Shameful act in parliament

Shameful act in parliament, Lagadapati pepper spray, Modugula Venugopal Reddy, Telangana bill, T Bill Parliament property

Shameful act in parliament, Lagadapati pepper spray

ప్రజాస్వామ్యంలో ఓడిపోయిన వోటరు!

Posted: 02/14/2014 10:33 AM IST
Shameful act in parliament

ఎదుటబడి చంపిన అర్జునుడే కాదు, కర్ణుడి చావుకి చాలామంది కారకులన్నట్లు వార్తలలోకి ఎక్కిన ఎంపీ లగడపాటి రాజగోపాల్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాత్రమే కాదు తెలుగువాడి ఆత్మగౌరవం ఢిల్లీ వీధుల్లో మంటగలవటానికి వెనుక చాలామంది హస్తాలున్నాయి.  కానీ వాదమొక్కటే.  అది రాజకీయ లబ్ధి కోసం చేసే అవకాశవాదం.

ఇటు తెలంగాణా ప్రజలను అటు సీమాంధ్ర ప్రజలను తమ రాజకీయ లబ్ధికోసం రెచ్చగొట్టిన రాజకీయ నాయకులు, కాంగ్రెస్ మొండి వైఖరి, ప్రతిపక్షాల కప్పదాటు విధానం మొదలైనవి తెలుగువాళ్ళని ప్రాంతీయంగా నిలువుగా చీల్చివేయటమే కాకుండా యావద్భారతావనిలో తెలుగువాళ్ళని అపహాస్యం చేసాయి.  దానితో పాటు భారతదేశాన్ని ప్రపంచ దేశాల ముందు తలదించుకునేట్టుగా చేసాయి. 

పైకి చూడటానికి లగడపాటి రాజగోపాల్ మిరియాల పొడి గాలిలో చల్లటం మాత్రమే కనపడుతోంది కానీ నిన్నటి రోజున పార్లమెంటులో అందరినీ దిగ్భ్రాంతులను చేసిన సన్నివేశం వెనుక వివిధ పార్టీల రాజకీయ చతురత కనిపిస్తుంది.  రాష్ట్ర విభజన జరగకపోతే మనుగడే లేదన్నట్లుగా ఎంత రభస జరుగుతున్నా పట్టించుకోకుండా మొండి వైఖరితో ముందుకెళ్ళి పార్లమెంటులో మేమైతే బిల్లు ప్రవేశపెట్టాం అని చెప్పుకోవటాని చేసినట్లుగా ఏం జరుగుతోందో సభలోని సభ్యులకు తెలియకముందే అయిపోయిందయిపోయింది బిల్లు ప్రవేశపెట్టేసాం అది ఇక పార్లమెంట్ ప్రాపర్టీ అన్నారు హోం మంత్రి షిండే, పార్లమెంటు వ్యవహారాల మంత్రి కమలనాధ్. 

ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు పార్లమెంటు సభలో ఉన్నప్పుడు రాష్ట్రంలోని నాయకులు పార్లమెంటు దగ్గర కలకలం రేపటం, ప్రజాప్రతినిధులని చూడకుండా విచక్షణా రహితంగా పోలీసుల చేత మెడలు పట్టి గెంటించుకోవటం అవసరమా.  ఇది తెలుగువాళ్ళందరికీ అవమానం కాలేదా.  ఈ లోపులో బాహాబాహీకి దిగిన తెలుగు ఎంపీలు పార్లమెంటుని రణభూమిగా మార్చారు.

టివిలలో ఏదీ పూర్తిగా చూపించలేదు, స్పష్టంగా చూపించలేదు, కానీ ఎవరిష్టమొచ్చిన సాక్ష్యం వాళ్ళు చెప్పారు.  కత్తి గ్యాస్ లాంటి మారణాయుధాలను పార్లమెంటులోకి తీసుకునివ్చారంటూ కమలనాధ్ మీడియా ప్రతినిధుల ముందు వాపోయారు.  తీరా చూస్తే విరగ్గొట్టిన మైకు కత్తిగా అభివర్ణించటమే కాకుండా దానితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకోబోయారని, గుండెపోటు వచ్చిన కొనకళ్ళ నారాయణ మూర్తి విషం తాగి చనిపోయారని వార్తలు బయటకు వచ్చాయి. 

ఈ గందరగోళానికంతటికీ కారణం కాంగ్రెస్ పార్టీ అంటూ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షం భాజపా, రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం తెదేపాలు విమర్శలు గుప్పించాయి.  ప్రతి అంశాన్నీ రాజకీయ లబ్ధి కోసమే మలుచుకునే నాయకులు ఒకరినొకరు నిందించుకుంటున్నారు.  అయితే అందరూ కూడా సమానంగా అంగీకరించేది ఒకటే- ఇన్ని సంవత్సరాలుగా పార్లమెంటులో గతంలో ఎప్పుడూ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోలేదు, ఇది ప్రజాస్వామ్యానికి జరిగిన ఖూనీ అని.  ఈ ఒక్కదానిలోనే ఏకాభిప్రాయం ఉంది అందరికీ.  

కానీ జరుగుతున్న సంక్షోభానికంతటికీ కారణం నేనే అని గుండె మీద చెయి వేసుకుని చెప్పగలిగేవారెవరైనా ఉంటే అది వోటరే.  ఇలాంటి నాయకులను ఎన్నుకున్నది నేనే కదా అంటూ విలవిలలాడవలసింది వోటరే.

అయితే ఈ అనుభవంతో నేర్చుకున్న పాఠాలు వచ్చే ఎన్నికలలో వోటర్ కి ఉపయోగపడతాయా అన్నది వేచి చూడవలసిందే!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles