Prime minister narendra modi strategic approach

Prime Minister Narendra Modi strategic approach, Modi forms Government with strategic plans, Modi made his own group to facilitate smooth governance

Prime Minister Narendra Modi strategic approach

వ్యూహాత్మకంగా పగ్గాలు చేపట్టిన మోదీ!

Posted: 07/13/2014 10:18 AM IST
Prime minister narendra modi strategic approach

ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్నది చెప్పటం చాలా కష్టం.  ఏ చిన్న విషయంలోనైనా ఫలితాలు తారుమారయ్యే అవకాశం మెండుగా ఉంటుంది.  కానీ అసలు పరీక్ష గెలిచిన తర్వాతనే ఉంటుంది.  సంపూర్ణమైన మెజారిటీ రాకపోతే మిత్ర పక్షాలను కలుపుకోవాలి, ప్రభుత్వంలో వాళ్లకి సుముచితి స్థానాన్ని కలిగించాలి.  ఆ తర్వాత సొంత పార్టీలోవారిని సంతృప్తి పరచాలి లేదా శాసించగలగాలి.  అందరూ ఆశావహులే కాబట్టి అందరికీ హోదాలు ఇవ్వటమైతే కుదరదు కాబట్టి, తప్పక సంతృప్తి పరచేవాళ్ళకి తగిన అవకాశమిస్తూ, దానితోపాటే తన మాట వినేవాళ్ళతో తన సొంత బృందాన్ని తయారుచేసుకోవాలి.  అంతేకానీ, మంచితనానికి పోయి ఏకుమేకయ్యేవాళ్ళకి పట్టం కడితే చివరకు తన స్థానానికే ఎసరు తగులుతుంది.

వీటన్నిటిలో కృతకృత్యులయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.

భాజపా కి సంపూర్ణమైన మెజారిటీ రావటంతో చాలా వరకు ముందుగా చెయ్యవలసిన పని మోదీకి తగ్గింది.  కానీ అనుకున్న బిల్లులను పార్లమెంట్ లో పాస్ చేయించుకోవాలి అంటే మరింత మెజారిటీ ఉండటం అవసరం కాబట్టి ఎన్డియే మిత్ర పక్షాలను కలుపుకుని ప్రభుత్వాన్ని స్థాపించటం చేసారాయన.

సొంతగూటిలో తనను ప్రధానమంత్రిగా నిలబెట్టి, అద్వానీ లాంటి సీనియర్లు వ్యతిరేకించినా తన మాటమీద నిలబడి భాజప ప్రధానమంత్రి అభ్యర్థిగా మోదీకి పూర్తి మద్దతునిచ్చిన పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్, గుజరాత్ అల్లర్ల విషయంలో వాజ్ పాయ్ కి కూడా ఎదురు నిలిచి మోదీకి మద్దతునిచ్చిన అరుణ్ జైట్లీలకు మోదీ తన ప్రభుత్వంలో సముచితి స్థానాన్నిచ్చి గౌరవించారు.  వెంకయ్యనాయుడుకి తగిన హోదాలిచ్చారు.  అంతగా పడని అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, కలరాజ్ మిశ్రా, యశ్వంత్ సిన్హాలను దూరంగా ఉంచారు.  ఆద్వానీ మద్దతుదారైన సుష్మాస్వరాజని కూడా దూరంగా ఉంచారు.  అంతకు ముందు ప్రభుత్వంలో లోక్ సభలో ప్రతిపక్ష నాయకురాలిగా వ్యవహరించినా ఈ ప్రభుత్వంలో ఆమెకు కార్యవర్గంలో కూడా చోటివ్వలేదు.  

అత్యంత విశ్వాసపాత్రుడిగా వ్యవహరించి, ఎన్నికల సమయంలో తనకు అండదండగా ఉన్న అమిత్ షాకి మోదీ భారతీయ జనతా పార్టీ అధ్యక్షపదవిని ఇప్పించగలిగారు.  ఆ తర్వాత లోక్ సభ, రాజ్య సభలలోనూ తానే భాజపా పార్లమెంటరీ నేతగా బాధ్యతలు తీసుకుని, లోక్ సభకు రాజ్ నాథ్ సింగ్ ని రాజ్యసభలో అరుణ్ జైట్లీని భాజపా ఉపనేతలుగా అదనపు బాధ్యతలను అప్పగించారు.

లోక్ సభలో 13 మంది, రాజ్య సభలో ముగ్గురు ఛీఫ్ విప్ లను నియమించారు.   పార్లమెంటరీ వ్యవహారాల శాఖ ఉపమంత్రులు జవదేకర్, సంతోష్ గాంగ్ వర్ లకు రాజ్యసభ, లోక్ సభలలో ఉప ఛీఫ్ విప్ బాధ్యతలను అప్పగించారు.  

అలా నరేంద్ర మోదీ ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ ఎంపీలనే కాకుండా భాజపాని కూడా తన గుప్పిట్లో పెట్టుకున్నారు, పార్లమెంటు వ్యవహారాలు సజావుగా సాగే ఏర్పాట్లు కూడా చేసుకోగలిగారు.  ఈ పనులన్నిటినీ చక్కదిద్దుకుంటూనే ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కుంటూ, విదేశ సంబంధాలను పటిష్టం చేసుకుంటూ, ఎన్నికల హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ నరేంద్రమోదీ చక్కటి సారధ్యకౌశలాన్ని, వ్యూహరచనను ప్రదర్శించారు.  

ఇక మిగిలిందల్లా ప్రకృతి సహకరించి దేశం సస్యశ్యామలమవటం ఉంది.  అది దైవాధీనం కాబట్టి మోదీ తన చేతిలో ఉన్నంత వరకు పరిస్థితులను తనకు అనుగుణంగా మలుచుకోవటం కృతకృత్యులయ్యారనే చెప్పుకోవాలి!

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles