సినిమా పరిశ్రమలో మొట్టమొదటగా ఎక్కువ ప్రాధాన్యత దక్కేది కేవలం ఒక్క నిర్మాతకు మాత్రమే. ఏదైనా ఒక చిత్రాన్ని మొదలుపెట్టినప్పుడు.. అందుకుగాను పనిచేసే చాయ్ వాడి నుంచి దర్శకుడివరకు అయ్యే ఖర్చంతా ఒక్క నిర్మాతనే భరించాల్సి వుంటుంది. అందరూ బాగుండాలని కోరుకుంటూ వారికి తగినట్టుగా అన్ని సదుపాయాలను ఏర్పాటు చేయడంలో నిర్మాత ఏమాత్రం వెనక్కు తగ్గకుండా ముందుకు సాగిపోతాడు. తన ఆస్తినైనా అమ్ముకుని, సినిమాకు కావలసినంత బడ్జెట్ ను సమకూర్చడంలో కేవలం నిర్మాతకే సాధ్యం అవుతుంది. ఒక విధంగా చెప్పుకోవాలంటే.. చిత్రసీమకే నిర్మాత ఒక తల్లిలాంటి వాడు అని చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అటువంటి నిర్మాతకు అన్ని విభాగాల్లో పెద్ద పీట వేయడం ఎంతో ముఖ్యం.
కానీ ప్రస్తుతకాలంలో నిర్మాత అనే మాటకు అర్థమే మారిపోయింది. ఒకవేళ సినిమా హిట్టయితే ఆ క్రెడిట్ మొత్తం అందులో నటించిన కథానాయకుడికీ, దర్శకుడికీ మాత్రమే దక్కుతుంది. ఎన్నో అవకతవకలను చవిచూసి, కష్టాలను ఎదుర్కుని ఆ సినిమాను నిర్మించిన నిర్మాతను మాత్రం ఎవ్వరూ పట్టించుకోరు. అదే సినిమా ఫ్లాప్ అయితే మాత్రం.. ఎవరిదారి వారు చూసుకుంటారు. దానికయ్యే నష్టాన్ని కేవలం నిర్మాత మాత్రమే భరించుకోవాల్సి వుంటుంది. పెట్టుబడి - లాభాలకు పెద్ద నిర్మాత ఊగిసలాడుతున్నాడు. ఒక గుమస్తాకున్న కనీస మర్యాదలు కూడా నేటి నిర్మాతకు అస్సలు దక్కడం లేదు.
అయితే ఇటువంటి కష్టతరమైన పరిస్థితుల్లో కూడా నిర్మాతలు వెనకడుగు వేయకుండా సినిమాలను నిర్మించడంలో ముందుకు వస్తున్నారు. నేటి యువతారలకు మంచి మంచి అవకాశాలు కల్పిస్తూ, వారిని అన్ని సౌకర్యాలను కల్పించడానికి, వారిలో విశ్వాసం కలిగించేందుకు నిర్మాతలు పట్టువదలకుండా సినిమాలను నిర్మిస్తున్నారు. అటువంటి మంచి మనసు కలిగివున్న నిర్మాతల్లో ఎప్పటికీ ముందువరుసలో వుంటారు భారత పార్లమెంటు మాజీ సభ్యుడు డాక్టర్ డి.రామానాయుడుగారు. చిన్న, పెద్ద సినిమాలు వంటివి తేడా లేకుండా, చిత్ర పరిశ్రమలో వస్తున్న కొత్త తారలకు మంచి సదావకాశాలు కల్పిస్తూ సినిమాలను నిర్మిస్తున్నారు రామానాయుడుగారు.
రామానాయుడుగారు 1936 జూన్ 6వ తేదీన ప్రకాశం జిల్లాలోని కారంచేడు గ్రామంలో జన్మించారు. నిర్మాతగా ఈయన జీవన ప్రయాణం 50 ఏళ్లకు పైగానే గడిచింది. చిత్రపరిశ్రమలో ఈయన చూడని మలుపు లేదు.. దక్కని గెలుపు లేదు. ఎన్ని ఆటంకాలు, ఇబ్బందులు, సమస్యలు ఎదురయినా.. వాటిని లెక్కచేయకుండా తన సినిమా ప్రస్థానాన్ని ముందుకు తీసుకుంటూ వెళ్లారు. విఫలం అయిన చోటే విజయాన్ని వెదుక్కోవాలనే నినాదంతో సినిమా ప్రపంచాన్ని వదిలిపెట్టకుండా, నిర్మిస్తూ వచ్చారు. అంతటి పిచ్చి ప్రేమను సినిమాల మీద రామానాయుడుగారు పెంచుకున్నారు.
ప్రపంచ చరిత్రలోనే ఏ ఒక్క నిర్మాత చేయలేని సాహసాన్ని రామానాయుడుగారు చేశారు. ఒకే ధాటిగా వందకుపైగా చిత్రాలను నిర్మించి, ప్రపంచ రికార్డును తన సొంతం చేసుకుని, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించుకోగలిగారు. దాంతో ఈయనను ప్రతిఒక్కరు మూవీ మొఘల్ గా అభివర్ణిస్తారు. మన భారతదేశంలో వున్న దాదాపు అన్ని భాషల్లోనూ సినిమాలను నిర్మించిన ఘనత కేవలం రామానాయుడుగారికే దక్కుతుంది. తన సంపాదనలో వచ్చిన లాభాలను కేవలం సినిమా రంగాలకే వెచ్చిస్తూ.. స్టూడియో, ల్యాబ్, డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్, పోస్టర్స్ ప్రింటింగ్, గ్రాఫిక్ యూనిట్‌తో సహా సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను సమకూర్చడంలో తనవంతు సహాయాన్ని అందిస్తూ వచ్చారు.
తెలుగు చిత్రపరిశ్రమలకు కొత్త దర్శకులను పరిచయం చేయడంలో రామానాయుడు ఎల్లప్పుడూ ముందుంటారు. దాదాపు 21వ మంది కొత్త దర్శకులను తన సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా వెలుగులోకి తీసుకొచ్చిన మొట్టమొదటి నిర్మాతగా రామానాయుడుగారు ఘనతను సంపాదించుకున్నారు. సినిమా షూటింగ్ మొదలుపెట్టిన దగ్గర్నుంచి, పేకప్ అయ్యేంతవరకు సెట్లోనే వుండి, దానికి అనుగునంగా నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారు. కేవలం చిత్రసీమలోనే కాదు.. రాజకీయపరంగా కూడా తనవంతు సేవలను అందించారు రామానాయుడు. 1999వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల నేపథ్యంలో బాపట్ల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా లోక్ సభకు ఎన్నికయ్యారు. కానీ 2004లో అదే స్థానం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు.
వ్యక్తిగత జీవితం :
ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన రామానాయుడుగారి తల్లి మూడేళ్ల వయస్సు వున్నప్పుడే చనిపోయారు. రామానాయుడికి ఒక అక్క, ఒక చెల్లెలు. తండ్రి వెంకటేశ్వర్లు కొన్నాళ్ల తరువాత రెండో పెళ్లి చేసుకున్నాడు. రామానాయుడు తన పినతల్లి దగ్గర ఎంతో గారాబంగానే పెరిగాడు. తన చదువును పూర్తి చేయడం కోసం ఒంగోలులోని తన బంధువు అయిన డాక్టర్ బిబిఎల్ సూర్యనారాయణగారి ఇంట్లో వుంటూ ఎస్సెస్సెల్సి దాకా విద్యాభ్యాసం చేశారు.
డిగ్రీ చదువుతున్న సమయంలో ఎక్కువగా సాంస్కృతిక కార్యక్రమాల్లో, కబడ్డీ మైదానంలోనే కనిపించడం ద్వారా మొదటి సంవత్సరంలో పరీక్షలు తప్పాయి. దాంతో ఆయన తండ్రీ చీరాల కళాశాలలో చేర్పించారు. అక్కడ కూడా కాలేజి రాజకీయాల్లో ఎక్కువ సమయం కేటాయించడం వల్ల రెండవ సంవత్సరం కూడా పరీక్షలు తప్పారు రామానాయుడుగారు. కొన్నాళ్ల తరువాత రామానాయుడు పెళ్లి తన సొంత మామా కూతురయిన రాజేశ్వరితో వివాహం జరిగింది. తరువాత తండ్రి పంచిన ఆస్తిలో భాగంగా వందెకరాల పొలంతో సొంతంగా సేద్యం మొదలుపెట్టారు.
సినిమా జీవితం :
మొట్టమొదటిసారిగా రామానాయుడుగారు ‘‘నమ్మిన బంటు’’ చిత్రంలోని ఓ సీన్ నటించాడు. తను జన్మించిన కారంచేడు ప్రాంతంలోనే ‘‘నమ్మిన బంటు’’ సినిమా షూటింగ్ సందర్భంగా ఎడ్లపందెం దృశ్య చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆయన ఒక సీన్ లో నటించారు. ఎంతో హుషారుగా ఆ సీన్ లో నటించడం వల్ల అక్కడున్న సినిమావాళ్లంతా దృష్టి ఈయనపై పడింది. షూటింగ్ అయిపోయిన తరువాత రామానాయుడుగారు తిరిగి వెళ్తుండగా అక్కడే వున్న అక్కినేని.. ‘‘మీరు సినిమాలోకి ఎందుకు రాకూడదు?’’ అని ప్రశ్నిస్తే.. దానికి సమాధానంగా ఆయన.. ‘‘నాకు నా ఇల్లు, వ్యవసాయం తప్ప మరే ఆలోచన లేదు’’ అని చెప్పారు.
అలా తిరిగి వెళ్లిన ఆయన.. రైసు మిల్లు వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అయితే ఆర్థిక కారణాల వల్ల దానిని మూసివేయాల్సి వచ్చింది. తరువాత మహాబలిపురంలో నివాసం ఏర్పరుచుకుని, తన అల్లుడితో కలిసి నిత్యం ఆంధ్ర కల్చరల్ అసోసియేషన్ కు వెళ్లేవారు. అక్కడే ఆయన సినిమావాళ్లతో పరిచయాలు ఎక్కువయ్యాయి. కొందరు చిత్రనిర్మాతలు తమకు భాగస్వాములు కావాలని రామానాయుడుగారికి కబురు పంపగా.. అందుకు ఆయన ఒప్పుకున్నారు. ఇలా ఈ విధంగా రామానాయుడుగారు తన సినీజీవితాన్ని ప్రారంభించారు.
చిత్రపరిశ్రమలో అడుగుపెట్టిన తరువాత నిర్మించిన కొన్ని చిత్రాలు మంచి విజయాలనే సాధించాయి. కొన్ని సమయాల్లో అవి సవాలుగా మారాయి. కొన్ని సందర్భాల్లో అయితే రామానాయుడుగారు తన ఆస్తి, అంతస్తును అమ్మి మరీ సినిమాలను నిర్మించారు. ఇటువంటి పరిస్థితులు ఈయనగారి జీవితంలో కోకొల్లలున్నాయి. అందులో ముఖ్యంగా ‘‘రాముడు - భీముడు’’ చిత్రం ఆయనకు తొలి సవాల్ గా నిలిచింది. వరుస పరాజయాలతో సతమతమవుతున్న రామానాయుడిగారికి సహాయం చేయడం కోసం ఎవ్వరూ తోడుగా లేరు. అయినా బెదిరిపోకుండా తన దగ్గరున్న ఆస్తిని, ఇంటిని అమ్మేసి ‘‘రాముడు - భీముడు’’ సినిమాను పట్టాలెక్కించారు. ఆ సందర్భంలో ఆయన.. ‘‘ఈ సినిమా ఆడితే నేను మద్రాస్ లోనే వుంటాను. లేకపోతే తిరిగి మహాబలిపురానికి వెళ్లి వ్యవసాయం చేసుకుని బతుకుతాను’’ అని శపథం చేశారు. అటువంటి పట్టుదల, తన మీద తనకున్న నమ్మకం, ఆయన కార్యదక్షతకు చివరికి విజయాలు కూడా తలవంచక తప్పలేదు. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలో నిర్మించిన రాముడు - భీముడు సినిమా మంచి విజయాన్ని సాధించి, రాచబాట పట్టింది.
అలాగే ‘‘ప్రేమ్ నగర్’’ సినిమా తీసే సమయంలో కూడా ఆయన పరిస్థితి ఘోరంగా వుండేది. తన దగ్గర ఆస్తులు కూడా ఆ సమయంలో లేవు. స్నేమితులు, బంధుమిత్రులు ఎంద మందలించినా.. ఆయన చెక్కుచెదరకుండా ఇతరుల నుంచి డబ్బులను సర్దుబాటు చేసుకుని ‘‘ప్రేమ్ నగర్’’ సినిమాను అధిక బడ్జెట్ తో తెరకెక్కించారు. అలా మొండిధైర్యంతో ముందడుగు వేసిన ఆయన.. మళ్లీ వెనక్కు తిరగలేదు. ఆయన సినీప్రస్థానాన్ని మలుపు తిప్పడంలో ప్రేమ్ నగర్ ఒక సూపర్ హైలెట్ గా చెప్పుకోవచ్చు.
అవార్డులు - రివార్డులు :
మొదటిసారిగా తన సినీ జీవితాన్ని దక్షిణ భారతదేశంలో మొదలుపెట్టిన రామానాయుడిగారికి ‘‘జీవన తరంగాలు (1973)’’, ‘‘సోగ్గాడు (1975)’’ చిత్రాలకుగాను ఫిల్మ్ ఫేర్ తరఫు నుంచి ఉత్తమ చిత్ర పురస్కారాలను అందుకున్నారు. 2003వ సంవత్సరంలో ‘‘పద్మ భూషణ్’’ పురస్కారాన్ని అందుకున్నారు. వివిధ భాషల్లో కూడా సినిమాలను నిర్మించడంలో దిట్ట అయిన రామానాయుడుగారికి బెంగాలీ భాషలో నిర్మించిన ‘‘అసుఖ్’’ చిత్రానికి 1999వ సంవత్సరంలో ఉత్తమ జాతీయచిత్ర పురస్కారం లభించింది. 100కు పైగా చిత్రాలను నిర్మించడంతో ప్రపంచ రికార్డు సృష్టించిన ఈయనకు.. మన భారత ప్రభుత్వం 2010 సెప్టెంబర్ 9వ తేదీన రామానాయుడిగారికి గౌరవ పురస్కారమైన ‘‘దాదాసాహెబ్ ఫాల్కే’’ అవార్డును ప్రకటించింది.
నటుడిగా చిత్ర పరిశ్రమలో ఆరంగేట్రం చేసిన రామానాయుడుగారు ఎన్నో కష్టాలను, ఒడిదుడుకులను ఎదుర్కుంటూ.. ప్రముఖ నిర్మాతగా ఎదిగి, ప్రపంచ చరిత్రను తిరగరాసే విధంగా 100కు పైగా చిత్రాలను నిర్మించి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకున్న మూవీ మోఘల్ గారికి మా ‘‘తెలుగువిశేష్’’ అందిస్తోంది హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more