Arunima sinha who claimed the mount everest with artificial leg

arunima sinha who claimed the mount everest with artificial leg, the story of arunima, history of arunima sinha, arunima sinha history, arunima sinha on mount everest, arunima sinha latest news, arunima sinha, arunima sinha mount everest, arunima sinha claimed everest

The story of arunima sinha who claimed the mount everest with artificial leg

ఒంటికాలితో ఎవరెస్టు శిఖరాన్ని జయించిన తొలిభారతీయ మహిళ

Posted: 07/22/2014 05:46 PM IST
Arunima sinha who claimed the mount everest with artificial leg

వాలీబాల్, ఫుట్ బాల్ వంటి పోటీల్లో పాల్గొంటూ మైదానంలో మెరుపుతీగలా దూసుకుపోతున్న ఓ అమ్మాయి జీవితంలో అనుకోకుండా ఒక ప్రమాదం ఎదురయింది. ఆ ప్రమాదం వల్ల ఆమె నరాలు తెగిపోయి, వెన్నుపూసకు గాయమైంది. దీంతో ఆమె ఒక కాలు పోయింది. ఎన్నో ఆశలతో జీవితంలో కొత్త పుంతలు తొక్కుతున్న సమయంలో ఈ ప్రమాదం రూపంలో కష్టాలు ఎదురయ్యాయి. తన జీవిత లక్ష్యాలను నెరవేర్చుకునేందుకు ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం అడ్డుపడింది. అయినా ఆమె తన మనస్థైర్యాన్ని కోల్పోకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. జీవితంలో ఏదోఒకటి సాధించాలనే దృఢసంకల్పంతో ఒంటి కాలితోనే నడవటం మొదలుపెట్టిన ఆ అమ్మాయి... నేడు ఎవరెస్ట్ శిఖరాన్నిఅధిరోహించింది. కేవలం ఒక్క కాలితోనే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మొదటి మహిళగా ప్రపంచ రికార్డుల్లోకెక్కింది. ఆమె పేరు అరుణిమ. ఆమె జీవితగాధ మీకోసం...

అరుణిమకు ఎదురైన ప్రమాదం :
2011 ఏప్రిల్ 12వ తేదీన ఒక అర్థరాత్రి చీకట్లో రెండు స్టేషన్ల మధ్యలో దూసుకుపోతున్న రైల్లోంచి కిందపడిపోయింది అరుణిమ. తెల్లవారగానే ఒక వ్యక్తి రక్తపు ముద్దలా వున్న ఆమెను చూసి పదిమందిని సాయం కోసం పిలుచుకువచ్చాడు. జనం రాకతో అరుణిమ స్పృహలోకి వచ్చింది. రెండు కాళ్లకూ తీవ్ర గాయాలు కాగా.. వెన్నుపూసలో భరించలేని బాధ! ఇక తల ఎన్నిచోట్లా పగిలిందో తెలియదు. అయినా తనలో వున్న శక్తినంతటినీ ఏకంచేసి తన వివరాల గురించి చెప్పింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు తమవంతు ఆమెకు వైద్యాన్ని అందించి, ఆమెను బరేలీ స్టేషన్ లో పోలీసులు, వైద్యులకు అప్పగించారు.

అయితే ఈ కేసు మా పరిధికి చెందింది కాదంటూ పోలీసులు కొంటిసాకులు చెబుతూ తప్పించుకున్నారు. చావుబతుకుల్లో ఆమెను ఎవరైనా కాపాడంటూ అంటూ ఒక వ్యక్తి కేకలు కూడా వేశాడు. దాంతో చావుబతుకుల్లో వున్న ఆమెను ఫ్లాట్ ఫాం నుంచి ఊళ్లో వున్న ఆసుపత్రికి తీసుకొచ్చి ఒక వరండాలో విడిచి వెళ్లిపోయారు. అప్పుడు డాక్టర్లు ‘‘ఇంకా బ్రతికే వుందా..?’’ అనే ఆశ్చర్యంలో వుండగా... అరుణిమ అతికష్టం మీద ‘‘ప్లీజ్.. నన్ను కాపాడండి’’ అంటూ వారిని వేడుకుంది. కానీ వారు మాత్రం ‘‘ఇదేదో ఆత్మహత్య కేసులా వుంది. దీనిని ముట్టుకుంటే మనకే ప్రమాదం’’ అంటూ చుట్టూ వున్న డాక్టర్లు చెప్పుకుంటున్నారు.

అప్పుడు అరుణిమ... మీరనుకుంటున్నట్లు నేను ఆత్మహత్య చేసుకోలేదు. కావాలంటే నా పర్సు చూడండి. అందులో రెండు ఏటీఎం కార్డులు, రెండువేల రూపాయలు వున్నాయి. ఎంత ఖర్చయినా ఫర్వాలేదు నన్ను బ్రతికించండి’’ అని తనలో జీవించాలనే ఆకాంక్షను చెప్పింది. అప్పుడు ఒక జూనియర్ డాక్టర్ నా రక్తాన్నిస్తానంటూ ముందుకొచ్చాడు. దాంతో ఆపరేషన్ థియేటర్ కు తరలించిన ఆమెను.. ‘‘ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఒక కాలు తీసేయాల్సిందే. ఇక రెండో కాలులో రాడ్ వేయాలి’’ అని చెప్పారు. ‘‘నేను బతకాలి.. నన్ను మీరేం చేసినా సరే’’ అని ధైర్యంగా ఒప్పుకుంది. చికిత్స నిమిత్తం ఆపరేషన్ థియేటర్ కు తీసుకెళ్లారు. చికిత్స పూర్తయ్యేసరికి ఆమె కుటుంబసభ్యులు అక్కడికి చేరుకున్నారు.

ఇదంతా ఎలా జరిగిందని ఆరా తీస్తే ఒక న్యూస్ పేపర్ లో.. ‘‘జాతీయ వాలీబాల్ - ఫుట్ బాల్ క్రీడాకారిణి అరుణిమ సిన్హా... లక్నో-ఢిల్లీ పద్మావతి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణిస్తుండగా ఒక దొంగ ఆమె గొంతులో వున్న గొలుసును కాజేయడానికి ప్రయత్నించాడు. అయితే ఆమె మాత్రం భయపడకుండా ధైర్యంగా నిలబడింది. ఆ పెనుగులాటలోనే ఆ దొంగ ఆమెను రైలు నుంచి కిందకు తోసేశాడు. అతను మాత్రం అక్కడి నుంచి పరారయ్యాడు’’ అని ఆమె మీద జరిగిన ాడి గురించి మొత్తం వివరాలను ప్రచురించింది. ఇదీ ఆమె జీవితంలో జరిగిన ఒక ఘోరమైన సంఘటన!

జీవిత చరిత్ర :
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అంబేద్కర్ జిల్లాలో జన్మించింది అరుణిమ. ఆమె తండ్రి ఆర్మీ ఉద్యోగి. ఆమెకు ఒక అన్నయ్య, చెల్లెలు వున్నారు. చిన్నప్పటి నుంచే ఆమెను ఫుట్ బాల్ ఆడటం ఎంతో ఇష్టం. ఇందుకు ఆమెను తల్లిదండ్రులు, పీఈటీ ఎంతో ప్రోత్సహించారు. దాంతో ఆమె వాలీబాల్, ఫుట్ బాల్ ఆటల్లో దూసుకుపోతూ ఎన్నో పతకాలను విజయం చేసుకుంది. జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది. ఈమె ఆటల్లో కొనసాగుతూనే ఎంఏ పూర్తి చేసింది. ఎల్.ఎల్.బీ చేస్తున్న రోజుల్లో ఆర్మీ రిక్రూట్ మెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది. కానీ దరఖాస్తులో పుట్టినరోజు వివరాలు తప్పుగా నమోదయ్యాయి. అయితే బరేలీ వెళ్లి రిక్రూట్ మెంట్ అధికారులకు జరిగిన పొరపాటు చెబితే సరిచేస్తారని ఇంట్లో వాళ్లు సలహా ఇచ్చారు. దీంతో ఆమె 2011 ఏప్రిల్ 2వ తేదీన లక్నోలో రైలెక్కింది. అప్పుడే ఈమె జీవితంలో తిరిగిరాని ఘడియాలు ముగిసిపోయాయి.

చికిత్స అనంతరం జీవితం :
బరేలీ హాస్పిటల్ లో అరుణిమకు చికిత్స నిమిత్త ఒక కాలును తీసేసి, ఇంకో కాలికి రాడ్ బిగించారు. ఈమెపై జరిగిన దాడి గురించి తెలుసుకున్న కేంద్ర, రాష్ట్రమంత్రులు కదిలొచ్చారు. ఆమె పూర్తిగా కోలుకునేవరకు ఎంత ఖర్చయినా ఫర్వాలేదంటూ అన్ని ఏర్పాట్లు చేశారు. నాలుగు నెలలు గడిచిన తరువాత డాక్టర్లు ఆధునిక పరిజ్ఞానంతో తయారైన కార్బన్ వ్యాక్స్ కాలిని అమర్చితే మునుపటిలాగే వీలుంటుందని ఆమెలో ఆశలో రేకెత్తించారు. దీంతో ఎంతో ఖరీదైన కృత్రిమ కాలుకు సంబంధించి ఖర్చును భరించడానికి ఓ సంస్థ ముందుకొచ్చింది. దాంతో ఆమె కృత్రిమ కాలుతో తిరిగి నడవ గలిగింది.

శారీరకంగా కోలుకున్న మానసికంగా ఎంతో బాధపడుతున్న అరుణిమను చూసి సోదరుడు ఓంప్రకాశ్ ఆమెను ధైర్యంగా నిలిచాడు. ‘‘రెండుకాళ్లు లేని మార్క్ ఇన్ గ్లిస్ ఎవరెస్ట్ శిఖరాన్ని అవరోధించినప్పుడు దాన్ని నువ్వు కూడా సాధించగలవు. నువ్వు అలాంటి ప్రయత్నం చెయ్’’ అంటూ ఆమెలో బలాన్ని పెంచాడు. మొదట ఆమె కోరిక మేరకు సోదరుడు ప్రముఖ షూటర్ జస్పాల్ దగ్గరకు తీసుకెళ్లాడు. ఈమెకు తనమీద తనకున్న దృఢసంకల్పాన్ని గుర్తించి, ఈమెకు షూటింగ్ లో శిక్షణ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు.

తరువాత అన్నయ్య ఓంప్రకాశ్ సహాయంతో ఎవరెస్ట్ విజేత బచేంద్రిపాల్ ను కలుసుకుంది. అరుణిమ అంగవైకల్యం సమస్యతో బాధపడుతున్నప్పటికీ.. ఈమెలో వున్న దృఢసంకల్పాన్ని గుర్తించి, ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కడంలో శిక్షణ ఇచ్చేందుకు ముందుకొచ్చింది బచేంద్రిపాల్. అప్పుడు టాటా స్టీల్ అడ్వెంచర్ ఫౌండేషన్ సారథ్యం వహిస్తున్న ఆమె తన సంస్థ తరఫున అన్నిరకాలుగా సహాయాన్ని అందించింది. నాలుగు నెలల శిక్షణ తరువాత అరుణిమ శారీరక శ్రమకు అలవాటు పడింది. శిక్షణలో భాగంగా ఎత్తైన కొండలు ఎక్కినప్పుడు కార్బన్ వ్యాక్స్ కాలు మొరాయించేది కానీ అనుకున్నది సాధించేంతవరకు వెనుదిరిగేది లేదంటూ కఠోర పరిశ్రమను కొనసాగించింది.

ఒకరోజు బచేంద్రిపాల్, అరుణిమకు శిక్షణలో భాగంగా 21,725 అడుగుల ఎత్తున్న చమ్సేర్ కంగ్రి శిఖరానికి తీసుకెళ్లింది. ఇందులో నువ్వు జయిస్తే విజయానికి దారి తెరిచినట్లేనని ఆమె అరుణిమతో పేర్కొంది. ఇక ఆమె తడబడకుండా తన లక్ష్యాన్ని ఛేదించేందుకు ముందుకు నడిచింది. మొదట 21,110 వరకు గర్వంగా పైకెక్కిన ఆమెకు.. మరో 600 అడుగుల ఎత్తును చేరుకుంటండగా మంచువర్షం అడ్డుపడింది. అయినా ఒంటికాలితో అంత ఎత్తుకు చేరుకున్న మొదటి మహిళవి నువ్వేనంటూ బచేంద్రిపాల్ హత్తుకుని ఆమెకు చెప్పింది. ‘‘ఇక వెళ్లు. నువ్వు ఎవరెస్ట్ శిఖరాన్ని అలవోకగా ఎక్కేయగలవు’’ అని ఆమెలో సంకల్పాన్ని పెంచింది.

టాటాస్టీల్ ఆధ్వర్యంలో అడ్వెంచర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎవరెస్టు పర్వతారోహణ బృందం బయలుదేరింది. అందులో భాగంగానే 2013 మొదటివారంలో 20,283 అడుగుల ఎత్తైన సమిట్ ఐలాండ్ శిఖరాన్ని ఈ బృందం అవరోధించింది. దాంతో అరుణిమకు ఆత్మవిశ్వాసం రెట్టిప్పైంది. 29వేల అడుగుల ఎత్తులో వున్న ఎవరెస్టును ఎక్కగలనన్న నమ్మకంతో 2013 ఏప్రిల్ లో ఎవరెస్టు యాత్రను ప్రారంభించింది. పైపైకి సాగిపోయిన అరుణిమ తన ఆశయ శిఖరాన్ని అవరోధించడంలో విజయం సాధించింది. వైకల్యాన్ని అధిగమించి అత్యున్నత శిఖరాన్ని చేరుకున్న తొలిమహిళగా చరిత్ర సృష్టించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles