Telangana Formation Day | Telangana Formation Day celebrations

Telangana formation day june 2

Telangana, Telangana Formation Day, History Of Telangana, Telangana Formation Day 2016, KCR, TRS, TRS Party, Telangana News

Telangana Formation Day June 2 2016: The Government of Telangana is Celebrating across 2nd Telangana state formation day In Telangana

బంగారు తెలంగాణ దిశగా రెండు అడుగులు...

Posted: 06/02/2016 09:56 AM IST
Telangana formation day june 2

ప్రజాస్వాయ్య దేశంలో ప్రజాస్వామ్య బద్దంగా దేశ 29వ రాష్ట్రంగా అవిర్భవించిన తెలంగాణ రాష్ట్రం రెండు వసంతాలను పూర్తి చేసుకుని బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో తెలంగాణ ఉద్యమం తొలిదశ, మలిదశలు జరిగిన తీరుతెన్నులపై సింహావలోకనం.. స్వయం పాలన, స్వాభిమానం, మన నీళ్లు, మన ఉద్యోగాలు ఇలా అన్నింటా మా వాటా మాకు ఇవ్వాల్సిందే. ఇంకనా ఇకపై చెల్లదు అంటూ సాదిన మహోద్యమం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం. భాషాప్రయుక్త రాష్ట్రాల ప్రకారం ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి నిజాం పాలించిన కొన్ని జిల్లాలను వేరుచేస్తూ ప్రత్యేక రాష్టంగా ఏర్పరచాలని మొదలైన ఉద్యమo. ఇది దాదాపు 60 సంవత్సరాల పాటు కొనసాగింది. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసము 1953 డిసెంబరులో, రాష్ట్రాల పునర్విభజన కమీషను ను నియమించడం జరిగింది.

ప్రజాభిప్రాయము ప్రకారము ఈ కమీషన్ హైదరాబాదు రాష్ట్రాన్ని విభజించి అందులో మరాఠీ భాష మాట్లాడే ప్రాంతాలను బొంబాయి రాష్ట్రం లోనూ మరియు కన్నడ భాష మాట్లాడే ప్రాంతాలను మైసూరు రాష్ట్రం లో కలిపివేయాలని సిఫారసు చేసినది. ఈ కమీషన్ నివేదిక (SRC) లో హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే తెలంగాణా ప్రాంతాలను ఆంధ్ర రాష్ట్రం లో విలీనం చేయడం వలన కలిగే లాభనష్టాలను చర్చించి విలీనానికి మద్దతు ఆంధ్రభాగంలో ఎక్కువగా వున్నప్పటికి, తెలంగాణా భాగంలో స్పష్టంగా లేకపోవటంతో తెలంగాణా భాగంను హైద్రాబాదు రాష్ట్రంగా ఏర్పాటు చేసి సాధారణ ఎన్నికలు జరిగిన తరువాత హైద్రాబాదు రాష్ట్రం ప్రజాభిప్రాయం ప్రకారం విధానసభలో విలీనం తీర్మానానికి మూడింట రెండువంతుల ఆధిక్యత వస్తే విలీనం జరపాలని సూచించారు. అయినప్పటికీ, జవహర్ లాల్ నెహ్రూ నేతృత్వంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం పెద్దమనుషుల ఒప్పందం ద్వారా తెలంగాణ భద్రతలను అందించడం తర్వాత 1956 నవంబర్ 1 న ఆంధ్ర రాష్ట్ర మరియు తెలంగాణ విలీనం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు కు నిర్ణయం జరిగింది.

1947 దేశానికి స్వాతంత్రం వచ్చినా.. నిజాం పాలనలోని హైదరాబాద్ రాష్ట్రానికి మాత్రం ఇంకా అంధకారంలోనే మగ్గిపోయింది. హైదరాబాద్ రాష్ట్రాన్ని మరో పరాయి దేశంగా మలచాలని అప్పటి నిజాం పన్నిన కుట్రలను, కుయుక్తులను తిప్పికోడుతూ కేంద్ర హోం శాఖ మంత్రిగా వున్న సర్థార్ వల్లభభాయ్ పటేల్ నిజాంపై పోలీస్‌ యాక్షన్‌ కు దిగారు, ఆ 1948 అక్టోబర్ 17న తెలంగాణ నిజాం పాలన నుంచి విమోచనం పోందింది. ఆ తర్వాత 1952లో సాధారణ ఎన్నిక జరిగి ప్రభుత్వం ఏర్పడే వరకు హైదరాబాద్‌ రాష్ట్ర పాలనా యంత్రాంగం మిలిటరీ, సివిల్‌ అధికారుల పాలనలోనే మగ్గింది. దీంతో ఆంధ్ర ప్రాంతంనుంచి వలసలు నిరాటకంగా కొనసాగాయి. అదివరకే ఆంధ్ర ప్రాంతంలో బ్రిటీష్‌ వారి క్రింద శిక్షణ పొంది అనుభవం ఉన్న ఆ అధికారులను తెలంగాణకు రప్పించుకున్నారు.

తొలిదశ ఉద్యమానికి పాదు వేసిన పాల్వంచ

అప్పటికే హైదరాబాద్‌ రాష్ట్రంలో అమల్లో ఉన్నా ముల్కీ నిబంధనలను కాదని వలసవాదులకు ఉద్యోగాలు ఇచ్చారు. 1956లో ఆంధ్రరాష్ట్రం హైదరాబాద్‌ రాష్ట్రంలో విలీనమైన తర్వాత వలసలు మరింత పెరిగాయి. స్థానికులకు కేటాయించిన ఉద్యోగాలు స్థానికేతరుల పరమవుతూవచ్చాయి. పెద్దమనుషుల ఒప్పందం ను గాలికొదిలేయడంతో 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ నిప్పు రాజుకుంది. ఖమ్మం జిల్లా పాల్వంచ లోని థర్మల్‌ స్టేషన్‌లో పనిచేసే ఉద్యోగుల్లో మెజార్టీ ఉద్యోగలు ఆంధ్ర ప్రాంతం వారు కావడంతో 1969, జనవరి 5న తెలంగాణ ఉద్యోగులు నిరసనకు దిగారు. అప్పటి ఉద్యమ ప్రారంభానికి పాల్వంచనే పాదు వేసింది. జనవరి 10 నుంచి నిరాహార దీక్షలు చేయాలని నిర్ణయించారు.

తెలంగాణ రక్షణలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ దినసరి వేతన కార్మిక నాయకుడు కృష్ణ నిరాహార దీక్షకు దిగాడు. దీంతో ఉద్యమం జిల్లా కేంద్రం ఖమ్మం పట్టణానికి పాకింది. జనవరి 9న పట్టణంలో బి.ఎ. స్టూడెంట్‌, నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ నాయకుడైన రవీంధ్రనాథ్‌ గాంధీచౌక్‌ దగ్గర నిరవధిక దీక్ష ప్రారంభించాడు. అతనితో పాటు ఖమ్మం మున్సిపాల్టీ ఉపాధ్యక్షుడు, కవి అయిన శ్రీ కవిరాజమూర్తి కూడా నిరాహారదీక్షలో పాల్గొన్నారు. తెలంగాణ రక్షణ సమితి పేరుతో సంస్థను స్థాపించి తెలంగాణ అభివృద్ధి కోసం వంద కోట్లు ఖర్చు చేయాలని, పోచంపాడు ప్రాజెక్ట్‌ నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణకు ప్రాముఖ్యత ఇవ్వాలని, తెలంగాణేతర ఉద్యోగుల్ని వెనక్కి పంపి ఆ స్థానాల్లో తెలంగాణ నిరుద్యోగులను నింపాలని తీర్మానాలు చేశారు. ఆ మరునాడు అంటే జనవరి 10న ఉద్యమం నిజామాబాద్‌ కు పాకింది. ఉద్యమంలోకి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులు చేరారు.

జనవరి 13న ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ విద్యార్ధుల కార్యాచరణ సమితి'ఏర్పడింది. ఆ రోజు మొట్టమొదటిసారిగా ప్రత్యేక తెలంగాణ సాధనను తమ లక్ష్యంగా విద్యార్థులు ప్రకటించుకున్నారు. విద్యార్ధుల కార్యాచరణ సమితి మెడికల్‌ విద్యార్ధి మల్లిఖార్జున్‌ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుంది. విద్యార్ధులు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాని మల్లిఖార్జున్‌ పిలుపునిచ్చారు. జనవరి 13న నగర ప్రముఖులందరు ఒక సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ పరిరక్షణ కమిటీని స్థాపించారు. విద్యార్ధులకు పూర్తి మద్దతును ప్రకటించారు. జనవరి 20న శంషాబాద్‌లో పాఠశాల విద్యార్ధులపై తొలిసారిగా కాల్పులు జరిపారు.

తొలిదశ ఉద్యమంలో తొలి అమరుడు సదాశివపేట శంకర్

ఉద్యమ ఉధృతిని గమనించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మిగుల నిధుల లెక్కలు తేల్చాలని జస్టిస్‌ భార్గవ అధ్యక్షతన ఒక కమిటీని వేసింది. జనవరి 22న తెలంగాణ రక్షణలను అమలు చేయడానికి ప్రభుత్వం జి.వో జారీ చేసింది. ఫిబ్రవరి 28లోగా నాన్‌ ముల్కీ ఉద్యోగులను వాపస్‌ పంపిస్తామని, జి.వోను నిర్లక్ష్యం చేసే అధికారుపై చర్య తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. జనవరి 24న సదాశివపేటలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 14 మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిలో 17 ఏళ్ల శంకర్‌ మరుసటి రోజు గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. 1969 తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శంకర్‌. కాల్పులకు నిరసనగా కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రత్యేక తెలంగాణ కాంగ్రెస్‌ సమితిని ఏర్పాటు చేశారు. జూన్‌ 4న తెంగాణలో పరిస్థితి తీవ్రతను తెలుసుకున్న ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ హైదరాబాద్‌ నగరానికి వచ్చి విద్యార్ధి నాయకులు, తెలంగాణ ప్రజా సమితి నాయకులతో చర్చలు జరిపింది. దాదాపు ఏడాది పాటు తెలంగాణ ఉద్యమం యుద్ధభూమిని తలపించింది. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగాయి. మొత్తం 95 సార్లు కాల్పులు జరిగాయి. హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో కర్ఫ్యూ విధించారు.

ఉద్యమంలో 369 మంది చనిపోగా, ప్రభుత్వ లెక్కలు మాత్రం 57 మంది చనిపోయినట్టుగా చెప్పాయి. తెలంగాణ ప్రజా సమితి నేతతో కేంద్రం చర్చలు జరిపింది. సెప్టెంబర్‌లో చెన్నారెడ్డి ఢిల్లీలో చర్చలు జరిపి వచ్చిన తర్వాత విద్యార్ధులు తరగతులకు హాజరు కావాలని చెన్నారెడ్డి, విద్యార్ధి నాయకుడు మల్లికార్జున్‌ ఒక ప్రకటన చేశారు. చదువులు కొనసాగిస్తూనే ఉద్యమంలో పాల్గొనాని విజ్ఞప్తి చేశారు. ఈ విధంగా ఉద్యోగులను, విద్యార్ధును ఉద్యమం నుంచి పక్కకు తప్పించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ అప్పటి నుంచి  దశాబ్దాల తరబడి పలు ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి,

కేసీఆర్ నేతృత్వంలో ప్రారంభమైన మలిదశ ఉద్యమం

2001 లో తెలంగాణ ముద్దుబిడ్డ కల్వకుంట చంద్రశేఖర్ రావు (ముద్దుగా తెలంగాణ ప్రజలు పిలచే పేరు కేసీఆర్) తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పటు చేసి అంపశయ్యపై ఉన్న తెలంగాణ ఉద్యమానికి మళ్లీ ప్రాణం పోశారు. అప్పుడు తాను తెలుగుదేశం ప్రభుత్వంలో శాసనసభ సభాపతిగా కోనసాగుతున్న తరుణంలో తన పదవితో పాటు, పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి.. తొలిసారిగా టీఆర్ఎస్ పార్టీ తరపున గెలుపోంది అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ప్రత్యేక రాష్ట్ర అకాంక్షను చాటారు. తొలిదశ ఉద్యమం గత స్మృతులను గుర్తుబెట్టుకుని అహింసా పద్దతిలోనే రాష్ట్ర సాధన సాధ్యమని, అందుకు అసెంబ్లీ తీర్మాణం ముఖ్య ఘట్టమని తెలుసుకుని అప్పటి నుంచి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు అనునిత్యం కృషి చేశారు. అలె నరేంద్ర, సినీ నటి విజయశాంతిలతో పాటు ఉద్యమాన్ని నిర్మించాడు. రాష్ట్ర సాదన కోసం గొంగలి పురుగును కూడా ముద్దాడాతానని చెప్పాడు.

ఆటుపోట్లను ఎదుర్కోన్న తెలంగాణ ముద్దుబిడ్డ

2004లో బావస్వారూప్యత కల్గిన పార్టీలో కలసి ఎన్నికలలో పోటీ చేసిన కేసీఆర్.. ఇటు కాంగ్రెస్ తో అటు వామపక్షాలతో కలసి పోటీ చేశారు. ఆ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో కూడా తెలంగాణ ప్రజల మనోభావాలు మాకు తెలుసు.. వాటిని తప్పక నేరవేరుస్తామంటూ చెప్పించడంలోనూ కేసీఆర్ సక్సెస్ అయ్యారు. సోనియా గాంధీ మెడలో తెలంగాణ పార్టీ కండువాను కప్పి తెలంగాణ ప్రజల అశీర్వాదంలో ఆ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇటు రాష్ట్రంలోనూ అటు కేంద్రంలోనూ అధికార కాంగ్రెస్ తో మిత్రపక్షింగా వున్నారు. కేంద్ర మంత్రి పదవి వచ్చినా.. ఫలానా శాఖ అంటూ లేని మంత్రిగా కొన్ని నెలల పాటు ఆయన కోనసాగారు. ఆ తరుణంలో ఆయన చెప్పింది.. నాకు తెలంగాణ రాష్ట్రం మాత్రమే ముఖ్యం. మంత్రి పదవులు, ఫోర్టుఫోలియోలు కాదు అని అన్నారు. యూపీఏ ప్రభుత్వం కామన్ మినిమమ్ ప్రోగ్రామ్ లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశాన్ని జోడించడానికి ఆయన దీక్షా  పట్టుదలే కారణం. ఆ తరువాత కూడా ఆయన స్వప్నం సాకారం కాలేదు. కొంత కాలం తరువాత ఆయన కేంద్రమంత్రి పదవికి, తన ఎంపీ పదవికి రాజీనామా చేసి మరలా ప్రజల అశ్శీర్వాదంలో అంతకుమించిన మోజార్టీతో గెలిచారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాను, తన పార్టీ ఎమ్మెల్యేలు ఎన్నిసార్లయినా ఎన్నికలకు వెళ్తామని గంటాపథంగా చెప్పిన నేత కేసీఆర్. ఆయన పార్టీ ఎమ్మెల్యేలలో కొంత మంది రెబెల్స్ గా తయారయ్యారు. అయినా ధైర్యం కోల్పోని కేసీఆర్.. నాకు ఎమ్మెల్యేలు, సీట్లు కాదు తెలంగాణనే ముఖ్యమని చాటారు.

తెలంగాణ సాధనలో కీలక ఘట్టం..

ఆ తరువాత 2009లో వచ్చిన ఎన్నికలలో టీడీపీ, వామపక్షాలతో కలసి మహాకూటమిగా ఏర్పడి మరలా తన సత్తాను చాటుకున్నారు కేసీఆర్. అయితే కేంద్ర రాష్ట్రాలలో ఆయన ప్రత్యర్థులే అధికారంలోకి వచ్చారు. దీంతో ఇక తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు అనూగూణంగా కార్యచరణ రూపోందించుకున్నారు. 2009లో ఆయన అమరణ దీక్షకు పూనుకున్నారు. ఇది తెలంగాణ మలిదశ ఉద్యమ దిశానిర్ధేశాలను మార్చింది. అప్పటి వరకు తెలంగాణ వస్తుందా.? అన్న అనుమానాలు వ్యక్తం చేసినవాళ్లు కూడా ఇకనైనా మా తెలంగాణ మాకు ఇవ్వండి అంటూ నినదించేలా చేసింది. తెలంగాణ కోసం పార్టీలు, కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా వీధుల్లోకి వచ్చేలా చేసింది. నగరాలు, పట్టణాల నుంచి గ్రామాలకు చేరిన ఉద్యమం కేసీఆర్ అమరణ దీక్షతో వంటింట్లోకి, బడులలోకి, కళాశాలల్లోకి చేరింది. తెలంగాణ రాష్ట్రం మా జన్మ హక్కు అంటూ ప్రతి ఒక్కరు నినదించేలా చేసింది. కేసీఆర్ అరోగ్య దృష్ట్యా దీక్ష విరమించాలని ఎందరో బతిమాలినా ఆయన విరమించలేదు. కాగా 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటున్నామన్న ప్రకటనతో ఆయన దీక్షను విరమించారు.

ఆత్మార్పణ చేసుకున్న తొలి అమరుడు శ్రీకాంత్ చారి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ తో అమరణ దీక్ష చేపట్టిన కేసీఆర్ ఉద్యమానికి మరింత బలాన్ని జోడించి.. ఉద్యమ రూపురేఖల్ని మార్చిన వీరుడు శ్రీకాంత్ చారి. .స్వరాస్ట్రం కోసం అసువులు బాసిన తోలి అమరుడు ఆయనే. కణకణలాడే నిప్పు కణ్ణాన్ని ముద్దాడి తన శ్వాస, ఆశ, ఆశయం తెలంగాణ రాస్ట్రం అంటూ ఉద్యమ సాక్షిగా మంటల్లో తనను తాను అత్మార్ఫణ చేసుకున్నాడు విద్యార్ది శ్రీకాంతాచారి , 2009 డెసెంబర్ 3వ తేదీన ప్రాణత్యాగం చేసిన అమరుడు శ్రీకాంతాచారి. ఆ తరువాత తెలంగాణ కోసం అనేక ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో కూడా అగ్గి రాజుకుంది. మా తెలంగాణ మాకు కావాలి అంటూ విద్యార్థులు నిరసించారు. ఈ క్రమంలో శ్రీకాంత్ చారి ఆత్మత్యాగం తరువాత అనేక మంది అదేబాటలో నడిచారు. కేవలం విద్యార్థులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు ఈ ఆత్మార్ఫణ చేసుకున్న వారిలో వున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థఇ నుంచి వరంగల్ అటో డ్రైవర్ వరకు, ఇక మరికోందరు ఇక్కడ కాదని ఏకంగా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అక్కడ ఆత్మహత్య చేసుకున్నారు. మలిధశ ఉద్యమంలో తుపాకులు కాదు.. ఆత్మర్ఫణలే అధికమయ్యాయి. దీంతో కేంద్రం దిగిరాక తప్పని పరిస్థితి ఏర్పడింది.

తెలంగాణ జేఏసీ ఏర్పాటు

తెలంగాణ ఉద్యమం కీలకదశకు చేరిన తరుణంలో కేంద్రం ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసిన తరువాత కూడా దానిని అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడిని తీసుకువచ్చారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలను మమేకం చేయాలని యోచించి.. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ తమ రాష్ట్రం విముక్తి పోందదని ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలో ఏర్పడిన తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ప్రాంతాలవారీగా రాజకీయ పార్టీలు, ఉద్యోగులు, న్యాయవాదులు, మేధావులు, రచయితలు, కార్మికులు, కర్షకులు, అటో డ్రైవర్లు, అర్టీసీ కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలు ప్రాంతాల వారీగా ఏకమయ్యారు. తెలంగాణ కోసం ఉద్యమించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయలేని స్థితికి ఉద్యమస్థాయి చేరుకుంది. చివరకు కాలనీ సంఘాలకు, గృహిణుల వరకు వెళ్లింది. ఇక ఈ స్థాయికి చేరుకున్న ఉద్యమాన్ని నిరసింపజేస్తే తెలంగాణ రాదని జేఏసీ అధ్వర్యంలో వివిధ ఉద్యమాలని రూపొందించారు,  సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వీటిలో చెప్పుకోదగినవి. ఈ ఉద్యమాల ఫలితంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వమి 2009 డిసెంబరు 9 న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రారంభమైందని అధికారికంగా ప్రకటించింది. తిరిగి ఆ నిర్ణయంపై కేంద్రం వెనక్కు తగ్గతూ అదే నెల డిసెంబర్ 23 మరో ప్రకటన చేయడంతో జేఏసీ ఆధ్యర్యంలో ఉద్యమాలు రూపోందించింది.

తెలంగాణ రాష్ట్ర అవిర్భావం

తెలంగాన మలిధశ ఉద్యమంలో జేఏసీ నిర్వహించిన మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, ఉద్యమాలు కీలక ఘట్టాలు. మిలియన్ మార్చ్ సందర్భంగా ఇసుక వేస్తే కూడా రాలనంత జనం పాల్లోగని విజయవంతం చేయగా, సకల జనుల సమ్మె నేపథ్యంలో మండల దీక్ష కాలం పాటు అనగా 42 రోజుల పాటు తెలంగాణలో అప్రకటిత బంద్ వాతావరణాన్ని సృష్టించింది జేఏసీ. ఇది అన్ని వర్గాల ప్రజల మద్దతుతోనే సాధ్యమైంది. 13 సెప్టెంబరు నుండి ప్రారంభమై 42రోజులపాటు జరిగిన సమ్మెలో తెలంగాణా లో ని ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయవాదులు, సింగరేణి కార్మీకులు, ఉపాధ్యాయులు, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులు , విద్యుత్ సంస్థ ఉద్యోగులు, పాల్గొన్నారు. దీనిలో భాగంగా రైల్ రోకోలను కూడా నిర్వహించారు. దీంతో కేంద్రం తలొగ్గింది. 16 అక్టోబర్ న రవాణా సంస్థ ఉద్యోగులు సమ్మె నుండి వైదొలగగా తదుపరి ఇతర సంఘాలు కూడా సమ్మె విరమించాయి. కోదండరామ్ ఈ సమ్మె ఫలితంగా కేంద్రం ఆలోచన మార్చగలిగిందని ఉద్యమం వేరేవిధంగా కొనసాగుతుందని  ప్రకటించాడు. అలా నిరంతరం ఉద్యమాలను రచించి, నిర్వహించడంతో ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర డిమాండ్కు కేంద్రం అమోదించింది. అసెంబ్లీ తీర్మాణాన్ని ప్రవేశపెట్టి అభిప్రాయ సేకరణ చేసిన తరువాత కేంద్రం అప్పటి అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించి మరోమారు ఎక్కడా, ఎలాంటి అలజడులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలను చేపట్టింది. పార్లమెంటు ఉభయ సభలలో బిల్లును ప్రవేశపెట్టి అమోదం లభించేలా చేసింది. దీంతో జూన్ రెండున తెలంగాణ రాష్ట్రం దేశ 29వ రాష్ట్రంగా అవతరించింది.

అవిర్భవించిన సుందర స్వప్నం తెలంగాణ రాష్ట్రం.. ముఖ్యమంత్రిగా కేసీఆర్

తెలంగాణ రాష్ట్రం అవిర్భవించింది. దేశంలోని 29వ రాష్ట్రంగా ఏర్పటయ్యింది. ఆ తరువాత వచ్చిన ఎన్నికలలో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితికి ప్రజలు పట్టం కట్టడంతో.. రాష్ట్రానికి తొలిసారిగా ముఖ్యమంత్రి పగ్గాలను కల్వకుంట చంద్రశేఖర్ రావు అందుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతోనే ఆయన ప్రజలకిచ్చిన హామీల  మేరకు ముందుగా రైతన్నల కడగండ్లను తీర్చేందుకు నడుం బిగించారు. పాత రుణాలను మాఫీకి చేసి తన మాటను నిలబెట్టుకున్నారు. అన్నదాతలు లేనిదే రాష్ట్రం ప్రగతి సుసాధ్యం కాదని రైతు కుటుంబం నుంచి వచ్చిన ఆయన వారికి ప్రాధాన్యతను ఇచ్చారు. ఆ తరువాత తెలంగాణ రాష్ట్రసాధనకు దోహదపడిన కార్మికులకు తెలంగాణ అవిర్భావ సందర్భంగా బోనస్ ప్రకటించారు. కాంట్రాక్టు కార్మికులను అంచెలవారీగా క్రమబద్దీకరిస్తామని చెప్పారు. రాష్ట్ర అధికార వేడుకలకు అప్పటి వరకు వున్న జింఖానా గ్రౌండ్ న కాదని, నిజాం ఏలిన గొల్కండ కోటకు వేడుకలను మార్చారు.

బంగారు తెలంగాణ దిశగా కేసీఆర్ అడుగులు

తెలంగాణ రాష్ట్రం సుసంపన్న రాష్ట్రమని ఇప్పుడు కూడా రైతన్న వేతలు పడకూడదని భావించిన కేసీఆర్ వారి రుణమాఫీలకు తొలి ప్రాధాన్యతనిచ్చారు. తెలంగాన డ్వాక్రా మహిళలకు కూడా రాష్ట్ర సంబరాలను ప్రకటించాలని వారికి కూడా రుణ మాఫీలు చేశారు. తన ముందున్న ప్రధాన కర్తవ్యం తెలంగాణను బంగారు తెలంగాణ చేయాలన్నదేనని అ దిశగా తన పాలనా యంత్రాగాన్ని అదేశించారు. తెలంగాణలో బడుగు, జీవులెందరో, భూమి లేని నిరుపేదలెందరు.. ఎవరు ఇళ్లు లేని వారు అన్ని వివరాలను తెలుసుకనేందుకు అప్రకటిత బంద్ తరహాలో యావత్ తెలంగాణవాసులను ఇళ్లకే పరిమితం చేసి వారి నుండి సమగ్ర సర్వే చేయించి వారి వివరాలను సేకరించారు. ఇక ముందుగా ఇల్లు లేని పేదలకు మునుపెన్నడూ లేని విధంగా అగ్గిపెట్టెల ఇళ్లు మాదిరాగా కాకుండా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్నికి ప్రాముఖ్యతను ఇచ్చారు. అందులో తెలంగాణ అమరవీరులకు, అర్మీ అమరవీరుల కుటుంబాలకు, జర్నలిస్టు మిత్రులకు, పోలీసు అమరవీరులకు కూడా ఇళ్లను కేటాయిస్తామని హామి ఇచ్చారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పుడు ఈ డబుల్ బెడ్ రూమ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఆడపడచులకు అండగా కేసీఆర్ ప్రభుత్వం

తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముఖ్యభూమిక పోషించిన యువతులకు కూడా కేసీఆర్ ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. తెలంగాణ నిరుపేద దళిత, గిరిజన అడపడచులకు ప్రభుత్వం తరపున వివాహాది కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో వారికి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీ పేరిట పథకాన్ని ప్రారంభించింది. అదే పథకాన్ని మరికోద్దిగా మెరుగులు దిద్ది మహ్మదీయ అడపడచులకు కూడా షాదీ ముబారక్ పేరుతో అందించింది. దీంతో ఇక నిరుపేద కుటుంబాలకు చెందిన అడపడచులు ఎలాంటి దిగులు లేకుండా వివాహాలను చేసుకునేలా ప్రభుత్వం తమ అండదండలను అందించింది. రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి పథకం కింద 2015 అక్టోబర్ నాటికి 41,123 మంది లబ్ది పొందారు. ఈ పథకం కింద ఎస్సీలకు రూ.157.4 కోట్లు ఖర్చు చేసింది. ఇక ఈ పథకాన్ని వెనుకబడిన వర్గాలలోని నిరుపేద కుటుంబాలకు కూడా వర్తింప చేస్తున్నారు. దీంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ఆడపడచులకు ప్రభుత్వం చేయుతనందిస్తుంది.

ఇక ముఖ్యంగా నగరాలు, పట్టణాలలో ఆడపడచులకు ఎదురవుతున్న ఈవ్ టీజింగ్, పోకరీల అట పట్టించేందుకు కూడా తెలంగాణ సర్కార్ నడుంబిగింది. వారి రక్షణ కోసం షీ టీమ్ లను ఏర్పాటు చేసింది. పోకిరీల అటలను ఎక్కడికక్కడ కట్టడి చేస్తూ షీ టీమ్ తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర ప్రజల మన్ననలను పోందుతున్నాయి. షీ టీమ్ లను ముందుగా హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశారు. ఏ ధేశానికి, ఏ రాష్ట్రానికి చెందిన అడపడచైనా తెలంగాణ ఇబ్బందులకు గురి కాకూడదనే భావన ప్రభుత్వంలో ప్రస్పూటిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం.. సంక్షేమానికి పెద్దపీట

దేశంలో చిట్టచివరిగా ఏర్పటైన తెలంగాణ రాష్ట్రం ఏడాదిన్నర కాలంలోనే అందరికన్న ముందుగా సంక్షేమ రంగంలో దూసుకుపోతుంది. సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానికి చేరుకుంది. ఈ విషయం తెలంగాణ ప్రముఖులు చెప్పడం కాదు.. సంక్షేమ రంగాల అమలుతీరుపై సర్వే చేసిన ఏ మీడియా సంస్థ గత సెప్టెంబర్ లో చెప్పిన విషయం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ముందు తెలంగాణలో ఫించన్లు కొందరికే లభ్యమయ్యేవి. అలా కాకుండా కుటుంబంలో వృద్ద భార్యభర్తలు ఇద్దరికీ కలపి ఫించన్ల ఇచ్చే కార్యక్రమానికి కేసీఆర్ ప్రభుత్వం నాంది పలికింది. ఇక వితంతు, వికలాంగులకు కూడా ఫించన్లు అందించింది.

విద్యార్థులు కమ్మగ తినాలే.. కంటి నిండ నిద్రపోవాలే. అప్పుడే వారి మేధోశక్తి పెరుగుతుందని తెలుసుకున్న కేసీఆర్.. సంక్షేమ హాస్టళ్లలో లావు బియ్యానికి బదులు సన్న బియ్యం అందిస్తూ మానవ వనరుల వికాసానికి కూడా దోహదపడుతున్నారు. వాస్తవానికి ఇలా ఇస్తామని ఆయన ఎన్నికల మానిఫెస్టోలో కూడా పోందుపర్చలేదు. కానీ హాస్టల్ విద్యార్థుల బాధలు తెలిసిన ఆయన వారికి నాణ్యమైన బోజనం పెడితే.. వారు ఖచ్చితంగా ఉత్తమ ఫలితాలను అందిస్తారని యోచించి.. పెద్ద మనస్సుతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఇక విశ్వవిద్యాలయాలు, కాలేజీలలో కూడా గిన్న అన్నానికి స్వస్తి పలకాలని కడుపు నిండా బోజనం పెట్టాలని అధికారులను అదేశించారు. దీంతో తెలంగాణ ఏ విద్యార్థి అకలిభాదలో అలమటించకుండా చర్యలు తీసుకున్నారు.

గ్రామాలే పట్టుగొమ్మలు-మిషన్ కాకతీయ

తెలంగాణ రాష్ట్రంలో గ్రామాలే పట్టగొమ్మలని భావిస్తుంది సర్కార్. ఈ క్రమంలో తెలంగాణలోని అన్ని గ్రామాలకు పునరుజ్జీవం చేసేందుకు నడుంబిగించింది. ఇందులో భాగంగా గ్రామాలకు సాగునీరు అందిస్తే.. అక్కడి నుంచి పట్టణాలకు వలసలు వుండవని, అంతేకాక ఇక గ్రామాలలో నిరుద్యోగ సమస్య కూడా తలెత్తదని భావించిన కేసీఆర్ ప్రభుత్వం అందుకు అనుగూణంగా చర్యలు చేపట్టింది.  కాకతీయుల కాలంలో ఉద్యమంలా సాగిన చెరువుల తవ్వకాలు, గొలుసుకట్టు చెరువుల నిర్మాణాలనే తెలంగాణ ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకుంది. మళ్లీ దానినే అమలు చేసిన తెలంగాణను సస్యశ్యామలం చేయాలని భావిస్తుంది. అందుకే ఈ పథకానికి 'మిషన్ కాకతీయ' అని నామకరణం చేసింది. తెలంగాణలో జలవనరులు, నీటి లభ్యత పెంచడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. చెరువుల్లో పూడిక తీతలు, చెరువుల్లో పూడికను పంటపొలాలకు తరలించడం వంటి చర్యల ద్వారా చెరువులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. ఈ పనులను ఉపాధి హామీ పథకం కింద చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా చెరువుల తూములు, అలుగులు, మత్తళ్ళు, మట్టి కట్టల మరమ్మత్తు పనులు కూడా చేపట్టనున్నారు. అంతకుముందే రాష్ట్రంలోని చెరువుల వివరాలు, విస్తీర్ణం వివరాలను కూడా ప్రభుత్వం సేకరించింది. ప్రస్తుతం ఉనికిలో ఉన్నవి, నిరుపయోగంగా మారినవి, కబ్జాలకు గురైన చెరువుల లెక్కలను కూడా నమోదు చేసింది.
 
'మిషన్ కాకతీయ'ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం దానికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడమే కాదు, అధికార యంత్రాంగానికి అవసరమైన ఆదేశాలిచ్చింది. ప్రవాస భారతీయులకూ చెరువులను దత్తత తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగానే ప్రముఖులు, ప్రతికా సంపాదకులతో ప్రత్యేకంగా సమావేశాలు కూడా నిర్వహించింది తెలంగాణ ప్రభుత్వం. సమాజంలోని అన్నివర్గాలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు సమాయత్తమవుతోంది. మొత్తానికి 'మిషన్ కాకతీయ'ను ఓ ప్రజా ఉద్యమంలా చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం చెబుతున్నట్లు ప్రజల భాగస్వామ్యం లేకుండా 'మిషన్ కాకతీయ' విజయవంతం కావడం అసాధ్యం. ఇలాంటి మహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం, అవినీతికి చోటులేకుండా చూడటం,స్వచ్ఛమైన ఫలితాలను ప్రజలకు అందేలా చూడటం వంటి విషయాలను అందరూ బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అంచనాలు అన్ని అనుకున్నట్లుగానే పూర్తైన తరువాత పనిలేక నగరబాట పట్టిన వలస జీవులు కూడా మళ్లీ గ్రామాలకు వస్తారని, దీంతో గ్రామాలు మళ్లీ సందడిగా మారతాయని ప్రభుత్వం నమ్మకం. అందకనే వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి తండాలన్ని గ్రామ పంచాయతీలుగా మార్చాలని కూడా కేసీఆర్ ప్రభుత్వం భావిస్తుంది.

తొలినాళ్ల కొరతను అధిగమించి నిరంతర విద్యుత్ దిశగా..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా వున్నా విద్యుత్ సమస్య మాత్రం అందరినీ బాధించింది. వేసవి విషయాలను పక్కనబెడితే వర్షాకాలం, చలికాలంలో కూడా విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోయింది. వాస్తవానికి తెలంగాణలో 8418 మెగావాట్లకు సగం కూడా ఉత్పత్తి అవడం లేదు. స్థాపిత సామర్థ్యానికి కనీసం 20 శాతం ఉత్పత్తి తక్కువగా కావడం.. అదే సమయంలో రోజు వారి డిమాండ్ ఒక్కసారిగా 120-145 మిలియన్ యూనిట్ల నుంచి సరాసరి 165-171 మిలియన్ యూనిట్లకు పెరగడంతోనే విద్యుత్ కొరత ఏర్పడింది. ఆ సమస్యను అధిగమించడానికి రంగంలోకి దిగిన తెలంగాణ సర్కార్.. అటు కేంద్రంతో ఈ సమస్యను చెప్పుకుంది. కేంద్రమంత్రితో పలు పర్యాయాలు చర్చలు జరిపి రాష్ట్రానికి విద్యుత్ కేటాయింపులను పెంచేవిధంగా కృషి చేసింది. దీంతో పాటుగా చత్తీస్ గడ్ రమణసింగ్ సర్కారుతో చర్చలు జరిపి దీర్ఘకాలిక సరఫరాతో విద్యుత్ ను కొనుగోలు చేసింది. దీంతో పాటు వార్ధా టూ డిచ్‌పల్లి, తెలంగాణ ఇంటర్ స్టేట్ ట్రాన్స్ మిషన్ లైన్ నిర్మించేందుకు టెండర్ల పిలిచింది ప్రభుత్వం. తెలంగాణలోనే అతిపెద్ద విద్యుత్ కేంద్రాలను నిర్మించేందుకు ప్రభుత్వరంగ సంస్థ అయిన బీహెచ్‌ఈఎల్‌తో ఒప్పందం చేసుకుంది. విద్యుత్ కొరతను ఎదుర్కొనేందుకు తక్షణ ప్రణాళికగా 500 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణానికి టెండర్లను ఆహ్వానించడంతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలో భాగంగా 2000 మెగావాట్ల కొనుగొలుకు ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.

అద్భుత పారిశ్రామిక విధానం.. నిరుద్యోగానికి విరామం..

ఉద్యమాల పురటిగడ్డ తెలంగాణలో రానున్నకాలంలో నైపుణ్యం కలిగి వున్న ఒక్క యువకుడు కూడా నిరుద్యోగిగా మారకూడదని, చేతి నిండా పని కల్పిస్తే బంగారు తెలంగాణ స్వప్నం అవిష్కృతం అవుతుందని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్ పారిశ్రామిక విధానంలో నూతన మార్పులను తీసుకోచ్చారు. సింగిల్ విండో విధానాన్ని అమలు చేశారు. దీంతో ఎందరెందరో పారిశ్రామిక వేత్తలు నేరుగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యి తమ పరిశ్రమలను మెక్ ఇన్ తెలంగాణలో భాగంగా స్థాపించేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ రంగంలో సంక్షోభంతో తెలంగాణలో పరిశ్రమలు రావని, వున్నవే తరలివెళ్లనున్నాయన్న వదంతులకు ముఖ్యమంత్రి దూరదృష్టి విధానం చెక్ పెట్టింది. ఓ వైపు తెలంగాణలో విద్యత్ సంక్షోభాన్ని నివారిస్తూనే భరోసాను కల్పించారు మరోవైపూ పారశ్రామికంగా ఎక్కడా లేనట్లుగా ఇక్కడ సింగిల్ విండో విధానం అమలుతో గూగుల్, మైక్రోసాప్ట్, యాపిల్ తదితర గ్లోబల్ సంస్థలు తమ యూనిట్లను స్థాపించేందుకు రంగం సిద్దం చేసుకోగా అనేక సంస్థలు కూడా ఇక్కడికి తరలివస్తున్నాయి. హైదరాబాద్ మాత్రమే కాకుండా వరంగల్ లోనూ సాప్ట్ వేర్ సంస్థల నిర్మాణాలు ఊపందుకున్నాయి. రానున్న మరికోన్నేళ్లలో ఇవి పూర్తి స్థాయిలో పనిచేయడం ప్రారంభించగానే ప్రత్యక్ష, పరోక్షంగా వేలాది మందికి ఉపాది లభించినట్లే.

ఇంటింటికీ సురక్షిత తాగునీరు - మిషన్ భగీరథ

గ్రామాల్లో తాగు నీటి కోసం కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండి వారి నివాసాల వద్దకే తాగునీటిని అందించే పథకమే మిషన్ భగీరధ. ఈ పథకానికి తొలుత వాటర్ గ్రిడ్ పథకం అని నామకారణం చేయగా, ఆ తరువాత దానిని మిషన్ భగీరధగా మార్చారు. ఈ పథకం ద్వారా 2018 చివరి నాటికి రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు రక్షిత తాగునీరిందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. కలుషిత తాగునీటి వల్ల అనేక రోగాలు వస్తున్నాయి. వాటిని నిర్మూలించి, ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు ఇంటికే తాగునీరు అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ పథకానైనా సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నా.. ముఖ్యంగా మిషన్ భగీరథ పథకంలో మాత్రం స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అశ్చర్యకర నిభంధనను విధించారు. ఐదేళ్లలో తాము అనుకున్నవిధంగా ఏ గ్రామానికైనా మంచినీరును అందించలేని పక్షంలో ఆ గ్రామానికి తాము రామని, రానున్నఎన్నికలలో ఓట్లడగబోమని ప్రకటించారు. కాగా ఈ పథకానికి ఇంటింటికీ ఎల్లవేళలా నీరందించేందుకు నాగార్జునసాగర్, ఎల్‌ఎండీ, మానేరు, శ్రీరాం సాగర్‌ల నుంచి నీటిని తీసుకొనేందుకు ప్రభుత్వం సిద్ధమయ్యింది. జలాశయాల్లో నీళ్లు డెడ్‌ స్టోరేజీలో వున్నా ప్రజలు మాత్రం తాగునీరు కోసం అలమటించే పరిస్థితి రాకూడదని భావించిన ప్రభుత్వం ఇలా చర్యలను తీసుకుంది.

జి మనోహర్ గౌడ్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles