పొగతాగుట నేరము. ఆరోగ్యానికి హానికరం అని చెప్తే పట్టించుకోవటం లేదు కాబట్టి పొగ తాగేవారికి కొన్ని ఆంక్షలు పెట్టవలసి వచ్చింది. సిగరెట్ తాగేవారికి ఎంత హాని కలుగుతుందో ధూషితమైన వాతావరణంలో గాలి పీల్చేవారికీ అంతే హాని జరిగే అవకాశం ఉంది కాబట్టి కొన్ని నిషేధాఙలను జారీ చెయ్యవలసి వచ్చింది. పబ్లిక్ ప్లేసెస్ లో పొగతాగరాదని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చెయ్యటంలో కొంతవరకే సాధ్యపడింది.
ప్రైవేటు స్థలం కానివన్నీ పబ్లిక్ ప్లేసెస్ లోకే వస్తాయి. రోడ్డు మీద కానీ మరేదైనా ఖాళీ స్థలంలో కానీ సిగరెట్ తాగితే అది వాతావరణంలో సులభంగా కలిసిపోతుంది. అదే, పదిమందీ తిరిగే చోట ఆ పని చేస్తే, పొగ పూర్తగా వాతావరణంలో కలిసిపోయేంత వరకూ ఊపిరి బిగబట్టుకోలేరు కదా. అందువలన పొంగ అంతరించే లోపులోనే మిగతావారు ఆ గాలిని పీల్చవలసి వస్తుంది. ఇది ఎంత అన్యాయం. మన ఇష్టం లేకుండానే మన నోటిలో మాంసాహారాన్ని కానీ మరేదైనా మనకి నచ్చని పడని వస్తువులను వేసి తినిపిస్తే ఎలా ఉంటుంది. పొగ తాగుతూ తాగనివారిని కూడా పరోక్షంగా తాగించటం, అది కూడా వీరు ఎంగిలి చేసిన గాలిని, అన్నది ఎంత వరకు సమంజసం. ఈ ఙానం ఎంతకీ కలగకపోవటం వలన దాన్ని చట్ట పరిధిలోకి తీసుకుని రావలసివచ్చింది.
పొగతాగటం నేరమని వినియోగదారులకు హెచ్చరికలు చెయ్యటం కూడా చట్టబద్ధం చేసేటప్పటికి, సిగరెట్ ఉత్పాదకులు, మా ఉద్దేశ్యం అది కాదు సుమా అని చెప్పటానికి, చట్టబద్ధమైన హెచ్చరిక అని రాసి మరీ ఆ హెచ్చరికను తెలియజేస్తున్నారు. అందువలన దాని ప్రభావం ఎవరిమీదా పడటం లేదు.
అసలు సిగరెట్ ఎందుకు తాగుతారు. ఒక విశేషమైన జీవన శైలిగా మొదలుబెడతారు. పొగాకులోని నికొటిన్ శరీరంలోని నరాల మీద పనిచేస్తుంది. నిస్త్రాణంగా ఉన్న శరీర వ్యవస్థని మేలుకొలుపుతుంది. ఉత్తేజపరుస్తుంది. ఇది కొంత వరకూ చలి ప్రదేశాలలో ఉపయోగకరమే. వేడి వేడి టీ కాఫీల్లాగానే సిగరెట్ కూడా ఉత్తేజకారిగా పనిచేస్తుంది కాబట్టి చలికి స్థబ్దుగా ఉండకుండా చురుకుదనం రావటం కోసం అది కొంతమేరకు ఉపయోగపడుతుంది. కానీ అదే అలవాటు పాశ్చాత్యుల జీవన శైలిలో నాగరికతగా ముద్రపడి, ఆ అలవాటు లేని వారు అనాగరికులనే అభిప్రాయం ఏర్పడింది. మేమూ తాగగలం అని మొదలుపెట్టటం వరకే వారి చేతిలో ఉంటుంది. ఆ తర్వాత అది అలవాటుగా మారుతుంది.
అలవాటు ఎందుకు అవుతుందీ అంటే ఇది నరాల మీద ప్రభావాన్ని చూపించేసరికి శరీరంలో కొన్ని మార్పులు ఏర్పడతాయి. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ మీద. టీ లో ఉన్న గుణమే ఒకటి సిగరెట్ లోనూ ఉంది. అది, ఆకలిని లేకుండా చెయ్యటం. ఆకలి ఉండదు కానీ పోషక పదార్థం కూడా కాదది. అందువలన అది శరీరానికి హాని కలిగిస్తుంది. బౌల్ మూవ్ మెంట్ కలిగిస్తుంది కాబట్టి విరోచనం సాఫీగా అవుతుందని అనుకుంటారు. కానీ అది ప్రకృతి విరుద్ధంగా జరిగే ప్రక్రియ. టీతో పోలిక అంత వరకే. పొగ ఊపిరి తిత్తులలోకి కూడా పోతుంది కాబట్టి ఊపిరి తిత్తులు చెడిపోయే అవకాశం ఉంది. ఊపిరి తిత్తుల నిర్మాణం కేవలం గాలి పీల్చుకోవటానికే ఉంది కానీ పొగకి కాదు. ఈ కారణాల వలన, మనిషి నెమ్మది నెమ్మదిగా సిగరెట్ పానాన్ని వ్యసనంగా మార్చుకుని, దాని మీద ఆధారపడుతూ, అది లేకపోతే విరోచనం రాకపోవటం, భోజనం తర్వాత తృప్తి కలగక పోవటం, నిద్రను ఆపుకోవటానికి సిగరెట్ తాగటం, మెదడు స్థబ్దుగా ఉండి ఆలోచన రాకపోతే సిగరెట్ ముట్టించటం వరకూ వెళ్తాడు.
అంతటితో ఆగిపోలేదు. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అన్నట్టు, ఒక పనికీ ఒక పనికీ మధ్యలో సిగరెట్ పానాన్ని అలవాటు చేసుకుంటారు. ఖాళీలను పూరించటానికి ఉపయోగిస్తారు. ఎవరైనా మిత్రులు, బంధువులు కలిసినప్పుడు అందరూ కలిసి సిగరెట్ తాగటం, సరదాగా బైటకు వెళ్తే సిగరెట్ తాగటం ఇవన్నీ శారీరక అలవాటు కంటే మానసికంగా తప్పని సరి అవుతంది. ఆలోచనలు రావటానికి, సిగరెట్ కీ ఏ సంబంధమూ లేదు కానీ ఒక పనికి ఉపక్రమించేటప్పుడు సిగరెట్ తాగటం అలవాటు చేసుకున్నారు కాబట్టి, ఆ పని చేసేంత వరకూ మెదడు వ్యవస్థ వేచి చూస్తుంటుంది అంతే. ఇంకా కొందరు ఒక చేత్తో సిగరెట్ తాగుతూ మరో చేత్తో పని చెయ్యటం అలవాటు చేసుకుంటారు. ఇక వారిని ఎవరూ బాగుచెయ్యలేరు.
చాలా మందికి తెలియనిది మరో విషయం ఉంది. సిగరెట్ అలవాటు వలన శరీరం మీద పడ్డ దాని ప్రభావం వలన సిగరెట్ ఆహ్లాదాన్ని కలిగించే మాట వాస్తవమే కానీ రోజులో తాగిన సిగరెట్లన్నిటికీ ఆ గుణం లేదు. రెండు మూడు సిగరెట్లు తప్పితే రోజులో తాగిన మిగతా సిగరెట్లన్నీ కేవలం ఖాళీలను నింపటానికే పనికి వస్తాయి. అది కాకపోతే మరేం చెయ్యాలో తెలియక చెయ్యటం జరుగుతుంది. శరీర కదలికలకు కూడా కొన్ని అలవాట్లుంటాయి. ఉదాహరణకు అన్నం తినటం. ఎంత చీకట్లోనైనా నోటికి ఆహారాన్ని అందించే చెయ్యి గురిగా నోటిలోకే పోతుంది. ఏమీ తోచక బయటకు వెళ్ళినప్పుడు కాళ్ళు మనకి అలవాటు పడ్డ ప్రదేశానికే తీసుకెళ్తాయి. అందుకే ఎవరైనా ఎప్పుడూ పోయే దుకాణానికి ఒక వస్తువు కోసం పోతే, అది ఆ సమయంలో దుకాణంలో లేకపోతే కూర్చోండి అని చెప్పి పక్క దుకాణం నుంచి తెప్పిస్తారు కానీ ఆ వినియోగదారుడిని పక్క దుకాణానికి పోనివ్వరు. ఈ దుకాణానికి అతని కాళ్ళు తీసుకుని వచ్చే అలవాటుని మార్చకునే అవకాశం ఇవ్వరు.
మోటర్ సైకిల్ మీద ఎక్కేముందు సీటు మీద చరచటం, అప్పుడప్పుడూ కళ్ళు, ముక్కు, ముఖం తుడుచుకోవటం, కూర్చున్నప్పుడు కాళ్ళూపటం, మొటికలు విరచటం, ఇలాంటివి ఎన్నో అలవాట్లు అవుతుంటాయి. అలాగే సిగరెట్ ప్యాకెట్ విప్పటం, దానిలోంచి సిగరెట్ బయటకు తీయటం, అగ్గిపెట్ట తీసి వెలిగించటం, బూడిదను విదిలించటం, వేళ్ళ మధ్యలో ఉన్న సిగరెట్ లోంచి బయటకు వచ్చే పొగను చూస్తుండటం, నోట్లోంచి పొగను రింగులుగా వదలటం ఇలాంటి కదలికలకు కూడా శరీరం అలవాటు పడుతుంది. అందువలనే ఖాళీగా ఉండలేక ఈ కదలికలకు పూనుకుంటారు. దానివలనే సిగరెట్ వినియోగం ఎక్కువవుతూ వస్తుంది.
అలా సిగరెట్ శారీరక మానసిక క్షేత్రాల మీద పట్టు సాధించి దానికి బానిసయిన వ్యక్తినే కాక అతని చుట్టుపక్కలవారినీ కూడా బాధితులను చేస్తుంది. రోజు రోజుకీ పెరిగి పోతున్న ఊపిరి తిత్తుల, కాలేయాల, మూత్రపిండాల వ్యాధులు, కేన్సర్ ల కు మూలం సిగరెట్ అని రూఢి అయిన తర్వాత కూడా ఆ హెచ్చరికలను పట్టించుకోకుండా అదే అలవాట్లను కొనసాగించటం చేస్తున్నప్పుడు కూడా చట్టం పట్టించుకోకుండా ఎలా ఉంటుంది. అందుకే ముందుగా సినిమా హాల్స్ లోనూ బస్సులు, రైళ్ళల్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడూ ధూమ్రపానాన్ని నిషేధించి దాన్ని అమలు చెయ్యటం జరిగింది. కానీ అవే సినిమా హాళ్ళల్లో వారు చూసే సినిమాలోని హీరో స్టైల్ గా సిగరెట్ తాగుతుంటే, తెలియకుండానే హీరోని అనుకరించే తత్త్వం ఉండటం వలన, సిగరెట్ తాగటం ఎక్కవే అవుతోంది కానీ తక్కువ కావటం లేదు.
దీన్ని ఆలోచించే, సినిమాల్లో కూడా సిగరెట్ తాగ్ సన్ని వేశాలను సాధ్యమైనంత తక్కువ చెయ్యమని, ఒకవేళ చూపించవలసి వస్తే సిగరెట్ తాగటం హానికరమన్న హెచ్చరికను చెయ్యమని ఆదేశమివ్వగా, సినిమా ప్రారంభంలో చూపిస్తున్నారు. కానీ దాన్ని ఎవరు పట్టించుకుంటారు, ఎవరు గుర్తుంచుకుంటారు. సినిమాలలో బయట వెలుగులను తీసివేసి, శబ్దం, దృశ్యరూపంలో చూపించే విషయాలన ప్రభావం ప్రేక్షకుల మీద ఉంటుంది కాబట్టి సెన్సార్ చెయ్యటం అవసరమని భావించిన సుప్రీం కోర్టు సూచనల మేరకు సెన్సార్ బోర్డ్ అయితే వచ్చింది కానీ, అందులో ఇంకా ధూమ్రపాన నిషేధాన్ని అమలుపరచలేదు. కానీ రజనీకాంత్ లాంటి కొందరు హీరోలు దాన్ని పాటించటం మెచ్చుకోదగ్గది.
స్టైల్ గా సిగరెట్ ని నోటిలో వేసుకుని అంతే స్టైల్ గా అగ్గిపుల్ల వెలిగించి దాని సుఖాన్ని పొందుతున్న భావాన్ని ముఖంలో చూపిస్తూ హీరోయిజానికి అది అవసరమే అన్న సంకేతాన్నిచ్చిన రజనీ కాంత్, తనను ఎంతగానో అభిమానించి అనుసరించేవారి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రముఖి సినిమానుండి తెరమీద సిగరెట్ తాగటాన్ని మానెయ్యటంలో ఆయన ఔన్నత్యం కనిపిస్తుంది.
సినిమాల్లో ధూమ్రపానాన్ని నిషేధించాలన్న ప్రతిపాదన ప్రస్తుతం న్యాయ శాఖ పరిశీలిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖా మంత్రి గులామ్ నబీ ఆజాద్ ఈరోజు తెలియజేసారు. ఒకవేళ సందర్భానుసారంగా అటువంటి సన్నివేశముంటే, పోగతాగటం వలన కలిగే దుష్పరిణామాలను ఆ నటుడితోనే సినిమా ముందు కానీ మధ్యలో కానీ 20 నిమిషాల వరకూ చెప్పించాలని సెప్టెంబరు 27న ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీచేసింది. అయితే నిర్మాతలు దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేసినందువలన ప్రస్తుతం న్యాయశాఖ పరిశీలనలో ఉందని ఆజాద్ అన్నారు. హానికరమని తెలిసినా ఉత్పాదననే నిషేధించలేకపోవటానికి కారణం, దాని మీద ఆదాయం మీద ఆధారపడ్డ ప్రభుత్వం, పొగాకు పంట సాగు మీద ఆధారపడ్డ రైతు కుటుంబాలు.
సిగరెట్ తాగటం అలవాటు చేసుకోవటం సులభమే కానీ వదిలెయ్యటం కష్టమనే అభిప్రాయాన్ని కూడా అందరిమీదా రుద్దారు. అది వారి మానసాల మీద పనిచేస్తున్నది. కానీ సిగరెట్ మానెయ్యటం కూడా సులభమే. దానికో ప్రణాళిక వేసుకుని, దానిబదులు మరేదో తినటమో తాగటమో కాకుండా కేవలం ఒకరోజు ఉదయమే సంకల్పం చేసుకని పొగతాగటం మానెయ్యటమే. దానికోసం ఒట్లు పెట్టుకోవటం కానీ మరేదో కానీ చెయ్యనక్కర లేదు. కాకపోతే శారీరకంగా మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురవవచ్చు. విరోచన బద్ధకం కానీ, ఆలోచనలు రాకపోవటంకానీ, ఖాళీ సమయంలో ఎప్పుడూ చేసే పనైన సిగరెట్ వెలిగించటం చెయ్యకపోతే మరేం చెయ్యాలో తెలియకపోవటం ఉండవచ్చు. అన్నిటికన్నా ముఖ్యంగా సిగరెట్ తాగటం మానేసిన వారిలో చాలా మందిలో బరువు పెరగటం కూడా సంభవించింది. అందువలన ఒక్కసారే మానెయ్యగూడదని అంటారు కానీ ప్రణాళిక వేసుకుని తగ్గించుకుంటూ ఉండేదానికంటే ఒక్కసారిగా మానెయ్యటమే సులభం. సిగరెట్ ని తగ్గించే లేక మానేసే ప్రణాళిక వెయ్యటమంటే దాని మీద దృష్టి పెట్టుకోవటమే కదా. దాని మీద దృష్టే పెట్టుకోకపోతే, అసలు సిగరెట్ అనేదే ప్రపంచంలో లేదను కోండి అప్పుడు?
సిగరెట్ మానెయ్యటం సులభమే! దానికోసం చట్టాలు తీవ్రంగా అమలు జరిగేవరకూ ఎదురుచూడనక్కరలేదు.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more