World metro police summit starts in telangana

metro police, hyderabad, telangana, world summit,

world metro police summit starts in telangana

మెట్రోపొలిస్ సదస్సుకు ముస్తాబైన మహానగరం..

Posted: 10/05/2014 05:27 PM IST
World metro police summit starts in telangana

తెలంగాణ రాష్ట్రం పేరు ప్రపంచ నలుమూలల చేరే సమయం అసన్నమైంది. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో మణిమకుటంలా నిలివనున్న ఐదు రోజుల ప్రపంచ సదస్సుకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన తెలంగాణ ప్రభుత్వం.. ఇక ఏర్పాట్లలో ఎక్కడా ఎలాంటి అవరోధాలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంది. ‘సిటీస్ ఫర్ ఆల్’ నినాదంతో దేశంలోనే మొదటి సారిగా హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ప్రారంభం కానున్న ‘11వ మెట్రోపొలిస్ ప్రపంచ సదస్సు’కు సర్వం సిద్ధం చేసింది. దాదాపు 50 దేశాల నుంచి రెండు వేల మందికి పైగా ప్రతినిధులు హాజరు కానున్న ఈ సదస్సులో మెట్రోనగరాల సమస్యలు, అనుభవాలు, ఆవిష్కరణలు వంటి వాటిపై ప్రతినిధులు చర్చిస్తారు. నగరాల్లో ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవలసిన చర్యల్ని సూచిస్తారు. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు జరిగే ఈ సదస్సును తెలంగాణ ప్రభుత్వం, జీహెచ్‌ఎంసీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు పూర్తి చేశాయి. వేదిక పరిసరాలతోపాటు ప్రతినిధులు పర్యటించే మార్గాలు.. పర్యాటక ప్రదేశాల్లో రహదారులకు మెరుగులు దిద్దారు. సుందరీకరణ పనులు వేగంగా పూర్తి చేస్తున్నారు. వేదిక పరిసరాల్లో ఉచిత వైఫై సేవల్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. సదస్సును పురస్కరించుకొని ప్రత్యేకంగా ‘కాన్ఫరెన్స్ మొబైల్ యాప్’ను ఆవిష్కరించారు. దీని ద్వారా ప్రతినిధులు స్మార్ట్ ఫోన్ నుంచే ఏరోజుకారోజు జరిగే సమావేశాలు, ప్రసంగించే వక్తలు, ప్రతినిధుల వివరాలు తదితరమైనవి తెలుసుకునే వెలుసుబాటును కల్పించారు. ఒకరికొకరు ఎస్సెమ్మెస్‌లు పంపించుకోవచ్చు. సదస్సుకు జొహన్నెస్‌బర్గ్, బార్సిలోనా, బెర్లిన్, టెహ్రాన్ తదితర నగరాల మేయర్లతోపాటు పలువురు అడ్మినిస్ట్రేటర్లు, ఆయా అంశాల్లో నిపుణులైన వారు తదితరులు హాజరవుతున్నారు.
 
 సిటీస్ ఫర్ ఆల్..
 
ఈ సదస్సులో స్మార్ట్ సిటీస్, అర్బన్ హౌసింగ్, అర్బన్ ఈక్విటీ, మెట్రోపొలిస్-గవర్నెన్స్, సిటీ మేనేజ్‌మెంట్-సర్వీసెస్,అర్బన్ ఫైనాన్స్, అర్బన్ హెల్త్ తదితర అంశాలపై చర్చలు జరుగనున్నాయి. వీటిల్లో సిటీ మేనేజ్‌మెంట్-సర్వీసెస్‌కు సంబంధించి ఎంపిక చేసిన ఏడు అంశాలను చర్చించనున్నారు. వాటిల్లో సోలార్ ఎనర్జీ, రహదారులు, నీటి నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, పారిశుధ్యం తదితర అంశాలున్నాయి. వీటితోపాటు మహిళలు, యువతకు సంబంధించిన అంశాలపైనా ప్రత్యేక చర్చలు జరుగనున్నాయి. చర్చల్లో వెలువడిన అభిప్రాయాలను, పరిష్కారమార్గాలను పరిశీలించి ఉపయోగకర అంశాలను క్రోడీకరించి వాటి ఆధారంగా ఆయా నగరాలకు అనువైన పాలసీ డాక్యుమెంట్స్ రూపొందించనున్నారు. అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సర్వీస్ డెలివరీ తదితర అంశాలకు సంబంధించి ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ల నిర్వహణకు 50 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. అంశాల ఎంపికలో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (అస్కి), సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ), నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్‌ఐయూఏ) ముఖ్య భూమిక వహిస్తున్నాయి. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ), యూఎన్ హాబిటేట్, ప్రపంచ ఆరోగ్యసంస్థ, ఒరాకిల్, సిటీస్ అలయెన్స్, ఏఎంబీ (బార్సిలోనా) తదితర సంస్థలు తమవంతు సహకారం అందించాయి. ఆతిథ్య నగరమైన హైదరాబాద్‌లోని అనుభవం ప్రతినిధులకు మరపురాని జ్ఞాపకాన్ని మిగల్చనుందని మెట్రోపొలిస్ సదస్సు డెరైక్టర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు.
 
సదస్సుకు హాజరయ్యే ప్రముఖులు..
 
సదస్సులో ప్రసంగించనున్న వారిలో ప్రముఖ పర్యావరణ వేత్త, నోబెల్ బహుమతి గ్రహీత రాజేంద్ర పచౌరి, జీన్-పాల్ హ్యూకన్ (మెట్రోపొలిస్ ప్రెసిడెంట్), అలైన్ లీ సాక్స్ (మెట్రోపొలిస్ సెక్రటరీ జనరల్), పాల్ జేమ్స్(డెరైక్టర్, యూఎన్ గ్లోబల్ కాంపాక్ట్-సిటీస్ ప్రోగ్రాం), ప్రొఫెసర్ ఓమ్ మాథుర్ (అర్బన్ ఎకనామిస్ట్), ప్రొఫెసర్ అమితాబ్ కుందు (చైర్‌పర్సన్,‘రివ్యూ ఆఫ్ పోస్ట్ సచార్ ప్రోగ్రామ్స్, ఇండియా), ప్రొఫెసర్ క్రిస్‌జాన్సన్ (సీఈవో, అర్బన్ టాస్క్‌ఫోర్స్, ఆస్ట్రేలియా), రామన్ టోర్రా, జనరల్ మేనేజర్, బార్సిలోనా మెట్రోపాలిటన్ ఏరియా(ఏఎంబీ), కీర్తిషా (ఆర్కిటెక్ట్, కేఎస్‌ఏ డిజైన్ ప్లానింగ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్), ఇందూ ప్రకాశ్‌సింగ్ (కన్వీనర్ నేషనల్ ఫోరం ఫర్ హౌసింగ్ రైట్స్), మ్జోలిసి త్షబలాలా (ప్రాజెక్ట్ మేనేజర్, హ్యూమన్ సెటిల్మెంట్స్ డెవలప్‌మెంట్స్, ఈ-తెక్విని మున్సిపాలిటీ), రాజేంద్ర జోషి (డెరైక్టర్, సాథ్ లైవ్లీహుడ్ సర్వీసెస్), సరాహ్‌ఉదీనా (డిప్యూటీ టూ ది అర్బన్ ప్లానింగ్ మేనేజర్ డెరైక్టర్, బార్సిలోనా సిటీ కౌన్సిల్), జాన్ మౌంట్ (కౌన్సిలర్, సిడ్నీ), ఫ్రాన్సినా విలా (ప్రెసిడెంట్, మెట్రోపొలిస్ ఉమెన్ ఇంటర్నేషనల్ నెట్‌వర్క్), డా.సూక్ జిన్ లీ (ప్రెసిడెంట్, సియోల్ ఫౌండేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ ఫ్యామిలీ) సహా పలువురున్నారు.
 
 400 మంది విదేశీ ప్రతినిధులు
 
 సదస్సుకు దాదాపు 2వేల మంది ప్రతినిధులు హాజరు కానున్నారని అంచనా వేయగా, ఆ సంఖ్య దాటింది. మన దేశంలోని 458 నగరాల నుంచి 1653 మంది ప్రతినిధులు పేర్లు నమోదు చేసుకోగా, దాదాపు 400 మంది విదేశీ ప్రతినిధులు పేర్లు నమోదు చేయించుకున్నారు. ప్రతినిధుల్లో దాదాపు 50 మంది మేయర్లున్నారు. మన దేశం నుంచి ఢిల్లీ, లక్నో, సూరత్, గ్వాలియర్, చెన్నయ్ తదితర నగరాల మేయర్లున్నారు. విదేశాలకు సంబంధించి బార్సిలోనా, జొహన్నెస్‌బర్గ్, టెహ్రాన్, జెనీవా, ఢాకా, సిడ్నీ, ఉగాండా తదితర ప్రాంతాల మేయర్లు హాజరుకానున్నారు.
 
 
రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతులు హాజరు
 
మెట్రోపొలిస్ సదస్సు దృష్ట్యా అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక 4 నెలల్లోనే జరుగుతున్న తొలి అంతర్జాతీయ సదస్సుకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా మన్నారు. సాంకేతికంగా 6వ తేదీనే సదస్సు ప్రారంభం కానున్నప్పటికీ, ప్రధాన సదస్సు 7వ తేదీన ప్రారంభం కానుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సదస్సును ప్రారంభించే ఈ కార్యక్ర మంలో గవర్నర్ నరసింహన్, కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు తదితర ప్రముఖులు పాల్గొననున్నారు. 9వ తేదీన ముగింపు కార్యక్రమానికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హాజరు కానున్నారు. తొలి ప్లీనరీలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ప్రసంగించనున్నారు. రెండో రోజు కార్యక్రమంలో ఐటీ మంత్రి కె. తారకరామారావు పాల్గొననున్నారు. వివిధ దేశాల ప్రతినిధుల మధ్య జరిగే అర్థవంతమైన చర్చల ద్వారా ప్రజలకు మేలు జరుగనుంది.  నగరంలో ఎదురవుతున్న సవాళ్లు, రవాణా, కాలుష్యం తదితర అంశాలపైనా చర్చలు జరుగుతాయి. 7, 8, 9 తేదీల్లో ఉదయం ప్లీనరీ సమావేశాలు.. అనంతరం సాంకేతిక, క్షేత్రస్థాయి సమావేశాలుంటాయి. అంతర్జాతీయ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతినిధుల వసతికి హోటళ్లలో బస, శాంతిభద్రతలకు పటిష్ట చర్యలు తీసుకున్నారు.
 
 చర్చలు.. ఒప్పందాలు
 సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, మేయర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. వీటిని గవర్నమెంట్ టూ గవర్నమెంట్ (జీ2జీ)గా వ్యవహరిస్తున్నారు. ఆయా అంశాల్లో సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి తదితర అంశాలపై చర్చలు జరిపి ఆయా దేశాలు ఎంఓయూలు కుదుర్చుకునేందుకు ఈ వేదిక ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. బిజినెస్ టూ బిజినెస్ (బీ2బీ)గా వ్యవహరించే వేదికల్లో మన దేశం- ఇతర దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. వీటిల్లో హైదరాబాద్‌ను ప్రత్యేకాంశంగా తీసుకొని కూడా చర్చలు జరుపుతారు. ఆయా అంశాలపై ముఖ్యంగా సాంకేతిక, పర్యావరణ అంశాలపై ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలున్నాయి.
 
 నగరంలోని వివిధ ప్రాజెక్టుల సందర్శన
 
 సదస్సులో సోషల్ నెట్‌వర్కింగ్‌కు సంబంధించిన అంశాలు,  పుస్తకావిష్కరణలు తదితర కార్యక్రమాలుంటాయి. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులు ఆయా అంశాలను అధ్యయనం చేసేందుకు తొమ్మిది వరకు క్షేత్రస్థాయి పర్యటనలు ఏర్పాటు చేశారు. వాటిల్లో 1. హైదరాబాద్ మెట్రోరైలు 2. మహిళా స్వయం సంఘాలు  3. ఐటీ కారిడార్ 4. చారిత్రక వారసత్వ భవనం నుంచి స్టార్‌హోటల్‌గా మారిన ఫలక్‌నుమా  5. ఔటర్‌రింగ్ రోడ్డు 6. హుస్సేన్‌సాగర్ ప్రక్షాళన 7. ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్  8. ఈఎంఆర్‌ఐ ఎమర్జెన్సీ సర్వీసెస్ 9. రూ. 5లకే భోజనం అంశాలు ఉన్నాయి.  సదస్సును  ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షప్రసారం చేసేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. చార్మినార్, ఐటీకారిడార్, ట్యాంక్‌బండ్‌లపై ప్రతినిధుల క్షేత్రస్థాయి పర్యటనలను కూడా ప్రత్యక్ష ప్రసారాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వీటిని ఇంటర్నెట్ నుంచి సైతం వీక్షించే ఏర్పాట్లు చేస్తున్నారు. సదస్సుకు హాజరయ్యే ప్రతినిధులకు అందజేసేందుకు ఏరోజుకారోజు నాలుగుపేజీల పత్రికను సైతం వెలువరించనున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : metro police  hyderabad  telangana  world summit  

Other Articles