Metro rail project issue cleared by kcr

metro rail, hyderabad metro rail, l and t metro rail, metro rail jobs, hyderabad metro rail jobs, hyderabad metro rail project, l and t metro rail jobs, l and t jobs, l and t company projects, kcr, telangana, hyderabad, latest news, telugu news papers

after meeting with kcr l&t company agreed to continue with project and also feels happy about government support : metro rail and l&t company members met cm kcr discussed about metro ral project in hyderabad

ఆపేస్తామన్నారు.. అబ్బేలేదన్నారు ఏమి‘టి’ మెట్రో మతలబు

Posted: 09/17/2014 06:34 PM IST
Metro rail project issue cleared by kcr

మెట్రో రైలు పనులు ఆపేస్తున్నామంటూ వచ్చిన కధనాలు తెలంగాణలో ప్రకంపణలు సృష్టించాయి. హైదరాబాద్ లో గత పరిస్థితులు, ప్రభుత్వ సహకారం లేనందున తాము ప్రాజెక్టు చేయలేమని.., ప్రభుత్వమే చేసుకోవాలన్నట్లు పత్రికలు ప్రధాన వార్తలుగా ప్రచురించాయి. దీంతో టీఆర్ఎస్ ను టార్గెట్ చేసిన ప్రతిపక్షాలు బుధవారం ఉదయం నుంచి రైలు ప్రధానాంశంగా దుమ్మెత్తిపోశాయి. తెలంగాణను నాశనం చేస్తున్నారని.. అందర్నీ భయపెడుతున్నారని, అభివృద్దిని తొక్కేస్తున్నారని విపక్షాలు విరుచుకుపడ్డాయి. దీంతో పరిస్థితి అదుపుతప్పుతుందని భావించిన ముఖ్యమంత్రి హడావుడిగా మెట్రో ఎండీతో సమావేశం అయ్యారు. అటు ఎల్&టీ సంస్థ మెట్రో రైలు వ్యవహారాలు చూస్తున్న వివేక్ గాడ్గిల్ కూడా కేసీఆర్ తో సమావేశంలో పాల్గొన్నారు.

ప్రాజెక్టు నిర్మాణంలో తమకు ఉన్న కష్టాలను కేసీఆర్ కు చెప్పుకున్నారు. అటు ప్రభుత్వ పరంగా చేయాల్సిన సాయం.. జాప్యం జరగటానికి గల కారణాలను ముఖ్యమంత్రి కూడా వివరించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మించలేమని లేఖ రాసిన గాడ్గిల్ సీఎంతో సమావేశం తర్వాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. మెట్రో ప్రాజెక్టును సకాలంలోనే పూర్తి చేస్తామని లేఖలో రాసిన దానికి విరుద్దంగా ప్రకటన చేశారు. అంతేకాకుండా ప్రాజెక్టుపై పత్రికల్లో వచ్చిన కథనాలు దురదృష్టకరమన్నారు. లేఖలు రాయటం ఇప్పుడేమి కొత్త కాదనీ.., రాష్ట్ర విభజనకు ముందు నుంచే ఇది జరుగుతుందన్నారు. ‘‘ ఈ సందర్బంగా ఈనెల 10న ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం వాస్తవమే అని గాడ్గిల్ అంగీకరించారు. తమకున్న ఇబ్బందు వల్ల ప్రాజెక్టును ప్రభుత్వానికి అప్పగిస్తామని చెప్పినట్లు అంగీకరించారు. అంతమాత్రానికే మేము తప్పు చేసినట్లా.. లేక ప్రభుత్వం మమ్మల్ని కావాలని ఇబ్బంది పెట్టినట్లా అన్నారు. కేవలం అలా అనుకుంటున్నాం అని చెప్పగానే పత్రికల్లో రాసేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఇది బాధాకర విషయమన్నారు.
 
ప్రాజెక్టు పనుల్లో పలు అవాంతరాలు, అడ్డంకులు ఉన్న మాట వాస్తవంగా ఒప్పుకున్నారు. భారీ ప్రాజెక్టులో ఇలాంటి అడ్డంకులు సాధరణమే అని వెల్లడించారు. అటు మెట్రో ప్రాజెక్టు ప్రస్తుత తరుణంలో నష్టం అని లేఖలో చెప్పిన గాడ్గిల్ బుధవారం సీఎంను కలిసిన తర్వాత ప్రాజెక్టు లాభదాయకమే అని మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అటు ప్రభుత్వ సహకారం కూడా తగ్గిందని లేఖలో వాపోయిన వ్యక్తి.., ఇప్పుడు మాత్రం తెలంగాణ ప్రభుత్వ సహకారంతోనే ప్రాజెక్టు జరుగుతోందన్నారు. లేఖ నిజము., లేఖలో రాసినవి నిజాలు అని చెప్తూనే, వాటిలో ప్రస్తావించిన పలు అంశాలకు పూర్తి విరుద్ధంగా ప్రకటన చేశారు. పైగా కధనం రాసిన మీడియా ఈ గందరగోళానికి దారితీసిందన్నట్లుగా చూపారు. వీలైనంత త్వరలో  టార్గెట్ తేది కంటే ముందుగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పారు.

సీఎంఓ ప్రకటన

మెట్రో ప్రాజెక్టుపై నిర్మాణ సంస్థ లేఖ కలకలంతో సీఎం కార్యాలయం కదిలింది. గందరగోళానికి తెరదించేందుకు ప్రెస్ నోట్ విడుదల చేసింది. మెట్రో ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతుందని నోట్ లో సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా పత్రికలు కథనాన్ని ప్రచురించాయని కార్యాలయం. ప్రాజెక్టులో భాగంగా ఎల్‌ అండ్‌ టీ, ప్రభుత్వం మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు సర్వసాధారణమని తెలిపింది. అయితే పత్రికా కధనాలు వీటిని ప్రజలను గందరగోళానికి గురిచేసేలా కథనాలు రాయటం సరికాదని తెలిపింది.

విరుచుకుపడ్డ విపక్షాలు

మెట్రో రైలు పనుల నుంచి తప్పుకుంటామని ఎల్&టీ లేఖ రాసిందన్న కధనం దుమారమే రేపింది. ఈ కధనంపై రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ప్రాజక్టు రద్దయితే అందుకు కేసీఆర్ బాధ్యత వహించాలని కాంగ్రెస్ నేతలు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఒప్పందం జరిగి నిర్మాణం సగంవరకు పూర్తికాగా.. టీఆర్ఎస్ ప్రభుత్వం చేతల వల్ల మొదటికే మోసం వచ్చేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణకు కేసీఆర్ ప్రభుత్వం తీరని నష్టం మిగులుస్తోందని విమర్శించారు.

అటు టీడీపీ కూడా ఈ అంశంపై నిప్పులు చెరిగింది. కేసీఆర్ ప్రభుత్వానికి ప్రాజెక్టుపై అవగాహన లేదని టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శించారు. రైలు అలైన్ మెంట్ మార్చాలని సీఎం మొండిపట్టుతో ఉన్నారని.. ఇది ఖర్చుతో కూడుకున్న పనితో పాటు.., ప్రమాదకరమైనదిగా అధికారులే చెప్తున్నా విన్పించుకోవటం లేదని ద్వజమెత్తారు. ఇక మెట్రోకు తెలంగాణ ప్రభుత్వం అడుగడుగునా అడ్డంకులు కల్గిస్తోందన్నారు. చివరకు గచ్చిబౌలిలో కేటాయించిన స్థలాన్ని కూడా తీసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దురాశపర చర్యల వల్లే విసుగుచెందిన ఎల్&టి రైలు పనులు చేపట్టలేమని ప్రకటించారని మండిపడ్డారు. తెలంగాణ మణిహారంగా., అభివృద్ధిలో కీలకం అయిన మెట్రో రైలుపైనే ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తే.., రాష్ట్ర అభివృద్ధిపై ప్రభుత్వం ఏ మేర చిత్తశుద్ధి చూపిస్తుందో తెలుస్తోందన్నారు.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : l and t  metro rail  kcr  latest news  

Other Articles