రాష్ట్రంలో 2024లో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకురావాలన్న యోచనలో జనసేన ఉన్నట్లు తెలుస్తోంది. జనసేన 9వ ఆవిర్భావ సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్ ఈ మేరకు సంకేతాలను కూడా ఇచ్చారు. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల చిత్రాన్ని కళ్ల ముందుంచారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనియబోమంటూ రాష్ట్రంలో పొత్తుల కూటమి ఎలా ఉండబోతుందో చెప్పకనే చెప్పింది. బీజేపీ, టీడీపీ, జనసేన లతోపాటు కలిసొచ్చే ఇతర శక్తులతో అధికార వైసీపీని ఢీకొట్టడానికి జనసేనాని సిద్ధమవుతున్నట్లు సంకేతాలు ఇచ్చారు.
పరస్పర విరుద్ధ అభిప్రాయాలు, విధానాలు గల పార్టీల మధ్య పొత్తు సాధ్యమా.? ఈ మేరకు జనసేన ఒకనాటి మిత్రులను మళ్లీ కలిపే ప్రయత్నం చేస్తుందా.? అది సాధ్యమేనా అనేది ప్రతిఒక్కరీ మదిలో మెదులుతున్న ప్రశ్న. 2019లో వైసీపీ 151 సీట్లలో గెలుపు విపక్షాల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేదే. ఆ నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేకత ఎంత ఉన్నా మహా అయితే వైసీపీ సీట్లు తగ్గవచ్చు గానీ 2024లోనూ వైసీపీ దే విజయం అని ఆ పార్టీ బలంగా విశ్వసిస్తున్నది. ఇటీవల పీఆర్సీ వ్యవహారమూ ఉద్యోగుల్లో కొంతవరకు అసహనానికి గురిచేసింది. ఇవి గాక ఓటీఎస్ అంశం, జీవో 36 లాంటి వాటిపైనా ప్రజలు వ్యతిరేకత చూపుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అనేది కొంత ఏర్పడింది.
2019 ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాలు గెలుచుకున్నా.. విపక్షాల లెక్కలు వేరేలా ఉన్నాయి. వైసీపీ ఆ ఎన్నికల్లో సాధించిన ఓటు షేర్ 49.95 శాతం, టీడీపీ 39.96 శాతం కాగా, జనసేన 5.54 శాతంగా ఉంది. ఒకవేళ 2024లో విడివిడిగా ఎన్నికలకు వెళితే మళ్లీ 2019 ఫలితాలు పునరావృతం కాకుండా.. టీడీపీని కలుపుకు వెళ్లాలని జనసేనాని సంకేతాలు ఇచ్చారు. ఇటు టీడీపీ కూడా జనసేనతో కలిసి జోడీ కట్టడానికి టీడీపీ సిద్ధంగానే ఉందని.. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వన్ సైడ్ లవ్ వ్యాఖ్యలు స్పష్టంచేస్తున్నాయి. భీమ్లా నాయక్ సినిమా విడుదల వ్యవహారంలోనూ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా జనసేన నేతలకంటే టీడీపీనే ఎక్కువగా స్పందించింది. మరోవైపు బీజేపీ కూడా జనసేనతో పొత్తు కొనసాగిస్తున్నది.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లాంటి అంశాలపై పవన్ కళ్యాణ్ బీజేపీతో కొంత అసహనంతో ఉన్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టీడీపీతో పొత్తుపై బీజేపీ సుముఖంగా ఉన్నట్టు ఇంతవరకూ కనపడలేదు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడం, మరోవైపు సీఎం జగన్ ముందస్తుకు వెళ్లినా ఆశ్చర్యం ఏమీ ఉండబోదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీని గద్దె దింపడం అనే అజెండాగా అన్ని పార్టీలూ ఏకం కావాలన్న భావన పవన్ కళ్యాణ్ ప్రకటనతో వెలువడింది అని అంటున్నారు. అయితే ఇలా అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడటం కొత్తమే కాదు. ఇక ఇలా ఏర్పడిన అన్ని సమయంలో ప్రజాతీర్పు అనుకూలంగా ఉంటుందని కూడా చెప్పలేం.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2004 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమిగా కాంగ్రెస్ సహా మిగతా పార్టీలన్నీ ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో అనుకున్నట్టుగానే అధికార టీడీపీని గద్దె దించగలిగినా కాంగ్రెస్ కూటమిలోని పార్టీలు ఎక్కువ కాలం కలిసి కొనసాగలేకపోయాయి. 2009 వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది. అప్పటి అధికార కాంగ్రెస్ ను ఓడించడానికి కనీస ఉమ్మడి ప్రణాళిక ఏదీ లేకుండానే టీడీపీ, టీఆర్ఎస్ సహా ఇతర పార్టీలన్నీ కలిసి పొత్తు పెట్టుకున్నా ప్రజలు వారిని ఆదరించలేదు. పైగా అప్పుడే కొత్తగా ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీ వారి అవకాశాలను గండికొట్టిందని గణాంకాలు చెబుతున్నాయి.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తర్వాత 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ పొత్తుపెట్టుకుని పోటీ చేశాయి. అప్పుడే జనసేన స్వయంగా పోటీ చేయకపోయినా టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు పలికింది. ఆ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ, బీజేపీ కూటమి కూడా ఎక్కువకాలం సంకీర్ణంలో కొనసాగలేకపోయింది. 2019 ఎన్నికల్లో జనసేన, టీడీపీ విడివిడిగానే పోటీ చేసినా వాటి మధ్య లోపాయికారీ ఒప్పందం నడిచింది అన్న విమర్శలు ఉన్నాయి. తాజాగా 2024 ఎన్నికల కోసం పార్టీల మధ్య పొత్తులకు బీజం పడబోతోంది అన్న అభిప్రాయం పవన్ కళ్యాణ్ ప్రసంగంతో రాజకీయ విశ్లేషకుల మధ్య ఏర్పడింది.
ప్రస్తుతం రాష్ట్రంలో విపక్షాల మధ్య విచిత్రమైన పరిస్థితి ఉంది. ప్రభుత్వం - విపక్షాల మధ్య కంటే, విపక్షం టు విపక్షం మధ్యే ఎక్కువ వైరం కనపడుతోంది. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు టీడీపీ అంటేనే భగ్గుమంటున్నారు. పైగా 2014 లో బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు అర్థాంతరంగా ముగిసిపోయింది. అయితే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు.. శాశ్వత శత్రువులు ఉండరు అన్న విషయం కూడా తెలిసిందే. దీంతో ఎన్నికల సమయానికి ఈ మూడు పార్టీలు గత 2014 తరహాలో మళ్లీకలసి ప్రజాతీర్పును కోరే అవకాశాలు లేకపోతేదు. ఇక ఆ దిశగా అడుగులు వేస్తున్న జనసేన ఉమ్మడి ఎజెండాను కూడా రూపోందించాలని.. జగన్ ముందస్తుకు వెళ్లినా.. ఎదుర్కోనేలా సిద్దంగా వుండాలన్న యోచలో వున్నట్లు తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more
May 19 | సీనియర్ కమేడియన్ అలీ అధికార వైసీపీ పార్టీకి రాజీనామా చేయనున్నారా.? అంటే ఔనన్న సమాధానాలే వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అధికార వైసీపీ పార్టీలో సినీమారంగం నుంచి ఆశించినంత స్థాయిలో మద్దతు లేదు. జగన్ సర్కార్ అధికారంలోకి... Read more
May 18 | గుజరాత్ కాంగ్రేస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పటీదార్ ఉద్యమ నేత హర్థిక్ పటేల్.. సరిగ్గా ఎన్నికలకు ముందు తన మనసు మార్చుకున్నారు. 24 గంటల ముందు తమ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో చర్చించిన తరువాత... Read more
Mar 18 | కాంగ్రెస్ పార్టీకి కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొనే కోమటిరెడ్డి బ్రదర్స్.. కాషాయ బాట పట్టనున్నారా?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొన్న తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నేత వివేక్ వెంకటస్వామితో భేటీ... Read more
Mar 18 | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని మరింత ఆందోళనకు గురి చేశాయి. మరీ ముఖ్యంగా పంజాబ్‌లో అధికారాన్ని తిరిగి అందుకుంటామన్న అంచనాలు నెలకొనగా, తాజా పలితాలతో అక్కడి కూడా పరిస్థితి అద్వానంగా... Read more