Ramayanam-Forty-five | రామాయణం - 45వ భాగం

Ramayanam forty five story

Ramayana, Ramayana Forty-five, Ramayana Story, Ramayana Epic Story, Ramayana Parts, Ramayanam 45th Part

The Ramayana is an ancient Sanskrit epic about Rama. It is one of the two most important ancient epics of India, the first one being the ancient Ramayana. The epic was originally written by sage (rishi) Valmiki of Ancient India. The book has about 96,000 verses and is divided into seven parts.

రామాయణం-45వ-భాగం

Posted: 09/06/2018 02:32 PM IST
Ramayanam forty five story

అప్పటిదాకా రథంలో ఉన్న రావణుడు, లక్ష్మణుడు కంటికి కనపడనంత దూరానికి వెళ్ళాక, ఆ రథం నుండి కిందకి దిగి కామరూపాన్ని దాల్చాడు. మృదువైన కాషాయ వస్త్రాలని ధరించి, ఒక పిలక పెట్టుకుని, యజ్ఞోపవీతం వేసుకుని, ఎడమ భుజానికి కమండలాన్ని ధరించి, రాశిభూతమైన తేజస్సుతో పరివ్రాజక(సాధువు) వేషాన్ని ధరించి ఆశ్రమం వైపు వెళ్ళాడు. రావణాసురుడు మారువేషంలో వస్తున్నాడని అక్కడున్నటువంటి చెట్లు కనిపెట్టి కదలడం మానేసి అలా నిలబడిపోయాయి. అప్పటిదాకా చక్కగా వీచిన గాలి రావణుడిని చూడగానే మందంగా వీచింది. రావణుడు తన ఎర్రటి కళ్ళతో చూసేసరికి, అప్పటిదాకా ఉరకలు వేసిన గోదావరి చప్పుడు చెయ్యకుండా చాలా నెమ్మదిగా ప్రవహించింది.

అలా ఆ రావణుడు సీతమ్మ దెగ్గరికి వెళ్ళి " నువ్వు పచ్చని పట్టుచీర కట్టుకొని, పద్మం వంటి ముఖంతో, పద్మములవంటి చేతులతో, పద్మాలలాంటి పాదాలతో ఉన్నావు. నువ్వు భూమి మీద యదేచ్ఛగా తిరగడానికి వచ్చిన రతీదేవివా. నీ ముఖం ఎంత అందంగా ఉంది, నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయి.........." అంటూ సీతమ్మని కేశములనుండి పాదముల వరకూ ఏ అవయవాన్ని వదలకుండా అంగాంగ వర్ణన చేశాడు. అలాగే " చాలా వేగంగా ప్రవహిస్తున్న నది ఒడ్డుని విరిచినట్టు, నువ్వు నా మనస్సుని విరిచేస్తున్నావు. యక్ష, కిన్నెర, గంధర్వ స్త్రీలలో నీవంటి స్త్రీని నేను ఎక్కడా చూడలేదు. ఇంత అందమైన దానివి ఈ అరణ్యంలో ఎందుకున్నావు? అయ్యయ్యో ఇది చాలా క్రూరమృగాలు ఉండే అరణ్యం, ఇక్కడ రాక్షసులు కామరూపాలలో తిరుగుతుంటారు, నువ్వు తొందరగా ఇక్కడినుంచి వెళ్ళిపో. నువ్వు మంచి మంచి నగరాలలో, పట్టణాలలో ఉండాలి, అక్కడ ఉండి సుఖాలు అనుభవించాలి. నువ్వు శ్రేష్టమైన మాలికలు, హారాలు వేసుకోవాలి, మంచి బట్టలు కట్టుకోవాలి, అన్నిటితో పాటు నీకు మంచి భర్త ఉండాలి " అన్నాడు. ( ఒక ఆడదాన్ని అనుభవించాలనే బుద్ధితో ఆమె దెగ్గరికి వచ్చి, ఆమె అందాన్ని పొగుడుతూ, తనని తాను పొగుడుకుంటూ, ప్రేమ అనే అందమైన భావాన్ని అడ్డుపెట్టుకుని మాట్లాడే వాళ్ళలాగ ఆనాడు రావణుడు మాట్లాడాడు.)

కాని సీతమ్మ తల్లి మనస్సు రాముడి మీదనే ఉండిపోవడం వలన, రావణుడి నీచపు మాటలని ఆమె సరిగ్గా పట్టించుకోలేదు. కాని ఇంటికొచ్చిన అతిథికి ఎంత గౌరవంగా పూజ చేస్తారో, అలా ఆ భిక్షుని రూపంలో ఉన్న రావణుడికి ఆసనం ఇచ్చి కూర్చోబెట్టింది. ఆయనకి అర్ఘ్య పాద్యములు ఇచ్చింది.

సీతాపహరణం ద్వారా తనని తాను చంపుకోడానికి సిధ్దపడుతున్న రావణాసురుడికి సమస్తమైన అతిథి పూజ సీతమ్మ చేస్తుంది అని వాల్మీకి మహర్షి అన్నారు.

అప్పుడా సీతమ్మ " నా పేరు సీత, నేను జనక మహారాజు కూతురిని. రాముడి ఇల్లాలిని. నేను ఇక్ష్వాకువంశంలో పుట్టిన రాముడిని పెళ్ళి చేసుకున్న తరువాత మనుషులు అనుభవించే భోగములన్నిటిని అనుభవించాను( సీతమ్మ తనని తాను జగన్మాతగా రావణుడికి పరోక్షంగా చెప్పింది). కైకమ్మ కోరిక మేరకు 14 సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యడానికి రాముడు అరణ్యాలకి వచ్చాడు. ఆయన తమ్ముడైన లక్ష్మణుడు సర్వకాలములయందు మాకు సేవ చేస్తుంటాడు.

మమ భర్తా మహాతేజా వయసా పంచ వింశకః ||

అష్టా దశ హి వర్షాణి మమ జన్మని గణ్యతే ||

అరణ్యవాసానికి వచ్చేటప్పటికి నాకు 18 సంవత్సరాలు, రాముడికి 25 సంవత్సరాలు " అని చెప్పి " ఓ బ్రాహ్మణుడా! నువ్వు ఒక్కడివి ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు, నీ గోత్రం ఏమిటి, నువ్వు ఎవరు " అని అడిగింది.

అప్పుడా రావణుడు " సీత! నా పేరు రావణాసురుడు. నన్ను చూస్తే దేవతలు, గంధర్వులు, అందరూ భయపడిపోతారు. పట్టుబట్ట కట్టుకుని ఇంత అందంగా ఉన్న నీ స్వరూపాన్ని చూసిన దెగ్గరి నుంచీ, ఎందరో భార్యలు ఉన్నా ఆ భార్యలతో క్రీడించినప్పుడు నాకు సుఖం కలగడంలేదు, అందుకని నీకోసం వచ్చాను. నువ్వు నాతో వస్తే, నిన్ను పట్టమహిషిని చేస్తాను. నువ్వు నా భార్యవి అయితే, 5000 మంది దాసీలు నీకు సేవ చేస్తారు, సమస్త లోకంలో ఉన్న ఐశ్వర్యాన్ని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను " అన్నాడు.

రావణుడి నీచమైన మాటలు విన్న సీతమ్మ " రావణా! నీకు తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావురా. మహా సముద్రాన్ని, పర్వతాన్ని కదపడం ఎలా చేతకాదో, అలా మహానుభావుడు, సర్వలక్షణ సంపన్నుడు, ధర్మాత్ముడు, పూర్ణచంద్రుని వంటి ముఖము కలిగినవాడు, జితేంద్రియుడు, సింహంలాంటి బాహువులు కలిగినవాడు, మదించిన ఏనుగులా నడవగలిగినవాడు అయిన నా భర్త రామచంద్రుని అనుసరించి ప్రవర్తిస్తానే తప్ప, నీవంటి దిక్కుమాలినవాడు ఐశ్వర్యం గురించి మాట్లాడితే వచ్చేటటువంటి స్త్రీని కాదు. ఒక నక్క సింహాన్ని ఎలా చూడలేదో, నువ్వు నన్ను అలా చూడలేవు. సూర్యకాంతిని దెగ్గరికి వెళ్ళి ఎలా ముట్టుకోలేమో, నువ్వు నన్ను అలా పొందలేవు. నువ్వు పాము యొక్క కోర పీకడానికి ప్రయత్నిస్తున్నావు. కంట్లో సూది పెట్టి నలక తీసుకున్నవాడు ఎంత అజ్ఞానో, పెద్ద రాయిని మెడకి చుట్టుకుని సముద్రాన్ని ఈదుదాం అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, సూర్య చంద్రులని చేతితో పట్టుకుని ఇంటికి తీసుకువెళదాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, ఇనుప కొనలున్న శూలం మీద నడుద్దాము అనుకున్నవాడు ఎంత అజ్ఞానో, నువ్వు అంత అజ్ఞానివి. సీసానికి బంగారానికి, గంధపు నీటికి బురదకి, ఏనుగుకి పిల్లికి, కాకికి గరుగ్మంతుడికి, నీటి కాకికి నెమలికి, హంసకి ఒక చిన్న పిట్టకి ఎంత తేడా ఉంటుందో, రాముడికి నీకు అంత తేడా ఉంది " అని అనింది.

అప్పుడా రావణుడు " నేను సాక్షాత్తు కుబేరుడి తమ్ముడిని, ఒకానొకప్పుడు కుబేరుడి మీద కోపం వచ్చి యుద్ధం చేసి, ఆ కుబేరుడిని లంకా పట్టణం నుంచి వెళ్ళగొట్టాను. ఆయన ఉత్తర దిక్కుకి వెళ్ళిపోయాడు. మళ్ళి ఉత్తర దిక్కుకి వెళ్ళి మా అన్నయ్యని చావగొట్టి పుష్పక విమానం తెచ్చుకున్నాను. నాకు కాని కోపం వచ్చి కనుబొమ్మలని ముడేస్తే, ఇంద్రుడు దేవతలతో సహా పారిపోతాడు. దశరథుడి చేత వెళ్ళగొట్టబడి, రాజ్యం లేక, అరణ్యాలలో తిరుగుతున్న ఆ రాముడిని నమ్ముకుంటావేంటి. నా దెగ్గరున్న ఐశ్వర్యాన్ని చూసి నా భార్యవి అవ్వు. నేను చిటికిన వేలితో చేసే యుద్ధానికి రాముడు సరిపోడు. ఏమి చెప్పమంటావు నీ అదృష్టం, నా కన్ను నీ మీద పడింది, నన్ను నువ్వు పొందు " అని గర్వంగా అన్నాడు.

అప్పుడు సీతమ్మ " కుబేరుడి తమ్ముడిని అంటావు, పదిమంది నిలేదీసేటట్టుగా ఇలా ప్రవర్తించడానికి నీకు సిగ్గువెయ్యటం లేదా. ఎందుకురా ఈ ప్రవర్తన నీకు. పద్దాక రాముడు పనికిమాలినవాడు అంటున్నావు, మరి ఆయన లేనప్పుడు నన్ను తీసుకువెళ్ళాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావు. రాముడు వచ్చేవరకు అలా నిలబడు చూద్దాము " అనింది.

అప్పుడు ఆ రావణుడు తన శరీరాన్ని పర్వతమంత పెంచి, తన నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. ధనుర్బాణాలతో, కుండలాలతో మెరిసిపోతున్నాడు, ఆకాశం నుండి దిగి వచ్చిన నల్లటి మబ్బులా ఉన్నాడు. అప్పుడాయన " నాతో సమానమైన వాడు ఎక్కడుంటాడు, నిన్ను ఇప్పుడు ఎలా తీసుకెళ్ళిపోతానో చూడు " అని, అపారమైన కామంతో కన్ను మిన్ను కానక, భయపడుతున్న సీతమ్మ దెగ్గరికి వచ్చి తన ఎడమ చేతితో సీతమ్మ తల్లి జుట్టు గట్టిగా పట్టుకొని, కుడి చేతిని సీతమ్మ తొడల కింద పెట్టి, ఆవిడని పైకి ఎత్తాడు. పైకి ఎత్తి ఆశ్రమం బయటకి వచ్చాడు. అప్పటివరకూ ఎవరికీ కనపడకుండా అదృశ్యంగా ఉన్న ఆ బంగారు రథం ఒక్కసారి ప్రత్యక్షమయ్యి భూమి మీదకి దిగింది.

ఆడ త్రాచుపాము కొట్టుకున్నట్టు కొట్టుకుంటున్న సీతమ్మని పరుషమైన మాటలతో భయపెడుతూ, రథంలో బలవంతంగా తన తొడల మీద కుర్చోపెట్టుకున్నాడు. అప్పుడాయన రథాన్ని బయలుదేరు అనేసరికి, ఆ రథం బయలుదేరింది. ఆకాశమార్గంలో వెళుతున్న ఆ రథం నుండి సీతమ్మ " రామ, రామ, మీరు ఎక్కడో అరణ్యంలో దూరంగా ఉండిపోయారు. నా కేక మీకు ఎలా వినబడుతుంది. ఈ దుష్టాత్ముడు నన్ను ఎత్తుకుపోతున్నాడు. ధర్మంకోసమని జీవితాన్ని, రాజ్యాన్ని త్యాగం చేసిన ఓ రామ! నీ భార్యని ఇవ్వాళ ఒక రాక్షసుడు అపహరిస్తున్నాడు. ఈ విషయం మీకు తెలియదు కాదా. లక్ష్మణా! సర్వకాలముల యందు రాముడిని అనుసరించి ఉండేటటువంటివాడ, నన్ను రావణాసురుడు ఎత్తుకుపోతున్నాడన్న విషయం నీకు తెలియదు కాదా. రక్షించండి, రక్షించండి " అని పెద్దగా కేకలు వేస్తూ సీతమ్మ ఏడుస్తోంది. అలాగే " ఓ మృగాల్లారా, ఓ పక్షుల్లారా, ఓ పర్వతాల్లారా, ఓ భూమి, ఓ గోదావరీ మీ అందరూ దయచేసి వినండి. నన్ను రావణాసురుడు అపహరించాడన్న వార్త రాముడికి తెలియచెయ్యండి " అని ఏడుస్తూ ఆ తల్లి రావణుడి తొడ నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తుంటే, 20 బాహువులతో ఆడ త్రాచుని నొక్కినట్టు నొక్కి తన తోడ మీద కుర్చోపెట్టుకున్నాడు.

అలా రావణుడు సీతమ్మతో వెళ్ళిపోతుంటే, అక్కడే చెట్టు మీద కూర్చొని ఉన్న వృద్ధుడైన జటాయువు కనబడ్డాడు. అప్పటికి ఆయనకి 60,000 సంవత్సరాలు. అప్పుడా జటాయువు " దుష్టుడైన ఓ రావణా! నువ్వు చెయ్యకూడని పని చేస్తున్నావు. ధర్మం ఆచరించడం కోసమని రాజ్యాన్ని విడిచిపెట్టి, అరణ్యాలకి వచ్చి తాపసిలా జీవిస్తున్న రాముడి ఇల్లాలిని అపహరిస్తున్నావు. దీనిచేత నువ్వు ప్రమాదాన్ని తెచ్చుకుంటావు. ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో. రాజ్యంలో పరిపాలింపబడుతున్న ప్రజలకి ధర్మంలో కాని, అర్ధంలో కాని, కామంలో కాని ఎలా ప్రవర్తించాలి అని అనుమానమొస్తే, తమ రాజు ఎలా ప్రవర్తిస్తున్నాడో చూసి, వాళ్ళు అలాగే బ్రతుకుతారు. రాజె ధర్మం తప్పిపోతే ప్రజలు కూడా ధర్మం తప్పిపోతారు. పనికిమాలినవాడికి స్వర్గానికి వెళ్ళడం కోసం విమానం ఇచ్చినట్టు, నీకు రాజ్యం ఇచ్చినవాడు ఎవడురా? నిన్ను రాజుని చేసినవాడు ఎవడురా? నేను వృద్ధుడిని, నాకు కవచం లేదు, రథం లేదు. నువ్వేమో యువకుడివి, కవచం కట్టుకున్నావు, చేతిలో ధనుర్బాణాలు ఉన్నాయి, రథం మీద ఉన్నావు. అలాగని నిన్ను విడిచిపెడతాను అనుకున్నావ. నా ప్రాణములు ఉన్నంతవరకూ నువ్వు సీతమ్మని తీసుకెళ్ళకుండా నిగ్రహిస్తాను. నా పౌరుష పరాక్రమాలు అంటె ఏంటో చూద్దువు " అని పెద్ద పెద్ద రెక్కల ఊపుతూ రావణుడి మీదకి యుద్ధానికి వెళ్ళాడు.

తన మీదకి జటాయువు యుద్ధానికి వస్తున్నాడని ఆగ్రహించిన రావణుడు, ఆయన మీదకి కొన్ని వేల బాణములు వేశాడు. ఆ బాణాలు జటాయువు ఒంటి నిండా గుచ్చుకున్నా, ఆయన తన రెక్కలని విదిల్చి ఆ బాణాలని కింద పడేసాడు. తరువాత ఆయన తన రెక్కలని అల్లారుస్తూ ఆ రథాన్ని కొట్టి, రావణుడిని తన ముక్కుతో కుమ్మాడు. ఆ దెబ్బలకి రావణుడి కోదండం విరిగిపోయి, బాణాలు కింద పడిపోయాయి. మళ్ళి ఆ జటాయువు తన రెక్కలతో కొట్టేసరికి ఆ రథం కింద పడిపోయింది. అప్పుడాయన తన వాడి ముక్కుతో ఆ రథసారధి శిరస్సుని కోసేసాడు. తన కాళ్ళ గోళ్ళతో ఆ రథానికి ఉన్న పిశాచాల్లాంటి గాడిదలని సంహరించాడు. అప్పుడు రావణుడు సీతమ్మతో కిందపడిపోయాడు. అలా పడిపోతు పడిపోతూ ఆ రావణుడు సీతమ్మని ఎడమ చంకలో దూర్చి పట్టుకున్నాడు.

ఇది చూశిన జటాయువుకి ఎక్కడలేని కోపం వచ్చి రావణుడి 10 ఎడమ చేతులని తన ముక్కుతో నరికేశాడు. నరకబడ్డ 10 చేతులతో సహా సీతమ్మ కిందపడిపోయింది. రావణుడికి మళ్ళి ఆ 10 చేతులు పుట్టాయి. అప్పుడా రావణుడు ఒక పెద్ద ఖడ్గాన్ని పట్టుకొని తన మీదకి వస్తున్న జటాయువు యొక్క రెండు రెక్కలని, కాళ్ళని నరికేశాడు.

అప్పుడా జటాయువు ఒంట్లోనుంచి నది ప్రవహించినట్టు రక్తం ప్రవహించింది. అప్పుడా జటాయువు అదుపుతప్పి ఒక చెట్టు దెగ్గర పడిపోయాడు. తనకోసం ప్రాణాలు అర్పించడానికి సిద్ధపడ్డ ఆ జటాయువుని చూసి సీతమ్మ పరుగు పరుగున వెళ్ళి ఆ జటాయువుని కౌగలించుకుని ఏడిచింది. సీతమ్మ నగలన్నీ కింద పడిపోయాయి, జుట్టంతా విరజిమ్ముకు పోయింది. అటువంటి స్థితిలో ఏకధారగా ఏడుస్తున్న సేతమ్మని చూసి రావణుడు " జటాయువు కోసం ఏడుస్తావే, రా " అని సీతమ్మ వెనక రావణుడు పరుగుతీసాడు. అప్పుడు సీతమ్మ జటాయువుని వదిలి అక్కడున్న లతలని, చెట్లని కౌగిలించుకుంది.

అప్పుడా రావణుడు అక్కడికి వెళ్ళి " చెట్లని, లతలని కౌగలించుకుంటావే, రా " అని, ఆవిడ జుట్టు పట్టుకొని వెనక్కి ఈడ్చేశాడు. రావణుడు సీతమ్మని అలా నేల మీద ఈడ్చుకుపోతుంటే సూర్యుడు, చంద్రుడు చూసి సిగ్గుతో మేఘాల చాటుకి వెళ్ళిపోతే, ప్రపంచాన్నంతటిని అకారణంగా చీకటి ఆవరించింది. సత్యలోకంలో కూర్చున్న బ్రహ్మగారు ఉలిక్కిపడ్డారు. అప్పుడాయన తన దివ్య నేత్రంతో చూసి " ఒరేయ్, నువ్వు చేసిన తపస్సుకి చావడానికి కావలసినంత పాపం ఇవ్వాళ మూటకట్టుకున్నావురా " అన్నారు.

రావణుడు సీతమ్మ జుట్టు పట్టి, ఈడ్చుకొని తెచ్చి, తన తొడల మీద కూర్చోపెట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోయాడు. అటూ ఇటూ తన్నుకుంటున్న సీతమ్మని 20 చేతులతో ఓడిసిపట్టుకున్న రావణాసురుడిని చూసి ఋషులు, ఈ కళ్ళతో ఇటువంటి దృశ్యాన్ని చూడవలసి వచ్చిందని బాధపడ్డారు, అలాగే రావణ సంహారం అవుతుందని సంతోషించారు.

ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మ ఆభరణాలు కిందపడిపోయాయి, ఆవిడ జుట్టు విడిపోయి చల్లుకుపోయింది, తిలకం పక్కకి తొలగిపోయింది. అలా ఆకాశంలో వెళ్ళిపోతున్న సీతమ్మకి ఒక పర్వత శిఖరం మీద 5 వానరాలు కనబడ్డాయి. వీళ్ళు నా సమాచారాన్ని రాముడికి అందజేస్తారు అనుకొని, తాను కట్టుకున్న వస్త్రం నుండి ఒక ఖండాన్ని చింపి, అందులో తాను ధరించిన నగలని మూటకట్టి ఆ 5 వానరముల మధ్యలో పడేటట్టు విడిచింది. సీతమ్మని తీసుకుపోతున్నాను అన్న ఆనందంలో రావణుడు ఈ విషయాన్ని గమనించలేదు. రెప్ప వెయ్యకుండా ఆ 5 వానరాలు ఈ దృశ్యాన్ని చూశారు.

Source: fb.com/LordSriRamaOfficalPage

 

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ramayana  Parts  రామాయణం  భాగాలు  

Other Articles

 • Ramayanam forty seven story

  రామాయణం-47వ-భాగం

  Sep 11 | శాంతించిన రాముడితో లక్ష్మణుడు " అన్నయ్యా! చూశావ లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో. కష్టాలు అనేవి ఒక్కరికే కాదు, గతంలో కూడా కష్టపడినవారు ఎందరో ఉన్నారు. నహుషుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో... Read more

 • Ramayanam forty six story

  రామాయణం-46వ-భాగం

  Sep 07 | త్వయా ఏవ నూనం దుష్టాత్మన్ భీరుణా హర్తుం ఇచ్ఛతా | మమ అపవాహితో భర్తా మృగ రూపేణ మాయయా || రావణుడి చేత ఎత్తుకుపోబడుతున్న సీతమ్మ ఇలా అనింది " నువ్వు మాయా మృగాన్ని... Read more

 • Ramayanam forty four story

  రామాయణం-44వ-భాగం

  Sep 03 | రావణుడు, మారీచుడు ఇద్దరూ కలిసి రాముడున్న ఆశ్రమం దెగ్గర రథంలో దిగారు. అప్పుడా మారీచుడు ఒక అందమైన జింకగా మారిపోయాడు. దాని ఒళ్ళంతా బంగారు రంగులో ఉంది, దానిమీద ఎక్కడ చూసినా వెండి చుక్కలు... Read more

 • Ramayanam forty three story

  రామాయణం-43వ-భాగం

  Aug 27 | అందరూ వెళ్ళిపోయాక రావణుడు నిశ్శబ్ధంగా వాహనశాలకి వెళ్ళి సారధిని పిలిచి ఉత్తమమైన రథాన్ని సిద్ధం చెయ్యమన్నాడు. అప్పుడు రావణుడు బంగారంతో చెయ్యబడ్డ, పిశాచాల వంటి ముఖాలు ఉన్న గాడిదలు కట్టిన రథాన్ని ఎక్కి సముద్ర... Read more

 • Ramayanam forty two story

  రామాయణం-42వ-భాగం

  Aug 23 | రాముడు ఖర దూషణులని సంహరించడాన్ని అకంపనుడు అనే రాక్షసుడు చూసి లంకా పట్టణానికి చేరుకున్నాడు. అక్కడాయన రావణుడి పాదముల మీద పడి, రాముడు ఖర దూషణులను ఎలా సంహరించాడో వివరించాడు. ఆగ్రహించిన రావణుడు "... Read more

Today on Telugu Wishesh