One boy and one girl true love story in one ofiice

one boy and girl real love story, true love story, real love story, cute love story, funny love story, latest true love story, latest love stories, harikanth stories, harikanth articles, super love story

true real love story one boy and girl love in one office

అలా మొదలయ్యింది: తెలంగాణ అబ్బాయి-ఆంధ్ర అమ్మాయి

Posted: 01/05/2015 12:57 PM IST
One boy and one girl true love story in one ofiice

ఒక అందమైన ప్రేమ కథ.... ఒక అనుకోని ప్రేమ కథ.... ఒక అద్భుతమైన ప్రేమ కథ...  నా మదిలోని భావాలకు అందమైన అక్షర రూపం ఇచ్చి తెలుగు హృదయాలకు అందించాలని నా మనసు ఆరాటపడుతుంది. ఈ ప్రేమ కథలో నేనంటే నేను అల్లుకుపోతానంటూ నా భావాలను మీకు అందించే అదృష్టం నాకివ్వమంటూ పదాలు పోటి పడుతుంటే.., అక్షరాలన్నీ అందంగా సింగారించుకొని నేనంటే నేను ముందని ప్రాధేయ పడుతుంటే ఎలా చెప్పాలన్న ఆందోళన యదలో మొదలయ్యింది... మళ్ళి యదలోనే ఒదుగుతున్న అక్షరాల రూపంలో ఆ మైమరిపించే మధుర ప్రేమను మీ ముందు పెడుతున్నాను.....

నిజంగా మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనకు  ఒక్కో క్షణం సాక్ష్యంగా నిలుస్తుంది.. ఆ క్షణమే మన జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ఆ క్షణమే కొన్ని విచిత్రమైన బంధాలని ముడివేస్తుంది. అలాంటి క్షణంలో ఒక అబ్బాయి.., ఒక అమ్మాయి ఎలా ఒక్కటయ్యారన్నదే ఈ నిజమైన ప్రేమ కథ.

ఎన్నో కమ్మని కలలతో.., అంతకు మించి ఇంకెన్నో కంటికి కునుకు పట్టనీయని కష్టాలతో కాలాన్ని ఎదురీదాలని, జీవితంలో ఎదగాలని ఎర్ర బస్సు ఎక్కి పట్నానికి పయనమై వచ్చాడు ఒక యువకుడు... కొన్ని విలువలు, కొంత ఆలోచన, కొంత అభినివేశమూ సాటి మనిషిని ఆదరించే ఆదర్శ భావాలున్న ఆ యువకుడు తన యుక్తి తో ఉద్యోగం కోసం యత్నించాడు... జర్నలిజం చదివిన ఆ యువకునికి జరింత ఆవేశమూ ఉంది దాని వెనకే ఆవేదనా ఉంది!! అందుకే కోరుకున్న కొలువు కోసం కోటి కంపెనిల్లో వెతికాడు. కాళ్ళకు కన్నులు ఉంటె కష్టాలు చెప్పుకొని కన్నీరు కార్చుకునేవేమో!! ఎట్టకేలకు ఉద్యోగం వరించింది... జీతం తక్కువైన దానిలోనే జీవితం ఉంటుందని 'రాజీ' పడి జేబు.., దానితో పాటు జానెడు పొట్టనింపాలని జాబ్ లోకి దిగాడా ఆ యువకుడు..... ప్రజలకి నిరంతర వార్తలను అందించే ఒక ఛానెల్ లో చలాకిగా చేరాడు...  క్రొత్త నగరం ఆ పైన క్రొత్త నౌకరి.... ఇక బ్రతుకు పోరుకు సిద్దమయ్యాడు భావి భవిష్యత్ తనదే అనుకున్నాడు.

మొదటి రోజులలో చాల క్రొత్తగా సరి క్రొత్తగా అనిపించిందా ఆ అబ్బాయికి, సహోద్యోగులతో పరిచయాలు..., సీనియర్లతో సయోద్యగా సాగిన సంబంధాలు అదో తనదైన లోకం లో తన జర్నలిజం తో ఈ జనాల్ని జాగృతం చేద్దామని భావించాడు.... కాని కాలం అతనికి కొన్ని అనుభవాలని అందంగా ఇచ్చింది... ఆ అనుభవాలని తన అంతరంగంలో చెరగకుండా అచ్చు వేసాడా ఆ అబ్బాయి. జనాన్ని జాగృతం చేయాల్సిన అవసరం లేదని ఈ జనంలో తను కిందకి జారకుండా ఉంటె చాలని అనుకున్నాడు. అందుకే తన పనే తన లోకంగా ఒక 6 నెలలు గడిపాడు... తన అక్షరాలనే అపూర్వంగా మలచి ఈ అవనికే ఆయుధమై ఆయువు పట్టుగా నిలిచే ప్రయత్నం చేసాడు. తను రాసిన ప్రతి వ్యాక్యంలో విషయంతో కూడిన విజ్ఞానం దాగి ఉండేది. ఆ ఒక్క సంవత్సరంలో ఎన్నో మార్పులు, తన ఉద్యోగ నిర్వహణలో మరెన్నో మధురానుభూతులు, కొన్ని చేదు జ్ఞాపకాలు కొన్ని తీపి జ్ఞాపకాలు... మెల్లి మెల్లి గా బ్రతుకు చక్రానికి ఆశ అనే ఇంధనాన్ని అందించి ఏదోలా నడుపుతుంటే.... అప్పుడచ్చింది జీవితాన్ని మార్చే క్షణం.., మురిపించే క్షణం..., మదిని మరో లోకంలో పడేసే క్షణం...


ఉద్యోగం చేస్తూ తీరిక లేకుండా గడుపుతున్న ఆ యువకునికి తనివి తీరా చూసిన ఇంకా ఆశ తీరని అందం కనిపించింది. ఆ అందం ఎక్కడో లేదు తన పని చేస్తున్న ఆఫీసు లోనే ఉంది... ఆరు నెలల పాటు ఆ ఆఫీసులో పని చేసిన ఆ అబ్బాయి అవసరం అనే పనిలో పడి తన పక్కనే తిరుగుతున్న ఒక అందం.., తనకు బంధాన్ని కలిపే అందమైన అనుబంధమని అర్థం చేసుకోలేదు... తన ఆఫీసులోనే పని చేస్తున్న ఆ అందమైన అమ్మాయిని చూసినప్పుడు అతని మనసు అనే సంద్రంలో అల్లోకల్లానికి దారి తీసింది. అందమైన తన అల్లరో తెలియదు... అప్పుడప్పుడు ప్రదర్శించే పసిపాపలాంటి తన అమాయకత్వమో తెలియదు... అలుపన్నది ఎరుగని ఆ అమ్మాయి మాటల మాటునదాగిన, అమృతాన్ని మించిన ఆ ప్రేమభావమో తెలియదు... అలసినప్పుడో, మనసు బాధలో ఉన్నప్పుడో.. నిత్యం తన పెదాలపై చిందులేసే ఆ చిరునవ్వులను చూస్తే కష్టం కూడా కమనీయంగా కనిపిస్తుంది.

ఇద్దరూ ఒకే దగ్గర పనిచేసినా కాని ఇద్దరికీ ఒకరిని ఒకరు చూసుకునే సమయం సందర్భం రాలేదు. ఆ మలుపు తిప్పే క్షణం రాగానే ఒకరినొకరు చూసుకున్నారు. తను అదే ఛానల్ లో న్యూసు రీడర్..., ఇతను ఉన్న న్యూసు రాస్తే ఆ అమ్మాయి ఆ రాసిన న్యూసు చదవాలి..,  ఆ అబ్బాయి అక్షరాలకు కలం కదిపితే ఆ అమ్మాయి కమనీయ స్వరం తోడవుతుంది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అందాన్ని తనది అందుకోలేని అర్హతేమో అన్న అనుమానం కలిగినప్పుడు..., ఆ అబ్బాయి అధైర్య పడలేదు... ఒకరోజు ఆ మలుపు తిప్పే మధుర క్షణం మాములుగా, రానే వచ్చింది.


ఆఫీసు లేని ఆదివారం రోజు... ఆ అబ్బాయి ఉంటున్న బాచిలర్ రూమ్ లో ఎవరు లేరు..., ఆదివారం, ఆ మరుదినమే మరొక సెలవు రోజు కావటంతో అందరూ ఊర్లకి బయలు దేరారు.... అప్పుడు ఆ క్షణం ఆ అబ్బాయికి రూమ్ లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎం తోచట్లేదు, ఎం చేద్దామా అని ఆలోచిస్తున్న సమయంలో.., తన మొబైల్ ఫోన్ ని తీసి గేమ్ ఆడుకుంటూ, ఆడుకుంటూ మధ్యలో కాంటాక్ట్ లిస్టు వైపు ఒక చూపు చూస్తే అప్రయత్నంగానో, అనుకోకుండానో కాని ఎప్పుడో ఏ సమయానో ఏదో రకంగానో ఉపయోగపడుతుందని సేవ్ చేసి పెట్టుకున్న నంబర్ కళ్ళ పడింది. మళ్ళి అనుకోకుండానే మొబైల్ పై అంగుష్ఠం (బ్రొటన వేలు)ఒక వైపు, అభికాంక్షతో కూడిన అంతరంగం మరో వైపు లాగాయి., ఏదోలా ధైర్యం చేసి బొటన వ్రేలుకే జంకు బొంకు లేకుండా ఓటేసి కాల్ బటన్ ని కాణి ఖర్చు లేకుండా నొక్కితే (ఆఫీసు ఫోన్ కాబట్టి) డైరెక్ట్ గా అమ్మాయి చేతిలో అందంగా ఇమిడిన మొబైల్ మోగింది.  

అమ్మాయి సెల్ డిస్ ప్లే లో తెలియని నంబర్ పడింది. ఎవరో ఏంటో అని కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడగానే అటు వైపు అబ్బాయి గొంతు... అతని పేరు చెప్పగానే గుర్తు పట్టింది ఆ అమ్మాయి..., మెల్లిగా మాటలు కలిసాక పేర్లు మరియు పలానా ఊర్లని చెప్పుకున్నాక, ఇంతకి ఎందుకు ఫోన్ చేశారని అమ్మాయి అడిగితే, రూమ్ లో ఎవరూ లేక, ఏమి చేయాలో అర్థం కాకా, ఎం పాలుపోలేకా చేసానని అబ్బాయి చెప్తే ఆ అమ్మాయి నవ్విన చిరునవ్వు చిద్విలాసమై చీకట్లను తరిమే చిరుకాంతిలా అనిపించిందా ఆ అబ్బాయికి... ఆ చల్లని వెన్నెల రాత్రి తన జీవితానికి వెలుగునిచ్చే వేగుచుక్కలా అనిపించిందా ఆ అబ్బాయికి. తనకి 10 గంటల వరకి నిద్ర రాదనీ ఇప్పుడు 9 గంటలవుతుందని కనుక ఒక గంట సేపు మాట్లాడమని ఆ అబ్బాయి కోరితే, ఆ అమ్మాయి కాదనకుండా ఓకే అనగానే ఇక మాటల ప్రవాహం పెరిగింది.... సమయం తో పాటు ఫోన్ లో మాటలూ పెరుగుతున్నాయి. ఆ అమ్మాయి మాటల్లో ఏదో మాయ ఉన్నట్లు ఆ అబ్బాయికి ఆ అమ్మాయి ఎప్పుడూ అలా మాట్లాడితే జీవితం చివరి వరకు వింటూనే ఉండాలని అనిపిస్తుంది. అలా మాట్లాడి మాట్లాడి చివరికే ఆ మాటలకే అలుపోచ్చాక కాని అర్ధం కాలేదు అర్దరాత్రి దాటిందని. వెంటనే పొద్దున్నే ఒక న్యూసు బులిటెన్ ఉందన్న సంగతి గుర్తొచ్చి అమ్మాయి ఇంక ఉంటానన్నప్పుడు అబ్బాయి మనసు ఎదురుచూసింది వేకువకే మెళకువ ఎప్పుడొస్తుందా అని...,

తెల్లవారి వారగానే ఎప్పుడు లేని అబ్బాయి గారూ నీట్ గా ఇన్ షర్టు వేసుకొని మరి ఆఫీసుకి వెళ్ళాడు. వెళ్లి వెళ్ళగానే అమ్మాయి కోసం కళ్ళ వెతుకులాటలు. ఆ వెతుకులాటలో పడి వ్యతనాన్ని ఇచ్చే యత్నాన్ని వదలకూడదని గుర్తొచ్చి మరీ వెరీ సిన్సియర్ గా వర్క్ చేద్దామంటే  తనువోక చోట నిలువనీయదు, తను తప్ప తక్కిన తలంపు రానీయదు. అలా అమ్మాయి కోసం యదలోపల యుద్ధం ప్రారంభమవ్వగానే అమ్మాయి ఒక్కసారిగా అచ్చ పట్టు పరికిణిలో కనిపించింది.. ఇక అంతే ఆ అబ్బాయి గుండె కొట్టుకోవటం ఒక్క క్షణం ఆగిపోయింది. ఎవరో ఈ చెలి ఏ స్వర్గ లోకం నుండో ఎగరోచ్చినట్లుగా అనిపిస్తుందా అబ్బాయికి, ఆధునికత అంటూ ఆగమైపోతున్న ఈ లోకంలో ఆశ్చర్యంగా ఉందాబ్బాయికి, మరో వైపు అద్బుతంగానూ ఉంది ఆడెవరో మగెవరో అంతుపట్టరాని ఈ అలంకరణల యుగంలో అచ్చ తెలుగమ్మాయంటే కవుల భావాల్లోనో, కళాకారుల ఆకృతుల్లోనో , ఊపిరి లేని ఊహల్లోనో మాత్రమే కనిపించే ఈ రోజుల్లో ఒక మెరుపులా మెరిసినట్లు అనిపించింది ఆ అబ్బాయికి.

అమ్మాయిని చూడగానే పచ్చని పైరులా, పెరటిలోన సీతాకోకచిలుకలా చిన్ననాటి గుడిసె గూడు లోని గువ్వ పిట్టలా, వయ్యారంగా వంపు తిరిగిన పల్లెటూరి వాగులా.., పాతకాలపు పల్లె అందాలన్నీ సింగారించుకొని అడవి మల్లె లాంటి అందంతో పారిజాత పరిమళాలు వెదజల్లుతూ... హంస లాగా వయ్యారంగా ఆ అమ్మాయి నడుస్తుంటే అబ్బాయి గుండె గిలగిల్లాడుతుంది. పదే పదే అదే పనిగా ఆ అమ్మాయినే చూస్తూ ఉంటున్నాడు ఆ అబ్బాయి. అందం అమాయకత్వం.... నిండిన ఆ కళ్ళతో మంత్రమే దోవేసి.., తనను దాటి వెళ్తుంటే తనను తాను గిల్లి చూసుకుంటున్నాడు ఆ అబ్బాయి నమ్మశక్యం కాని ఆ నిజాన్ని ఋజువు చేసుకోవటానికన్నట్లు..... కలువ పువ్వుల్ల్లాంటి ఆ కనులు చూస్తుంటే కనుపాప వెలుగునైన కాకపోతినే అనిపిస్తుందా ఆ అబ్బాయికి, కనీసం కాటుకల్లే అయినా మారాలనిపిస్తుంది ఆ అబ్బాయికి ఆమె కనులకి మరింత అందం అద్దటానికి.., అహో ఆ అందం అద్భుతం చేత మహాద్భుతం అని అనిపించేలా ఉంది ఆ అబ్బాయి మనసుకు. ఎప్పుడెప్పుడు తనతో మాటలు కలుపుదామా అని మనసు తొందర పెడుతుంది.

రానే వచ్చింది ఆ సమయం, ఆ అమ్మాయే మాటలే కలిపినా క్షణానా, ఆ అబ్బాయి ఆనందం అంబరాన్ని అంటుతుంది. మాటలు కలిసాయి అటు ఆఫీసులో ఇటు ఫోన్ లో కలుస్తూనే ఉన్నాయి. మాట్లాడుకోవాల్సిన మాటలు మౌనం దాల్చాక, చెప్పాల్సిన ఊసులు ఊ కొట్టటం ఆగిపోయాక అప్పుడు మొదలయ్యింది మనసులో అలజడి... అసలా ఆ బంధం ఏంటా అని ఇద్దరికి.., ఆ అమ్మాయి మనసులో ఆలోచనా కెరటాలు ఎగసిపడుతున్నాయి...  అమ్మాయి ఎవరో, అబ్బాయి ఎవరో మరీ కాలం కలిపింది ఇద్దరినీ, కారణమేమిటో తెలియదు, అంతా అంతు పట్టని మాయలా, అంచెలంచలుగా ఎదిగేనూ అందమైన బంధమేదో వారిద్దరి మధ్య.

అమ్మాయికి కూడా ఒక ప్రత్యేక అనుభూతి కలుగుతుంది. ఎప్పుడైనా ఆఫీసుకు ఎవరు లేట్ గా వచ్చిన ఒకరి గురించి ఇంకొకరు ఆరాలు తీయటాలు, క్యాంటిన్లో కబుర్లు.., అలా సరదా సాయంత్రాలు.., కాలాన్ని కమ్మని కమనీయ తీపి గురుతులుగా మార్చి కొనసాగిస్తుంటే....,  ఒక రోజు రానే వచ్చింది... మనసులోని  మాటను బయట పెట్టె మంచి సమయం దగ్గర పడింది, ధైర్యం కూడగట్టుకొని హనుమాన్ బొట్టు పెట్టుకొని మరీ వెళ్ళడా ఆ అబ్బాయి, తనను పెళ్లి చేసుకుంటావా అని అడగటానికి. తనకు ఎలా పరిచయం అయ్యిందో , ఎందుకు పరిచయం అయ్యిందో తెలియదో కాని అమ్మాయి దగ్గరికి వెళ్లి మనసు పడిన తనకు మదిలో మాటలు చెప్పాలంటే పదాలు పెదాలు దాటట్లేదు ఆ అబ్బాయికి..., లోలోన అబ్బాయి మదన పడుతుంటే అప్పుడే అర్ధం చేసుకొని తన యదలో అందంగా ఒదిగి నేనున్నా అనింది... అమ్మాయి అర్ధం చేసుకుంది..., అబ్బాయి ఆనందపడ్డాడు.., కాని ఆ ఆనందం ఎంతో సేపు కాలేదు ఆవిరి కావటానికి, ఆ అమ్మాయి వెనువెంటనే తల్లిదండ్రులు ఒప్పుకుంటేనే పెళ్ళని చెప్పింది... హమ్మయ్య ఏది అయితే అది అయ్యిందిలే మొత్తానికి తానంటే ఇష్టమని ఒప్పుకుంది అదే ఎక్కువని ఆ అబ్బాయి ఆకాశమంత ఎత్తుకు ఎగిరి ఆనందపడ్డాడు.... కాలం గడుస్తుంటే ఇద్దరి బంధం కాంక్రీట్ కంటే దృడంగా మారింది.

ఇక పెళ్ల్లి సమయం రానే వచ్చింది. ఇంక అక్కడ మొదలయ్యింది సమస్య ఇద్దరి వర్గాలు వేరు కావటంతో భయం భయపెట్టింది, ఆందోళన ఎక్కువయ్యింది. పెళ్లి అవుతుందా కాదా అని.., కాని అబ్బాయి గుండెల నిండా ఆత్మ విశ్వాసం కూడగట్టుకొని ఒకరోజు అమ్మాయికి ఏ మాత్రం చెప్పకుండా అమ్మాయి నాన్న దగ్గరికి వాళ్ళ ఊరికి వెళ్ళాడు. ధైర్యంగా చెప్పాడు అమ్మాయి నాన్నతో.., నేను మీ అమ్మాయిణని ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని.., ఇంక ఆ అమ్మాయి తండ్రి అబ్బాయి ధైర్యాన్ని, ఆత్మ విశ్వాసాన్ని చూసి ముచ్చటపడి అభ్యంతరం ఏమి చెప్పలేదు కానీ.., పెళ్లి చేసుకోవటానికి మాత్రం కొన్ని రోజుల గడువు విధించాడు. మొత్తానికి పెళ్ల్లికయితే ఒప్పుకున్నాడని అదే ఆనందమని ఆ అబ్బాయి అక్కడికే సరి పెట్టుకొని..  ఆ వెనువెంటనే ఆ అబ్బాయి ఇంట్లో కూడా అమ్మాయి గురించి చెప్పి పెద్దలందరిని ఒప్పించాడు.

ఆ రోజు ఊరి నుండి తిరిగొచ్చిన తర్వాత అప్పుడు ఆ అమ్మాయిని కలిసాడు విషయం చెప్పటానికి.., ఆ అమ్మాయికి అప్పటికే అబ్బాయి వచ్చినట్లు వాళ్ళ నాన్న చెప్పి ఉండటం చేత కొంత కోపంతో అలకబూనింది. కన్నీరు కంటిపాపలను తడమగా.., తల్లడిల్లిపోయిన అబ్బాయి మనసు తట్టుకోలేక ప్రేమగా తనను బ్రతిమాలుతుంటే కన్నీటితో అబ్బాయి గుండెని తడిచేసింది. కోపమైన, ఆవేశమైన, ఆరాటమైన, ఆలోచనైన, అందంగా అల్లుకుంది.. తన మదికి చేరువయ్యింది. ఎవరిని నొప్పించకుండా అబ్బాయి అమ్మాయి ఇద్దరి మనసుల అద్దమై నిలిచిన అద్బుతమైన ప్రేమకు వందనాలు ప్రేమాభివందానాలు.... అబ్బాయి మనసులో ఇప్పుడు ఒక్కటే ఉంది.... అమ్మాయి పెదాలపై చిరునవ్వు చెదరనీయకూడదని.... తన కళ్ళలో ఏనాడు కన్నీళ్ళు చూడకూడదని....., అదే విధంగా అమ్మాయి మనసులో ఒక్కటే ఉంది అబ్బాయికి అన్నింటా తోడుగా నీడగా ఉండి కలకాలం కలతలు లేకుండా కమనీయంగా సాగాలని కాంక్షిస్తుంది.

నిజమైన ప్రేమకు నిలువుటద్దంలా నిలిచి నిప్పు సాక్షిగా, నింగే హద్దుగా త్వరలో ఒక్కటవుతున్న ప్రేమ పక్షులకు అంకితమిస్తూ, అభినందిస్తూ.....


హరికాంత్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(4 votes)
Tags : one boy and one girl l0ve story  true love story  cute love story  

Other Articles