Ramayanam-Forty-Three | రామాయణం - 43వ భాగం

Ramayanam forty three story

Ramayana, Ramayana Forty-Three, Ramayana Story, Ramayana Epic Story, Ramayana Parts, Ramayanam 43th Part

The Ramayana is an ancient Sanskrit epic about Rama. It is one of the two most important ancient epics of India, the first one being the ancient Ramayana. The epic was originally written by sage (rishi) Valmiki of Ancient India. The book has about 96,000 verses and is divided into seven parts.

రామాయణం-43వ-భాగం

Posted: 08/27/2018 01:57 PM IST
Ramayanam forty three story

అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర మార్గం మీదుగా పయనమయ్యాడు. అలా వెళుతుండగా ఆయనకి ఒక పెద్ద వట వృక్షం కనబడింది.(తన తల్లి అయిన వినతకి దాస్య విముక్తి చెయ్యడానికని, గరుక్మంతుడు అమృతం తేవడానికి బయలుదేరేముందు తన తండ్రి అయిన కశ్యపుడిని అడిగాడు, నేను ప్రయాణం చేసేటప్పుడు ఆకలి వేస్తుంది కదా, అప్పుడు ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని. అప్పుడా కశ్యపుడు " నువ్వు హిమాలయ పర్వతాలకి దెగ్గరగా వెళుతున్నప్పుడు ఒక పెద్ద సరోవరం కనబడుతుంది, ఆ సరోవరం ఒడ్డున రెండు గజకచ్ఛపాలు కొట్టుకుంటూ ఉంటాయి. అవి ఒక తాబేలు ఒక ఏనుగు. పూర్వకాలంలో, ఒక బ్రాహ్మణుడికి విభాసుడు, సుప్రతీకుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆ బ్రాహ్మణుడు మరణించిన కొంత కాలానికి ఆ అన్నదమ్ముల మధ్య ఆస్తి పంపకాలలో తేడాలు వచ్చి, ఒకరిని ఒకరు శపించుకున్నారు. విభాసుడు సుప్రతీకుడిని ఒక పెద్ద ఏనుగుగా అవ్వమని, సుప్రతీకుడు విభాసుడిని ఒక పెద్ద తాబేలుగా అవ్వమని శపించుకున్నారు. ఆ తాబేలు చుట్టుకొలత 10 యోజనములు, మందం 3 యోజనములు ఉంటుంది. ఆ ఏనుగు 6 యోజనముల ఎత్తు, 12 యోజనముల పొడువు ఉంటుంది. ఏనుగు తాబేలుని బయటకి లాగాలని చూస్తుంటుంది, తాబేలేమో ఏనుగుని నీళ్ళల్లోకి లాగెయ్యాలని చూస్తుంది, అవి అలా కొన్ని వేల సంవత్సరముల నుండి కొట్టుకుంటూ ఉన్నాయి. అవి అలా కొట్టుకుంటూ ఉండడం వలన ఆ చుట్టుపక్కల ఎవరూ ఉండడంలేదు. కనుక ఆకలి వేస్తే ఆ రెండిటినీ తినేసెయ్యి " అని కశ్యప ప్రజాపతి అన్నాడు. గరుక్మంతుడు సరే అని బయలుదేరాడు, అలా వెళుతూ వెళుతూ ఆ ఏనుగుని, తాబేలుని చూశాడు. ఆ రెండింటినీ తన కాలి గోళ్ళతో పైకి ఎత్తి, న్యగ్రోధం అనే మహావృక్షం యొక్క కొమ్మ మీద ఆ రెండిటినీ పెట్టాడు. ఆ గజకచ్ఛపాల బరువుకి ఆ కొమ్మ విరిగిపోతుండగా, గరుక్మంతుడు తన ముక్కుతో ఆ కొమ్మని పైకి ఎత్తి ఒక భద్రమైన స్థానానికి చేర్చాడు. తరువాత ఆ గజకచ్ఛపాలని ఒక పర్వతం మీద పెట్టుకొని తినేశాడు. ఆ తరువాత ఇంద్రుడి దెగ్గరికి వెళ్ళి అమృతాన్ని తెచ్చి వినతని దాస్యం నుండి విముక్తురాలిని చేశాడు. ఆనాడు గరుక్మంతుడు ఆ గజకచ్ఛపాలని పెట్టినది ఈ వృక్షం మీదనే). రావణుడు ఆ న్యగ్రోధం అనే వృక్షాన్ని చూసి, కిందకి దిగి చుట్టూత చూసేసరికి, ఆయనకి ఒక తాపస ఆశ్రమం కనబడింది.

అప్పుడాయన ఆ ఆశ్రమంలోకి వెళ్ళి చూడగా, అందులో నారచీర కట్టుకొని, జటలు వేసుకొని, నియమముతో ఆహారాన్ని తింటున్నటువంటివాడై, ఒకప్పుడు రాక్షసుడైనటువంటి మారీచుడు కనబడ్డాడు. అప్పుడా రావణాసురుడు " ఓ మారీచా! నేను ఇప్పుడు చాలా కష్టంలో ఉన్నాను. నీవంటి మహాత్ముడు కాకపోతే నాకు ఎవరు ఉపకారం చేస్తారు. నువ్వు నాకు తప్పకుండా ఉపకారం చెయ్యాలి. నీకు తెలుసు కదా, జనస్థానంలో 14,000 రాక్షసులను నియమించి మునుల యొక్క ధర్మాల్ని, యజ్ఞాలని నాశనం చెయ్యమని చెప్పాను. నేను చెప్పిన పనులని వాళ్ళు ఎంతో శ్రద్ధా భక్తులతో ఆచరిస్తుండగా ఎక్కడినుంచో రాముడు వచ్చి ఖరుడిని, దూషనుడిని, త్రిశిరస్కుడిని, మహాకపాలుడిని మరియు 14,000 రాక్షసులను ఒక్కడే చంపేశాడు. నా మనస్సుకి ఎంత బాధగా ఉందో తెలుసా. రాముడు కర్కశుడు, తీక్ష్ణ స్వభావం ఉన్నవాడు, మూర్ఖుడు, లుబ్ధుడు, ఇంద్రియాలని జయించనివాడు, ధర్మాన్ని విడిచిపెట్టినవాడు, అన్ని ప్రాణులను భయపెట్టేవాడు, దశరథుడికి అసహ్యం వేసి రాముడిని అరణ్యాలకి వెళ్ళగొట్టాడు, అందుకని నేను రాముడిని బాధపెట్టాలని అనుకుంటున్నాను. ఏ పాపం ఎరుగని పిచ్చి తల్లి నా చెల్లి శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. నన్ను ఇంత బాధపెట్టిన రాముడిని బాధపెట్టడానికి ఆయన భార్య అయిన సీతని అపహరించి తీసుకొద్దామని అనుకుంటున్నాను. రాముడితో యుద్ధం చేసి సీతని తీసుకురావడమనేది చాలా కష్టంతో కూడుకున్న పని, అందుకని ఏ యుద్ధమూ చెయ్యకుండా పని జెరిగిపోయే ఉపాయం ఒకటి నేను ఆలోచించాను. ఇప్పుడది నీకు చెబుతాను విను. నీకు సమస్త మాయలు తెలుసు కనుక, నువ్వు బంగారు లేడిగా మారిపో. నీ ఒంటిమీద వెండి చుక్కలు ఉండాలి, ఇంతకుముందు ఎవ్వరూ చూడని కొమ్ములు ఉండాలి. నువ్వు సీత కంటపడేటట్టుగా ఆశ్రమంలో పరిగెత్తు, అటూ ఇటూ ఆడు. అప్పుడు సీత నిన్ను చూసి, ఆ మృగం కావాలి అని అడుగుతుంది. సీత కోరిక తీర్చడం కోసం రాముడు నీ వెనకాల వస్తాడు, అప్పుడు నువ్వు అదృశ్యమవుతూ కనబడుతూ రాముడిని చాలా దూరం తీసుకుపో, అలా కొంత దూరం వెళ్ళాక హా! సీత, హా! లక్ష్మణా అని రాముడి కంఠంతో అరువు. రాముడికి కష్టం వచ్చిందనుకొని సీత లక్ష్మణుడిని పంపిస్తుంది. అప్పుడు నేను వెళ్ళి సీతని, రాహువు చంద్రుడిని ఎత్తుకొచ్చినట్టు ఎత్తుకొస్తాను. అందుకని నువ్వు బంగారు జింకగా మారిపో " అన్నాడు.

ఈ మాటలు విన్న మహాత్ముడైన మారీచుడు, దేవతలు కనురెప్ప వెయ్యకుండా ఎలా నిలుచుంటారో అలా నిలుచుండిపోయాడు. శవం నిలబడితే ఎలా ఉంటుందో అలా నిలబడ్డాడు. తరువాత ఆయన అన్నాడు.....

సులభాః పురుషా రాజన్ సతతం ప్రియ వాదినః |

అప్రియస్య చ పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః ||

" రావణా! మన మనస్సుకి ఇష్టమయ్యేటట్టు మాట్లాడేవాళ్ళు చాలామంది దొరుకుతారు, కాని వాళ్ళు మనన్ని అభ్యున్నతి వైపుకి నడిపించేటట్టుగా మాట్లాడేవారు కాదు. కొంతమంది మాట్లాడితే అప్రియంగా మాట్లాడినట్టు ఉంటుంది, కాని ఆ మాటలలో అవతలివారి అభ్యున్నతిని గూర్చిన మాటలు ఉంటాయి. అలా మనకి మంచి చెప్పేవాడు దొరకడు, ఒకవేళ అలాంటివాడు దొరికినా వినేవాడు దొరకడు. నీకు ఎవరో గూఢచారులు చెబితే రాముడి గురించి విన్నావు. ఆ గూఢచారి పరమ దుర్మార్గుడు, నీ మీద కక్షకట్టి నీ ప్రాణములు తియ్యాలని చూస్తున్నాడు. అందుకని నీకు అన్నీ అసత్యములు చెప్పాడు. నువ్వు ఇప్పటిదాకా రాముడి గురించి చెప్పినవన్నీ అబద్ధాలు. రాముడు మహా ధర్మాత్ముడు, మహేంద్రుడికి, వరుణుడికి ఎటువంటి పరాక్రమము ఉంటుందో రాముడికి అలాంటి పరాక్రమము ఉంది. అందరూ వచ్చి రాజ్యం తీసుకో అని అడిగినా, తన తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కొసమని రాముడు అరణ్యాలకి వచ్చాడు. నీ మాటలు వింటుంటే నాకు ఒక అనుమానము వస్తుంది, సీతమ్మ మానవ స్త్రీ కాదు, నిన్ను చంపడానికని, రాక్షస కులాన్ని నాశనం చెయ్యడానికని భూమిమీదకి వచ్చిన దేవతా స్త్రీ. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నువ్వు నశించిపోతావు, నీతోపాటుగా లంకా పట్టణం నశించిపోతుంది, రాక్షసులందరూ భూమిమీద పడి నశించిపోతారు. నీకు ఎవరో అబద్ధాలు చెప్పారు, ఆ మాటలు విని అన్నీ నీకు తెలుసనుకొని ఆ మాటలు ఇంకొకరికి చెబుతున్నావు. నువ్వు రాజువి, ఇంత చపలబుద్ధితో ఉండకూడదు.

రామో విగ్రహవాన్ ధర్మః సాధుః సత్య పరాక్రమః |

రాజా సర్వస్య లోకస్య దేవానాం ఇవ వాసవః ||

ప్రపంచంలో ఉన్న ధర్మాన్ని తీసుకొచ్చి ఒకచోట పోసి, దానికి ప్రాణం పోస్తే, ఆయనే రాముడు. సత్యమే పరాక్రమముగా కలిగినవాడు. రాముడు ఈ లోకములన్నిటికి రాజు. అటువంటి రాముడి జోలికి వెళితే నువ్వు నాశనమయిపోతావు. నీకు తెలియక సీతమ్మని తీసుకొస్తాను అంటున్నావు, ఆమె బూది కప్పిన నిప్పు, తన తేజస్సుతో తనని రక్షించుకోగలదు. ఆమె కారణజన్మురాలు. రాముడి యొక్క కోదండం నీడలో రక్షింపబడుతున్న సీతమ్మని అపహరించి తేవడం నీ తరం కాదు రావణ! ఆవిడని అపహరించడానికి నీ శక్తి సరిపోదు.

జీవితం చ సుఖం చైవ రాజ్యం చైవ సుదుర్లభం |

యత్ ఇచ్ఛసి చిరం భోక్తుం మా కృథా రామ విప్రియం ||

నీకు రాజ్యం ఉంది, నిన్ను కామించన భార్యలు కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళతో నువ్వు హాయిగా జీవితాన్ని గడపాలి అనుకుంటే, రాముడి పట్ల అప్రియాన్ని మాత్రం చెయ్యకు. నీకు ఒక విషయం చెబుతాను గుర్తుపెట్టుకో, నేను కూడా ఒకప్పుడు నీలాగే విర్రవీగాను. ఆ రోజుల్లో నేను నల్లటి శరీరంతో ఉండి, బంగారు కుండలాలు పెట్టుకొని, వర గర్వంతో మదించి ఉండేవాడిని. ఆ సమయంలో విశ్వామిత్రుడంతటివాడు యాగం చేస్తుంటే, నేను ఆ యాగాన్ని ధ్వంసం చేశాను. అప్పుడు విశ్వామిత్రుడు అయోధ్య నుంచి రాముడిని, లక్ష్మణుడిని తీసుకొచ్చాడు. అప్పుడు వాళ్ళిద్దరూ యాగం చుట్టూ తిరుగుతూ ఆ యాగాన్ని రక్షిస్తున్నారు. యాగం చివరికి వచ్చాక ఆ యాగాన్ని ధ్వంసం చెయ్యాలనుకొని నేను ఆకాశ మార్గంలో వచ్చి చూశాను. ఇప్పుడు నీకెంత పొగరుందో, అప్పుడు నాకంత పొగరుండేది.

అజాత వ్యంజనః శ్రీమాన్ బాలః శ్యామః శుభేక్షణః |

ఏక వస్త్ర ధరో ధన్వీ శిఖీ కనక మాలయా ||

నేను కిందకి చూసేసరికి, మెడలో ఒక బంగారు గొలుసు వేసుకుని, మీసాలు సరిగ్గా రాని, పద్మములవంటి కన్నులున్న, ఒక్క వస్త్రం కట్టుకుని, చేతిలో కోదండం పట్టుకొని, పిలక పెట్టుకొని ఉన్నవాడిని చూశాను. విశ్వామిత్రుడు వెళ్ళి ఈ పిల్లవాడినా తీసుకొచ్చింది, వీడా నన్ను చంపేవాడు అని, నువ్వు ఇప్పుడు ఎలా అనుకున్నావో నేను కూడా అప్పుడు అలానే అనుకున్నాను. బాలచంద్రుడివంటి ముఖంతో ఉన్న ఆ రాముడు నన్ను ఏమి చేస్తాడులే అని నేను ఆ యాగ గుండంలో రక్తాన్ని వర్షించాను. అప్పుడు రాముడు నన్ను ఒక బాణం పెట్టి కొడితే నేను 100 యోజనముల అవతల సముద్రంలో పడిపోయాను. కొంతకాలానికి నాకు తెలివి వచ్చింది. అప్పటినుంచి నాకు రాముడన్నా, రామబాణం అన్నా హడల్.

పాములున్న సరోవరంలోకి చేరిన చేపలు ఎలా నశించిపోతాయో, తాను ధర్మంగా బతుకుతున్నా, అధర్మాత్ముడితో స్నేహంపెట్టుకున్నవాడు కూడా అలానే నశించిపోతాడు. అందుకని నీతో స్నేహం పెట్టుకోవడానికి నాకు భయంగా ఉంది. అసలు నీకు పరుల భార్యలని తెచ్చుకోవాలనే కోరిక ఏమిటి? నీకు ఉన్నటువంటి వేల భార్యలతో సుఖంగా ఉండలేవా? ఇప్పటిదాకా బాగానే ఉన్న నీకు ఇటువంటి పాడు బుద్ధి ఎందుకు కలిగింది? రాముడి జోలికి వెళ్ళమాకు నాశనమయిపోతావు.

ఆనాడు రాముడి బాణపు దెబ్బ తిన్నాక కొంతకాలానికి నాకు మళ్ళి అహంకారం పుట్టుకొచ్చింది. రాముడు మళ్ళి కనబడడులే అని ఒక పెద్ద మృగ రూపం పొందాను. నాకున్న పాత స్నేహితులిద్దరితో కలిసి తాపసులని చంపి, వారిని భక్షిద్దామని మేము బయలుదేరాము. అలా కొన్ని ఆశ్రమాల మీద దాడి చేసి, అక్కడున్న తాపసులని భుజించాము. తరువాత మేము అలా తిరుగుతుండగా నాకు నారచీర కట్టుకుని, జటలు వేసుకుని, సీతమ్మతో, లక్ష్మణుడితో కలిసి కోదండం పట్టుకుని ఉన్న రాముడు కనిపించాడు. అయితే రాముడు మారిపోయాడు, ఇప్పుడాయన ఒక తాపసి కనుక నేను తినేయ్యచ్చు అనుకొని, నా స్నేహితులిద్దరిని ప్రోత్సహించి రాముడి మీదకి పంపాను. అప్పుడు రాముడు వాళ్ళిద్దరిని రెండు బాణములతో సంహరించాడు. నేను కనపడితే రాముడు నన్ను చంపెస్తాడని, ఆయనకి కనపడకుండా పారిపోయి వచ్చేసాను. అప్పటినుంచీ నాకు నిద్రలో రాముడు కోదండం పట్టుకొని కనపడుతున్నాడు, నేను ఉలిక్కిపడి లేచిపోతుంటాను. అందుకని ఇక చంపడాలు మానేసి, నారచీర కట్టుకుని, శాఖాహారం తింటూ, తపస్సు చేసుకుంటున్నాను.

అలా నేను ఏ కందమూలాలో తెచ్చుకుందామని బయటకి వస్తే, ప్రతి కొమ్మ మీద, కాయ మీద, గడ్డిపరక మీద, భూమి మీద, నీటి మీద, ప్రతీ చోట నన్ను చంపడానికి యముడు వచ్చినట్టు రాముడు కనపడుతుంటాడు. అందుకని నేను బయటకి కూడా వెళ్ళడం లేదు. నాకు ఇప్పుడు కన్ను మూసినా, తెరిచినా రాముడే కనపడుతున్నాడు. నాకు అంతా రామమయమై కనపడుతుంటే, నేను ఎవరిని బాధపెట్టను, ఎవరి జోలికి వెళ్ళను? రావణా! ఇవ్వాళ నా పరిస్థితి ఏంటో తెలుసా, నా దెగ్గరికి ఎవరన్నా వచ్చి రథము అని అందామనో, లేకపోతే రత్నము అని అందామనో, 'ర' అని పలుకగానే, వారు తరువాత 'మ' అంటారేమో అని నేను పారిపోతున్నాను. నీ తీట తీరక యుద్ధం చేస్తాను అంటె, యుద్ధం చేసుకో, నా మాటలు విని నీ కోరిక తీరిపోతే ఎలా వచ్చావో అలా వెళ్ళిపో. ఈ రెండిటిలో ఏదో ఒకటి చెయ్యి, ఇందులోకి నన్ను మాత్రం లాగకు.

ప్రతీసారి మా చెల్లి ముక్కు చెవులు కోసేసాడు అంటున్నావు కదా, అసలు మీ చెల్లి ఏమి చేసిందని ఆవిడ ముక్కు చెవులు కోసేసారో అని మీరెవరన్నా అడిగార. ఇలా అడగకుండా వెళ్ళిన ఆ ఖరుడు మరణించాడు. నువ్వు కూడా అదే మార్గంలో వెళ్ళిపోతున్నావు. నామాట విని ఇటువంటి పనులు చెయ్యకు " అని మారీచుడు అన్నాడు.

మారీచుడు చెప్పిన మంచి మాటలు తలకి ఎక్కకపోవటం వలన రావణుడు ఇలా అన్నాడు " అన్ని గొప్పలు చెబుతావేంటి రాముడి గురించి, రాముడు కేవలం ఒక మనిషి, నాదెగ్గర రాముడిని పొగడద్దు, నా నిర్ణయం మారదు. ఖరుడు వెళ్ళిన మార్గంలోనే రాముడిని కూడా పంపుతాను. నీ సహాయంతోనే సీతని ఎత్తుకొస్తాను. నేను నిన్ను సీతని అపహరించడం కోసమని జింక వేషం వెయ్యమన్నాను. అంతేకాని ఇందులో అపాయం ఉందా లేదా అని నేను నిన్ను అడగలేదు. ఇవన్నీ నిన్ను ఎవడు చెప్పమన్నాడు. నువ్వు పరిధిని మించి మాట్లాడుతున్నావు. ప్రభువు నీ దెగ్గరికి వచ్చి మాట్లాడుతుంటే, అడిగిన ప్రశ్నకి అంజలి ఘటించి జవాబు చెప్పడం నీ బాధ్యత, ఇక అంతకన్నా ఎక్కువ మాట్లాడకూడదు. రాజు అగ్ని, ఇంద్రుడు, సోముడు, వరుణుడు, యముడు అనే 5 రూపాలలో ఉంటాడు. నువ్వు నా మాట వింటే, నేను నీ పట్ల సౌమ్యంగా ఉంటాను, కాదంటే నేను నీకు యముడిని అవుతాను. నేను చెప్పినట్టు నువ్వు వెంటనే బంగారు లేడిగా మారి బయలుదేరు. జింకగా వెళితే రాముడి చేతిలో చస్తావో లేదో అన్నది అనుమానమే, కాని వెళ్ళనంటే మాత్రం నేను నిన్ను చంపేస్తాను " అన్నాడు.

అప్పుడు మారీచుడు " రాజు తప్పు త్రోవలో నడుస్తుంటే, మంత్రులైన వారు చుట్టూ చేరి నిగ్రహించాలి, అలా నిగ్రహించని మంత్రులు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. రాజ్యపాలన నిర్వహిస్తున్నవాడిని పాశములతో పట్టే స్థితిలో మంత్రులు లేకపోతే, ఆ మంత్రులకి మరణశిక్ష విధించాలి. రాజె ధర్మం, రాజె జయం, రాజు వల్లనే లోకానికి రక్షణ. ఆ రాజు ధర్మం తప్పిననాడు లోకంలో రక్షణ ఉండదు, ఆ రాజుని ఆశ్రయించిన వారెవరూ బ్రతకరు.

స్వామినా ప్రతికూలేన ప్రజాః తీక్ష్ణేన రావణ |

రక్ష్యమాణా న వర్ధంతే మేషా గోమాయునా యథా ||

రాజన్నవాడు ప్రజల వెనకాల ఎలా ఉండాలంటే, కొడుకుల వెనక తండ్రిలా ఉండాలి. అలా ఉండనివాడు ఆవుల వెనకాల వచ్చిన నక్కలాంటి వాడు. అలాంటివాడి వలన ఆ ప్రజలకి భద్రత ఉండదు. నీలాంటి దుర్మార్గుడు రాజుగా ఉన్న ఆ రాజ్యంతో పాటు, ఆ రాక్షసులూ నశించిపోతారు. నీకు పుట్టిన ఈ నీచమైన కోరిక వలన నీ సైన్యం కూడా నశించిపోతుంది. రాముడు చూస్తుండగా సీతమ్మని తీసుకురాలేవని తెలిసి, రాముడు లేనప్పుడు సీతమ్మని అపహరించాలని ప్రయత్నం చేస్తున్నావు. నీకు తెలుసు నువ్వు పిరికివాడివని, యుద్ధంలో నిలబడలేవని. నువ్వు నా ప్రభువువి కనుక, నా కొనప్రాణం వరకూ నువ్వు చెప్పిన పనిని చెయ్యడానికి ప్రయత్నిస్తాను, కాని సీతమ్మ కంటే ముందు నన్ను రాముడు చూస్తే, నా పని అయిపోయినట్టే. రాముడిని చూసి నేను ఒక్కడినే చనిపోతాను, ఆ తరువాత సీతమ్మని తెచ్చి, నువ్వు సకల బంధుపరివారంతో చనిపోతావు. ఎప్పుడైతే ఈ పని చేస్తాను అన్నానో, అప్పుడే నా ప్రాణాలు పోయాయి, ఇప్పుడు నీ ముందు ఉన్నది మారీచుడు అనే బొమ్మ, ఆ బొమ్మని నీకు నచ్చినట్టు వాడుకో. నీకు ఎంత చెప్పినా నువ్వు వినడంలేదు కనుక నీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాను, పద " అని అన్నాడు.

Source: fb.com/LordSriRamaOfficalPage

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramayana  Parts  రామాయణం  భాగాలు  

Other Articles

  • Ramayanam forty seven story

    రామాయణం-47వ-భాగం

    Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

  • Ramayanam forty six story

    రామాయణం-46వ-భాగం

    Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

  • Ramayanam forty five story

    రామాయణం-45వ-భాగం

    Sep 06 | అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని,... Read more

  • Ramayanam forty four story

    రామాయణం-44వ-భాగం

    Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

  • Ramayanam forty two story

    రామాయణం-42వ-భాగం

    Aug 23 | రాముడు ఖర దూషణులని సంహరించడాన్ని అకంపనుడు అనే రాక్షసుడు చూసి లంకా పట్టణానికి చేరుకున్నాడు. అక్కడాయన రావణుడి పాదముల మీద పడి, రాముడు ఖర దూషణులను ఎలా సంహరించాడో వివరించాడు. ఆగ్రహించిన రావణుడు "... Read more