Demolition of illegal constructions madhapur

demolition of illegal constructions, demolitions make innocent end user lose, illegal constructions should be stopped in the beginning, precautionary measures obviate demolitions

demolition of illegal constructions

కట్టడాలను కూల్చివేసే అగత్యం ఎందుకు కలుగుతుంది?

Posted: 07/03/2014 11:25 AM IST
Demolition of illegal constructions madhapur

అక్రమ నిర్మాణాలంటూ నగరాలలో కొన్ని సంవత్సరాల తర్వాత వాటిని కూల్చివేసే అగత్యం ఎందుకు కలుగుతుందసలు?  అక్రమ నిర్మాణాలే అయితే వాటికి అనుమతులు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు ఎందుకు కలిగిస్తారు?  ఈ ప్రశ్నలకు జవాబు చెప్పలేరు.  

ఎందుకంటే ప్రభుత్వాలు మారగానే పద్ధతులు మారిపోతాయి!  అంతకు ముందు ప్రభుత్వం తప్పు అన్నది ఇప్పుడు ఒప్పవచ్చు, అప్పుడు ఒప్పు అన్నది ఇప్పుడు తప్పవచ్చు!  

అక్రమ నిర్మాణాలు ఉండగూడదన్నది నిజమే కానీ వాటిని మొగ్గలోనే తుంచకుండా ఉపేక్షించి, ఉపేక్షించి, తీరా అది పైకి లేచి, ధరలు పెరిగి, చేతులు మారిని తర్వాత తప్పు అనటం ఎంతవరకు సబబు?  దీనివలన ఎంతమంది అమాయకులు బలైపోతున్నారు.  ఒక ఇల్లు కట్టటమంటే సామాన్యుడికి సులభమైన విషయమా?  తీరా అప్పోసప్పో చేసి ఇల్లు నిలబెట్టుకుంటే అది అక్రమం అంటూ కూలగొట్టటం ప్రజాహితమా?

నిర్మాణాలు గాలిలో లేవవు కదా!  స్థానికంగా ఉండే అధికారులు ఏం చేస్తారు?  అక్రమ నిర్మాణాలు పైకి లేస్తుంటే చూసుకుంటూ ఎలా ఉండిపోతారు?  అంటే ఆ సమయంలో వస్తున్న అవినీతి సొమ్ముకు ఆశపడి మిన్నకుంటారు! కానీ తీరా పై అధికారులు లేదా ప్రభుత్వం కన్నెర్ర చేసేసరికి ఆ ఉద్యోగులు కూడా తప్పనిసరిగా ప్రభుత్వం పక్షం మాట్లాడుతారు.  అక్రమనిర్మాణాలు జరుగుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకున్నావని సంబంధిత అధికారులనెందుకు నిలదీయరు?  

ప్రస్తుతం హైద్రాబాద్ లో జరుగుతున్న కూల్చివేతలనే కాదు, దేశం మొత్తంలో జరుగుతున్నదిదే!  అక్రమ నిర్మాణమే అయితే వెంటనే ఎందుకు కూల్చివేయరు?  అది పూర్తై అమ్మకాలు కొనుగోళ్ళు జరిగేంతవరకు వేచి చూసి, అందులో సామాన్యుడు నివసిస్తుంటే అప్పడు తెలుస్తుందా అది అక్రమ నిర్మాణమని?  

మందుల దుకాణంలో డాక్టర్ ప్రిస్కిప్షన్ మీదనే మందుల అమ్మకం చేసినట్లుగా సిమెంట్, స్టీల్ కొనుగోళ్ళ సమయం నుంచే నియంత్రణనెందుకు పాటించగూడదు?  ప్రతి సిమెంట్, స్టీల్ అమ్మకాల మీద నిర్మాణానికి ఇచ్చిన అనుమతుల వివరాలు పొందుపరచి ఎప్పటి కప్పుడు అధికారులకా వివరాలను అందిస్తే, జరుగుతున్నది అక్రమ నిర్మాణమే అయితే అప్పుడే పట్టుబడదా?  రూ.50000 కి దాటిన వినియోగదారుల లావాదేవీలను బ్యాంక్ నుంచి ఆదాయ పన్ను శాఖకు చేరినట్లుగా, తలచుకుంటే అధిక ప్రమాణంలో జరిగే క్రయవిక్రాయాల స్థాయిలోనే అక్రమ నిర్మాణాలను నిలిపివేయవచ్చు.  

అప్పుడు కొనుగోలు దారుడు, మౌలిక సదుపాయాలనున్నాయీ అంటే చట్టబద్ధమైందన్న నమ్మకంతో కొనుగోలు చేసుకోగలుగుతాడు.  భూకబ్జా జరిగితే ఎక్కువగా దానిలో నష్టపోయేది నిజంగా కబ్జా చేసినవాళ్ళే కాదు,  వాళ్ళు ఆ ప్రాపర్టీని చిన్న చిన్న ముక్కలుగా చేసి తిరిగి అమ్మితే కొనుగోలు చేసిన వాళ్ళది.  అదెవరూ అంటే మధ్యతరగతివాళ్ళు!  అక్రమంగా నిర్మాణం చేసినవాళ్ళు డబ్బు చేసుకుని ఉడాయించేంత వరకు ఏ అధికారులూ మాట్లాడకపోవటం వలనే ఇవి జరుగుతున్నాయి.  

చట్టంలో కొన్ని లొసుగులున్నమాట నిజమే.  దొంగ వస్తువు దొరికినప్పుడు దాన్ని ఉపయోగిస్తున్నవారిని పట్టుకోవటమే కాకుండా ఆ వస్తువును జప్తు చెయ్యటం కూడా జరుగుతుంది.  అలాగే నిర్మాణం అక్రమంగా జరిగిందీ అంటే అది ఎప్పుడు జరిగిందన్నది చట్టం పట్టించుకోదు.  అక్రమంగా జరిగిన నిర్మాణమా, అయితే దాన్ని కూల్చివెయ్యండి అన్నదే చెప్పటం జరుగుతుంది.  

ఇప్పటికైనా, మొగ్గగా ఉన్నప్పుడే తుంచివేయాలని, అలా జరగకపోతే సంబంధిత అధికారుల మీదనే ముందుగా చర్య తీసుకోవాలనే నియమం ఉన్నట్లయితే అక్రమ నిర్మాణాలు జరిగేంత వరకు సినిమా చూసినట్లు చూస్తూ ఊరుకోరు.  విద్యుత్, నీటి సరఫరా చెయ్యటమనేది జరగదు.  ఆ తర్వాత కరెంట్ కట్ చెయ్యటం కాదు ముందు ఎందుకు ఇచ్చారన్న ప్రశ్న వెయ్యాలి!  ఆటో రోడ్డు మీద తిరుగుతుందీ అంటే అందుకు అవసరమైన అనుమతులూ, నడిపే మనిషికి లైసెన్స్ ఉందనే అందులో ఎక్కుతారు.  అంతేకానీ ఆటో నడిపే మనిషిని నీ లైసెన్స్ చూపించు, నీ బండి పేపర్లు చూపించమని అడగరు.

సరైన నియమావళిని రూపొందించినట్లయితే అక్రమమైన కట్టడాలు ఉండవు, నష్టపోయే సామాన్యులూ ఉండరు.   

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles