ఓ మూసలో సాగిపోతున్న తెలుగు సినిమాకు కొత్త దారి చూపించిన దార్శనికుడాయన. తెలుగు సంస్కృతీ సంప్రదాయాలకు కాపు కాస్తూ... క ళామతల్లి కంట కొత్త వెలుగును నింపిన ముద్దుబిడ్డ ఆయన! ఆయన సినిమా... అలసిన మనసుకు సేదదీర్చే చల్లని మలయ పవనం!
ఆయన సినిమా... తీయగా వీనులకు సోకే మంజీరనాదం!సిరిసిరిమువ్వలు మోగించినా... శంకరాభరణాన్ని శ్రావ్యంగా ఆలపించినా...సప్తపదికి అసలైన అర్థాన్ని వివరించినా... స్వర్ణకమలాన్ని ప్రేక్షకుల హృదయ కొలనుల్లో వికసింపజేసినా... అది ఆ కళారాధకుడి కృషికి ఫలితం! తెలుగు సంస్కృతి పట్ల ఆయనకున్న అపారమైన మమకారానికి సాక్ష్యం!సరదా కోసం మొదలైన సినిమా కళకు సందేశాన్నిచ్చేంత ఔన్నత్యాన్ని ఆపాదించిన ఆ కళాతపస్వి కె.విశ్వనాథ్.
నా జీవితంలో చాలా ఎత్తుపల్లాలున్నాయి... నేను చాలా కష్టాలు పడ్డాను...చిన్నప్పట్నుంచీ నాకు సినిమా అన్నా, నాటక కళ అన్నా ఎంతో ప్రీతి... అంటూ చెప్పిన ఆయన విశేషాలు.
నా పూర్తి పేరు కాశీనాథుని విశ్వనాథ బాబు. మాది గుంటూరు జిల్లా, పెద పులివర్రు. చక్కని క్రమశిక్షణ, ఆచార వ్యవహారాలు, నియమాలు కలిగిన కుటుంబం. ఇంట్లో నేనే మొదటివాడిని. నా తర్వాత ఇద్దరు చెల్లెళ్లు. నా ప్రాథమిక విద్య మా ఊరిలోనే పూర్తయ్యింది. తర్వాత నాన్న వృత్తిరీత్యా విజయవాడకు మారాం. పదో తరగతి వరకూ అక్కడే చదివాను. తర్వాత గుంటూరు హిందూ కాలేజ్‌లో ఇంటర్, ఏసీ కాలేజీలో బీఎస్సీ! నాకు తెలిసి ఈ మధ్యలో గుర్తు పెట్టుకోవాల్సినంత గొప్ప సంఘటనలేవీ జరగలేదు!
సంతకాలు పెట్టే ఉద్యోగం కావాలనుకున్నా!
నాన్న సుబ్రహ్మణ్యం వాహినీ పిక్చర్స్‌లో మేనేజర్‌గా ఉండేవారు. వాళ్లు కొత్త ఎక్విప్‌మెంట్‌తో స్టూడియో పెడుతున్నపుడు... మనవాడిని అందులో చేర్పిస్తే బాగుంటుంది కదా అని మా అంకుల్ మా నాన్నకు చెప్పారు. ఆయన అంగీకరించారు.నిజానికి నాకు హుందాగా ఫైళ్ల మీద సంతకాలు పెట్టే ఉద్యోగం చేయాలనుండేది.మేనేజర్‌గానో, మేనేజింగ్ డెరైక్టర్‌గానో ఉంటే ఆ దర్జాయే వేరు కదా! అలాగని నాన్న మాటకు ఎదురు చెప్పలేను. అయినా ఈ రోజుల్లోలా కాదు అప్పట్లో. పెద్దవాళ్లు ఏ నిర్ణయం తీసుకున్నా మా మంచి కోరే తీసుకుంటారని నమ్మేవాళ్లం మేము. అందుకే నాన్న వెళ్లమనగానే సరే అన్నాను. వెంటనే మద్రాసు రెలైక్కాను.మద్రాసులో... కొత్త వాతావరణంలో... కొత్త జీవితం మొదలయ్యింది! వాహినీ స్టూడియోస్‌లో రికార్డిస్టుగా ఉద్యోగం! బీఎన్ రెడ్డి, కేవీ రెడ్డి, దుక్కిపాటి మధుసూదనరావు, తాతినేని ప్రకాశరావు, ఆదుర్తి సుబ్బారావు, భానుమతి, ఆవిడ భర్త రామకృష్ణ... ఎంతోమంది ప్రముఖులతో పరిచయమయ్యింది అప్పుడే. సినిమాలు తీస్తున్న ప్పుడు టెక్నీషియన్‌స అందరూ వాళ్ల వాళ్లే ఉన్నా, రికార్డిస్టుని మాత్రం మా స్టూడియో వాళ్లే ఇచ్చేవారు. నేను రికార్డింగులో కూడా కాస్తంత క్రియేటివిటీ చూపించాలని ప్రయత్నించేవాడిని. నా తపనని మొదటిసారి గుర్తించింది ఏఎన్నార్!
అన్నపూర్ణ పిక్చర్స్ వారి సినిమాలకు నేను రికార్డిస్టుగా ఉండేవాడిని. ఆ సమయంలోనే నాకు క్రియేటివ్ సైడ్ ఆసక్తి ఉందని గుర్తించి, అన్నపూర్ణ సంస్థలోకి తీసుకున్నారు ఏఎన్నార్. అప్పటికి ఆదుర్తిగారు అన్నపూర్ణవారి సినిమాలకు దర్శకత్వం వహిస్తున్నారు. దాంతో ఆయన దగ్గర అసిస్టెంట్‌గా చేరాను. స్క్రిప్టు, మ్యూజిక్ వర్కులను కో-ఆర్డినేట్ చేస్తుండేవాడిని. కొన్ని సినిమాలకు సహాయ దర్శకుడిగా చేసిన తర్వాత... నా ప్రతిభను గుర్తించిన దుక్కిపాటి మధుసూదనరావుగారు ‘ఆత్మగౌరవం’ చిత్రానికి దర్శకత్వం చేసే అవకాశాన్నిచ్చారు. నన్ను పూర్తిస్థాయి దర్శకుడిని చేశారు. మొదటి సినిమానే మంచి పేరు తీసుకు రావడంతో అవకాశాలు బాగా వచ్చాయి. చెల్లెలి కాపురం, ఓ సీత కథ, కాలం మారింది, శారద, జీవనజ్యోతి... ఇలా నిరాటంకంగా సాగిపోయింది ప్రస్థానం!
అప్పుడే దారి మారింది!
ఓ దారిలో సాగిపోతున్న ఈ పయనాన్ని మరో దారికి మళ్లించింది ‘సిరిసిరిమువ్వ’! శాస్త్రీయ నృత్య ప్రధానంగా సాగిపోయిన ఆ సినిమా తీస్తున్నంతసేపూ సంగీత ప్రాధాన్యమైన సినిమా కూడా తీయాలన్న ఆలోచన మనసులో మెదులుతూనే ఉంది. అంతవరకూ సినిమాను సినిమాలాగానే తీసిన నేను, ఏదైనా సందేశాన్నిచ్చేలా సినిమాలు తీయాలన్న ధోరణిలో ఆలోచించడం మొదలుపెట్టాను. మన సంస్కృతీ సంప్రదాయాల గురించి, విలువల గురించి అందరికీ చెప్పడానికి సినిమా లాంటి మంచి మాధ్యమం ఉన్నప్పుడు, ఎస్కేపిస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ వైపు ఎందుకెళ్లాలి అన్న ఆలోచన నన్ను బలంగా పట్టి కుదిపేసింది. ఫలితమే శంకరాభరణం!‘సిరిసిరిమువ్వ’ సంచలన విజయంతో ‘శంకరాభరణం’ పట్ల నా బాధ్యత మరింత పెరిగింది. అందుకే ప్రతి విషయంలోనూ స్పష్టమైన ప్లానింగ్‌తో అడుగు వేశాను. ముఖ్యంగా నటీనటుల విషయంలో! ఏ రొమాంటిక్ హీరోనో, యాక్షన్ హీరోనో పెట్టి... అతడు సంగీతానికే అంకితమైపోయాడని ప్రేక్షకులని ఒప్పించడం చాలా కష్టం. కాబట్టి కొత్తవాళ్లను తీసుకోవడమే బెటరనుకున్నాను. చాలామంది పేర్లు పరిశీలనకు వచ్చాయి. కానీ ఎవరూ సూటవలేదు. చివరికి సోమయాజులు దొరికాడు.
ఆ తర్వాత సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం, సిరివెన్నెల, శృతిలయలు, స్వర్ణకమలం... ప్రతి సినిమా ఓ ప్రయోగమే. సప్తపదికయితే చాలా విమర్శలు ఎదుర్కోవలసి వచ్చింది. శంకరశాస్త్రిలాంటి స్వచ్ఛమైన బ్రాహ్మణుడిని చక్కగా ఎలివేట్ చేశారు. ఇప్పుడేమో వేరే కులాన్ని పెకైత్తి చూపించడం ఎంతవరకూ కరెక్టని కొందరడిగారు.విమర్శలు వెల్లువెత్తితేనేం... ‘సప్తపది’ ఓ అద్భుతమైన చిత్రంగా తెలుగు సినిమా చరిత్రలో స్థానం సంపాదించుకుంది. నర్గీస్ దత్ జాతీయ సమైక్యతా అవార్డును గెలుచుకుంది. విశ్వనాథ్ సినిమా అంటే ఇలాగే ఉంటుంది అనే ఇమేజ్ క్రియేట్ అయ్యింది.
సినిమాలేం చెడిపోలేదు!
‘శంకరాభరణం లాంటి సినిమాలు ఇప్పుడు రావడం లేదు, అసలు మంచి సినిమాలేం రావడం లేదు, సినిమా పరిస్థితి ఏమిటి?’ అని అడుగుతుంటారు కొంతమంది. ఇప్పటి సినిమాలు శంకరాభరణంలా ఉండకపోవచ్చు. అంతమాత్రాన తెలుగు సినిమా పాడైపోయిందని నేను అనను. ఇప్పటివాళ్లూ కష్టపడుతున్నారు. మంచి సినిమాలు తీస్తున్నారు. కాకపోతే ట్రెండ్ మారిపోయిందంతే. మా సినిమాలు అమ్మమ్మ పొయ్యిమీద వండి, రాతి చిప్పలో పులుసు పెట్టి, రోట్లో పచ్చడి చేసి, అరిటాకులో పెట్టే అన్నం లాంటివి. ఇప్పటి సినిమాలు ఫైవ్‌స్టార్ హోటల్లో భోజనం లాంటివి. ఎవరిష్టానికి వాళ్లు తింటారు. అందులో తప్పు లేదు కానీ అప్పటి రుచిని మర్చిపోవడం కాస్త బాధిస్తుందంతే. అయితే ఒకటి... నలభై కోట్లు పెట్టినవాడు డెబ్భై కోట్లు రావాలనుకుంటాడు. నలభై ఒక్క కోటి వస్తే చాలు అనుకునేవాళ్లు చాలా తక్కువ. అది తప్పేం కాదు. నిర్మాత నష్టపోకూడదు కదా! నా వరకూ నేను నిర్మాత డబ్బుకి ట్రస్టీనని ఫీలవుతాను. నా పంథాలో నేను సినిమాలు తీసినా, నిర్మాతకు ఏ నష్టమూ కలగకూడదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటాను.
మనకు అవార్డులు రావు!
నిజమే. మనకు అవార్డులు రావు. అలాగని మనం మంచి సినిమాలు తీయడం లేదని కాదు. ఏం, బాపుగారి ‘సాక్షి’ మంచి సినిమా కాదా! అలాంటి సినిమాలు ఇంకెన్ని తీయలేదు మనం! వాటికెందుకు అవార్డులు రావడం లేదు! మనకి మన సినిమాని మార్కెట్ చేసుకోవడం రాదు. ఇతర భాషా చిత్రాల విషయమే చూస్తే... విడుదలకు ముందు నుంచే వాళ్ల సినిమాలకు ఇంటర్నేషనల్ మీడియాలో రకరకాలుగా ప్రాచుర్యం కల్పిస్తారు. నిజంగానే ఆ సినిమాలో ఏదో గొప్పదనం ఉంది అనుకునేలా చేస్తారు. దాంతో జ్యూరీ సభ్యులకు ముందుగానే ఆ సినిమా మీద ఓ పాజిటివ్ అభిప్రాయం ఉంటుంది. ఇంక మనకెలా వస్తాయి అవార్డులు? అసలు మన సినిమాని మనమే మెచ్చుకోం ముందు. భమిడిపాటి కామేశ్వరరావుగారు అన్నట్టు... ఎదుటివాడు తెల్లచొక్కా వేసుకుంటే తట్టుకోలేక ఇంకు చల్లుతాడట మరో తెలుగువాడు. లోపం మనలో పెట్టుకుని అవార్డులు రాలేదని ఎవరినో అనుకోవడం ఎందుకు!
ఇప్పటికీ చాలామంది అడుగుతున్నారు... మీరెందుకు సినిమాలు చేయట్లేదని! అవకాశాల్లేక దర్శకత్వానికి దూరంగా లేను. బాక్సాఫీస్ ఫార్ములాలను అనుసరించి సినిమాలు చేయడం నా వల్ల కాదు. నా ట్రాక్‌లోంచి బయటికెళ్లి సినిమాలు తీయలేను. తీయను కూడా. అంతేకాదు, సినిమా చేస్తే మనసంతా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఊపిరి సలపదు. ఈ వయసులో కాస్త ప్రశాంతంగా గడపాలని కూడా ఉంది. అందుకే ఈ దూరం!
మంచి కథ... మధ్యలో ఆగిపోయింది!
పెరట్లో జాగ్రత్తగా పెంచిన కరివేపాకు చెట్టును కొట్టేస్తాం. ఇన్నాళ్లూ వీడికి కరివేపాకు ఇచ్చాను, నన్ను కొట్టేస్తాడా అని కుంగిపోయి అది చచ్చిపోదు. మళ్లీ చిగురిస్తుంది. పెంపుడు కుక్క సోఫా కొరికేసిందని నాలుగు దెబ్బలేస్తాం. ఇన్నాళ్లూ వీళ్లింటికి కాపలా కాశాను, ఇవాళ నన్ను కొడతాడా అని అది అలిగి బావిలో దూకి చచ్చిపోదు. మన వెంటే తిరుగుతుంది. కానీ మనిషలా కాదు. ప్రతి చిన్నదానికీ బాధ పడిపోతాడు. నిరాశతో ప్రాణాలు తీసుకోవాలనుకుంటాడు. ఆ బలహీనత గురించి రాసిందే ‘సర్వమంగళ’. టీవీ సీరియల్ కోసం నేను మొదటిసారి రాసిన కథ అది. నన్నో సీరియల్ డెరైక్ట్ చేయమని మూడు నెలలు తిరిగితే నేను ఒప్పుకోలేదు. పోనీ కథేమైనా ఇవ్వమంటే ఆ కథ రాసి ఇచ్చాను. చాలా అద్భుతమైన కథ! కానీ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. కొందరు ఫ్రెండ్‌స అ సబ్జెక్ట్‌నే మళ్లీ తీద్దామంటున్నారు. చూడాలి కుదురుతుందో లేదో!
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more