Three years and more to recover from hudhud cyclone damage and loss

Cyclone Hudhud, Visakhapatnam, Bay of Bengal, Cyclone, Andhra Pradesh, north coastal areas, vishaka city, power, tele communications

three years and more to recover from Hudhud cyclone damage and loss

తుపాను దెబ్బనుంచి తేరుకోవడానికి మూడేళ్లపైనే..

Posted: 10/14/2014 08:49 AM IST
Three years and more to recover from hudhud cyclone damage and loss

యవ్వన నగరం విశాఖ సహా ఉత్తరాంధ్రపై పెనుతుపాను రూపంలో వచ్చిన హుద్‌హుద్' పంజా విసిరింది. సముద్రుడి ఆగ్రహానికి.. వాయువు తోడవ్వడంతో జరిగిన ప్రళయంలో లెక్క లేనంత నష్టం జరిగింది. ఇళ్లు వాకిళ్లు, ఊళ్లకూళ్లు.. పంట పోలాలు, పశుసంపద ఒక్కటి కాదు.. అన్నింటా తమను నిండా ముంచిందని ఉత్తరాంధ్ర ప్రజలు కన్నీళ్లు పెడుతున్నారు. వారి కన్నీళ్లను లెక్కించేందుకు ఏ కొలమానాలూ లేవు. అత్యంత భయానకంగా వచ్చిన పెనుతుపాను... తమ జీవితాలను ఛిద్రం చేసిందని తలచుకొంటూ ఆందోళనలో మునిగిపోయారు. నీట మునిగిన ఇళ్ల నుంచి సురక్షిత ప్రదేశాలకు వెళ్లేందుకు మార్గం కూడా లేని పరిస్థితులు ఉత్తరాంధ్రలో కనిపిస్తున్నాయి.

తుపాను ప్రభావిత పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతోంది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సహాయ పునరావాస చర్యల నిమిత్తం ప్రత్యేకంగా అయిదు బృందాలను ఏర్పాటు చేసింది. పునరావాస శిబిరాల్లోనే కాకుండా ఇళ్లలో చిక్కుకుపోయిన వారికీ ఆహారం, మంచినీరు అందే ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని 44 మండలాలపై హుద్‌హుద్ తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపించింది. 2.5 లక్షల మంది పౌరులు ప్రత్యక్షంగా ప్రభావితమయ్యారు.

హుద్ హుద్ ధాటికి ఉత్తరాంధ్రలో 21 మంది మృత్యువాతపడ్డారు. శ్రీకాకుళం జిల్లాల్లో ఒకరు, విజయనగరం జిల్లాలో అయిదుగురు, విశాఖపట్నం జిల్లాలో 15 మంది చనిపోయారు. మృతులకుటుంబాలకు రూ.5 లక్షలు చొప్పున, క్షతగాత్రులకు రూ.లక్ష పరిహారంగా ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రకృతి ప్రకోపం ధాటికి నగర జీవనం అతలాకుతలమైంది. బడుగు బలహీన వర్గాలు తీవ్రంగా నష్టపోయాయి. చిరు వ్యాపారులు జీవనోపాధిని, పూరిళ్లలో నివసించే వారు నిలువ నీడను లేకుండా చేసింది. సాగరాన్ని ఆధారంగా చేసుకొని జీవించే మత్స్యకారుల పడవలు, వలలు కూడా దెబ్బ తిన్నాయి.

పెనుతుపాను సృష్టించిన విధ్వంసం నుంచి ఉత్తరాంధ్ర తిరిగి కోలుకోడానికి మూడేళ్లు పైగానే పడుతుందని అధికార వర్గాల అంచనా. మూడేళ్లయినా మళ్లీ తమను తుపాను భయం వెన్నాడుతూనే వుంటుందని ఉత్తరాంధ్రవాసులు చెబుతున్నారు. జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నా.. పూర్వ వైభవం రావాలంటే దీర్ఘకాలిక ప్రణాళికలు అవసరమని ఆయా వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వేల కిలో మీటర్ల పొడవునా ఉన్న వివిధ రకాల రహదారుల్లో తుపాను దెబ్బకు 60 శాతానికి పైగా దెబ్బతిన్నాయి. విశాఖ పర్యాటక, ఐటీ రంగ అభివృద్ధికి కీలకమైన వాటిలో ఒకటైన అంతర్జాతీయ విమానాశ్రయం తుపాను దెబ్బకు చెల్లాచెదురైంది. ఈదురు గాలుల బీభత్సంతో విమానాశ్రయ పైకప్పు (రూఫ్) పూర్తిగా నేలమట్టమైంది.

వాణిజ్యంగా ఇప్పుడిప్పుడే అభివృద్ధి పథంల సాగుతున్న విశాఖను హుద్ హుద్ పెనుతుపాను చావుదెబ్బ కొట్టింది. తుపాను దెబ్బకు ఐమాక్స్ థియేటర్ కాంప్లెక్స్‌లు, షాపింగ్ మాళ్లు, ప్రముఖ ఆటో మొబైల్ షోరూంలు పెద్ద ఎత్తున నష్టపోయాయి. పెద్ద ఎత్తున దూసుకొచ్చిన గాలులతో అద్దాలు పగిలాయి.  పర్యాటక నగరంగా విరసిల్లుతున్న విశాఖలోని ఆహ్లాద వాతావరణాన్ని మరుభూమిగా మార్చింది తుపాను. ఆర్కేబీచ్, రుషికొండ నుంచి భీమునిపట్నం బీచ్ వరకు పలు భవనాలు కళావిహీనంగా మారాయి. కొత్తగా అభివృద్ధి చేస్తున్న లాసన్స్‌బే బీచ్ సముద్ర నీటి ముంపునకు గురయ్యింది. కైలాసగిరి పైనా అందమైన వనాలన్నీ గాలుల తీవ్రతకు చెల్లాచెదురు అయ్యాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles