Check Movie Review ‘చెక్’ మూవీ రివ్యూ

Teluguwishesh ‘చెక్’ ‘చెక్’ Get information about Check Telugu Movie Review, Nithin Check Movie Review, Check Movie Review and Rating, Check Review, Check Videos, Trailers and Story and many more on Teluguwishesh.com Product #: 94744 2.75 stars, based on 1 reviews
 • చిత్రం  :

  ‘చెక్’

 • బ్యానర్  :

  భవ్య క్రియేషన్స్

 • దర్శకుడు  :

  చంద్రశేఖర్ యేలేటి

 • నిర్మాత  :

  వి.ఆనంద ప్రసాద్

 • సంగీతం  :

  కళ్యాణి మాలిక్

 • సినిమా రేటింగ్  :

  2.752.75  2.75

 • ఛాయాగ్రహణం  :

  రాహుల్ శ్రీవాత్సవ్

 • ఎడిటర్  :

  అనల్ అనిరుద్దన్‌

 • నటినటులు  :

  నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, త్రిపురనేని సాయిచంద్, సంపత్ రాజ్, హర్షవర్ధన్, రోహిత్ పాథక్, సిమ్రాన్ చౌదరి తదితరులు

Check Movie Review A Game Of Chess That Leaves You Wanting

విడుదల తేది :

2021-02-26

Cinema Story

రొమాంటిక్ చిత్రాల హీరోగా తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టిన హీరో నితిన్.. తన రోటిన్ కు భిన్నంగా వైవిద్యమైన కథలను అలోచించే విధంగా రూపోందించే దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో కలసి తెరకెక్కించిన చిత్రమే చెక్. ఈ ఇద్దరి కలయిక చిత్ర నిర్మాణానికి ముందే ఆసక్తిని రేకెత్తించగా, అభిమానుల అంచనాలు బాగానే పెరిగాయి. ఈ క్రమంలో ఇవాళ విడుదలైన చిత్రంలో ఫ్యాన్స్ అంచనాలు నిజమయ్యాయా.? అన్నది చిత్రం చూసిన తరువాతే నిర్ణయానికి రావాలి. కరోనా లాక్ డౌన్ కు ముందు భీష్మ చిత్రంలో మంచి హిట్ అందుకుని జోరుమీదున్న నితిన్.. కోవిడ్ అన్ లాక్ తరువాత చెక్ తో ప్రేక్షకుల మందుకు వచ్చి వారిని మెప్పించాడా అన్నది తెలియాలంటే చిత్రాన్ని చూడాల్సిందే.  

కథ

ఆదిత్య (నితిన్) 40 మంది ప్రాణాలు పోవడానికి కారణమైన ఉగ్రవాద దాడి కేసులో దోషిగా తేలి ఉగ్రవాదిగా ముద్రపడిన ఖైదీ. తనపై అభియోగాలు నిరూపితం కావడంతో న్యాయస్థానం ఉరిశిక్ష విధించాలని తీర్పును వెలువరిస్తోంది. కానీ అతడికి ఆ నేరంలో ఎలాంటి పాత్ర ఉండదు. పరిస్థితుల ప్రభావం వల్ల ఆ కేసులో చిక్కుకుంటాడు. కానీ అతడి వాదన కోర్టులో నిలవదు. తన తరఫున వాదించకూడదని లాయర్లు నిర్ణయం తీసుకుంటారు. అలాంటి పరిస్థితుల్లోనే ఈ కేసును టేకప్ చేస్తుంది మానస (రకుల్ ప్రీత్) అనే లాయర్.

ముందు ఆదిత్య తప్పు చేశాడనే అనుకున్న మానస.. తర్వాత అతను నిర్దోషి అని అర్థం చేసుకుని అతడిని కేసు నుంచి విముక్తుడ్ని చేయాలని పోరాడుతుంది. మరోవైపు జైల్లో శ్రీమన్నారాయణ (సాయిచంద్) అనే చెస్ క్రీడాకారుడి దగ్గర ఆ ఆట నేర్చుకున్న ఆదిత్య.. తన అసాధారణ ప్రతిభతో ఆయన్ని మెప్పిస్తాడు. శ్రీమన్నారాయణ జైలు నుంచి బయటికి వచ్చాక ఆదిత్యకు బయట చెస్ టోర్నీల్లో పోటీ పడేందుకు ఏర్పాట్లు చేస్తాడు. ఇలా ఆడి మంచి పేరు సంపాదిస్తాడు. ఇలా మొదలైన ఆదిత్య చెస్ ప్రయాణం ఎక్కడ దాకా వెళ్లింది.. అతణ్ని బయటికి తెచ్చేందుకు మానస చేసిన ప్రయత్నం ఏ మేర ఫలించింది. ఈ ఖైదీ జీవితంలోకి యాత్ర (ప్రియ ప్రకాష్) ఎలా వచ్చింది.? అసలు అమె ప్రాముఖ్యత ఏమిటీ.? ఆదిత్య జీవితం ఏ తీరానికి చేరింది అన్నది మిగతా కథ.

cinima-reviews
‘చెక్’

 విశ్లేషణ

‘ఐతే’, ‘అనుకోకుండా ఒక రోజు’ చిత్రాలతో తన చిత్ర కథల ఎంపిక, టేకింగ్ ఎంతో విభిన్నంగా వుంటాయని నిరూపించుకుని ప్రేక్షకులకు దగ్గరైన దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి కొంత గ్యాప్ తరువాత ‘చెక్’తో ఆయన మరో భిన్నమైన ప్రయత్నమే చేశాడు. చేయని నేరానికి ఉరిశిక్ష పడ్డ ఖైదీ.. తన తెలివితేటలతో ఎలా జైలు నుంచి బయటికి వచ్చాడనే పాయింట్ కు చెస్ గేమ్ నేపథ్యాన్ని ఎంచుకుని ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచాలని చూశాడు. చెస్ నేపథ్యంలో యేలేటి సినిమా ప్రేక్షకులను అలరించింది. అయితే దాదాపుగా ప్రతీ ఇంట్లో ఓక చెస్ ఆటగాడు వున్న ఈ రోజుల్లో ఆటలోని నైపుణ్యాన్ని స్క్రీన్ ప్లే రూపంలో రక్తికట్టించడంలో యేలేటికి ఎన్ని మార్కులు వేస్తారన్నది ప్రేక్షకులే తేల్చాలి.

‘చెక్’లో ఉరిశిక్ష పడ్డ ఖైదీ నైపుణ్యం గల అటగాడిగా తీర్చిదిద్దిన విధానంలో ప్రేక్షకులను కన్విన్స్ చేయడంలో యేలేటి తడబడ్డాడు. తన తెలివి తేటలతో చిన్న చిన్న సైబర్ క్రైమ్స్ చేసుకునే హీరోకు ఉగ్రవాదిగా ముద్రపడి ఉరిశిక్ష పడటం వాస్తవికంగా అనిపించదు. అతను ఈ కేసులో ఇరుక్కునేందుకు దారి తీసే పరిస్థితులు నమ్మశక్యంగా లేవు. ఒక వ్యక్తికి ఉరి శిక్ష వేయడం అంటే.. అంత సాధారణంగా జరిగిపోదు. సాక్ష్యాలు పక్కాగా ఉండాలి. ఆ వ్యవహారం అంతా ఎంతో పకడ్బందీగా అనిపించాలి. కానీ ‘చెక్’లో చాలా విషయాలు పైపైన చూపించేసి హీరోను దోషిగా నిర్ధారించేసినట్లు అనిపిస్తుంది. హీరో ఎంత బలంగా ఇరుక్కుంటే అతడి మీద సానుభూతి కూడా అంత ఎక్కువగా ఉంటుంది. అతను ఎలా బయటపడతాడనే ఉత్కంఠ రేగుతుంది. ‘చెక్’లో ఆ ఉత్కంఠే మిస్ అయింది.

‘చెక్’లో ప్రేక్షకులను అలరించే అంశాలు లేవనేమీ కాదు. ప్రథమార్ధంలో ‘చెక్’ చాలా వరకు ఎంగేజింగ్ గానే సాగుతుంది. ఆరంభ సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి. నేరుగా ఉరి శిక్ష పడ్డ ఉగ్రవాదిగా హీరోను పరిచయం చేయడంతో దీని వెనుక కథేంటో తెలుసుకోవాలన్న ఆసక్తి పుట్టేలా సినిమా మొదలవుతుంది. హీరోకు మొదట పరిస్థితులన్నీ ప్రతికూలంగా.. అన్ని దారులూ మూసుకుపోయినట్లు చూపించి.... ఆ తర్వాత అతడి ఒక్కోటి ఓపెన్ చేయడంతో ప్రేక్షకులు కథలో ఇన్వాల్వ్ అవుతారు. హీరో చదరంగం వైపు ఆకర్షితుడై ఆ ఆటలో నైపుణ్యం సాధించే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా హీరోను చీకటి గదిలో వేస్తే.. కిటికీ గళ్ల ప్రతిబింబాన్నే చెస్ బోర్డుగా ఊహించుకుని అతను ఆటలో నేర్పు సాధించే సన్నివేశంలో యేలేటి మార్కు కనిపిస్తుంది.

కాగా, హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతగా రక్తికట్టలేదు. ప్రియ ప్రకాష్ పాత్రను పేలవంగా తేలిపోయింది. ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది. ద్వితీయార్ధంపై ఆసక్తి పెంచుతుంది. కానీ ఆ తర్వాత యేలేటి అనుకున్నంత ఆసక్తికరంగా కథనాన్ని నడిపించలేకపోయాడు. ద్వితీయార్ధంలో జైలు సన్నివేశాలు రిపీటెడ్ గా అనిపిస్తాయి. హీరో చదరంగంలో అంతర్జాతీయ  స్థాయికి ఎదిగిపోయే సన్నివేశాలు టూమచ్ అనిపిస్తాయి. క్లైమాక్స్ ట్విస్టు మీద పూర్తిగా డిపెండ్ అయిపోయిన దర్శకుడు... దానికి ముందు సన్నివేశాలను తేల్చేశాడు. ముగింపులో మలుపు థ్రిల్ చేసినా.. ఈ కథకు ఇది సరైన ముగింపేనా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఈ కథను అసంపూర్తిగా వదిలేసిన భావన కలుగుతుంది. అయినప్పటికీ ఈ చిత్రానికి క్లైమాక్సే హైలైట్.

నటీనటుల విషాయానికి వస్తే..

నితిన్ ఆదిత్య పాత్రకు చక్కగా సరిపోయాడు. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. పరిణతితో కూడిన నటనతో ఆకట్టుకున్నాడు. అతను ఇలాంటి ఫుల్ లెంగ్త్ సీరియస్ రోల్ చేయడం కొత్తగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో చక్కటి హావభావాలు ఇచ్చాడు. రకుల్ ప్రీత్ కూడా ఇందులో కొత్తగా కనిపించింది. కానీ ఆమె లుక్ ముందున్నంత ఆకర్షణీయంగా లేదు. తన పాత్ర జస్ట్ ఓకే అనిపిస్తుందంతే. ప్రియ ప్రకాష్ వారియర్ ఏ రకంగానూ ఆకట్టుకోదు. ఆ పాత్రను మరీ పేలవంగా తీర్చిదిద్దాడు యేలేటి.

కనిపించిన కాసేపు గ్లామర్ ఎటాక్ చేయడం తప్పితే ప్రియ ఇందులో చేసిందేమీ లేదు. సినిమాలో అందరిలోకి.. హీరో నితిన్ కంటే కూడా బాగా నటించిందంటే సాయిచందే. సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రతి సినిమాతోనూ ఆశ్చర్యపరుస్తున్న ఆయన శ్రీమన్నారాయణ పాత్రలో టాప్ క్లాస్ పెర్ఫామెన్స్ ఇచ్చాడు. ఇంకెవరూ ఆ పాత్రను ఇంతకంటే బాగా చేయలేరు అనిపించేలా చేశాడు. సంపత్.. మురళీ శర్మ పాత్రలు.. వారి నటన మామూలే. పోసాని తన పాత్ర పరిమితి మేరకు నటించారు.టెక్నికల్ అంశాలకు వస్తే..

సినిమాలో సాంకేతికంగా పెద్ద సానుకూలత కళ్యాణి మాలిక్ నేపథ్య సంగీతం. ప్రతి సన్నివేశాన్నీ ఆర్ఆర్ తో ఎలివేట్ చేయడానికి అతను ప్రయత్నించాడు. నేపథ్య సంగీతం ద్వారా ఒక మూడ్ క్రియేట్ చేయడానికి కృషి చేశాడు. రాహుల్ శ్రీవాస్తవ్ ఛాయాగ్రహణం బాగుంది. ఎక్కువ సన్నివేశాలు జైలు గోడల మధ్యే సాగినా.. మరీ మొనాటనస్ అనిపించకుండా కెమెరా పనితనం చూపించాడు. భవ్య వారి నిర్మాణ విలువలకు ఢోకా లేదు. నరేష్ రెడ్డి మాటల్లో మెరుపులున్నాయి. ముఖ్యంగా చదరంగంలోని జంతువుల గురించి చెప్పే మాటలు.. హీరో ఫిలాసఫీకి సంబంధించిన డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.

ఇక దర్శకుడు యేలేటి విషయానికొస్తే.. ఆయన ఎంచుకున్న పాయింట్ విభిన్నమైనదే అయినా.. పతాక సన్నివేశాల మీద పెట్టిన దృష్టి.. దానికి ముందు సన్నివేశాలపై మాత్రం అంతగా లేదనే చెప్పాలి. కానీ దాన్ని అనుకున్నంత ఆసక్తికరంగా ప్రెజెంట్ చేయలేకపోయాడు. కొన్ని సన్నివేశాల్లో.. క్లైమాక్స్ లో యేలేటి ముద్ర కనిపించినా.. ఓవరాల్ గా ఆయన్నుంచి ఆశించే బ్రిలియన్స్ సినిమాలో మిస్సయింది. జైల్లోనే చాలా వరకు కథను నడిపించేలా స్క్రిప్టు రాసుకోవడంతో ఆయన తనను తాను బంధనాలు వేసుకున్నట్లయింది. స్క్రీన్ ప్లేతో వైవిధ్యం చూపించడానికి.. ఉత్కంఠ రేపడానికి అవకాశం లేకపోయింది.

తీర్పు: యేలేటి మార్కు మెరుపులతో.. నితిన్ నటనతో ఆకట్టుకున్న ‘‘చెక్’’

చివరగా.. గెలుపోటములకు మధ్య డ్రాగా ముగిసిన ‘చెక్’

Author Info

Manohararao

He is a best editor of teluguwishesh