Vijayawada will be temporary capital of ap

vijayawada, ap capital, ap new capital, andhrapradesh temporary capital, telangana, seemandhra, chandrababu naidu, kcr, andhrapradesh, shivaramakrishnan committee

ap goverment orders to transfer all offices to vijayawada and make it as temporaray capital : vijayawada will be ap temporary capital

తాత్కాలిక రాజధానిగా విజయవాడ

Posted: 08/12/2014 07:14 PM IST
Vijayawada will be temporary capital of ap

(Image source from: vijayawada will be temporary capital of AP)

ముందుగా ఊహించిందే జరిగింది. ఏపీకి విజయవాడ రాజధానిగా మారింది. అయితే శాశ్వతంగా కాదు, తాత్కాలికంగా. ఏపీకి చెందిన ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల కార్యాలయాలను తరలించాలని చంద్రబాబు నిర్ణయించారు. విజయవాడ కేంద్రంగా తాత్కాలిక పరిపాలన జరగాలని ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు అన్ని ప్రభుత్వ శాఖలు, ఉద్యోగులను సన్నద్ధం చేయాలన్నారు. రాజధాని నిర్మాణంపై పట్టుదలగా ఉన్న చంద్రబాబు.., హైదరాబాద్ లా కాకుండా పరిపాలన వికేంద్రీకరణ జరిగే విధంగా ఉండాలని భావిస్తున్నారు. అంతేకాకుండా రాజధాని నిర్మాణం ప్రపంచస్థాయి ప్రమాణాలతో జరగాలనుకుంటున్నారు. రాజధాని సలహా కమిటీతో సమావేశమైన ఏపీ సీఎం ప్రధానంగా ఇదే అంశాన్ని చెప్పారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు పాటిస్తూ.., ప్రపంచ పర్యాటకాన్ని ఆకర్షించేలా రాజధాని నిర్మాణం జరగాలన్నారు. ఇందుకోసం అనువైన స్థలాలను ఎంపిక చేయాలని, వివిధ దేశాల్లో ఉన్న రాజధానుల అత్యుత్తమ సౌకర్యాలను అధ్యయనం చేయాలని ఆదేశించారు.

ఎందుకీ నిర్ణయం?

విభజన తర్వాత హైదరాబాద్ తెలంగాణకు శాశ్వత రాజధానిగా, రెండు తెలుగు రాష్ర్టాలకు పదేళ్ళు ఉమ్మడి రాజధానిగా ఉంచుతూ తెలంగాణ బిల్లును గత కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు ప్రభుత్వ శాఖల విభజన జరిగింది. ఆయా కార్యాయాల్లోని భవనాల్లో తెలంగాణ, ఏపీ కార్యకలాపాలు వేర్వేరుగా జరుగుతున్నాయి. పదేళ్ళ పాలన కోసం భవనాలను కూడా విభజించటం జరిగింది. అయితే నిత్యం ఏదో ఒక గొడవ జరుగుతోంది. విభజనకు ముందే అమీ తుమీకి సిధ్దపడిన తెలంగాణ-ఏపీ ఉద్యోగులు ఇప్పుడింకా పట్టుబిగుస్తున్నారు. ప్రతి విషయంలోనూ ఒకరితో మరొకరు విభేదిస్తున్నారు. దీంతో ఏదో ఒక కార్యాలయంలో రెండు రాష్ట్రాల ఉద్యోగులకు తగాదాలు వస్తున్నాయి. ఇవి ఏ స్థాయిలోకి వెళ్ళాయంటే దేశంలో గౌరవనీయమైన హోదాలో, ఎక్కడైనా ప్రజల కోసం పనిచేయటానికి సిద్ధపడి విధుల్లో చేరిన ఐఏఎస్ ల మధ్య కూడా తెలంగాణ, ఏపీ విభజనలు వచ్చాయి. ఈ మద్య జరిగిన ఓ కార్యక్రమానికి ఏపీ ఐఏఎస్ చందనాఖాన్ హాజరుకాకుండా తెలంగాణ ఐఏఎస్ లు అడ్డుపడ్డారు. దీంతో ఇక లాభం లేదనుకుని తమ ప్రాంతానికి వెళ్ళటమే ఉత్తమమనే నిర్ణయానికి వచ్చారు.

అంతేకాదు విభజన తర్వాత జరిగిన విద్యుత్ పంపకాల గొడవ సందర్బంగా ఏపీ ప్రభుత్వం తమకు విద్యుత్ ఇవ్వకుంటే హైదరాబాద్ లోని ఏపీ కార్యాలయాలకు కరెంట్ కట్ చేస్తామని తెలంగాణ నేతలు పలువురు హెచ్చరించారు. ఇలా తరుచుగా మాటలు పడుతూ ఉండటం కంటే వెళ్ళిపోవటమే రెండు రాష్ర్టాలకు ఉత్తమంగా చంద్రబాబు మనసులో అనుకున్నారు. రాజధాని ఎక్కడ అనే విషయమే ఇంకా తేలకపోవటంతో నిర్మాణంకు చాలా సమయం పడుతుంది. ఈ లోపు ఇక్కడే ఉండి అవమానాలు భరించటం కంటే సొంత రాష్ర్టంలో ఎన్ని ఇబ్బందులు పడ్డా పరవాలేదనుకుని ఈ నిర్ణయానికి వచ్చారు. తన నిర్ణయాన్ని కమిటికి చెప్పటంతో పాటు ఏర్పాట్లను వెంటనే పరిశీలించాలని ఆదేశించారు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిపాలనను విజయవాడకు మార్చాలని బాబు స్పష్టం చేశారు. కొత్త రాజధాని నిర్మాణం పూర్తయ్యే వరకు తాత్కాలిక రాజధాని ఉండాలనీ.., అక్కడి నుంచే పరిపాలన జరుగుతుందని చెప్పారు.

ఇప్పటికిప్పుడు రాజధాని తరలింపు అంటే ఆషామాషీ వ్యవహారం కాదని చంద్రబాబుకు కూడా తెలుసు. అన్ని సౌకర్యాలతో రాజధాని తరలింపు అంటే సమయం పడుతుంది. కాని అంత సమయం హైదరాబాద్ లో ఉండాలని లేదు కాబట్టి విజయవాడ, పరిసర ప్రాంతాలను పరిశీలించాలని రాజధాని సలహా కమిటీని ఆదేశించారు. గన్నవరం విమానాశ్రయం దగ్గర్లోని ఐటీ పార్క్ కాంప్లెక్స్ అయిన మేథ టవర్స్ ను పరిశీలించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. కార్యాలయాల నిర్వహణకు స్థలం, భవనాల సంఖ్య, ఉద్యోగుల సంఖ్య, శాఖల ముఖ్య కార్యాలయాలు ఇతర అంశాలపై వెంటనే సమగ్ర పరిశీలన జరపాలని ఆదేశించింది. ఈ ఆదేశాల ప్రకారం త్వరలోనే ఏపీ ప్రభుత్వ పరిపాలన విజయవాడకు ప్యాకప్ అవుతుందని స్పష్టమవుతోంది.

ఉద్యోగుల విభజన తేలకుండానే

రాష్ర్ట విభజన జరిగినా.., ప్రధానమైన ప్రభుత్వ ఉద్యోగుల విభజన మాత్రం ఇంకా జరగలేదు. తాత్కాలికంగా ఉద్యోగులను విభజిస్తూ కమల్ నాధన్ కమిటీ గతంలో ఆదేశాలు జారీ చేసింది. శాశ్వతంగా విభజన కోసం ఇరు రాష్ర్టాలతో పలుమార్లు చర్చలు జరిపి కొద్ది రోజుల క్రితమే మార్గదర్శకాలు విడుదల చేసింది. వీటిపై రెండు ప్రాంతాల ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు కూడా తీసుకుని వాటిని పరిశీలిస్తోంది. ఆ తర్వాత ఉద్యోగుల విభజనపై తుది మార్గదర్శకాలు రూపొందించి కేంద్రానికి పంపితే.., ప్రభుత్వం పరిశీలించి నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దీనికి ఇంకా సమయం పడుతుంది. ఈ లోపు విజయవాడకు రాజధాని తరలింపు అంటే ఉద్యోగుల విభజన ఎలా అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. తాత్కాలికంగా ఏపీ ప్రభుత్వంలో కొందరు తెలంగాణ ఉద్యోగులు, తెలంగాణ ప్రభుత్వంలో కొందరు ఆంధ్రా ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వంతో పాటు విజయవాడకు వెళ్ళే తెలంగాణ ఉద్యోగులు అక్కడ ఎలా ఉండాలి. ఉద్యోగుల శాశ్వత విభజన తర్వాత వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నలు వస్తున్నాయి. అంతేకాకుండా వేల సంఖ్యలో ఉన్న ఉద్యోగులను తరలించటం అంటే మామూలు విషయం కాదు. వారి పిల్లల చదువులు, ఇళ్ళు, కుటుంబాలు, విజయవాడ సమీపంలో వారికి నివాస సౌకర్యం ఇలా ఎన్నో అంశాలను పరిష్కరించాల్సి ఉంది. మరి వీటన్నిటినీ బాబుగారు ఎలా;.., ఏం చేస్తారో..? చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vijayawada  ap capital  shivaramakrishnan committee  chandrababu naidu  

Other Articles