Telugu content

madhubala movies, bollywood, old classic, movies, indian, cinema, hindi, film, song, biography

madhubala movies, bollywood, old classic, movies, indian, cinema, hindi, film, song, biography

అందాల నటి మధుబాల

Posted: 04/08/2013 07:40 PM IST
Telugu content

ప్రతిభ పరిమళించకుండానే ఆ ‘అనార్కలి’ రాలిన మొగ్గయింది. అయితేనేం? భారతీయ సినీ సాగరంలో ఓ తియ్యని తేనె అల - మధుబాల. ఆమె అందాన్ని చూసి అమెరికన్ పత్రికలే ‘వావ్’ అన్నాయి. ఆమె అభినయానికి దాసోహమై మన ప్రేక్షకులు ‘వహ్వా’ అన్నారు. సౌందర్యం ఎలా ఉంటుందో తెలియాలంటే మధుబాలను చూస్తే చాలు. ధనస్సు లాంటి కనుబొమలు, సంతృప్తికై వెదుకులాడే కళ్లు, సమ్మోహనమైన చిరునవ్వు, విశాలమైన భుజాలు, పొంగిపొరలే దేహ లావణ్యాలతో ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన నటి మధుబాల.

సంప్రదాయ పఠాన్ ముస్లిం వనిత మధుబాల. అసలు పేరు ముంతాజ్ బేగం జెహాని దహ్లావి. 1933 వాలెంటైన్స్ డే రోజున న్యూఢిల్లీలో జన్మించింది. తండ్రి అతా ఉల్లాఖాన్‌కి ఆదాయం తక్కువ. పొట్ట కూటికోసం కుటుంబంతో ముంబై వచ్చేశాడు. అక్కడే ఆమె బాల్యం గడిచింది. తన అక్కాచెల్లెళ్లు యాస్మిన్, చంచల్, గంగలతో ఆడుకునేది, పాడుకునేది. కేవలం కుటుంబ పోషణకే ఆమె మేకప్ వేసుకుంది. 1942 నాటి ‘బసంత్’ ఆమె తొలి చిత్రం. వయసు తొమ్మిదేళ్లే. బేబీ ముంతాజ్‌గా తెరపై పేరు. చెప్పలేనంత సంబరం. ‘బసంత్’లో ‘మేరీ చోటీసీ మన్‌మే’ అనే పాట పాడింది. ‘ధన్నా భగత్’ చిత్రంలో చిన్న భజన గీతం కూడా ఆలపించింది బేబీ ముంతాజ్. బాల నటిగా ఆమె ప్రయాణం అయిదారేళ్లు. పది, పన్నెండు చిత్రాలు. సంపాదన నెలకు 45 రూపాయలు. ముద్దుముద్దుగా ఉన్న ముంతాజ్‌కి అందాల నటీమణి దేవికా రాణి ‘మధుబాల’ అని పేరు పెట్టింది.

మన దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాదే మధుబాల హీరోయినైంది - ‘నీల్‌కమల్’ చిత్రంతో! 14 ఏళ్ల మధుబాల నటన ముందు రాజ్‌కపూరే వెలవెలబోయే స్థితి. ఆ తర్వాత ఓ రెండేళ్లు, ఏడెనిమిది సినిమాల్లో తానేమిటో నిరూపించుకుంది. 1949 నాటి ‘మహల్’ చిత్రం హీరోయిన్‌గా మధుబాలను సంపూర్ణంగా ఆవిష్కరించింది. 1950లో మధుబాల ఓ రోజు ఇంట్లో రక్తం కక్కుకుంది. గుండె లోపల రంధ్రం ఉందని, వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ అని డాక్టర్లు చెప్పారు. ఒక్కసారిగా శూన్యమనిపించిందామెకు. ఇంట్లో వారికి తప్ప ఎవ్వరికీ తన బాధను చెప్పలేదు. నిరాశపడలేదు. 1950-54 మధ్య ఆమె కెరీర్ తారాజువ్వయ్యింది. పాతిక వరకు సినిమాల్లో నటించింది. పాత్రల్ని పట్టించుకోలేదు. నటన కన్న అందానికి ఎక్కువ స్థానమున్నా పర్వాలేదనుకుంది. ఆమె నటించిన ‘హంసతే ఆంసూ’... ‘ఎ’ సర్టిఫికెట్ పొందిన తొలి చిత్రం.
గుండెల్లో బాధ ఉన్నా దిగమింగుకుని ఇరవై నాలుగ్గంటలూ షూటింగుల్లోనే గడిపింది. థియేటర్ ఆర్ట్స్ అనే అమెరికన్ పత్రిక 1952 ఆగస్టు సంచికలో మధుబాలపై ప్రత్యేక వ్యాసం ప్రచురించింది. ‘ది బిగ్గెస్ట్ స్టార్ ఇన్ ద వరల్డ్’ అనే శీర్షికతో - అప్పటికి కేవలం 19 ఏళ్లే ఉన్న మధుబాలను ‘అభిమానులనే కాదు భక్తుల్ని’ కలిగిన నటి అని పేర్కొంది ఆ పత్రిక! ‘గత పదేళ్లుగా భారతదేశానికి నాలుగే తెలుసు. జాతీయోద్యమం, స్వాతంత్య్రం, సినిమా, మధుబాల. ఆమె సరసన నిలబడిన హీరోని చూస్తే, పురుషుడు గొప్పవాడన్నదో భ్రమ అని తేలిపోతుంది. మధుబాల చిత్రాలకై బర్మా, మలయా, ఇండోనేషియా, తూర్పు ఆఫ్రికాల్లో అభిమానులు వెర్రెత్తి చూస్తారు’ - అని ఆ పత్రిక కొనియాడింది.‘అలాంటి అందాల కుందనపు బొమ్మను దర్శించుకోవాలంటే ముంబై వెళ్లండి - హాలీవుడ్ స్టార్లు ఉండే లాస్ ఏంజెల్స్‌లోని బావర్లీ హిల్స్ కాదు’ అంటాడు ఆ వ్యాసం రాసిన డేవిడ్ కార్‌‌ట. ఈ ఆర్టికల్ చదివిన ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు ఫ్రాంక్ కాప్రా పరిగెత్తుకుని ముంబై వచ్చాడు. మధుబాలను దర్శించుకున్నాడు. ఈ సౌందర్యమూ, నటనావైదుష్యమూ ప్రపంచానికి తెలియాలన్నాడు. హాలీవుడ్‌లో నటించమని ప్రాధేయపడ్డాడు. కాని మధుబాల తండ్రి కుదరదని స్పష్టం చేశాడు. కూతురి ఆరోగ్యం గురించి అతనికి తెలుసు కదా!

1954లో మద్రాస్‌లో ‘బహుత్ దిన్ హువే’ షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో ఆమె బాగా నీరసించిపోయి, ఒక దశలో లొకేషన్‌లోనే భళ్లున రక్తం కక్కుకుంది. అది పత్రికల్లో ప్రధాన వార్తయ్యింది. ఆమె అనారోగ్యం గురించి లోకానికి తెలిసిపోయింది.దిలీప్‌కుమార్‌తో మధుబాల స్నేహం ఓ భగ్నమైన స్వప్నం. వారిద్దరి తొలి పరిచయం జరిగింది 1944లో. తొలిసారి జంటగా నటించింది 1949 నాటి ‘సింగార్ చిత్రంలో. 1951 నాటి ‘తరానా’లో ఇద్దరూ తెరపైనా, వెనకా కూడా ప్రేమాయణం సాగించారు. అయిదేళ్లపాటు దిలీప్‌తో ఆమె ప్రణయ ప్రస్థానం సాగింది. కూతురి పరిస్థితిని, కెరీర్‌ని దృష్టిలో పెట్టుకుని తండ్రి అతా ఉల్లాఖాన్... అనేక ఆంక్షలు పెట్టేవాడు. మధుబాలను ఎవ్వరూ వ్యక్తిగతంగా కలవకూడదు. మేకప్ రూమ్ మొదలుకుని ఎక్కడైనా సరే! అలాంటిది 1956లో ‘నయా దౌర్’ షూటింగ్ కోసం బి.ఆర్.చోప్రా భోపాల్ రమ్మన్నాడు - మధుబాల, దిలీప్‌కుమార్‌లను. ఇది కావాలని వారిద్దరికీ ఆంతరంగిక అవకాశం కల్పించేందుకు చోప్రా చేస్తున్నాడన్నాడు అతా ఉల్లాఖాన్. కూతుర్ని పంపించనన్నాడు. కోర్టు కేసయింది. మధుబాల ఆ చిత్రం నుంచి వైదొలగింది. కన్నతండ్రికి ప్రాధాన్యమిచ్చి దిలీప్‌కుమార్‌ని దూరం చేసుకుంది మధుబాల.కిషోర్‌కుమార్‌తో మధుబాల ప్రేమ మరో భగ్నమైన స్వప్నం. వీరిద్దరూ కలిసి నటించిన మొదటి సినిమా 1956 నాటి ‘ఢాకే కీ మల్‌మల్’. అప్పుడే వారి మధ్య ప్రణయం చిగురించింది. 1958లో చల్తీ కా నామ్ గాడీ చిత్రంలో కూడా ఇదే జంట. అదే వరస. ప్రేమ రెమ్మలు తొడిగింది.

ముఖ్యంగా ‘ఏక్ లడ్‌కీ భీగీ భాగీసీ’ పాత్ర చిత్రీకరణలో ఈ ప్రేమ ముదురు పాకాన పడింది.అప్పటికే కిషోర్‌కుమార్‌కు రుమాగుహతో పెళ్లయ్యింది. ఓ కొడుకు. రుమా ప్రసిద్ధ బెంగాలీ నటీమణి, గాయని. ఇంత చక్కని కాపురం ఉండగా మధుబాలతో ఏంటిదంతా అంటూ సినిమాటోగ్రాఫర్ అలోక్‌దాస్ గుప్తా ఎంతో చెప్పాడు కిషోర్‌కుమార్‌కి. అయినా ప్రేమ ముందు ఏదీ నిలవలేదు. ఇద్దరూ ఏకంగా పదకొండేళ్లు ప్రేమించుకున్నారు.మధుబాల అంటే గుర్తొచ్చే చిత్రం ‘మొఘల్-ఏ-ఆజమ్’. 1960లో విడుదలైన ఈ చిత్రం మధుబాల నటనా వైదుష్యమేంటో, అందమేంటో, హావభావలాస్యాలేంటో చవిచూపించింది. అదే ఏడాది విడుదలైన బర్సాత్ కీ రాత్ కూడా సూపర్‌హిట్. తానే దర్శకత్వం వహిస్తూ ఫర్జ్ జార ఇష్క్ చిత్రాన్ని నిర్మించాలని మధుబాల ఎంతో ప్రయత్నించింది. కానీ ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆ కల కలగానే మిగిలిపోయింది.

1969లో కిషోర్‌కుమార్, మధుబాల పెళ్లి చేసుకున్నారు. ఆమె ముస్లిం. తాను హిందూ. మరి ఎలా? అందుకే కిషోర్‌కుమార్ ఇస్లాం స్వీకరించాడు. తన పేరుని కరీం అబ్దుల్‌గా మార్చుకున్నాడు. ముస్లిం సంప్రదాయంలో ‘నిఖా’ జరిగింది. తన కుటుంబంలోనూ ఏ అడ్డంకీ రాకూడదని హిందూ పద్ధతిలోనూ పాణిగ్రహణం జరిగింది. అదేం విచిత్రమో... 11 ఏళ్ల ప్రేమ... రెండుమార్లు పెళ్లి. అయినా వారి సంసారం నెల్నాళ్ల ముచ్చటే అయింది.కాపురం పెట్టిన సరిగ్గా నెలరోజులకు మధుబాల భర్తను వదిలేసి బాంద్రాలోని పుట్టింటికి వచ్చేసింది. అయితే విడాకులు తీసుకోలేదు. అలాగని వారు ఓ గూటి గువ్వలూ కాలేదు. పెళ్లయిన కొన్నాళ్లకే ఆమె మరణించింది. తన ఆరోగ్యం సహకరించడం లేదని తెలిసే భర్తకు దూరమైంది. ప్యార్ కియాతో డర్‌నా క్యా అని అనుకోలేకపోయింది - దరిచేరుతున్న మరణతీరం చూసి!

1959 నాటి ఇన్‌సాన్ జాగ్ ఉఠా చిత్రంలో ‘జానూ జానూ’ అనే పాటలో కొంతసేపు గుండెనూయలనూపు నవ్వొకటి వస్తుంది. ఆ నవ్వు ఆ పాట పాడిన ఆశాభోంస్లేది కాదు. ఆ పాటలో జీవించిన మధుబాలది. తన కాలం నాటి ప్రసిద్ధులు - రాజ్‌కపూర్, షమ్మీకపూర్, దిలీప్‌కుమార్, దేవానంద్, సునీల్‌దత్, కిషోర్‌కుమార్... ఇలా అందరితోనూ ఆమె నటించింది. సంప్రదాయ పాత్రల్లోనూ ఒదిగిపోయింది. హౌరా బ్రిడ్జిలో పొట్టి పొట్టి జాకెట్లతో, గౌన్లతో మెరిసిపోయింది.1969 నాటికి ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించింది. మెరుగైన వైద్యం కోసం లండన్ వెళ్లింది. కాని ఆపరేషన్ చేసేంత వైద్య సదుపాయాలు ఆనాడు లేవు. దాంతో నిరాశతో భారత్ వచ్చే సింది. చివరి రోజుల్లో ఆమె సినిమాల్లో నటించాలని ఎంతగా తపించిందో. అయినా కొన్ని చిత్రాల్లో కొన్ని దృశ్యాల్లో నిలబడలేనంత నీరసించిపోయింది. చివరి చిత్రం ‘జ్వాల’లో మధుబాల బదులు ఆమె సోదరి చంచల్ డూప్‌గా నటించింది. చివరకు 1969 ఫిబ్రవరి 23న మధుబాల గుండె చప్పుడు ఆగిపోయింది. మధుభాండం బద్దలైపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles