తలనుండు విషము ఫణికిని
వెలయంగా దోకనుండు వృశ్చికమునకున్
దలతోక యనకయుండును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ !
తలనుండు విషము= తలలో విషముంటుంది, ఫణికిని= పాముకి, వెలయంగా= పైకి కనిపించేవిధంగా, తోకనుండు= తోకలో ఉంటుంది, వృశ్చికమునకున్= తేలుకి తలతోక యనక యుండును= తల తోక అంటూ ఒక చోటేమీ లేదు, ఖలునకు= దుర్మార్గుడికి, నిలువెల్ల విషము= ఒళ్ళంతా విషమే, గదరా= కదా.
పాముకి తలలో విషముంటంది, తేలుకి తోకలో విషముంటుంది కానీ దుర్మార్గ చిత్తుడి ఒళ్ళంతా విషమే జాగ్రత్త అంటారు శతకకర్త.
సుమతీ శతకంలోని ఈ పద్యం కూడా బహుళ ప్రచారంలో ఉన్నదే. సుమతీ శతకం తెలుగులో రచించటమే కాదు, ఆధునిక తెలుగు భాషను పదునుకూడా పెట్టి, బాషను సుసంపన్నం చేసిందనటంలో అతిశయోక్తి లేదు. ఈ పద్యాల్లోని మాటలను అదే పొందికలో ఎందరో రచయితలు, వ్యాసకర్తలు, ఉపన్యాసకులు ఉపయోగిస్తూ వచ్చారు. నీ ఒళ్ళంతా విషమే అనే పదప్రయోగం అలాంటిదే. సుమతీ శకతంలోని ఇలాంటి పదాలనెన్నిటినో తెలుగులో వాడటాన్ని కూడా ఒకప్పుడు చాలా గొప్పగానే భావించేవారు. పాము కాటు వేస్తే విషమెక్కుతుంది, తేలు తొకతో కొడితే విషమెక్కుతుంది అని తెలియనివారికి కూడా ఆ విషయాలను ఈ పద్యం తెలియజేస్తుంది. తలా తోకా అనేమీ లేదు ఒళ్ళంతా విషమే అని చెప్పటంలో కవి చమత్కారం బాగా కనిపిస్తుంది.
అలా అని దుర్మార్గుడైన మనిషి శరీరంలో నిజంగా విషముంటుందని కాదు. పాము విషయంలో తల దగ్గర జాగ్రత్త వహిస్తే విషప్రయోగాన్ని తప్పించుకోవచ్చు. అలాగే తేలు విషయంలో తోక తగలకుండా జాగ్రత్తపడితే విషప్రయోగం నుంచి తప్పించుకోవచ్చు. కానీ దుర్మార్గుడి బారిన పడితే మాత్రం తప్పించుకోవటం కష్టం అనేదాన్ని చెప్పటం కోసమే ఒళ్ళంతా విషమే అని శతకకర్త అన్నారు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more
Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more
Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్ మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more
Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more
Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్ సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more