Upa loss itself on coalgate and manmohan facing court notices now

upa, coalgate, coal, manmohan, cbi, caag, report, hindalco, parekh

In a sensational twist to the Hindalco coal block allocation case, a special court here on Wednesday summoned former Prime Minister Manmohan Singh as an accused while summarily rejecting the CBI closure report. The court observed that there were enough “incriminating circumstances” to prosecute Dr. Singh for criminal conspira

ప్రత్యేకం: యుపిఎ మాడిపోయింది.. మన్మోహన్ కు మసి అంటుకుంది

Posted: 03/12/2015 05:18 PM IST
Upa loss itself on coalgate and manmohan facing court notices now

బొగ్గు గనుల కేటాయింపుల్లో అవతవకలు జరిగాయన్నది దేశం మొత్తానికి తెలిసిన నిజం. విలువైన జాతి సంపదను అప్పనంగా కొంత మందికి లేదా కొన్ని కార్పోరేట్ వర్గాలకు కేటాయిస్తు అప్పటి కేంద్ర ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పటికీ వెంటాడుతూనే ఉన్నాయి. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రధాని పదవితొ పాటు, బొగ్గు గనుల శాఖను తనవద్దే ఉంచుకున్నారు. అయితే అదే సమయంలో కీలకమైన బొగ్గు గనుల కేటాయింపుల్లో మితిమీరిన అవినీతి జరిగిందని, ఫలితంగా వేల కోట్ల రూపాయల విలువైన బొగ్గు నిక్షేపాలు కొందరి స్వంత మయ్యాయన్నది వాస్తవం. కానీ ఆ కేసులో ఎంత మంది తమ చేతివాటం చూపించారు అన్నది ప్రశ్న. కానీ వేరే వారి సంగతి ఏమో తెలియదు కానీ మన్మోహన్ సింగ్ కు మాత్రం బొగ్గు మసి ఇంకా పోవడం లేదు. బొగ్గు గనుల కేటాయింపుల్లో జరిగిన అవతవకలు, సంబందించిన వివరాలు మీ కోసం...

పారిశ్రామికీకరణం పుణ్యమా అని ప్రభుత్వం పరిశ్రమలకు భారీగా ఎర్రతివాచి పరిచింది. అందులో భాగంగా వాటి్కి  కావాల్సిన అన్ని సదుపాయాలను కల్పించాలని కూడా ప్రభుత్వం పూనుకుంది. అయితే దీన్ని పారిశ్రామిక వర్గాలు తమకు అనుకూలంగా వాడుకున్నాయి. తోలు వలిచి మరీ అరటిపండు నోట్లో పెట్టినట్లు ప్రభుత్వం పరిశ్రమలకు కల్పిస్తున్న సౌకర్యాలను, అవకాశాలను తమకు అనుకూలంగా మార్చుకున్నారు కొందరు బడా పారిశ్రామిక వేత్తలు. అందులో భాగంగా తమకు భారీగా బొగ్గు కేటాయింపులను కేటాయించాలని ప్రదానికి, ప్రభుత్వానికి వత్తిడి పెంచారు. నిబంధనలను ఉల్లంఘిస్తు, కొంత మంది ప్రయోజనాలకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం బొగ్గు గనులను కొందరికి కేటాయిస్తు నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రతిపక్షాలు ఎంత రాద్దాంతం చేసినా, పర్యావరణ వేత్తలు ఎన్ని హెచ్చరికలు చేసినా వాటిని పట్టించుకున్నా పాపాన పోలేదు.

కానీ చేసిన పాపం ఊరికే పోతుందా..నిజం ఎన్నటికైనా బయటికి రావాల్సిందే. కానీ యుపిఎ చేసిన అతి పెద్ద చారిత్రాత్మక తప్పును కాగ్ బయటపెట్టింది. 2012 ఫిబ్రవరిలో భారీ కుంభకోణాన్ని బయటపెట్టింది. 2జి స్పెక్ట్రమ్‌ కేటాయింపుల్ని మించిన దోపిడి జరిగిందని ఆరోపిస్తూ నివేదికను పార్లమెంటు ముందు ప్రవేశపెట్టింది. బొగ్గు గనుల కేటాయింపుల్లో జరిగిన అవినీతి, అక్రమాలపై యుపిఎ ప్రభుత్వాన్ని నగ్నంగా నిలబెట్టింది కాగ్. బొగ్గు గనుల కేటాయింపుల్లో అనుసరించిన విధానాలతో దేశ ఖజానాకు లక్షా 86వేల కోట్ల రూపాయల మేర నష్టం వచ్చిందని కాగ్‌ నివేదిక వెల్లడించింది.  బొగ్గు నిల్వల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, దాదాపు వంద ప్రైవేట్ కంపెనీలు, విద్యుత్, స్టీల్, సిమెంట్ పరిశ్రమలకు చెందిన కొన్ని పబ్లిక్ సెక్టర్ కంపెనీలు ఈ బొగ్గు నిల్వలను కారు చౌకగా కొట్టేశాయని కాగ్ వివరించింది.

ఇలా బొగ్గు క్షేత్రాలను దక్కించుకన్న సంస్థల్లో టాటా గ్రూప్ సంస్థలు, జిందాల స్టీల్ పవర్ లిమిటెడ్, ఎలక్ట్రో స్టీల్ కాస్టింగ్స్ లిమిటెడ్, అనిల్ అగర్వాల్ గ్రూప్ సంస్థలు, భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్, జైస్వాల్ నెకో, అభిజిత్ గ్రూప్, ఆదిత్యా, బిర్లా గ్రూప్ కంపెనీలు, ఎస్సార్ గ్రూప్ ప్రైవేట్ వెంచర్స్, అదానీ గ్రూప్, ఆర్సిలార్ మిట్టల్ ఇండియా, లాంకో గ్రూప్‌తో పాటు అనేక చిన్న, మధ్య తరహా సంస్థలకూ బొగ్గు నిల్వలను అత్యంత చవకగా కట్టబెట్టారని కాగ్ తప్పుబట్టింది.

2004లో యూపీఏ అధికారంలోకి వచ్చాక.. దేశవ్యాప్తంగా బొగ్గు గనుల్లో తవ్వకాలకు... రాష్ట్రాల సిఫార్సుల ఆధారంగా కేంద్రం ప్రైవేట్‌ సంస్థలకు అనుమతులు మంజూరు చేసింది. బొగ్గు గనుల్ని ప్రైవేట్‌ సంస్థలకు ఏకపక్షంగా కట్టబెట్టకుండా.. వేలం పద్ధతిని ఎందుకు అనుసరించలేదన్న ప్రశ్న తలెత్తింది. పైగా ఈ అంశంపై క్యాబినెట్‌లోనూ చర్చకు పెట్టలేదు. బొగ్గుగనుల మంత్రిత్వ శాఖ ఏకపక్షంగా.. ప్రేవేటు సంస్థలకు పాత పద్ధతుల్లోనే గనులను కేటాయించేసింది. బొగ్గు క్షేత్రాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో  ప్రకాష్‌జావ్‌దేకర్‌  చీఫ్‌ విజిలెన్స్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో కాగ్‌ కూడా ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. కాగ్‌ అభ్యంతరాలకు అప్పటి బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి పి.సి.పరేఖ్‌ కూడా మద్దతు పలకడంతో.. కేంద్రం ఇరుకున పడాల్సి వచ్చింది.

దేశంలో బొగ్గుకు డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో బొగ్గు క్షేత్రాల కేటాయింపు విధానాన్ని సవరించాలని 2004లోనే బొగ్గు మంత్రిత్వశాఖ ప్రయత్నాలు ప్రారంభించింది. అప్పటి దాకా అమల్లో ఉన్న క్యాప్టివ్‌ విధానానికి బదులు గనుల్ని వేలం వేయడం ద్వారా ఖజానా ఆదాయం ఎలా సమకూరుతుందో వివరిస్తూ అప్పటి బొగ్గు శాఖ కార్యదర్శి పి.సిపరేఖ్‌ ఓ నివేదికను 2004 జులై 16న సమర్పించారు. 2004 ఏప్రిల్‌ 28న బొగ్గుశాఖ కార్యదర్శి సమర్పించిన ప్రతిపాదనలపై ఇతర ప్రభుత్వ శాఖల అభిప్రాయాలను తెలుసుకోవాలని అప్పటికి అదికారులు సూచించారు. ప్రభుత్వం కేటాయించే విధానంలో కొన్ని సంస్థలకే బొగ్గు క్షేత్రాలను కేటాయించే వీలుందని, ఫలితంగా ఇతర కంపెనీలు తప్పనిసరిగా కోల్‌ ఇండియా నుంచి బొగ్గును కొనుగోలు చేయాల్సి ఉంటుందని తెలిసింది. దీని వల్ల ప్రభుత్వం నుంచి బొగ్గు గనులు దక్కించుకున్న కొన్ని సంస్థలకే మేలు కలుగుతుండటంతో ప్రభుత్వం అడ్డుచెప్పింది. 2004 అక్టోబర్‌ నాలుగున వేలం పద్ధతికి సంబంధించిన ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని ప్రభుత్వం యోచించింది.

వివిధ ప్రభుత్వ శాఖలు, రాష్ట్రాల నుంచి అందిన సూచనలు, సలహాలను పొందుపరిచి 2005 జూన్‌ 21న ప్రధాని అమోదం కోసం చట్టసవరణకు కొత్త ముసాయిదాను పిఎంఓకు బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంపారు. అయితే 2005 జులై4న బొగ్గు క్షేత్రాల వేలంలో పాల్గొనేందుకు విద్యుత్‌ సంస్థలు సుముఖంగా లేవని ప్రధానికి అధికారులు తిరిగి లేఖ రాశారు. వేలం ప్రతిపాదనను మరింత లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. అయితే బొగ్గు క్షేత్రాల వేలానికి రాష్ట్రాలు, వివిధ ప్రభుత్వ శాఖలు అనుకూలంగా ఉన్నాయనే సంగతిని అధికారులు దాచి ఉంచారు.  ప్లానింగ్‌ కమిషన్‌, ఆర్ధిక శాఖ, గనుల శాఖ, ఉక్కు మంత్రిత్వ శాఖలు కూడా బొగ్గు మంత్రిత్వ శాఖ చేసిన వేలం ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించాయి. దీంతో 2005 జులై 25న బొగ్గు క్షేత్రాల వేలానికి ప్రధానమంత్రి కార్యాలయం అమోదం తెలిపింది. బొగ్గు గనుల జాతీయికరణ చట్టాన్ని సవరించాలని నిర్ణయించింది. ప్రతిపాదిత సవరణ పార్లమెంటులో నెగ్గడానికి సమయం పడుతున్నందున అప్పటికే అందిన దరఖాస్తుల్ని పరిష్కరించాలని నిర్ణయించి 24 బొగ్గు క్షేత్రాలను వేలం వేశారు. అయితే పిఎంఓలోని కొందరు అధికారులు, బొగ్గు మంత్రిత్వ శాఖ పెద్దలు కలిసి వేలం పద్ధతి అమల్లోకి రాకుండా చట్టపరమైన అడ్డంకులను సృష్టించారని బొగ్గుశాఖ కార్యదర్శి కాగ్‌ నివేదిక వెలుగు చేసిన తర్వాత ఆరోపించారు.

అలా నిజాలను కప్పి ఉంచుతూ కొందరు అధికారులు, నేతాగణం చేసిన ఫలితంగా భవిష్యత్ భారతానికి ఎంతో విలువైన బొగ్గు గనులు కేవలం కొంత మందికి మాత్రమే స్వంతమయ్యాయి. అయితే అప్పటి యుపిఎ ప్రభుత్వం చేసిన అవినీతి మరకలు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. మీడియాలో యుపిఎ ప్రభుత్వం చేసిన అవినీతి కధలు కథలుగా ప్రసారమైంది. దాంతో అవినీతి ఊబిలో పూర్తిగా కూరుకుంది యుపిఎ. అయితే బొగ్గు గనుల కేటాయింపుల్లో జరిగిన అవినీతిపై కానీ, ప్రభుత్వంపై పడ్డ బొగ్గు మచ్చను కానీ వ్యతిరేకిస్తూ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు మన అప్పటి భారత ప్రధాని మన్మోహన్. అదే ఇప్పుడు అతనికి శాపమైంది. అప్పుడు తప్పు జరుగుతున్నా పట్టించుకోకుండా ఉండడం వల్లే మన్మోహన్ ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కానీ ఇప్పుడు మాత్రం తాను నిజాయితీ పరుడినని, తన నిజాయితీ గెలుస్తుందని తెగ బాధపడుతున్నారు.

తాజాగా బొగ్గు కుంభకోణంలో మన్మోహన్ సింగ్ కోర్టుకు హాజరుకావాలంటూ సిబిఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. చేసిన తప్పుకు బలైపోయి, అధికారానికి దూరమైన కాంగ్రెస్ ఇప్పుడు స్పందిస్తోంది. కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మన్మోహన్ సింగ్ కు బాసటగా నిలుస్తూ, కాంగ్రెస్ నాయకులు, సోనియా గాంధీ ఢిల్లీలో ర్యాలీ కూడా నిర్వహించారు. అయితే సంఘభావం గా నిర్వహించిన ర్యాలీ యుపిఎ తప్పులను ఒప్పులుగా మార్చదు. ఒక్క మన్మోహన్ తప్పు చెయ్యనంత మాత్రాన యుపిఎపై పడ్డ బొగ్గు మరకలు అబద్దాలు కాకుండా పోవు. కానీ ఇవేవీ పట్టన్నట్లు కాంగ్రెస్ మాత్రం మా మన్మోహన్ మాణిక్యం, ఎలాంటి కలంకాలు లేవంటూ చంకలు చరుస్తోంది. తప్పు చెయ్యడం కన్నా, తప్పు జరిగేప్పుడు ఆపకపోవడం కూడా పెద్ద తప్పే. ఇదే ఇప్పుడు మన్మోహన్ కు వర్తిస్తోంది. బొగ్గు కుంభకోణం గురించి తెలిసిన మౌన మునిగా ఉండిపోయిన మన్మోహన్ ఇప్పుడు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. మొత్తానికి దేశాన్ని ఓ కుదుపు కుదిపిన బొగ్గు గనుల కుంభకోణం లో కాస్త ప్రగతి కనిపిస్తోంది. జాతి సంపదను దోచుకోవడానికి సహకరించి ఉంటే ఎవరైనా శిక్షకు అర్హులే...చివరికి అది ప్రదాని అయినా కూడా.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : upa  coalgate  coal  manmohan  cbi  caag  report  hindalco  parekh  

Other Articles