రాష్ట్ర విభజన జరిగి దాదాపు ఒక సంవత్సరం అయింది. విభజన అని పేరే గానీ నిజానికి నేటి మన ఆంధ్రప్రదేశ్ దాదాపు అరవై సంవత్సరాల క్రితం ఏర్పడ్డ ‘ఆంధ్ర రాష్ట్రమే’. Sఒక జాతిచరిత్రలో ఇది అతి స్వల్ప కాలమేకాని ఈ అరవై ఏళ్ళలో మనకు నాలుగు నైసర్గిక స్వరూపాలు, నాలుగు రాజధానులు, నాలుగు విభజనోద్యమాలు. బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రానికీ ఇంత విచిత్ర చరిత్ర ఉండదు.
1953లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ‘భాష’ ప్రాతిపదికన విడిపోయాం. బాగానే వుంది. అయితే అప్పటికే ఆంధ్రుల సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక రాజధానిగా నడిబొడ్డున సిద్ధంగా ఉన్న గుంటూరు-విజయవాడ ప్రాంతాన్ని వదిలి ఏ సౌకర్యం లేని కర్నూలును రాజధాని చేయడం దగ్గర మొదలైంది - మన రాజకీయ నాయకుల స్వార్థ క్రీడ. మూడేళ్లకే 1956లో, అదే క్రీడలో భాగంగా రాయలసీమ, తెలంగాణ కాంగ్రెస్ నాయకుల మధ్య వర్గ సామరస్యం కుదరడంతో విశాలాంధ్ర పేరిట తెలంగాణను కలుపుకొని, కర్నూలు నుంచి హైదరాబాద్‌కు రాజధాని మార్చుకున్నాం.
ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తొలి మూడు దశాబ్దాల కాలంలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన వందలాది ప్రభుత్వరంగ పరిశ్రమలు, విద్య, వైద్య, రక్షణ రంగ సంస్థలు హైదరాబాద్‌కే వెళ్లాయి. ఆ తర్వాత సీమాంధ్ర రాజకీయ వ్యాపార భూస్వామ్య వర్గాలకు హరిత విప్లవం తదితర మార్గాలద్వారా వచ్చిన వ్యవసాయ ఆదాయం అంతా హైదరాబాద్‌కే చేరింది. 1990తర్వాత ఐ.టి.రంగం అభివృద్ధితో సీమాంధ్రు లకు సమకూరిన విదేశీమారకం అంతా హైదరాబాద్‌కే పెట్టుబడిగా మారింది గానీ, ఈ ప్రాంతం మాత్రం అనాథగానే మిగిలిపోయింది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ నగరంగా తామే అభివృద్ధి పరచామని గర్వంగా చెప్పుకొనేవాళ్ళు -సీమాంధ్ర ప్రాంతాన్ని ఇంతకాలం అనాథగా వదిలేసినందుకు ఏం సంజాయిషీ చెబుతారు?
గత యాభై సంవత్సరాలుగా బలపడిన ప్రత్యేకరాష్ట్ర వాదం, చెలరేగిన విభజన ఉద్యమాలు చూసైనా ఆంధ్ర నాయకులు కళ్లు తెరవలేదు సరికదా, హైదరాబాద్ అభివృద్ధిని మరింత వేగిరపరిచారు. సీమాంధ్ర ప్రాంతపు వెనుకబాటుతనం శాశ్వతమైపోతోందని గ్రహించిన ఆనాటి ప్రజానాయకులు -వాళ్ళు రాజకీయ వ్యాపారులో, రియల్టర్‌లో కాదు. 1969/70లో ఉధృతంగా నిర్వహించిన జై ఆంధ్ర ఉద్యమం విజయవంతమై వుంటే పరిస్థితి మరోలా వుండేది. ఆ ఉద్యమ వైశాల్యంలో ఆంధ్రులు ఎక్కాల్సిన రైలు మరో నలభై సంవత్సరాలు ఆలస్యమైంది. 1956-2010 సంవత్సరాల మధ్య ప్రతి దశలోనూ సీమాంధ్ర రాజకీయ నాయకులు, పెట్టుబడిదారులు తమ తమ స్వీయ ప్రయోజనాల కోసం ప్రాకులాడారే గానీ మన ప్రాంతాభివృద్ధి కోసం ఆలోచించలేదు. తెలంగాణలో ప్రత్యేక ఉద్యమం ఉధృతమైన తర్వాత సీమాంధ్ర నాయకుల వైఖరి మరింత విచిత్రంగా మారింది. స్వార్థ ప్రయోజనాల కోసం సీమాంధ్రకు చెందిన రాజకీయ వ్యాపారులు ప్రజలను తప్పుదారి పట్టించారు. సీమాంధ్ర సామాన్య పౌరులకు రాష్ట్ర విభజన వల్ల నిజంగానే నష్టం ఉంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 2001లో మొదలుకాగానే సమైక్యాంధ్ర కోసం ఉద్యమించినా కొంత అర్థం వుండేది. అయితే 2009 డిసెంబర్ 9 రాత్రి చిదంబరం విభజన ప్రకటన చేసేంతవరకూ దాదాపు తొమిదేళ్ళు నిమ్మకునీరెత్తినట్టు స్తబ్దంగా ఉండిపోయారు సీమాంధ్రులు. ఆంధ్రులు పది సంవత్సరాలుగా తమగుండెల మీద రగులుతున్న కుంపటిని ఏ మాత్రం పట్టించుకోకపోవడం విచిత్రం.
‘రాష్ట్ర సమైక్యత’ సాధ్యం కాదని 2009 డిసెంబర్ 9న చిదంబరం ప్రకటనతో తెలిసిపోయింది. ఇంకా అనుమానాలున్న వాళ్లకి 2013 జూన్ 30 తీర్మానంతో విభజన అనివార్యం అని తేలిపోయింది. కనీసం అప్పటినుంచైనా ‘వేర్పాటు జరిగితే సీమాంధ్రకు రావాల్సిన రాయితీలేమిటి? ఆస్తుల అప్పుల పంపకాలకు విధివిధానాలేమిటి? అరవై సంవత్సరాలు సమైక్య రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌లో ఒనకూడిన మౌలిక సౌకర్యాలు, నిర్మాణాలు, పారిశ్రామికీకరణ, విద్యా వైద్య రక్షణ సంస్థలు, ఆదాయ వనరులు ఇవన్నీ ఏకపక్షంగా తెలంగాణకు కట్టబెట్టడం మరీముఖ్యంగా తెలంగాణ వారు వేర్పాటు కోరుకున్న సందర్భంలో ఎంతవరకు సబబు?’ ఇత్యాది విషయాలన్నీ సీమాంధ్ర నాయకులు చర్చకు పెట్టాల్సింది. విభజన అనివార్యమే అయితే వాటి నుంచి న్యాయమైన వాటా అంధ్రులకు అందేలా జాతీయస్థాయిలో ప్రయత్నించాల్సింది.
అవన్నీ వదిలిపెట్టి సమైక్యరాష్ట్రమే మన ధ్యేయమంటూ, హైదరాబాద్ లేకపోతే సీమాంధ్ర ప్రజలు బ్రతకలేరనే బీద అరుపులతో, విడిపోతే ఆంధ్రులకు తాగునీరు, సాగునీరు దొరకవనే కరువు మాటలతో కాలం గడిపారు. అంటే తెలంగాణ వారి నీరు, సంపద ఆంధ్రులు దోచుకున్నారనే అపవాదును అమాయకంగా బలపరిచినారు ఉద్యమకారులు. సమైక్య ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడడమంటే మాతృద్రోహం చేసినంత పాపంగా చిత్రించటం ప్రారంభించారు. ఉదాహరణకు విజయవాడ, గుంటూరులలో ప్రత్యేకాంధ్రకు అనుకూలంగా ఉన్న ఉద్యమాన్ని (అందులో ఈ వ్యాసకర్త కూడా ఓ కార్యకర్త) సంస్థలను అనుమానించి, అవమానించి సమావేశాలను భగ్నం చేసి భౌతిక దాడులతో భయభ్రాంతులను చేశారు. ‘సమైక్యవాదమే మనకు ఆధారం, హైదరాబాద్ మన జీవన సారం’ అనే భ్రమలు వ్యాపింప చేశారు సీమాంధ్ర నాయకులు.
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నిర్వహించిన తీరునూ ఒకసారి నిశితంగా పరిశీలిద్దాం. సమైక్యతే మన ధ్యేయమైతే వేర్పాటువాదులకు కూడా సమైక్యత ఎంత ప్రయోజనకరమో చెప్పగలగాలి. అంతేగానీ విడిపోతే ‘మేం నీళ్ళు, కరెంటు, ఆదాయం కోల్పోయి చెడిపోతాం’ అంటే ఎలా? మీరు బాగుపడడం కోసం మేం కలిసుండాలా? అని ఎదుటవాళ్లు అడగరా? ‘మేము వచ్చి మిమ్మల్ని బాగుపరచాం’ అంటే మరి ‘మిమ్మల్ని మీరు ఎందుకు బాగుపరచుకోలేదు’ అని ఎదుటివాళ్లు ప్రశ్నించరా? విడిపోదామనుకొనే వాళ్ళకు కలిసి వుందామనుకొనే వాళ్ళు సమైక్యత పట్ల భరోసా కల్పించాలి. అంతేగానీ ఆ ఉద్యమాన్ని, ఆ నాయకులను కించపరిచే వ్యాఖ్యలు, విమర్శలు చేయడం సబబా? ఆ పెత్తందారీ తనంవల్ల తెలంగాణ వారిలోని అసంతృప్తి ఆందోళనగా మారింది. సమైక్య ఉద్యమం తీవ్ర స్థాయిలో కొనసాగుతుండగా నాయకులు కొందరు రాయలసీమను, తెలంగాణలో కలవమని, ఇంకొందరు కర్ణాటకలో కలుస్తామని అనడం కూడా ఆంధ్రుల సమైక్యత ఆ ఉద్యమపు డొల్లతనాన్ని తేటతెల్లం చేసింది. తెలంగాణలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పక్షాలు ప్రత్యేక రాష్ట్రం కోసం ఏకోన్ముఖంగా ఉద్యమిస్తున్నప్పుడు సమైక్య ఉద్యమ నాయకుల పిల్లి మొగ్గలు ఉద్యమాన్ని బలహీనపరిచాయి. సీమాంధ్రలోని కాంగ్రెస్, తెలుగుదేశం అన్ని ప్రధాన రాజకీయ పక్షాలు రాష్ట్ర విభజనకు ఒక వైపు సూత్రప్రాయంగా ఆమోదించి తీర్మానాలు చేసి లేఖలు ఇచ్చి ఎన్నికల ప్రణాళికలలో చేర్చి ఎన్నికల ఒప్పందాలు కుదుర్చుకొని మరోవైపు సమైక్యత కోసం ఉద్యమించడం వారి అవకాశవాదాన్ని, దివాలాకోరుతనాన్ని ప్రపంచానికి తేటతెల్లం చేశాయి.
ఇక కేంద్ర విభజన బిల్లు తయారుచేసిన దగ్గర నుంచీ సమైక్యాంధ్ర నాయకుల వాదన చిత్రాతిచిత్రంగా మారింది. ఆధికరణ 3పై వివాదం, అధికరణ 371పై రగడ, ఫ్రీజోన్‌పై పేచీ, విభజన బిల్లు ముసాయిదాను రాష్ట్ర అసెంబ్లీ తిరస్కరిస్తే కేంద్రం తోక ముడుస్తుందన్న వితర్కమూ, లోక్‌సభలో పాసైతే రాజ్యసభలో వీగిపోతుందన్న కుతర్కమూ, పాసైనా రాష్ట్రపతి ఆమోదించరనే దురాశ, సమైక్యనాయకులు ఆఖరి నిమిషంలో ‘ఏదో బ్రహ్మాస్త్రం’ ప్రయోగిస్తారనే పేరాశ... సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ‘ఆశల పల్లకీలో ఊహల ఊరేగింపు’గా తయారుచేసింది. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు జరగాల్సింది ఆలోచిద్దాం. ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వాళ్ళు అంటున్నట్టు విభజన వల్ల సీమాంధ్ర అభివృద్దికి మంచి అవకాశం వచ్చిందనే నిజాన్ని అందరూ గుర్తించచడం అవసరం. గతంలో లాగా అభివృద్ధి మొత్తం రాజధానిలో కేంద్రీకృతం కాకుండా రాష్ట్రం నలుమూలలకు వికేంద్రీకరించడం అవసరం. రాజధానిని భూతల స్వర్గంగా నిర్మించే ప్రయత్నంలో అభివృద్ధి కార్యకలాపాలకు ఉపాధి కల్పనకు పెట్టుబడులు లేని స్థితిని ఆహ్వానించకూడదు. రాష్ట్రమంటే 13 జిల్లాలు. అంతేగాని ఒక రాజధాని మాత్రమే కాదు.
మరో ముఖ్య విషయం రాష్ట్ర విభజన చట్టంలో అనేక లొసుగులున్నాయని రాజకీయ పార్టీలతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు కూడా అంటున్నారు. ఆస్తులను, సంస్థలను స్థానికత ఆధారంగా విభజించి అప్పులకు మాత్రం జనాభా సంఖ్యను ప్రామాణికంగా చేసుకున్నారు. తత్ఫలితంగా సీమాంధ్ర ప్రాంతం విపరీతంగా నష్టపోగా యాభై ఐదు సంవత్సరాల సమైక్యాంధ్ర అభివృద్ధి ఫలితాలు మాత్రం తెలంగాణ పరమయ్యాయి. ఇది అన్యాయమని అంటున్నారు-అధికారంలో వున్న వాళ్ళు కూడా అన్యాయం అన్యాయం అని ఆక్రోశించడం సమంజసం కాదు. అన్యాయాన్ని సరిదిద్దడం కోసం కృషి చేయాలి. అవసరమైతే ‘న్యాయపోరాటం’ చెయ్యాలి. ఈ విభజన తెలంగాణ వారి కోరికే కాబట్టి సహజన్యాయసూత్రాలకు అనుగుణంగా, సీమాంధ్రులకు రావలసిన వాటాకోసం న్యాయపోరాటం చేసే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించాలి. భారత రాజ్యాంగంలోని 12, 13, 21 తదితర ఆధికరణల ప్రకారం విభజన చట్టం వల్ల సీమాంధ్రకు జరిగిన నష్టాన్ని న్యాయ సమీక్షకు పెట్టాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతైనా ఉంది.
- పసుపులేటి మునిరాజు
న్యాయవాది, సామాజిక కార్యకర్త
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more