Bhagavata Purana Thirtytwo | భాగవతం - 32వ భాగం

Bhagavatam thirtytwo story

Bhagavata Purana, Srimad Bhagavatam, Bhagavata, Lord Krishna, Bhagavata Purana Sri Krishna,Bhagavata Purana Thirtytwo Part

Bhagavata Purana also known as Srimad Bhagavata Maha Purana, Srimad Bhagavatam or Bhagavata, is one of Hinduism's eighteen great Puranas (Mahapuranas, great histories). Composed in Sanskrit and available in almost all Indian languages,the Bhagavata Purana asserts that the inner nature and outer form of Krishna is identical to the Vedas and that this is what rescues the world from the forces of evil. An oft-quoted verse is used by some Krishna sects to assert that the text itself is Krishna in literary form.

భాగవతం - 32 వ భాగం

Posted: 07/09/2018 02:04 PM IST
Bhagavatam thirtytwo story

ఒకరోజున సతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తోంది. పైన అందరూ విమానములలో వెళ్ళిపోతున్నారు. అలా వెళుతూ వాళ్ళు చెప్పుకుంటున్నారు. . ‘దక్షప్రజాపతి యాగం చేస్తున్నాడు. ఆహ్వానం వచ్చింది. అందుకని మనందరం వెడుతున్నాం’ అని చెప్పుకుంటుంటే ఆవిడ విని గబగబా అంతఃపురంలోంచి క్రిందికి దిగి శివుడి దగ్గరకు వచ్చి ‘స్వామీ! పుట్టింట్లో ఏదయినా ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్లల మనసంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది. మా నాన్నగారు యాగం చేస్తున్నారట. నాకు నా తండ్రిగారు చేస్తున్న యాగామునకు వెళ్ళాలని అనిపిస్తోంది. మనం కూడా యాగానికి వెళదాం’ అంది. తమకు ఆహ్వానం రాలేదు కదా అన్నట్లుగా శంకరుడు సతీదేవికేసి చూశాడు. ఆయన మనస్సులోని భావనను ఆమె పసిగట్టింది. ‘కొంతమంది పిలిస్తేనే వెళ్ళాలి కొంతమంది పిలవకపోయినా వెళ్ళాలి. తండ్రిగారి ఇంటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళవచ్చు. అంది. అపుడు శంకరుడు ‘దేవీ, నీవు చెప్పినది యథార్తమే. పిలుపు లేకపోయినా సరే పుట్టింటికి ఉత్సవం జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు. కానీ నేను కూడా ఒక మాట చెపుతాను విను. నేను లేచి నమస్కరించ లేదని నీ తండ్రిగారు నన్నొక సభలో అవమానం చేసి మాట్లాడారు. కాబట్టి ఇప్పటికి కూడా వారు నాయందు అనుకూల్యతతో ఉండరు. కాబట్టి ఇప్పుడు మనం వెడితే తలుపు తీసి అసలు పలుకరించరు. మాట్లాడరు. వాళ్ళు మనలను చాలా దారుణంగా అవమానిస్తారు. కాబట్టి బంధువయినా సరే ఆదరణ లేనప్పుడు వాడు ఎంతగొప్పవాడయినా వాడి గడప తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు. కాబట్టి వెళ్ళవద్దు’ అని చెప్పాడు. అపుడు ఆవిడ ‘నాకు వెళ్ళాలని అనిపిస్తోంది’ అంది. అపుడు శివుడు ‘అయితే నీవు వెళ్ళవచ్చు’ అన్నాడు ఆయన త్రికాలజ్ఞుడు, అన్నీ తెలుసు.

వెంటనే తల్లి పుట్టింటికి బయలుదేరింది. ఆమె కాళ్ళకు ఉన్నటువంటి గజ్జెలు మ్రోగుతుండగా పట్టుపుట్టం కట్టుకుని బయలుదేరితే వెంటనే శివుడు సైగ చేశాడు. ప్రమథగణములు అందరూ అమ్మవారి వెంట బయలుదేరారు. అమ్మవారి పుట్టింటికి వచ్చేసరికి దక్షప్రజాపతి ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు. పరవారం అంతా కూర్చుని ఉన్నారు. వృషభవాహనం దిగి సతీదేవి ఇంట్లోకి వస్తోంది. ఏ తల్లి అనుగ్రహం ఉంటే పసుపు కుంకుమలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహం వుంటే ఐశ్వర్యం వస్తుందో అటువంటి తల్లి తన కూతురి దాక్షాయణి అని పేరుపెట్టుకుని నడిచి వస్తోంది. దక్షుడు లేవలేదు, పలకరించలేదు. తండ్రి తన భర్తను నిందించాడు. వచ్చిన కూతురు మీద తండ్రి ప్రేమను చూపించలేదు. ఆమె చాలా బాధపడింది. దీనిని మణిభద్రుడు అన్నవాడు చూశాడు. అమ్మవారు ఉగ్రమయిన తేజస్సుతో చూస్తోంది. ఆమె సమస్త బ్రహ్మాండములను కాల్చివేయ గల శక్తి గలది. ప్రమథగణములు చూశాయి. విచ్చుకత్తులు పైకి తీసి ఈ దక్షుడిని చంపి అవతల పారేస్తామన్నాయి. అమ్మవారు వారించింది. దక్షుడిని తనవద్దకు పిలిచి పరమశివుని నీ చిత్తం వచ్చినట్లు కూశావు. ఇప్పుడు చెపుతున్నాను నీకొక మాట ‘ఎవరయినా శంకరుణ్ణి నిందచేస్తే వాని నాలుక పట్టి పైకి లాగి కొండనాలుక వరకు కత్తితో కోసివేయవచ్చు. అలా నీకు చేయడానికి అధికారం లేని పక్షంలో ఉత్తరక్షణం శివనింద ఎక్కడ జరిగిందో అక్కడ చెవులు మూసుకుని బయటకు వెళ్ళిపోయి ప్రాయశ్చిత్తంగా ఆ రోజు అన్నం తినడం మానివేయాలి. నువ్వు దుర్మార్గుడివి. దుష్టాత్ముడివి. అందుకే శంకరుణ్ణి నిందచేశావు. నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకముందు నేను ఎప్పుడయినా పరమ పవిత్రుడయిన శంకరునిసాన్నిధ్యంలో కూర్చుని వుంటే దాక్షాయణీ అని పిలుస్తారు. దుర్మార్గుడవయిన నీ కుమార్తెగా పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను. అందుకని నేను ఈ శరీరమును వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతాను’ అని పద్మాసం వేసుకుని కూర్చుని ప్రాణాపానవ్యాన వాయువులను నాభిస్థానమునందు నిలబెట్టింది. ఆపైన ఉదాన వాయువును హృదయం మీద నుంచి పైకి తీసుకువచ్చి కనుబొమల మధ్యలో నిలబెట్టి ఇంద్రియములు అన్నితిలోంచి అనిలము అనే అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్ని యందు శరీరమును దగ్ధం చేసి బూడిదకుప్పై క్రిందపడిపోయింది. సభలో హాహాకారములు మిన్నుముట్టాయి. ప్రమథ గణములకు ఎక్కడలేని కోపం వచ్చి కత్తులు తీసి దక్షుడి మీద పడ్డారు. భ్రుగుడికి చాలా సంతోషం కలిగింది. వెంటనే హోమం చేసి అందులోంచి ‘రుభులు’ అనబడే దేవతలను సృష్టించి రుద్ర గణములను తరిమికోట్టించాడు. ఈ విషయములను నారదుడు వెళ్ళి శంకరునకు చెప్పాడు. ఆయన ప్రశాంతంగా ధ్యానమగ్నుడై కూర్చుని ఉన్నాడు. శంకరునకు ఎక్కడలేని కోపం వచ్చేసింది. ఇంత శాంతమూర్తి రుద్రుడయిపోయాడు. ఒక్కసారి లేచాడు. పెద్ద వికటాట్టహాసం చేశాడు. ఆ నవ్వుకి బ్రహ్మాండములు కదిలిపోయాయి. మెరిసిపోతున్న జటనొకదానిని ఊడబెరికి నేలకేసి కొట్టాడు. ఒక్కసారి అందులోంచి ఒక పెద్ద శరీరం పుట్టింది. ఆ శరీరమును చూసేటప్పటికే హడలిపోయారు అందరూ. వీరభద్రావతారం ఉద్వేగంతో ఒక్కసారి దూకి శంకరుని పాదములకి నమస్కరించి బయల్దేరాడు. బయల్దేరేముందు పరమశివుడి కి ప్రదక్షిణం చేసి ‘తండ్రీ, నాకు ఏమి ఆనతి’ అని అడిగాడు. ‘సతీదేవి శరీరమును విడిచిపెట్టింది. దక్షయజ్ఞమును ధ్వంసం చెయ్యి’ అన్నాడు శంకరుడు.

వీరభద్రుడు ఒక పెద్ద శూలం పట్టుకు బయలుదేరాడు. ఆయనతో ప్రమథ గణములన్నీ వచ్చేస్తున్నాయి. ఆ శబ్దమును యాగంలో వున్న వాళ్ళు విన్నారు. దక్షప్రజాపతి భార్య ‘ఉపద్రవం వచ్చేసింది’ అనుకుంది. వీరభద్రుడు రుద్రగణములతో కలిసి యజ్ఞమంటపములన్నిటినీ పడగొట్టేశాడు. పిమ్మట నందీశ్వరుడు భ్రుగువు దగ్గరకు వెళ్ళాడు. ‘ఆనాడుసభలో శంకర నిండా జరుగుతుంటే కళ్ళు ఎగుర వేసిన వాడివి నీవేకదా! ఇప్పుడు దానికి తగిన శిక్ష అనుభవిస్తావు’ అని గడ్డం క్రింద ఎడమచెయ్యి వేసి పట్టుకొని ముంజికాయను బొటనవ్రేలు పెట్టి పైకెత్తేసినట్లు బొటనవేలితో రెండు కనుగుడ్లు ఉత్తరించేశాడు. అప్పుడు భ్రుగుడి కళ్ళు ఊడి క్రిందపడిపోయాయి. ‘పూష’ అనే సూర్యుడు ఉన్నాడు. ‘ఏమయ్యా, నువ్వు శంకర నింద జరుగుతుంటే పెద్దగ నోరు తెరచి నవ్వావు. ఇప్పుడు నీకు శిక్ష చూడు’ అని ఆయన నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు. రెండుదవడలు తెరిచి పళ్ళు పీకేశారు. ఆఖరున వీరభద్రుడు దక్షప్రజాపతి దగ్గరకు వెళ్ళాడు. ఆయనను క్రిందపారేసి గుండెలమీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠమును కోసేశాడు. కంఠం తెగలేదు. ఆశ్చర్యపోయాడు. దక్షుని శరీరం అంతా మంత్రపూతమయిపోయి వుంది. ఎలా త్రుంచాలా అని ఆలోచించాడు. ‘ ఈ దుర్మార్గుడు శివ నింద చేసినందుకు యజ్న పశువు శరీరమును ఎలా తుంచేస్తానో అలా తుంచేస్తాను అని గుండెల మీద కుడి కాలు వేసి తొక్కిపట్టి తోటకూర కాదను తిప్పెసినట్లు కంఠమును తిప్పేసి ఊడబెరికి దానిని తీసుకువెళ్ళి యజ్ఞంలో వెలుగుతున్న అగ్నిహోత్రంలో పారవేశాడు. ఆ శిరస్సు యజ్ఞంలో కాలిపోయింది. తలలేని మొండెం ఉండిపోయింది. అక్కడ వాళ్ళని రక్షించిన వాడు లేదు. శివనింద ఎంత ప్రమాదకరమో, భగవంతుని యందు భేద దృష్టి ఎంత ప్రమాదకరమో వ్యాసుల వారు జాతికి భిక్ష పెట్టి చెప్తున్నారు. మనం ఈశ్వరుడిని ఒక్కడిగా చూడడం నేర్చుకోవాలి. లేకపోతే పాడైపోతాము. అప్పుడు అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి ‘అయ్యా, పాపకర్మ చేశాము దానివలన ఇంత ఉపద్రవం వచ్చింది. ఏమి చేయమంటావు’ అని అడిగారు.

అపుడు బ్రహ్మగారు ‘పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేశారా? ఎందుకు ఆ యజ్ఞం? మీకు ఒక్కటే మార్గం ఉంది. మీరు ఎవరిపట్ల తప్పు చేశారో వాని దగ్గరకు వెళ్ళి కాళ్ళమీద పదిపొంది. ఎన్ని తప్పులు చేసినా ఆయన కాళ్ళమీద పడిపోతే మరల రక్షిస్తాడు’ అని సలహా చెప్పాడు. అపుడు వాళ్ళు ‘మాతో నీవు కూడా రావలసింది’ అని ప్రార్థించారు. ‘సరే పదండి’ అని బ్రహ్మగారు వీరిని తీసుకొని కైలాసం వెళ్ళారు. వీరు వెళ్లేసరికి అత్యంత ప్రశాంతచిత్తుడై ఒక రావిచెట్టు క్రింద శంకరుడు కూర్చుని ఉన్నాడు. బ్రహ్మగారు వెళ్ళి పరమశివుని ముందు స్తోత్రం చేశారు. అయ్యా, తెలియక నీపట్ల దోషం చేశారు. నీవు సాక్షాత్తు పరబ్రహ్మవు. సృస్టిస్థితిలయ ఈ మూడూ నీయందు జరుగుతుంటాయి. తెలియనటువంటివారు ఈ రకంగా అపచార బుద్ధితో ప్రవర్తించారు. వీరిని క్షమించు’ అన్నారు బ్రహ్మగారు.

మహానుభావుడు భోళాశంకరుడు కదా! అభయంకరుడు. ‘మీ అందరికీ నిష్కల్మష చిత్తంతో అభయం ఇస్తున్నాను.’ యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. ఎవరు యజ్ఞము చేయాలో అటువంటి దక్ష ప్రజాపతికి ఈవేళ ముఖం లేదు. అందుకని దక్షుని మొండెమునకు గొర్రె ముఖమును తీసుకువెళ్ళి అతికించండి. మిగిలిన యజ్ఞభాగాన్ని పూర్తిచేస్తాడు. పూష తానూ ఏదయినా తినవలసి వచ్చినపుడు యజమాని దంతములతో తింటాడు. భ్రుగునికి నేతములు ఇస్తాను. కానీ ఇకనుంచి తాను తినవలసినటువంటి హవిస్సులు భ్రుగువుకి కనపడతాయి. ఎవరెవరు దెబ్బలు తిన్నారో ఎవరెవరు అంగవికలురు అయ్యారో వాళ్ళందరికీ తిరిగి స్వాస్థ్యమును ప్రసాదిస్తున్నాను. ఈ యజ్ఞమును సంతోషంతో పూర్తి చేసుకోండి’ అని వరములను ఇచ్చేశాడు. దక్షప్రజాపటికి గొర్రె తలకాయ తీసుకు వెళ్ళి పెట్టారు. వెంటనే ఆయన లేచి నిలబడి పరుగెత్తుకుంటూ కైలాసమునకు వఛి శంకరుణ్ణి చూసి ప్రార్థన చేశాడు. ‘స్వామీ నీవు నన్ను దండించడాన్ని రక్షణగా భావిస్తున్నాను. దీనివలన ఇక భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరూ ఇటువంటి అపరాధములు చేయకుందురు గాక! స్వామీ నన్ను మన్నించు’ అని నమస్కరించాడు. వెళ్ళి యాగమును పూర్తిచెయ్యి అన్నాడు శంకరుడు. తరువాత దక్ష ప్రజాపతి తన యజ్ఞమును పూర్తిచేసి శ్రీమన్నారాయణుని స్తోత్రం చేస్తే అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. ‘స్వామీ నీవు యజ్ఞభర్తవి అని నమస్కరించాడు. ఎవరు దక్షయజ్ఞ ద్వంసమును చదువుతున్నారో వారికి తుట్టతుద ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి శివనామమును చెప్తూ కైవల్యమును పొందగలరు. అటుఅవంటి గొప్ప ఫలితమును దక్షయజ్ఞ ధ్వంసమునకు ప్రకటించారు

Source: fb.com/LordSriRamaOfficalPage

 

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty four story

    రామాయణం-44వ-భాగం

    Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

  • Ramayanam forty three story

    రామాయణం-43వ-భాగం

    Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more