దగ్గర కొండెము చెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మరి తా
నెగ్గు ప్రజకాచరించుట
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ
దగ్గర- దగ్గరచేరి, కొండెము చెప్పెడు- చాడీలు చెప్పే, ప్రెగ్గడ పలుకులకు- మంత్రి మాటలకు, రాజు ప్రియుడై- రాజుకి నచ్చి, తాన్- అతను, నెగ్గు- చెడు, ప్రజకాచరించుట- ప్రజలకు చెయ్యటమనేది, బొగ్గులకై- బొగ్గులకోసం, కల్పతరువు- కల్పతరువును, బొడుచుట- నరికివేయటం లాంటిది.
మంత్రి చాడీలను విని ప్రజలకు అపకారం చేసే రాజు వైఖరి ఎలాంటిదంటే, బొగ్గులకోసం కల్పతరువుని నరికి కాల్చినట్టే.
పూర్వకాలం అధికారం రాజులదే, వంశపారంపర్యంగా వచ్చినా, లేదా యుద్ధాలు చేసి సంపాదించినా. కానీ సలహాలివ్వటం కోసం రాజులు మంత్రులను చేరదీస్తే వాళ్ళల్లో కొందరు వాళ్ళ హోదాని ఉపయోగించుకుని బంధుప్రీతి, స్వార్థంతో చెడు మాటలతో రాజు మెదడులో విషాన్ని పూరించేవారు. అలా చాడీలు చెప్పే మంత్రి మాటలు విని రాజు తన ప్రజలకు నష్టం కలిగించినట్లయితే అది కల్పతరువుని బొగ్గులకోసం నరికివేసినట్టే సుమా అంటారు శతకకర్త. కల్పతరువు అంటే ఈ కాలంలో అందరికీ తెలియక పోవచ్చు. బొగ్గులకోసం చెట్టు నరకటమన్నా తెలియకపోవచ్చు. అందుకే ఈ క్రింది వివరణ.
వంట చేసుకోవటానికి ఇంధనం ఇప్పటిలా గ్యాస్ కానీ కరెంటు కాని లేని రోజులు కాబట్టి చెట్లను నరికి వాటికి నిప్పంటించి దాని మీద వంటచేసేవారు. అన్ని కాలాల్లోనూ కూరగాయలు దొరకేవి కాదు కాబట్టి ఒరుగులు, ఒడియాలు, పచ్చళ్ళు పెట్టుకున్నట్టుగానే, వర్షాకాలంలో కట్టెలు దొరకవని ముందుగానే బొగ్గులను చేసుకుని పెట్టుకునేవారు. కట్టెలను కాల్చి, అవి పూర్తిగా బూడిద అవకముందే వాటిని అర్పి వేస్తే అవి బొగ్గులవుతాయి. వాటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు కుంపటిలో వేసి నిప్పు అంటించి వంట చేసుకోవచ్చు. ఇవీ బొగ్గులంటే, బొగ్గుల ఉపయోగం.
ఇక కల్పతరువంటే, స్వర్గంలో ఇంద్రుడి దగ్గరుండే ఒక చెట్టు. ఆ చెట్టు మహిమ ఎలాంటిదంటే ఆ చెట్టు కింద ఉండి ఏది కోరుకుంటే అది లభిస్తుంది. తరువు అంటే చెట్టు. ఏది కావలిస్తే దాన్ని సృష్టించి ఇచ్చే వృక్షం కాబట్టి దాన్ని కల్పతరువు అన్నారు. ఏది కావాలంటే అది ఇచ్చే చెట్టుని కేవలం బొగ్గుల కోసం నరికివేయటం ఎంత అవివేకం.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more
Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more
Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్ మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more
Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more
Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్ సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more