వార్థా దెబ్బకి చెన్నై చిధ్రం.. నష్టం ఎంత? | Cyclone Vardah brings Chennai to a standstill.

Cyclone vardah hits indian city of chennai

Cyclone Vardah, Chennai Cyclone Vardah, Tamil Nadu Cyclone Vardah, Andhra Pradesh Cyclone Vardah, South India Cyclone Vardah, 10 dead Cyclone Vardah, Chennai heavy Rains, Telangana Cyclone Vardah, Telangana rains

Cyclone Vardah Strikes Near Chennai, 10 Dead, Thousands Evacuated.

వార్థా ఎఫెక్ట్: చిధ్రమైన చెన్నై... 10 మంది మృతి

Posted: 12/13/2016 07:49 AM IST
Cyclone vardah hits indian city of chennai

వార్థా తుఫాను చెన్నైకి చుక్కలు చూపించింది. గంటలకు 192 కిమీ వేగంతో వీచిన ఈదురు గాలులు, వాటి ధాటికి కార్లు, బస్సులు సైతం గాల్లోకి ఎగురుతూ హాలీవుడ్ సినిమాలను తలపించాయి. భారీ వర్షం భారీ వృక్షాలు కూకటివేళ్లతో సహా నేలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు వంగిపోయాయి. పలు ఇళ్లు పేకమేడల్లా కుప్పకూలాయి. వెరసి వార్థా చెన్నై వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేసి గజగజ వణికించాయి.

నగరంలో వార్థా సృష్టించిన పెను విధ్వంసంతో విలవిలలాడిపోయారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో చెన్నై రేవు వద్ద తీరాన్ని తాకి, ఆపై మూడు గంటలపాటు బీభత్సం సృష్టించింది. తుపాను విధ్వంసానికి వందలకోట్ల రూపాయల ఆస్తినష్టం సంభవించిందని అంచనా. చెన్నై సహా వివిధ ప్రాంతాల్లో తుపాను ధాటికి ఇప్పటి వరకు పది మంది మృతి చెందారు. 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 4లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా చెన్నై, ఎన్నూరు రేవుల్లో ఏకంగా పదో నెంబరు ప్రమాద హెచ్చరికలను ఎగరేశారంటే తుపాను తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. పెనుగాలుల ప్రభావానికి ఒక్క చెన్నైలోనే ఏకంగా 9 వేల భారీ వృక్షాలు నేలకూలాయి. ఇక రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే కనీసం రెండు లక్షల చెట్లు కూలిపోయి ఉంటాయని అంచనా. ఇప్పటికే పది వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాన్ తీవ్రతతో రానున్న 48 గంటలు కూడా భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

ఆంధ్రాలోనూ తీవ్ర నష్టమే...
నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తుపాను ప్రభావంతో పలుచోట్ల జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోయాయి. ముందుజాగ్రత్త చర్యగా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం నేడు సెలవు ప్రకటించింది. చిత్తూరు జిల్లా పనబాకంలో తుపాను దాటికి ఒకరు మృతి చెందినట్టు కమిషనర్ వినయ్‌చంద్ తెలిపారు. తుపాను ప్రభావంతో తిరుపతిలో 9, తిరుమలలో 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. మరోవైపు దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్టణంలోని తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది..

తెలంగాణలో వర్షాలు...
తుపాన్‌ ప్రభావం వల్ల రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. తుపాన్‌ కారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని, రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోయే అవకాశముందని పేర్కొంది.


గతంలో గడ గడలాడించిన  భారీ తుఫాన్ లు...
అక్టోబర్‌ 2014: హుదూద్‌ తుఫాన్. విశాఖపట్నం సమీపంలో తీరం దాటింది. గంటకు 205 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశాల్లో 100 మందికి పైగా చనిపోయారు. 3.50 లక్షల మందిని ఖాళీ చేయించారు. 21 లక్షల కుటుంబాలపై ప్రభావం చూపింది.
అక్టోబర్‌ 2013: ఫాలిన్‌ తుఫాన్. ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ తీరాల్లో 5.50 లక్షల మందిని ఖాళీ చేయించారు.
మే 2008: నర్గీస్‌ తుఫాన్. మయన్మార్‌లోని ఇర్రవడీ నదీ డెల్టా ప్రాంతంలో 1.38 లక్షల మందిని బలితీసుకుంది. వేలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. వెయ్యి కోట్ల డాలర్ల ఆస్తి నష్టం సంభవించింది.
అక్టోబర్‌ 1999: ఒడిషాను పెను తుపాను కబళించింది. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. 10 వేల మంది బలయ్యారు. మరో 15 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
ఏప్రిల్‌ 1991: బంగ్లాదేశ్‌ను భారీ తుపాను ముంచెత్తింది. దాదాపు 1.39 లక్షల మంది మృత్యువాతపడ్డారు. గంటకు 225 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.
నవంబర్‌ 1977: భీకరమైన తుపాను ఆంధ్రప్రదేశ్‌పై పంజా విసిరింది. దివిసీమ చావుసీమ అయింది. అధికారిక లెక్క ప్రకారం 14,204 మంది చనిపోయారు. అనధికారిక అంచనా ప్రకారం మృతుల సంఖ్య 50 వేలు దాటింది.
నవంబర్‌ 1970: తూర్పు పాకిస్తాన్‌ (ఇప్పటి బంగ్లాదేశ్‌)ను భారీ తుపాను తాకింది. మూడు లక్షల మందికి పైగా ప్రజలు అసువులుబాశారు. గంటకు 224 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cyclone Vardah  Chennai 10 dead  Andhra Pradesh 1 died  

Other Articles