State progress is down by power holidays

Telangana government, industries, small scale industries, winding up, no employment, under employment, power holidays

state progress is down by power holidays

పరిశ్రమలకు విద్యుత్ కట్.. రాష్ట్ర ప్రగతి కోత

Posted: 10/08/2014 07:13 PM IST
State progress is down by power holidays

తెలంగాణా రాష్ట్రంలోని పరిశ్రమలకు మరింత గడ్డుకాలం దాపురించింది. ఇవాళ్టి నుంచి పరిశ్రమలకు వారంలో రెండురోజలుపాటు పవర్‌హాలిడే ప్రకటిస్తుండడంతో ఇటు పారిశ్రామిక వేత్తలు, అటు కార్మికులు నడిరోడ్డున పడుతున్నారు. ఏ దేశ ప్రగతి చూసినా.. అటు వ్యవసాయంతో పాటు ఇటు పరిశ్రమిక రంగం పురగతిపైనే వృద్ది రేటు అధారపడి వుంటుంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఆ రెండు రంగాలు గడ్డుకాలన్ని ఎదుర్కొంటున్నాయి. చేతికందాల్సని పంట అందకపోవడంతో అటు రైతన్నలు బలవన్మరణాలకు పాల్పడుండగా, ఇటు పవర్ హాలిడే ప్రకటనలతో కార్మికులకు డొక్కలు ఎండుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో స్వయం పాలన కోరుకున్న తెలంగాణ వాసులకు రాష్ట్రం సాకరమైందన్న ఆనందం నాలుగు నెలలు కూడా తిరగకుండానే హరించుకుపోతోంది. పది మందికి అన్నం పెట్టే రైతన్న ముంగిళ్లలో చావు డప్పలు వినబడుతన్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థమవుంతోంది. రైతన్నలే అన్నమో రామచంద్రా అంటూ అల్లల్లాడాల్సిన పరిస్థితులు ఉత్పనమవుతున్నాయి. నాలుగు నెలల స్వయం పాలనలోనే రైతన్నలు క్రిమి సంహారక మందులను తీసుకుని మృత్యువును కౌగలించుకుంటున్నారు.

రైతాంగాన్ని కాపాడుకునే పనిలో భాగంగా పరిశ్రమలకు వారానికి రెండు రోజులు పవర్ హాలిడే ప్రకటించడంతో ఇక ఇప్పడు కార్మికులు, పారిశ్రామిక వేత్తలలో ఆందోళన మొదలైంది. వారం రోజులు కష్టపడినా.. రెక్కడితే కాని డోక్కాడని బతుకుల్లో ప్రభుత్వ ప్రకటన పిడుగు పడ్డట్లైంది. చాలీచాలని జీతాలతో బతుకులు ఈడుస్తున్న తమను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే అకలి, అకలి అంటూ అంగరాల్చే విధంగా చేస్తోందని ఆరోపిస్తున్నారు. తమ జీవితాలలో వెలుగులు నిండుతాయని భ్రమిస్తే.. జీవితాలే లేకుండా చేస్తుందని ఆరోపిస్తున్నారు.

తమ కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తమపై వుందని అందుకోసం రోజు రెండు గంటల పాటు ఎక్కువ కష్టపడతామని చెబుతున్నా యాజమాన్యాలు అంగీకరించడం లేదు. మిగిలిన షిఫ్టుల్లో వుండే కార్మికుల కడుపు ఎలా కొట్టమంటారని యాజమాన్యాలు కార్మికులను ప్రశ్నిస్తున్నాయి. అసలే అంతంత మాత్రంగా వున్న పారిశ్రామిక ప్రగతి పవర్ హాలిడేలతో హరించుకుపోతోందని పలు యాజమాన్యాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో విద్యుత్ సంక్షోభం ఏర్పడుతుందన్న అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై టీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అందుబాటులో వున్న రాష్ట్రాల నుంచి విద్యుత్ కోనుగోలు చేస్తామని ప్రకటనలు గుప్పించారు. అధికారం చేపట్టి నాలుగు మాసాలు అవుతున్నా.. ఏ రాష్ట్రం నుంచి విద్యుత్ కొనుగోలు చేయడంలో ఎందుకు విఫలమయ్యరన్న విమర్శలు వినిబడుతున్నాయి. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యపై ముఖ్యమంత్రి కెసిఆర్‌ పలుమార్లు సమీక్షలు నిర్వహించారు. పంట చేతికొచ్చే సమయంలో విద్యుత్‌ కోతల వల్ల పొలాలకు నీరు అందక ఎండిపోతుండటంపై రైతులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న తరుణంలో వ్యవసాయానికి ప్రాథాన్యత ఇవ్వాలని భావిస్తున్నారు. అందుకనే పరిశ్రమలకు పవర్ హాలిడేలు ప్రకటిస్తున్నారు.

ఇప్పటికే ప్రతిరోజు పవర్‌ ఎక్సేంజ్‌ ద్వారా ప్రభుత్వం అదనంగా 14 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను యూనిట్‌ రూ.8.50 పైసలు చొప్పున కొనుగోలు చేస్తోంది. అయినప్పటికీ డిమాండ్‌-సప్లరు మధ్య దాదాపు 25 మి.యూ., కొరత ఏర్పడుతోంది. దీంతో రైతుల్ని ఆదుకోవడం కోసం తప్పని పరిస్థితుల్లో ప్రభుత్వం పరిశ్రమలకు విద్యుత్‌ కోతల్ని పెంచాల్సి వస్తోందని అధికారులు చెప్తున్నారు. అదే సమయంలో ఇప్పటికే ముక్కుతూ, మూలుగుతూ నడుస్తున్న పరిశ్రమలకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పారిశ్రామికవేత్తలు మరింత కుంగిపోతున్నారు. రెండు రోజులు పవర్‌ హాలిడే ప్రకటించిన ప్రభుత్వం మిగిలిన ఐదురోజుల్లో కూడా పీక్‌ అవర్‌ నిబంధనలు, షరతులు, జరిమానాలు విధిస్తోంది. ఈ మొత్తం నెలవారీ బిల్లులకు నాలుగింతలుగా వస్తున్నాయని పారిశ్రామికవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. విద్యుత్‌ లేకపోవడంతో ఆర్డర్లు తీసుకోవడానికి సైతం పరిశ్రమల యజమానులు వెనకాడుతున్నారు.

ఇక మరికొన్ని యాజమాన్యాలు కార్మికుల సంఖ్యను కుదిస్తున్నాయి. కొత్తగా ఎలాంటి ఉపాధి అవకాశాలు అవకాశమే లేవంటున్నాయ. దీంతో కార్మికుల కుటుంబాలు వీధిపాలవుతున్నాయి. ఎక్కడా పనిదొరక్క ఆర్ధాకలితో అలమటిస్తున్నారు. స్కూల్‌ ఫీజులు కట్టలేక పిల్లల్ని చదువులు మాన్పిస్తున్నారు. ఇప్పటికే విద్యుత్‌ కోతల కారణంగా పలు పరిశ్రమలు మూతపడ్డాయి. మరికొన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయాయి. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానులు బ్యాంకు రుణాలు చెల్లించలేకపోవడంతో నిరర్ధక ఆస్తుల (ఎన్‌పిఏ) జాబితాల్లో చేరుతున్నారు.

దీనివల్ల పారిశ్రామిక వేత్తల భవిష్యత్‌ నాశనమౌతోందని పారిశ్రామిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రైతుల తరహాలోనే ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ సెక్టార్‌కు రుణమాఫీని ప్రకటించాలంటూ పారిశ్రామిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఉన్న పరిశ్రమలకే విద్యుత్‌ ఇవ్వలేక సతమతమౌతున్న సర్కార్‌ కొత్తగా పారిశ్రామిక విధానం ప్రకటించేందుకు ఉత్సాహపడుతుండటాన్ని తప్పుపడుతున్నారు. ఉన్న పరిశ్రమలే విద్యుత్‌ కోతలతో సతమతమౌతుంటే, కొత్త పరిశ్రమలకు ఎక్కడి నుంచి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి పరిస్థితిని వివరించి.. విద్యుత్ ను అదనంటా కేటాయించుకునేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ఒప్పందంలో తెలంగాణ 51.12 శాతం, ఆంధ్రప్రదేశ్‌ 47.88 శాతం కరెంట్‌ వినియోగించుకోవాలని పేర్కొంది. దీన్ని ఆసరా చేసుకుని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరమ్మతుల పేరుతో కొన్ని కేంద్రాలలో విద్యుత్‌ను నిలిపివేసి విద్యుత్‌ సమస్యను మరింత జఠిలం చేసిందని కేంద్రానికి వివరించాలని కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 4వేల మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అనుమతి ఇస్తామని చెప్పినా రాష్ట్ర ప్రభుత్వం స్థల సేకరణ చేపట్టకపోవడం విచారకరం. నేదునూరు, శంకర్‌పల్లి, భూపాలపల్లి ప్రాంతాల్లో ఇప్పటికైనా విద్యుత్‌ ఉత్పత్తికి పూనుకుంటే రెండేళ్లలో విద్యుత్‌ వినియోగంలోకి వస్తుందంటున్నాయి ప్రతిపక్షాలు.  రైతుల నిరసనలతో ప్రభుత్వం దిగివచ్చిందనుకుంటే.. మరి కార్మికుల ఆందోళన చేస్తే ఏం చేస్తుందనేది శేష ప్రశ్నగా మారింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles