గులాబీ చంద్రుడు అసలేం చేశాడు | KCR two years ruling in telangana

Kcr two years ruling in telangana

telanagana, CM kcr, two years ruling, తెలంగాణ, రెండేళ్ల పాలన, విశ్లేషణ, latest news, telanagana news, telugu news

telanagana CM kcr two years ruling analysis.

గులాబీ చంద్రుడు అసలేం చేశాడు

Posted: 06/02/2016 12:11 PM IST
Kcr two years ruling in telangana

రెండేళ్ల క్రితం అధికారం చేపట్టిన సమయంలో ఒక్కడు.. బక్కోడు, పైగా రాజకీయ అనుభవం లేనివాడు, మంత్రివర్గం అలాంటిదే, ఏం చేస్తాడులే అంటూ పలుప్రశ్నలతో పెదవి విరిచిన వారే ఇప్పుడు నోట మాట రాక మూగబోయారు. తెలంగాణ అనే సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన ఆయన దాన్నే కంటిన్యూ చేస్తూ ఓవైపు ప్రజల్లో సానుభూతితో పాటు, మరోవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలోకి తీసుకెళ్తున్నారు. వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో అఖండ విజయాలే ఆయన పట్ల ప్రజలకున్న విశ్వసనీయతను రెట్టింపు చేసినట్లు తెలియజేస్తున్నాయి. రెండేళ్ల కాలం అంటే దాదాపు 40 శాతం ముగిసిన కాలంలో ఆయన ప్రభుత్వం సాధించిన విజయాలు, సాధించాల్సినవి లెక్కలేసుకుంటే...

తెలంగాణ రాష్ట్రంలో అతి ముఖ్యమైన సమస్యలు నీరు, విద్యుత్‌. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విడిపోతే రెండు రాష్ట్రాల మధ్య వీటిపై ఖచ్ఛితంగా గొడవలు జరుగుతాయని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వాదనకు దిగాడు. తొలి ఏడాది తెలంగాణ విద్యుత్‌ రంగంలో తీవ్రమైన సమస్యల్నే ఎదుర్కొంది. కానీ, రెండో ఏడాదికి ఆ సమస్య చాలావరకు మాయమైపోయిందనే చెప్పాలి. తెలంగాణ వ్యాప్తంగా విద్యుత్‌ కొరతకు పెద్దగా ఆస్కారం లేకుండా చేయగలిగారు. ప్రధానంగా హైద్రాబాద్‌లో, ఎక్కడా ఈ ఏడాది విద్యుత్‌ కోతలు కన్పించలేదు. అదే హైద్రాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ని పెంచిందన్నది నిర్వివాదాంశం. రాష్ట్రానికి మిగులు బడ్జెట్ కూడా మిగిల్చిన ఘనత ఆయన సొంతం.

గడచిన రెండేళ్ళలో తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ భగీరధ అనీ, మిషన్‌ కాకతీయ అనీ రెండు అత్యంత ప్రతిష్టాత్మకంగా పలు పథకాల్ని చేపట్టింది. వీటిద్వారా నగరానికి తాగునీటి సమస్యను తీర్చటంతోపాటు,  ప్రాజెక్టుల వ్యవహారం ఓ కొలిక్కి తెచ్చేందుకు ఆస్కారం ఏర్పడింది. తెలంగాణ ప్రధాన నీటి వనరు అయిన చెరువులపై దృష్టిసారించడం ద్వారా రైతుల్లో ఓ ముద్ర వేశారు. అయితే ఆయా పథకాల్లో  కొన్ని లోటుపాట్లు ఉన్నాయన్న సంగతి పక్కనబెడితే కేసీఆర్‌ మాత్రం తన ఇమేజ్‌ని రోజురోజుకీ పెంచుకోగలుగుతున్నారనీ, ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెంచగలుగుతున్నారనీ ఖచ్చితంగా చెప్పేయొచ్చు. ఇటీవల తెలంగాణలో జరిగిన పలు ఎన్నికలే నిదర్శనం. మరీ ముఖ్యంగా గ్రేటర్‌ హైద్రాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ సంచలన విషయం.. కేసీఆర్‌ ఇమేజ్‌ని పీక్స్‌కి తీసుకెళ్ళిందనే చెప్పాలి.  గత ఎన్నికల్లో గ్రేటర్‌లో పోటీ చేయడానికి కూడా సాహసించని తెలంగాణ రాష్ట్ర సమితి ఈ ఎన్నికల్లో దాదాపు వంద సీట్లు గెలుచుకుని రికార్డు సృష్టించింది. సాధారణంగా అధికారంలోకి వచ్చిన పార్టీ రోజులు గడిచేకొద్దీ ప్రజాదరణ కోల్పోతూ ఉంటుంది. ఈ విషయంలో టీఆర్‌ఎస్‌ పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ఇందుకు కర్త, కర్మ, క్రియ అన్నీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాత్రమే!
    
 
రెండేళ్లు అసలేం చేశారు...
రాజకీయపరమైన వ్యూహ రచన చేయడంతో పాటు పాలనాపరమైన అంశాలలో కూడా తనదైన ముద్ర వేయడానికి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. గత ముఖ్యమంత్రుల వలె రొటీన్‌గా ఆలోచించకుండా తెలంగాణ ప్రజలు ఏమి కోరుకుంటున్నారు? ఏమి చేస్తే ప్రజల మనస్సు దోచుకోవచ్చు? అన్న దానిపై దృష్టిపెట్టి పథకాలకు రూపకల్పన చేశారు. ఫలితమే మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, ప్రాజెక్టుల రీ డిజైనింగ్‌ వంటి పథకాలు పురుడు పోసుకున్నాయి. తెలంగాణ ప్రజలకు కావలసింది సాగు, తాగు నీరు అన్నది గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ బడ్జెట్‌లో సింహభాగం ఈ రెండు పథకాలకే కేటాయించారు. దాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో ఈ రెండు పథకాలకు శ్రీకారం చుట్టారు. శాసనసభలో ప్రకటించినట్టుగా సాగునీటి ప్రాజెక్టులకు ఏటా 25 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయగలిగితే తెలంగాణలోని బీడు భూములన్నీ సస్యశ్యామలం అవుతాయి. మిషన్‌ భగీరథపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎక్కువగా ఆశలు పెట్టుకున్నప్పటికీ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి అయ్యి బీడు భూములకు నీరు అందినప్పుడే ఆయనకు రాజకీయ ఫలాలు అందుతాయి. గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చిన హామీలలో చాలా వరకు నెరవేర్చినప్పటికీ ప్రధానమైనవి ఇంకా ఉన్నాయి.

ఇందులో ప్రధానమైనవి పేదలకు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు. దళితులకు కుటుంబానికి మూడు ఎకరాల భూమి. ముస్లింలకు రిజర్వేషన్‌లు వంటివి ఉన్నాయి. వాస్తవానికి ఈ మూడు హామీలను అమలు చేయడం చాలా కష్టంతో కూడుకుంది.

డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కోసం పేద ప్రజలు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. లక్షల సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌కు జరిగిన ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి జయకేతనం ఎగురవేయడానికి ప్రధాన కారణం బస్తీలలో నివసించే పేదలు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు వస్తాయన్న నమ్మకంతోనే అధికార పార్టీకి మద్దతు ఇచ్చారు. ఇళ్లపై ఆశతో కాంగ్రెస్‌ పార్టీకి అండగా ఉంటూ వస్తున్న బస్తీలన్నీ టీఆర్‌ఎస్‌ వైపు మళ్లాయి. ఇక రెండవదైన దళితులకు కుటుంబానికి మూడు ఎకరాల వంతున భూ పంపిణీ. ఈ పథకం కూడా ఇంత వరకు పూర్తిస్థాయిలో ఆచరణకు నోచుకోలేదు. ప్రైవేటు భూములు కొని అయినా పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది కనుక, ఈ పథకం పూర్తి స్థాయిలో అమలు కావాలంటే దీనికీ వేల కోట్ల రూపాయల నిధులు అవసరమవుతాయి. మూడవది ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్‌ కల్పించడం. ఈ వాగ్దానం అమలుకు కట్టుబడి ఉన్నామని కేసీఆర్‌ చెబుతున్నారు గానీ ఆచరణలో అసాధ్యంగా కనిపిస్తున్నది. మొత్తం రిజర్వేషన్‌లు 50 శాతం దాటకూడదన్న సుప్రీంకోర్టు తీర్పు అమలులో ఉన్నందున 50 శాతానికి మించి రిజర్వేషన్లు కల్పించాలంటే పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ అవసరం. రిజర్వేషన్ల పెంపుదల కోసం వివిధ వర్గాల నుంచి దేశవ్యాప్తంగా చాలా కాలంగా డిమాండ్‌లు వస్తున్నాయి.
         
ఈ మూడు అంశాలపై ప్రభుత్వాన్ని ఇప్పటికిప్పుడు నిలదీయడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఎన్నికలకు ఇంకా మూడేళ్ల వ్యవధి ఉంది కనుక అప్పటికి పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. కానీ, ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ డిస్టింక్షన్‌లో పాస్‌ అయ్యారనే చెప్పవలసి ఉంటుంది. రెండేళ్ల క్రితం అత్తెసరు మార్కులతో అధికారంలోకి వచ్చిన ఇప్పుడు తెలంగాణలో తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగారు.

మూడో ఏడాదిలోకి అడుగు పెడ్తున్న తెలంగాణలో, జిల్లాల విభజన మరో ఆసక్తికరమైన అంశం కానుంది. తెలంగాణ ఉద్యమకాలంలోనే కొత్త జిల్లాల అంశాన్ని 'ఎజెండా'గా చూపించారు కేసీఆర్‌. దాన్నిప్పుడు నిజం చేయబోతున్నారు. అన్నిటికీ మించి, తెలంగాణతోపాటు 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌ కూడా ఇదే రోజు వేడుకలు చేసుకోవాల్సి వున్నా, ప్రత్యేక పరిస్థితులు.. విభజన కారణంగా నష్టపోయిన వైనం.. వెరసి అక్కడ సంబరాలు చేసుకునే వీలు లేదు. అది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కి బాగా కలిసొచ్చింది. నవనిర్మాణ పేరిట ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరసన తరహా కార్యక్రమాలకు పిలుపునిస్తే, కేసీఆర్‌ మాత్రం.. తెలంగాణ అంతటా వెలుగులు నింపేస్తున్నారు. తద్వారా తెలంగాణ సమాజంలో ఆనందోత్సాహాల్ని నింపుతూ ముందుకు తీసుకెళ్తున్నారు.


భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telanagana  CM kcr  two years ruling  telugu news  

Other Articles