిమానుల్ని ఏ మాత్రం నిరాశ ప‌ర‌చ‌లేదు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ ను ఎందుకు మిస్టర్ ప‌ర‌ఫ‌క్ట్ అంటారో.. ఈ చిత్రంలో... Read more

  • Minister kanna politics in congress party

    కలకలం రేపిన మంత్రి కన్నా

    Dec 21 | రాష్ట్ర నాయకుల్లో మళ్లీ కలకలం రేగింది. ఈ కలకలానికి కారణం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. తాజా ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయ నేతల్లో చర్చకు... Read more

  • Gay romance verdict government files review petition in supreme court

    గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్

    Dec 21 | గే ల రొమాన్స్ కోసం కేంద్రం పైట్ చేయటానికి పూనుకుంది. గే విషయంలో సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు చాలా బాదకారమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ విచారం వ్యక్తం చేసిన విషయం... Read more