Bus accidents increasing due to overspeed

Bus accidents increasing due to overspeed, Volvo bus, APSRTC Garuda bus, Jabbar Travels Bus accident, Bus hits divider catches fire

Bus accidents increasing due to overspeed

అతివేగంతో ఎక్కువౌతున్న బస్సు ప్రమాదాలు

Posted: 01/31/2014 09:20 AM IST
Bus accidents increasing due to overspeed

బస్సులలో అభివృద్ది చెందిన సాంకేతికతే బస్సు ప్రమాదాలకు దోహదం చేస్తున్నాయా అనిపిస్తోంది.  పవర్ స్టీరింగ్, ఆటో గేర్ ల వలన బస్సు డ్రైవింగ్ చాలా సునాయాసమైపోయింది.  దానితో ఎక్కువగా దృష్టి దాని మీద పెట్టకుండా తేలిగ్గా నడుపుతూ పోతుండటంతో అదాటున ఏదైనా ఎదురౌతే బస్సు నియంత్రణ తప్పుతుంది.  కుదుపులు లేకుండా పోతుండటం వలన ఎంత వేగంగా పోతున్నది ఒక్కోసారి డ్రైవర్ గమనించకపోవచ్చు.  

ఇవన్నీరాత్రి పూట దూరప్రయాణాలలో నడిచే బస్సులలో మరీ ఎక్కుగా ప్రమాదాలకు గురిచేస్తున్నాయి.  డ్రైవర్ ఎంత అనుభవశాలైనా రాత్రి పూట కునుకు పట్టే వేళ అతి వేగం, మగతను తప్పించుకోవటం కోసం టీ తాగటం సరిపోదు కాబట్టి పక్కవాళ్ళతో బాతాఖానీలో లేకపోతే సంగీతం వింటూనే బస్సు నడుపుతుండటమో చేస్తుంటారు.

వీటన్నిటికీ తోడు షార్ట్ సర్క్యూట్ లు, డీజిల్ ట్యాంక్ పగిలిపోవటం లాంటివి ప్రయాణీకులకు ప్రాణాంతకమౌతున్నాయి.  నిన్న రాత్రి బెంగళూరు నుంచి విజయవాడ వెళ్తున్న గరుడ బస్ గుంటూరు జిల్లాలో చిలకలూరిపేట సమీపంలో తాతపూడి చేరుకున్నప్పుడు రోడ్ డివైడర్ ని ఢీకొంది.  ఆయిల్ ట్యాంకర్ పగిలిపోయింది.  బస్సులో ప్రయాణం చేస్తున్నవాళ్ళు కిటికీ అద్దాలను పగలగొట్టుకుని బయటకు దూకారు.  బస్సులోను బయటకు వచ్చినవారిలోనూ కొందరు గాయపడగా వాళ్లని హాస్పిటల్ కి చేర్చి వైద్య చికిత్స చేయిస్తున్నారు.  

బెంగళూరు నుంచి హైద్రాబాద్ వస్తున్న జబ్బర్ ట్రావెల్స్ వారి వోల్వో బస్సు మహబూబ్ నగర్ జిల్లా పాలెం దగ్గర డివైడర్ కొట్టుకుని ఆయిల్ ట్యాంక్ పగిలిపోవటం, అదే సమయంలో నిప్పు రాజుకుని బస్సు, దానితో పాటు 45 మంది ప్రయాణీకులు దగ్ధమైపోవటం మరపుకి రాకముందే మరెన్నో సంఘటనలు బస్సు ప్రయాణమంటేనే, అది కూడా రాత్రిపూట చెయ్యటం భయంభయంగానే జరుగుతోంది.  కానీ విధి లేక, టికెట్ ధర ఎక్కువైనా ప్రైవేట్ బస్సులలో ప్రయాణం చేస్తున్నారు.  

కానీ ప్రైవేట్ యాజమాన్యం కిందనే కాదు ప్రభుత్వం సంస్థైన ఆర్టీసీ లోని బస్సులు కూడా ఈవిధమైన ప్రమాదపు అంచులలో నడుస్తుండటం శోచనీయం.  ఇప్పటికీ ఆర్ టి ఏ దాడులలో కేవలం పేపర్లు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూస్తున్నారు కానీ వేగాన్ని నియంత్రించే దిశగా చర్యలు చేపట్టటం లేదు.  ప్రభుత్వం తరఫునుంచి కమిటీ ఏర్పడి జరిగిన ప్రమాదాలను పరిశీలించి, భవిష్యత్తులో అలాంటివి కానీ మరే విధమైన విపత్తులు జరగకుండా ఉండటం కోసం తీసుకోవలసిన జాగ్రత్తలను, పాటించవలసిన మార్గదర్శకాలను రూపొందించవలసివుంది.  

జబ్బార్ ట్రావెల్స్ ప్రైవేట్ సంస్థ కాబట్టి వాళ్ళ మీద అధికారులు, రాజకీయ నాయకులు, బాధితులు ఆందోళన చేసారు కానీ వరుసగా జరుగుతున్న గరుడ ప్రమాదాలను ఎవరూ పట్టించుకోవటం లేదు.  పోయిన సంవత్సరం జనవరిలో బెంగళూర్ విజయవాడ గరుడ బస్ బోల్తా పడింది.  జూన్ లో కర్నాటక బోర్డర్ లో ప్రమాదం జరిగింది.  అదే నెలలో నల్గొండ సమీపంలో బస్సులో మంటలు చెలరేగాయి. కానీ ప్రయాణీకులు ప్రమాదాన్ని తప్పించుకున్నారు.  నవంబర్ లో నల్గొండ దగ్గర నిప్పు అంటుకుంది.  ఇంకా ఎన్నో ప్రమాదాలు తృటిలో తప్పిపోయాయి.  అయినా ప్రభుత్వ రంగ సంస్థ కావటంతో ఆర్ టి సి అధికారులను నిలదీయలేదెవరూ. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles