వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయలక్ష్మి తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమంగా ఆస్తులను కూడగట్టారని, వాటి మీద దర్యాప్తు చెయ్యవలసిందిగా కోరుతూ అక్టోబరు 17న హైకోర్ట్ లో పిటిషన్ ని దాఖలు చేసారు. ఆ పిటిషన్ లో పేర్కొన్నవన్నీ ముఖ్యంగా చంద్రబాబు ఏ విధంగా ఆ ఆస్తులను సంపాదించారన్నదే వివరంగా ఉన్నాయి.
ఈ పిటిషన్ ని పరిశీలించిన తర్వాత, నవంబరు 14న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గులామ్ మహమూద్, జస్టిస్ నూతి రామమోహన రావుల ధర్మాసనం, విడివిడిగా దర్యాప్తులు చేపట్టమని సిబిఐ, ఇడి, సెబిలను ఆదేశించింది. దీనిమీద స్టే కోసం సుప్రీం కోర్టుని ఆశ్రయించగా, సుప్రీం కోర్టు ఆ అభ్యర్థనను తోసిపుచ్చుతూ, ఇందులో సవరణలకుకానీ, నిలిపివేయటానికి కానీ మధ్యంతర ఆదేశాలకు హైకోర్ట్ లో పిటిషన్ దాఖలు చెయ్యమని సూచించింది. నవంబరు 14 న హైకోర్టు ఆదేశాల మేరకు నవంబరు 26న సిబిఐ చంద్రబాబు మీద ప్రాథమిక విచారణకు కేసు నమోదు చేసింది.
చంద్రబాబు నాయుడుతో పాటు మొత్తం 12 మంది మీద జరిగే దర్యాప్తులలో మిగిలిన వారు -నారా భువనేశ్వరి, నారా లోకేష్, ఉషోదయా ఎంటర్ ప్రైజెస్, హెరిటేజ్ ఫుడ్స్, అహోబలరావు, వి.నాగరాజ నాయుడు, వై.సత్యనారాయణ చౌదరి, మధుకాన్ ఇండస్ట్రీస్, మాగంటి రాజబాబు అలియాస్ మురళీ మోహన్, కె. వెంకటేశ్వరరావు, సి.ఎమ్.రమేష్ లు.
వీరందరిమీద అభియోగాలతో వైయస్ విజయమ్మ దాఖలు చేసిన పిటిషన్ లోని వివరాలు ఇవి-
చిత్తూరు జిల్లాలో నారావారిపల్లి లో సామాన్య కుటుంబంలో జన్మించిన చంద్రబాబు తన కాలేజ్ చదువు అయిపోగానే రాజకీయాల్లోకి వచ్చారంటే ఆయన సంపాదనంతా రాజకీయరంగంలో ఆర్జించిందే. వంచనతో పిల్లనిచ్చిన మామనే పదవి నుంచి తొలగించి ఆ పదవిని కైవసం చేసుకున్నారు. చంద్రబాబు చేసిన ఆస్తులు ప్రకటన ప్రకారం, 1986 కిముందు సంక్రమించిన పూర్వీకుల ఆస్తి 2 ఎకరాల వ్యవసాయ భూమి. దాన్ని అమ్మి, నెల్లూరు జిల్లాలో నిందలి, వాఖ్యాం గ్రామాలలో భూములు కొనగా వాటి నుంచి ఆయనకు వస్తున్న ఆదాయం సాలీనా 36000 రూపాయలని ఆయన వెల్లడించారు. చంద్రబాబు సంపాదన అక్కడి నుంచీ క్రమంగా పెరుగుతూ వచ్చింది. 1985లో కుటుంబ సభ్యుల పేర్ల మీద 65 ఎకరాల భూమిని కేవలం ఎకరాకు 1000 రూపాయల ధరకే కొనుగోలు చేసారు. అది కాకుండా మరో 250 ఎకరాలు బేనామీ పేర్ల మీద కొనుగోలు చెయ్యటం జరిగింది. ఆ 65 ఎకరాలకు, మరో 250 ఎకరాలు కొనుగోలు చెయ్యటానికి కావలసిన రొక్కం ముట్టింది ఒక దగ్గర్నుంచే. ఈ మొత్తం 315 ఎకరాలకూ ఒకే పెద్ద ప్రహరీ 12 కిలోమీటర్ల పొడవునా ఉంది.
బేనామీ లావాదేవీలు బాగానే జరిగాయనే అనుమానాలు వ్యక్తమయే విధంగా, 2001లోఆగస్ట్ 25న బాబు అతని కుమారుడు లోకేష్ ల ప్రమేయంతో మరో నాలుగు పెద్ద పెద్ద లావాదేవీలు జరిగాయి. అందులో రెండు బహుమతుల రూపంలో మరి రెండు అమ్మకాలుగా. 1999లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రకటించిన ఆస్తుల విలువ 7.83 కోట్ల రూపాయలు. అంతకు ముందు తన వ్యవసాయ ఆదాయంగా ప్రకటించింది సంవత్సరానికి 36000, శాసన సభ్యుడిగా జీతం నెలకి 650 రూపాయలు, హెరిటేజ్ లో డైరెక్టర్ గా పారితోషికం నెలకి 20000 రూపాయలు. ఆయన సంపాదించిన ఆస్తులు చూస్తే ఈ సంపాదనతో సాధ్యం కానిదే.
ఇదే కాకుండా ఆయన తల్లి పేరు మీద, భార్య పేరు మీద జరిగిన లావాదేవీలను కూడా పరిగణనలోకి తీసుకోవలసి ఉంటంది. చంద్రబాబు తల్లి అమ్మనమ్మ ఆస్తులను తరచి చూడవలసి అవసరం ఉంది. ఎందుకంటే కుప్పం గ్రామంలో ఆమెకు సంప్రాప్తించింది కేవలం రెండు ఎకరాల భూమే. కానా 2000 సంవత్సరంలో హైద్రాబాద్ మదీనా గూడా గ్రామంలో సర్వే నం.59 లో ఆమె 5 ఎకరాల స్థలాన్ని కొన్నారు. జాస్తి పాండురంగ విఠల్ నుంచి హైటెక్ సిటీ దగ్గర 40 లక్షల రూపాయలకు 1135 గజాల స్థలాన్ని కొన్నారు. బంజారా హిల్స్ లో 35 లక్షల రూపాయల విలువైన స్థలాన్ని కొన్నారు.
1994 సంవత్సరం అక్టోబరు 19న హెరిటేజ్ ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ సంస్శ ప్రోస్పెక్టస్ లో తనకి వేరే ఏ వ్యాపారాలు లేవని ప్రకటించారు కానీ అప్పటికే భువనేశ్వరీ కార్బైడ్స్అండ్ కెమికల్స్ ప్రై.లిమిటెడ్ స్థాపించబడింది. భువనేశ్వరి కార్బైడ్స్, ఎల్లోయ్స్ రెండు సంస్థలూ బ్యాంక్ లనుంచి ఋణాలు తీసుకున్న విషయాలను కావాలనే దాచివుంచారు.
1999లో చంద్రబాబు భార్య భువనేశ్వరి, కొడుకు లోకేషేలు స్థాపించిన ఎ 2 జడ్ ఇ మల్టీ సాఫ్ట్ ప్రై.లిమిటెడ్, దరిమిలా బిజ్ప్రో టెక్నాలజీస్ ప్రై.లిమిటెడ్ గా మారిన సంస్థ గురించిన వివరాలు ఎన్నికల సమయంలో ఎన్నికల అధికారికి సమర్పించిన ఆస్తుల ధృవీకరణలో లేవు. ఇది నేరం కనుక చంద్రబాబు శిక్షార్హులు.
1989లో రామా అగ్రికల్చరల్ ఫామ్స్ అనే కుటుంబ సంస్థ చంద్రబాబు తల్లి, భార్య, కుమారుడు లోకేష్ మరో బంధువు పి.దాసయ్య నాయుడు పేర్లతో స్తాపించబడి, దాని ద్వారా కొండాపూర్ లో 3.276 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసారు. హైటెక్ సిటీకి కేవలం అర కిలోమీటర్ దూరంలో ఉన్న స్థలాన్ని ఒక లక్ష రూపాయలకు అనగా ఎకరం 30,487కే కొనుగోలు చేసారు. ఇది కొనటానికి డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ప్రకటించలేదు. కొండాపూర్ దగ్గర హైటెక్ సిటీ పేరుతో ఇన్ఫోటెక్ పార్క్ అభివృద్ధికి ప్రభుత్వ నిర్ణయాన్ని 1996లో చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించింది. దానితో రామా అగ్రికల్చరల్ ఫామ్స్ స్థలానికి ధర విపరీతంగా పెరిగిపోయి ఆ లబ్ధి అంతా ఆయన కుటుంబీకులకే ప్రాప్తమైంది.
డా.రెడ్డి ల్యాబ్స్ కి 1998లో 25 కోట్ల రూపాయల సేల్స్ టాక్స్ 14 సంవత్సరాల డిఫరమెంట్ కి చంద్రబాబు ప్రభుత్వం అనుమతులిచ్చింది. కొత్త సంస్థకే ఇచ్చే ఈ వెసులుబాటు 1984లో స్థాపించి, షేర్లు స్టాక్ ఎక్సేంజ్ లో నమోదై, 1.67 బిలియన్ డాలర్ల లాభాల బాటలో సాగుతున్న డా.రెడ్డి ల్యాబ్స్ కి ఇవ్వటం అవసరమా.
చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతున్న సమయంలో ఆలోచనలూ ప్రతిపాదనలూ అన్నీ తనవే కాబట్టి, పెద్ద ప్రోజెక్ట్ లను ప్రకటించే ముందే తనకు కావలసినవారికి ఆ విషయాలను ఆ విషయాలను అందించటం ద్వారా వారికి లాభం చేకూరేట్టు చేసే అలవాటుండేది. పెద్ద పెద్ద ప్రోజెక్ట్ లను ఎక్కడ ప్రారంభించేది వాటి వివరాలను ఈనాడు రామోజీరావు, జయభేరి ప్రోపర్టీస్ మురళీ మోహన్ కి, మరి కొందరు తనకు దగ్గరివారికి చల్లగా అందించేవారు. దానితో వాళ్ళు అటువంటి స్థలాలను ముందుగానే కొనుగోలు చేసి లాభపడటమనేదానికి కావలసినన్ని సాక్ష్యాధారాలున్నాయి. తన పదవిని అడ్డుపెట్టుకుని చేసిన ఇటువంటి పనులను సూక్ష్మంగా దర్యాప్తు చెయ్యవలసి వుంది.
కృష్ణా గోదావరి బేసిన్ లో చమురు నిల్వలు బోంబే హై బేసిన్ కి 40 రెట్లు ఎక్కువని 2002 లో నిర్ధారించబడింది. ఈ బేసిన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండటం వలన అధికారులు ఈ విషయంలో గుజరాత్ రాష్ట ప్రభుత్వంలా మన రాష్ట్రం తరఫునుంచి కూడా ఒక సంస్థని స్థాపించి గ్యాస్ లో భాగానికి బిడ్ వెయ్యమని సలహా ఇచ్చినా దాన్ని చంద్రబాబు ప్రభుత్వం కావాలనే పెడచెవిని పెట్టి, ఆ సలహాలను విస్మరించారు. ఫలితంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చేపట్టిన గ్యాస్ అన్వేషణలో ఎన్నో నియమాలను ఉల్లంఘిస్తూ, మత్స్యాకారులకు నష్టం కలిగిస్తూ వాతావరణ ప్రధూషణానికి పాల్పడుతూ, జలాధార వ్యాపకాలకు ఆటంకాలు కలిగిస్తోంది.
రామోజీరావు స్థాపించిన మార్గదర్శి చిట్ ఫండ్ లో ఎన్నో అక్రమాలు వెలుగు చూసాయి. దానితో 2007లో ఆ సంస్థ ఎంతో ఆర్థిక సమస్యలను ఎదుర్కుంది. రిజర్వ్ బ్యాంక్ నియమాలను ఉల్లంఘిస్తూ, 2600 కోట్ల రూపాయలను డిపోజిట్ల పేరుతో మార్గదర్శి కూడగట్టిందని దర్యాప్తులో తేలింది. వాటిని తిరిగి ఇవ్వటానికి సంస్థలో అందుకు కావలసిన సొమ్ము లేదు. అయినా ధైర్యంగా తన పత్రిక ఈనాడులో ఆ 2600 కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చేస్తామని ప్రకటనలు చేసారు. ఆ మేరకు ఈ కోర్టులోనే రామోజీరావు హామీ ఇచ్చారు. అందుకు చంద్రబాబు చూసీచూడనట్టు ఊరుకున్న కెజి బేసిన్ వ్యవహారంలో లాభపడ్డ అందుకు ప్రతిగా ముఖేష్ అంబానీ రిలయన్స్ గ్రూప్ తన దగ్గరివారి ద్వారా, రామోజీరావు అప్పులను తీర్చటంలో సాయపడింది. రిలయన్స తరఫునుంచి ఆదుకున్న వారు నిమేష్ కంపని, వినయ్ చజ్లానీ లు.
2007-2008 ల కేవలం 37 రోజుల్లోనే, 6 షెల్ కంపెనీలను స్థాపించి, ఆ షేర్ మనీని 2604 కోట్ల మేరకు రిలయన్స్ కంపెనీ కంపనీకి బదలాయించింది. దానితో కంపనీ రామోజీరావుకి అండగా నిలబడగలిగారు.
1997 నుంచి 2001 వరకు శంషాబాద్ పక్కనే ఉన్న పల్మాకోల్ గ్రామంలో రామోజీరావు ఆయన బంధువులు భాగస్వాములుగా మార్గదర్శి చిట్ ఫండ్ ఉండేది. ఆ భాగస్వాములు, 10000 రూపాయల జీతంతో అందులో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు, అప్పట్లో ఉన్న ధర ప్రకారం ఎకరానికి 50000 రూపాయల చొప్పున 360 ఎకరాల స్థలాలను కొనుగోలు చేసారు. వ్యవసాయ భూములకు ల్యాండ్ సీలింగ్ అమలులో ఉన్న కారణంగా ఈ జాగానంతా ఒక వ్యక్తి తన పేరుతో కొనలేరు కాబట్టి ఉద్యోగులు కూడా కొనుగోలు చేసే ఈ ఏర్పాటు జరిగింది.
ఈ కోనుగోళ్లు జరిగిన తర్వాత, చంద్రబాబు ప్రభుత్వం, బేనామీల స్థలాలను తిరిగి తీసుకోవటం కోసం ఆ స్థలాలను నాన్ అగ్రికల్చరల్ భూమిగా మార్పిడి చేసింది. దాని వలన వ్యవసాయ భూముల ల్యాండ్ సీలింగ్ లోకి ఇది రాకుండా ఉంటుంది. భూమి వర్గీకరణ మార్పు జరగగానే అంతవరకూ వేరే వారి పేర్ల మీదున్న స్థలాలన్నీ రామోజీరావు పేరు మీదికి మారిపోయాయి. ఉదాహరణకు రామోజీ ఫిల్మ్ సిటీలో వైస్ ప్రెసిడెంటు కొల్లి బాపినీడు చౌదరి పేరు మీద 10 వరకూ లావాదేవీలున్నాయి. కానీ ఇప్పుడు అతని పేరు మీద ఒక్క స్థలమూ లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దగ్గరి వాడు అయిన జయభేరి ప్రోపర్టీస్, ఎమ్ ఎమ్ ఫైనాన్సియర్స్ కి చెందిన మాగంటి మురళీమోహన్ గచ్చిబౌలి గ్రామంలో 1996లో 2.34 ఎకరాల స్థలాన్ని 10 లక్షలకే కొనుగోలు చేసారు. ఆ తర్వాత హైటెక్ సిటీ వెలిసిన మాదాపూర్ కి ఈ గచ్చిబౌలి గ్రామం అతి చేరువలో ఉండటం విశేషం. హైటెక్ సిటీ ప్రకటన వెలువడగానే స్థలాల రేట్లు గణనీయంగా పెరిగిపోయాయి.
మాదాపూర్ సర్వే నంబర్ 65 లో ఉన్న 645 ఎకరాల్లో మూడోవంతు స్థలాన్ని అంతర్జాతీయ ఐటి కంపెనీలకు కేటాయిస్తూ, మిగిలిన రెండు భాగాలనూ చంద్రబాబు మురళీ మోహన్ సాయంతో బేనామీ కంపెనీల పేర్ల మీద లాగేసుకున్నారు. ఆ కంపెనీల ఆవిర్భావం ఐటి కార్యకలాపాలు కాక కేవలం ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీలు ఇతర సౌకర్యాల కోసమే ఏర్పడినవి. ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు బాగా లాభపడ్డారన్నది నిర్వివాదం. ఉదాహరణకు, వల్లూరుపల్లి నాగార్జున అనే వ్యక్తి, వల్లూరిపల్లి ఆగ్రోటెక్, అర్జున్ కంప్యూటర్స్ లాంటి ఎన్నో పేర్లతో స్థాపించిన కంపెనీలకు అతి తక్కువ ధరకు జాగా సంపాదించారు. ఆ స్థలాలను ఆయా కంపెనీలకు కేటాయించిన తర్వాత వాటన్నిటినీ మాగంటి మురళీ మోహన్, అతని కంపెనీలకు అమ్మేసారు.
ఇవి ముఖ్యమైన అభియోగాలు.
ఇవన్నీ అంతకు ముందు వైయస్ ఆర్ హయాంలో చేసిన అభియోగాలేనని, వాటికి కోర్టు నుంచి క్లీన్ చిట్ వచ్చేసిందని చెప్తున్నా, తనతో పాటు మొత్తం పన్నెండు మంది మీద ఆరోపణలు చేసి, దర్యాప్తులు జరగటమనేది తెదెపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి తలపోటు వ్యవహారంగానే మారింది. చంద్రబాబు వర్గంలోవారికి నాయకుడి అభయం మీద శంక కలిగే అవకాశం ఉంది. రాజకీయాల్లో మిగతా వ్యవహారాలు, సొంత వ్యాపారాలు కుంటుపడతాయి. బ్యాంక్ ఖాతాలను సీల్ చేసే వరకూ పోతే దైనందిన వ్యవహారాలకు పెద్ద దెబ్బే తగులుతుంది.
సరిగ్గా జగన్ కూడా ఇదే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటి వరకూ జగన్ కి మద్దతుగా నిలిచినవారు తమ మీదికి ఏమొస్తుందో అని ఆలోచించే పరిస్థితి కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీ మీద ఎక్కుపెట్టిన బాణాలను వారిద్దరూ పరస్పరం సంధించుకోవటం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంది. తెలంగాణా విషయంలో దగా చేసిన కాంగ్లెస్ పార్టీని నామరూపాల్లేకుండా చేస్తామని తెలంగాణా ఉద్యమం సాగించే తెరాస, రైతు పోరు పేరుతో ఉద్యమ బాటలో సాగుతున్న ప్రధాన ప్రతిపక్షమైన తెదేపా, కాంగ్రెస్ పార్టీ లోంచి సభ్యులను తనవైపు తిప్పుకుని సవాలుగా మారబోయిన జగన్, వీరు ముగ్గురూ ఒకరి మీదొకరు అస్త్రాలు సంధించుకుంటూ మిగతా వారు కాంగ్రెస్ తో కలిసిపోతున్నారని అనుమాన పడుతూ, పరస్పర ఆరోపణలు చేసుకుంటూ కోర్టు కేసుల్లో కూడా చిక్కుకోవటం కాంగ్రెస్ పార్టీకి కలిసివస్తోంది. ఇది ఇలాగే సాగితే 2014 ఎన్నికల వరకు మరి కొన్ని సంక్షేమ పథకాలతో ప్రజల మనసు చూరగొనే ప్రయత్నం చెయ్యటానికి సమయం దొరుకుతుంది.
ఇంతకీ వైయస్ విజయమ్మ ఈ పిటిషన్ ని వెయ్యటానికి కారణమేమిటి?
చంద్రబాబు అవినీతికి తోడ్పడితే, ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల్లో వైయస్ ఆర్ ఈ పని ఎందుకు చెయ్యలేదు. అదికారం చేతిలో ఉన్నప్పుడు విచారణలకు ఎందుకు ఆదేశించలేదు. కారణమొకటే. రాజకీయాల్లో ఎవరి చేతికి దొరికింది వారు తీసుకోవటం మామూలైపోయింది. మనదేశంలోని రాజకీయ వ్యవస్థే అలా తయారైంది. ఒకరి అవినీతిని బయటపెడితే వీరి అవినీతి కూడా బయటపడే అవకాశం ఉంది కాబట్టి గుంభనంగా ఉండటం పరిపాటయిపోయింది. పైకి ఎన్ని విమర్శలు సంధించుకున్నా, చంద్రబాబు కానీ, వైయస్ ఆర్ కానీ లోతుల్లోకి పోకపోవటానికి అదే కారణం.
కానీ వైయస్ ఆర్ ఆకస్మిక మరణంతో, రాజకీయ అనుభవం లేని జగన్, తండ్రి స్థానం తనకి లభిస్తుందని ఆశపడి భంగపడటం జరిగింది. ఢిల్లీ దర్బారు ముఖం పక్కకు తిప్పుకుంది. ఇది చూసి తట్టుకోలేక, ఎన్నికలకు కావలసిన ధనం, తండ్రి మీద రాష్ట్ర ప్రజలకున్న సద్భావనను ఉపయోగించుకుని అధికారం చేజిక్కించుకుని ఢిల్లీ నేతలకు బుద్ధి చెప్పాలనుకుని దానికి తల్లి సాయం తీసుకున్నారు జగన్. జగన్ కే లేని అనుభవం ఆమెకి ఎక్కడి నుంచి వస్తుంది. నామినేషన్ వెయ్యమంటే వెయ్యటం, ఎన్నికలకు ప్రచారం చేసుకోవటం జరిగింది. తాత్కాలికంగా విజయం సాధించినా, తనేమిటో చూపించాననుకుని విర్రవీగుతున్న సమయంలో జగన్ ఆస్తుల మీద విచారణ మొదలైంది. అంతకు ముందు ఉప ఎన్నికల సమయంలో జరిగిన హోరా హోరీ ముప్పేట ప్రచారంలో ఒకరి మీద మరొకరు విమర్శలు విసురుకున్నారు. అయితే, ఒక సిబిఐ కేసు పడిందంటే జగన్ మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకోవటం ఖాయం అని చంద్రబాబు బహిరంగంగా అనటం, నిజంగానే జగన్ మీద ఆరోపణలు, దివంగత నేతైన తండ్రి మీద కూడా అభియోగాలు రావటం తట్టుకోలేని జగన్ వర్గం అదంతా చంద్రబాబు వలనే జరుగుతోందని గాఢంగా విశ్వసించింది. అందుకే అదే తరహాలో బుద్ధి చెప్పాలని వేసిన పిటిషనే చంద్రబాబు అక్రమ ఆస్తుల మీద ఆరా!
కుటుంబ ప్రతిష్టగా భావించిన వైయస్ విజయమ్మ ఎన్నికల్లో నిలబడ్డట్టుగానే జగన్ మాట విని దాఖలా చేసిన పిటిషనే కానీ ఆమె సొంత నిర్ణయం కాదని ఎవరికైనా సులభంగా అర్థమౌతుంది. ఈ పిటిషన్ వలన కాంగ్రెస్ అధిష్టానం మెత్తబడితే తనమీద కేసుల ఉధృతం తక్కువవుతాయేమోనని ఆశించి జగన్ ఈ పని చేసారని, అందుకోసమే ఢిల్లీలో లాబీయింగ్ చెయ్యటం కోసమే ఆ సమయంలో ఢిల్లీ వెళ్ళి వచ్చారని, ఆ తర్వాత చంద్రబాబు మీద కూడా అక్రమ ఆస్తుల పిటిషన్ వేయించారన్న మాటలు కూడా కొందరు విశ్లేషకుల నోట వినిపిస్తోంది.
అయినా, రాష్ట్రాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్లిందెవరన్నది అందరికీ తెలుసు. తెలుగు దేశం పార్టీ పాలనలో రాష్ట్రం ఇతర రాష్ట్రాలు ఈర్ష్య పడేంతగా అభివృద్ధి చెందింది. ఎంతో గొప్ప నాయకుడని కాంగ్రెస్ పార్టీ, వైయస్ ఆర్ పార్టీ కూడా ఎన్నికల్లో పెట్టుకున్న వైయస్ ఫోటో మీద మాకు హక్కుందే మాకుందని ఇరువురూ వాదులాడుకోవటం కూడా అందరూ చూసారు. అటువంటిది ఉప ఎన్నికలు అయిపోగానే కాంగ్రెస్ వైయస్ ఆర్ అవినీతిని బయట పెట్టే ప్రయత్నం చేసింది. ఐదు సంవత్సరాల్లో లక్ష కోట్ల రూపాయలు సంపాదించిన ఘనతున్న వైయస్ ఆర్ కుటుంబానికి ఇతరులను విమర్ళించే హక్కుందా అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా హక్కుంది, దాన్ని వినియోగించుకుని, తను అప్పటికే అక్రమ ఆస్తుల అభియోగాలను ఎదుర్కుంటున్నారు కాబట్టి జగన్ తన తల్లి చేతుల మీదుగా ఈ పిటిషన్ దాఖలు చేయించారు.. దీనితో అందరి దృష్టీ తనమీది నుంచి మళ్ళిపోతుందని కూడా జగన్ అనుకున్నట్టుగా కనిపిస్తోంది. వైయస్ ఆర్ పేరు చెడిపోకుండా ఉంటేనే కదా వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి మనుగడ ఉండేది! అందుకే వైయస్ కుటుంబం మీద ఎక్కుపెట్టిన బాణాన్ని తెలివిగా జగన్ చంద్రబాబు వైపు తిప్పారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more