ఎమ్మెస్ చదివి, విదేశాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నవారెవరైనా స్వదేశంలో స్థిరపడటానికి వెనుకంజ వేస్తారు. స్వదేశానికి వచ్చినా ఏదైనా వ్యాపారాన్నే ఎంచుకుంటారు. ముప్పై ఏడేళ్ల్ల పాతూరి క్రాంతి మాత్రం వ్యవసాయం చేయాలనుకుంది. ‘వ్యవసాయం నష్టాలనే తెస్తుంది ’ అని చెప్పేవారి మాటలను ఖాతరు చేయకుండా ఇష్టంగా చేపట్టింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే...
విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం, ఇట్లామామిడిపల్లిలో నలభై రెండు ఎకరాల మెట్టభూమిలో బంగారాన్ని పండిస్తున్నారు క్రాంతి. లక్షలు వచ్చే ఉద్యోగాన్ని వదులుకొని నష్టాల పాల్జేసే వ్యవసాయాన్ని కోరి ఎందుకు ఎంచుకున్నారని ఎవరైనా అడిగితే వారికి ఆశువుగా తన ఇష్టాన్ని తెలియజేస్తారు క్రాంతి.‘‘నలభై ఏళ్ల క్రితం మా నాన్నగారు చదువుకోసం కృష్ణా జిల్లా నుంచి విశాఖ వచ్చి, ఇక్కడే స్థిరపడ్డారు. చిన్నప్పట్నుంచీ వ్యవసాయమంటే నాకు అమితమైన ఇష్టం ఉండేది. కాని, ఆమాట ఆప్పట్లో ఇంట్లో చెప్పలేకపోయాను. పెళ్లయ్యాక భర్త ప్రదీప్‌తో పాటు అమెరికా వెళ్లాను. అక్కడే ఎమ్మెస్ పూర్తిచేశాను.
పిల్లలు, ఉద్యోగం... ఈ వ్యవహారాలతో పన్నెండేళ్లు బిజీ బిజీగా గడిచిపోయింది. కానీ నా మనసులో వ్యవసాయం గురించిన ఆలోచన అలాగే ఉండిపోయింది. పిల్లలు పెద్దయ్యాక కాస్త ఫ్రీ టైం దొరికింది. దీంతో మళ్లీ చిన్ననాటి ఆశలు మోసులెత్తాయి. ఇండియాకి వెళ్లిపోదామని నా భర్తతో పోరుపెట్టాను. అతి కష్టమ్మీద ఒప్పించగలిగాను. మూడేళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగాలకు రాజీనామాలు ఇచ్చి విశాఖ వచ్చేశాం.
మెట్టభూమిని మెరుగ్గా...
నా భర్త విశాఖలో రెస్టారెంట్ పెట్టారు. నేను వ్యవసాయం ఎక్కడ చేస్తే బాగుంటుందా అని ఆలోచించాను. అన్నీ అనుకూలంగా ఉన్న భూముల్లో నేను చేయదగ్గ వ్యవసాయం ఏముంటుందనే ప్రశ్న వేసుకుని మెట్టభూములు ఎక్కడెక్కడ ఉన్నాయో వాకబు చేశాను. చివరకు నా కల ఫలించింది. నాకు నచ్చిన ఎన్నో పూల మొక్కలే కాదు మన దగ్గర అరుదుగా పెరిగే ఖర్జూర మొక్కలూ నాటించి, ప్రాణంగా పెంచుతున్నాను. కొబ్బరి, జామ, ఉసిరి, మామిడి, కొబ్బరి, మామిడి... ఒకటేమిటి ఎన్నో చెట్లు నా పెంపకంలో ఏపుగా పెరిగాయి. పొలం గట్లనూ వదల్లేదు. పండ్లు, పూలతో పచ్చని నేల తల్లిని చూస్తుంటే మనసులోతుల్లో నుంచి ఎడతెగని సంతోషం నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటుంది. మొదట్లో చాలా కష్టంగా ఉండేది. రోజులో 20 గంటల పాటు భూమిని నా అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడానికే సరిపోయేది. బోర్లు వేయడం, డ్రిప్ సిస్టమ్‌ను అమర్చుకోవడం, మట్టిని టెస్టులు చేయించడం, ఏఏ పంటలు వేయాలో సెలెక్ట్ చేయడం, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు ఎక్కడి నుంచి తీసుకురావాలో, ఎలాంటి మొక్కలు నాటించాలో... అన్నీ దగ్గరుండి చూసుకున్నాను. ఇందుకోసం ఎంతోమంది వ్యవసాయ నిపుణులను సంప్రదించాను. వాతావరణానికి తట్టుకుని పెరిగే మొక్కలెన్నో తెచ్చి నాటించాను.
సరైన ప్లాన్‌తో ముందంజ...
అమెరికాలో ఉన్నప్పుడూ ఇండియా వ్యవసాయం మీద దృష్టిపెట్టేదాన్ని. ఎన్నో వెబ్సైట్లు చూడటం, తెలసిన వారి ద్వారా సమాచారం సేకరించుకోవడం చేసేదాన్ని. చాలామంది నోట ఇండియాలో వ్యవసాయం అంటే నష్టాలే అనే మాట విన్నాను. ఇక్కడికి వచ్చాక కూడా చుట్టుపక్కల రైతులు వ్యవసాయం వల్ల తీవ్ర నష్టాలపాలవుతున్నారని తెలుసుకున్నాను. సరిగ్గా ప్లాన్ చేసుకోకపోవడం వల్లే నష్టాలు వస్తున్నాయని అనిపించింది. మార్కెట్లో ఏ సరుకు అవసరమో గుర్తించి దాన్నే సాగు చేయడం మొదలుపెట్టాను. దీంతో నేను పంటను కోయక ముందే కొనుగోలుదారులు సిద్ధంగా ఉంటున్నారు. ఈమూ కోళ్లకు మంచి డిమాండ్ ఉంది. ఖరీదు కూడా ఎక్కువే. అందుకే 170 ఈము కోళ్లను కూడా పెంచుతున్నాను. నా దృష్టిలో సేద్యం ఒక పని కాదు.. ఒక కళ. అందులో ప్రతిభ చూపితే బంగారం పండుతుంది. అందుకు ఓపిక, సహనం ఎక్కువ అవసరం.
సేంద్రీయ ఎరువులతోనే లాభం...
ఇష్టానుసారం పురుగు మందులు, ఎరువులు వాడేస్తే దిగుబడి ఎక్కువగా వస్తుందనుకోవడం అపోహ. ముందు ఏ పంటకు ఏ తెగులు సోకిందో క్షుణ్ణంగా తెలుసుకుని ఆ మందు పిచికారీ చేయాలి. దీని వల్ల ఖర్చుతగ్గడమే కాకుండా మంచి ఫలితాలు వస్తాయి. పొగాకు పొడి, వేప నూనె వంటి వాటితో తెగుళ్లను నివారించడానికి ప్రయత్నిస్తున్నాను. వాస్తవానికి వీటితో చాలావరకు సమస్య పరిష్కారమైపోతుంది. అప్పుడు కూడా తెగుళ్లు దారికి రాకుంటే రసాయనమందుల వాడతాను. ఎరువుల విషయంలోనూ ఇదే పాటిస్తాను. ఆర్నెళ్లకోమారు భూసార పరీక్షలు చేయిస్తాను. భూమిలో ఏది తక్కువైతే అది మాత్రమే వాడితే సరిపోతుంది. మనం కూడా ఏ విటమిన్లోపిస్తే ఆ మాత్రలే వేసుకుంటాం కదా.. ఇక్కడా అదే పద్ధతి అమలు చేస్తాను. అయితే పశువుల ఎరువునే ఎక్కువగా వాడతాను. ఇంకా సరిపోకపోతే యూరియా ఉపయోగిస్తాను. అందుకే ఇక్కడి కాయగూరల రుచికూడా బాగుంటుందని ఇక్కడి వారు అంటుంటారు. ఒక పంటనే సాగు చేయడం లేదు. అన్నీ అంతర పంటలే. రెండు మూడు పంటలు కలిపి సాగు చేస్తాను. అప్పుడు తక్కువ భూమిలోనే ఎక్కువ ఆదాయం వస్తుంది.
మూడేళ్లలోనే అవార్డు...
ఉదయం ఐదింటి నుంచి సాయంత్రం ఆరు వరకూ ప్రతి మొక్కనూ, చెట్టును పలకరిస్తాను. శుక్రవారం సాయంత్రం విశాఖలోని నా కుటుంబం దగ్గరికి వెళతాను. శని, ఆదివారాలతో నా ఇద్దరి పిల్లల ఆలనా పాలన చూసుకొని, తిరిగి సోమవారం నా ఇష్టమైన వ్యాపకంలో మునిగిపోతాను. వ్యవసాయంలో నేను సాధించిన ప్రగతిని గుర్తించిన సర్కారు ‘రైతు నేస్తం ’ కార్యక్రమంలో భాగంగా ‘ఐవీ సుబ్బారావు’ అవార్డుకు ఎంపిక చేసింది. నా ఆత్మసంతృప్తిని రెట్టింపు చేసింది’’ అంటూ వ్యవసాయం రంగంలో తాను ఎంచుకున్న నవీన పద్ధతులను వివరించారు క్రాంతి.
(And get your daily news straight to your inbox)
Mar 09 | మహిళా దినోత్సవం రోజున మహిళలకు కీర్తించడంతో వారికి సమాజంలో సగం కాలేరు. అందని ఆకాశంలోనూ సగం వారు పోందలేరు. దీంతో నిజానికి మహిళల్లోని సృజనాత్మకత, పరిపాలన దక్షత, నేర్పరితనం, విధుల పట్ల బాధ్యత అన్ని... Read more
Jan 30 | రావిచెట్టు లక్ష్మీ నరసమ్మ (1872 - అక్టోబర్ 24, 1918) మహిళాభ్యుదయానికీ, మాతృభాషలో విద్యాభివృధ్ధికీ, విజ్ఞాన గ్రంథాల ప్రచురణకు తీవ్రంగా కృషి మహిళామణి. తెలంగాణ విద్యావ్యాప్తికి విశేష కృషి చేసిన రావిచెట్టు రంగారావు సతీమణి.... Read more
Jan 21 | ఆమె పేరు ఈశ్వరి.. అమె మీలో ఎవరు కోటీశ్వరులు షోలో పాల్గోంది. ఈ షోలో అమె పార్టిసిపేట్ చేయడం ద్వారా అమె ఒక్కసారిగా లక్షలాది మంది హృదయాలను గెలుచుకోగలిగింది. షోలో ఎంత గెలుచుకుంది అన్న... Read more
Aug 26 | ఎక్కడో యుగోస్లేవియాలో పుట్టి కోల్కత్తా మురికివాడల్లోని అభాగ్యుల జీవితాల్లో వెలుగునింపిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిసా.. తోటివారికి సాయం చేయడానికి తన వ్యక్తిగత జీవితాన్నే త్యాగం చేసి, కష్టాల్లో ఉన్నవారికి వెతికి మరీ సాయమందించి... Read more
Dec 29 | దేశవ్యాప్తంగా పిల్లలందరికీ సరైన పోషకాలు వున్న అహారం అందించాలన్నదే అమె అభిమతం. పోషకాలు లేని ఆహారం ఎంత తింటే మాత్రం ఏంటీ లాభం అని తనను తాను ప్రశ్నించుకున్న అమె.. ముందుగా పోషకాలు అందే... Read more