ఏఱకుమీ కసుగాయలు
దూఱకుమీ బంధుజనుల దోషము సుమ్మీ
పాఱకుమీ రణమందున
మీఱకుమీ గురువులాఙ మేదిని సుమతీ
ఏఱకుమీ- ఏరవద్దు, కసుగాయలు- పచ్చికాయలను, దూఱకుమీ- దూషించవద్దు, బంధుజనుల- బంధువులను, , దోషము సుమ్మీ- తప్పు సుమా, పాఱకుమీ- పారిపోవద్దు, రణమందున- యుద్ధంలో ఉన్నప్పుడు, మీరకుమీ గురవులాఙ- గురువుల ఉపదేశాలను ఉల్లంఘించకు, మేదిని- ఈ ప్రపంచంలో.
పచ్చి కాయలను ఏరకు, బంధువులను దూషించకు, రణరంగం నుంచి పారిపోకు, గురువుల ఆనతి మీరకు.
మామూలుగా శతకాల్లో ఉండే ఉపమానాలు ఇందులో లేవు. పోల్చి చూసేవి కావు ఇవన్నీ. ప్రయాణం చేసేటప్పుడు చిన్నవాళ్ళకి పెద్దవాళ్లెలాగైతే కొన్ని జాగ్రత్తలు తెలియజేస్తారో, అలాగే జీవితంలో ఎన్నో అనుభవాలను, ఎంతో ఙానాన్ని మూటగట్టుకున్న మహాత్ములు ఎందరికిచ్చినా తరగని ఆ సంవదను పంచిపెడుతూ వచ్చారు. ప్రతి మనిషీ ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుంటూ పోవాలంటే ఒక జీవిత కాలం సరిపోదు, ఎదుగుదలకు అవకాశం ఉండదు. అందువలన అనుభవాన్ని గడించినవారు తిరిగి అవే తప్పులు చెయ్యకుండా ఉండటం కోసమే కావచ్చు లేదా వారు తెలుసుకున్న కొన్ని సులభ మార్గాలను మానవాళికి అందించటం కోసమే కావచ్చు అందించిన సూక్తులే ఈ శతకాలు. పూర్వకాలంలో ఈ శతకాలను వల్లె వేయించేవారు. ముఖ్యంగా ఈ సుమతీ శతకం ఎంతటి ప్రచారాన్ని పొందిందంటే, ఇందులోని వాక్యాలను పండితులు, రచయితలు తమ ప్రసంగాలు, రచనల్లో ఉపయోగించేవారు.
ఇప్పుడు మనందరం కూరగాయలను, పండ్లను బజార్లో కొనుక్కుంటున్నాం. కానీ పూర్వకాలంలో వాటిని ఉమ్మడి ఆస్తులైన సహజ తోటలు, అడవుల్లో కోసుకోవటం, కిందపడ్డవి ఏరుకోవటం చేసేవారు. అంత కష్టపడి తెచ్చుకునే పండ్లు పచ్చివి ఏరుకుంటే ఏం లాభం. అందువలన పండినవాటిని, ఉపయోగించగలిగినవాటిని తీసుకోమని చెప్తారు. అలాగే రెండవ సూక్తిలో, మీ బంధువులను మీరే దూషిస్తే ఎలా. బంధుత్వం అంతటితో తెగిపోతుంది కదా అని చెప్తున్నారు. మూడవ సూక్తిలో యుద్ధ భూమి నుంచి పారిపోవద్దని అన్నారు. రాజులు పాలించే కాలంలో దేశాన్ని రక్షించుకోవటానికి అవసరమైతే యువతంతా యుద్ధంలో పాల్గొనేవారు. అప్పట్లో యుద్ధంలో దెబ్బ తగిలితే ముందు భాగంలో తగలాలి కానీ వీపుకి కాదు అని చెప్పేవారు. వెనక వైపు దెబ్బ తగిలిందంటే పారిపోయే ప్రయత్నంలో తగిలిన దెబ్బే అది. విజయమో, వీర స్వర్గమో అనేవారు. సాధిస్తే విజయం, లేదా వీరులకు సంప్రాప్తించే స్వర్గభూమి. మరో సూక్తిగా, గురువుల ఆఙను మీరవద్దని చెప్తారు. మీకు ఉపదేశించే గురువులు సమాజంలో మీరున్న స్థానాన్ని, ఙానంలో మీ స్థాయిని, మీ జీవన శైలిని బట్టి, మీకు కొన్ని ఉపదేశాలిస్తారు. వాటిని ఎందుకు ఇచ్చారో గురువులకే తెలుసు కాబట్టి వాటిని పాటించటమే మీ వంతు అని చెప్తారు.
ఇలాంటి సూక్తులన్నీ భావితరాన్ని ఉద్ధరించటానికి చేసినవే. ఇవన్నీ చెప్పకపోయినా ఎందుకు చెప్పలేదని వారినెవరూ అడగేవారు లేరు, కానీ ప్రజాహితంలో మానవాళి మీదున్న ప్రేమతో భావితరాలకు ఉపయోగపడతాయనే ఉద్దేశ్యంతో చెప్పినవే ఇవన్నీ. వీటిని చదివేటప్పుడు వీటిని రాసిన కాలంలోని పరిస్థితులను అప్పటి స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని అర్థం చేసుకుంటూ, ఈ కాలంలో ఎంత వరకూ అన్వయించుకోగలిగితే అంత చేసుకోవాలి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Apr 15 | ఉడుముండదె నూఱేండ్లును బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్ మడువుఁ గొక్కెర యుండదె కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ! టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం... Read more
Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more
Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్ మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more
Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more
Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్ సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more