పూర్వకాలంలో రాజుల దగ్గర పనిచేసే వాళ్ళతో కూడా రాజులకు ముప్పు పొంచివుండేది. యుద్ధాలలో నాయకత్వం వహించి సేనాధిపతి అయినవాళ్ళతో కూడా రాజులు జాగ్రత్తగా ఉండేవారు. ఎందుకంటే బలవంతుడైనవాడు తన కింద వున్న సేనను ఉపయోగించుకుని రాజు మీద తిరుగుబాటు చేసే అవకాశం ఉంది కనుక! అటువంటి సందర్భం వచ్చేంత వరకు వేచి చూడకుండా, బలవంతుడిగా తయారవుతున్నవాడిని అణచటానికి ఒక మార్గం దేశద్రోహం నేరం అంటగట్టి దేశ బహిష్కరణ చెయ్యటం. కానీ బతికుంటే ఆ మనిషి మరోసారి కక్ష సాధించినా సాధించవచ్చు. అందువలన రెండవ మార్గం, సురక్షితమైన మార్గం ఆ యోధుడిని యుద్ధానికి పంపించటం. ఆ యుద్ధం కూడా బలవంతులైన శత్రురాజుల మీదకు గెలిచే అవకాశం తక్కువగా ఉన్నచోటికి పంపించటం! గెలిచాడా బలమైన శత్రువు సంహరించబడతాడు, ఓడాడో ఆ శత్రు రాజు చేతిలో ఈ యోధుడే హతమారుతాడు. అదే తనకిష్టులైన యోధులను సులువుగా గెలిచే యుద్ధాలకు, అధిక సైన్యాన్ని కూడా తోడుగా పంపి వాళ్ళు గెలిచే అవకాశం బాగా ఇచ్చి, వాళ్ళకి బిరుదులు ఇచ్చి సత్కారాలు చెయ్యటానికి అవకాశం ఉంటుంది.
ఇలాంటి రాజనీతిని ప్రజాస్వామ్యంలో అమలుచేస్తే మాత్రం అది ప్రజలను మోసం చేసినట్లే అవుతుంది! మంచి మాటలతో చేసే నయవంచన అవుతుంది!!
పేరుకి అన్ని వర్గాల వారికీ అవకాశం ఇస్తూ, ఇతర కులాలవారికి పార్టీ టికెట్ ని వాళ్ళు గెలవ లేని స్థానాలలో పోటీకి కేటాయించి, తమ వర్గీయులకు గెలుపొందే స్థానాలలో నిలబెట్టినట్లయితే మాత్రం అది ప్రజలను దగా చెయ్యటమే అవుతుంది! పార్టీ అధినాయకుడికి గెలిచే అవకాశాలు ఎక్కడ ఉన్నాయన్నది తెలుస్తుంది. ఆ మాత్రం అంచనా వెయ్యగలరు. కానీ గెలిచే అవకాశం తక్కువగా, లేక అసలే లేని చోట ఇతర కులాల నాయకులను నిలబెట్టినట్లయితే, గెలిచారంటే ఆ స్థానం కూడా దక్కినట్లవుతుందని, ఓడిపోయారూ అంటే చూసారా మేమైతే అవకాశం ఇచ్చాం అని చెప్పుకోవటానికి పనికివస్తుందని అనుకుంటే మాత్రం అది కుటిల రాజనీతి అనిపించుకుంటుంది. ప్రజాస్వామ్య సిద్ధాంతానికి గొడ్డలి పెట్టు అవుతుంది.
తెలుగు దేశం పార్టీ విషయంలో ఎలాంటి రాజనీతిని అవలంబిస్తున్నారో ఎన్నికలు అయిపోతేనే కానీ పూర్తిగా అర్థం కాదు. అభ్యర్థులను ఎంపిక చేసినప్పుడు ఏ కులాల నిష్పత్తిలో జరిగిందో, ఎన్నికలైపోయి ఫలితాలు వెలువడిన తర్వాత కూడా చిన్నా చితకా తేడాతో అదే నిష్పత్తిలో అన్ని కులాలవారు ఎంపీలు లేక ఎమ్మల్యేలు అయినట్లయితే నిజంగా ప్రజాస్వామ్య పద్థతిలో అభ్యర్థుల ఎంపిక జరిగినట్లే.
అలా కాకుండా, తీరా ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీని పోషిస్తున్న వర్గంవారే గెలుపుగుర్రాలుగా నిలిచి వాళ్ళే ప్రభుత్వాన్ని స్థాపించినట్లయితే తెలుగు దేశం పార్టీ కూడా మరోసారి తెలుగు ప్రజలను మోసం చేసినట్లే అవుతుంది. కాబట్టి లిట్మస్ టెస్ట్ ఇదే- కులాల నిష్పత్తి పోటీకి నిలబెట్టిన అభ్యర్థులలో ఉన్నట్లుగానే గెలిచిన అభ్యర్థులలో కూడా ఉందా లేదా అని చూడటమే!
తెలుగు దేశం పార్టీకి ఇది ఆఖరు అవకాశం అని చెప్పుకోవచ్చు. ఈసారి తన నిజాయితీని నిరూపించుకోకపోతే మాత్రం ఆంధ్రా ప్రజలు మరెప్పుడూ నమ్మరు.
వైయస్ ఆర్ కాంగ్రెస్ తమ వర్గీయులకే స్థానం ఇస్తామని బాహాటంగా చెప్తున్నారు కాబట్టి అది మోసం చేసినట్లవదు. తెదేపా కాని, భాజపా కాని దేశంలోంచి తరిమికొట్టాలి, నామరూపాలు లేకుండా చెయ్యాలి అని ఆకాంక్షించే కాంగ్రెస్ పార్టీ విషయంలో పరిశీలిస్తే, మిగతా విషయాలు ఎలా ఉన్నా ప్రస్తుతం మనం చర్చిస్తున్న వివిధ వర్గాలకు అధికారం చేపట్టటానికి అవకాశం ఇచ్చే విషయంలో చూస్తే, ఆ పార్టీలో అన్ని వర్గాలకూ సమానంగా అవకాశాలు లభించాయని చరిత్ర చెప్తోంది.
పి.వి.నరసింహారావు కానీ, సంజీవయ్య కాని కాంగ్రెస్ లో కాకుండా తెదేపా లేక మరేదైనా పార్టీలో ఉండి ఉంటే అధికారంలోకి వచ్చివుండేవారా అన్నది అనుమానమే! అసలు కెసిఆర్ కి తెదేపాలోంచి బయటకు పోవలసిన అవసరం ఎందుకొచ్చింది? కెసిఆర్ నే ముఖ్యమంత్రిని చేసి చంద్రబాబు పార్టీ అధ్యక్ష పదవిలోనే బాధ్యతలను నెరవేర్చటానికి పూనుకుంటే అసలాయన తెదేపాని విడిచి పోయేవారా, కొత్త పార్టీని స్థాపించివుండేవారా, రాష్ట్ర విభజన అంశం ఇంతవరకు వచ్చి వుండేదా?
గతం గురించి మాట్లాడుకునేది అందులోంచి పాఠాలు నేర్చుకోవటానికే కాని జరిగిపోయినదాన్ని తవ్వి ఇంకా విమర్శించటానికి కాదు సుమా!
అందువలన, ఒక విధంగా తెదేపా అనుసరించిన కులరాజకీయం రాష్ట్ర విభజనకు దోహదం చేసిందని చెప్పుకోవచ్చు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం ఉద్యమం ఎప్పటి నుండో నడుస్తున్నా వాళ్ళందరినీ సంఘటిత పరచి, తెలంగాణా వస్తేనే కాని మనకు భవిత లేదు అనే అభిప్రాయాన్ని తెలంగాణా ప్రజల్లోకి బలంగా వేళ్ళూనేట్టుగా చేసింది తెలంగాణా రాష్ట్ర సమితి వచ్చిన తర్వాతనే.
అందువలన, రాష్ట్రంలో అధికారంలోకి రావటానికి తెదేపాకి మరోసారి అవకాశం వచ్చింది కాబట్టి, మరోసారి అటువంటి తప్పు చెయ్యకుండా సమాజంలో అన్ని వర్గాల నుండి ప్రజాప్రతినిధులు వచ్చి అన్ని వర్గాలకూ ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వాన్ని స్థాపించి నడిపినట్లయితే ఆ పార్టీ చిరకాలం నిలిచివుంటుంది.
తెలుగు దేశం పార్టీ రాష్ట్రంలో అభివృద్ధిని సాధించిందన్న అభిప్రాయం ప్రజల్లో కొద్దో గొప్పో ఉంది కాబట్టి సామాజిక పరంగా కూడా న్యాయం చేసే పార్టీగా పేరు తెచ్చుకున్నట్లయితే రాబోయే కాలంలో ఎక్కువ కాలం అధికారంలో ఉండటానికి అవకాశం మెండుగా ఉంది.
ప్రస్తుత పరిస్థితుల్లో పటిష్టమైన పార్టీ, పటిష్టమైన ప్రణాళికతో ప్రభుత్వాన్ని నడిపే పార్టీ సీమాంధ్రకు ఎంతైనా అవసరం. అభివృద్ధి పథంలో చెయ్యవలసిన పని చాలా వుంది కాబట్టి ప్రజల సంక్షేమంలో పనిచేసి, ప్రజల మనసుని చూరగొనే పార్టీ, తెలంగాణా విడిపోయిన తర్వాత మిగిలే శేషాంధ్రప్రదేశ్ ని ముందుకు నడిపించటం ఎంతో అవసరం.
చివరగా,
తెలుగు దేశం పార్టీని పోషిస్తూ అన్నివేళలా వెన్నుగాచే కులస్తులు చంద్రబాబు నాయుడుకి బలమైతే, మరో పక్క వాళ్ళే బలహీనతగా మారుతున్నారు. అపర రాజనీతి కోవిదుడైన చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఒత్తిడులకు లొంగి, సత్యాన్ని విస్మరించి తెదేపాని ముందుకు పోకుండా చేస్తున్నారన్నదానికి మచ్చుకి రెండు ఉదంతాలను తీసుకుంటే-
2009 లో సత్తెనపల్లిలో బిసి అభ్యర్థి నిమ్మకాయల రాజనారాయణ యాదవ్ అతి తక్కువ వోట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన పట్టుదలతో అక్కడ కృషి చెయ్యబట్టి ఇప్పుడు తెదేపాకు అక్కడ ప్రాభవం పెరిగింది. ఆయన అక్కడ నిలబడితే గెలవటం ఖాయం. కానీ ఆ బిసి అభ్యర్థికి అవకాశం ఇవ్వకుండా సత్తెనపల్లిలో తన కులస్తుడికి టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు అదే అభ్యర్థి స్వతంత్రంగా పోటీ చేస్తే? ఇలా సొంత కులస్తుల ఒత్తిడికి తలవొగ్గినట్లయితే పార్టీ విజయం మాట అటుంచి మనుగడకే ప్రమాదం రాదా?
అలాగే, తాడేపల్లి గూడెం ఎమ్మెల్యే ఈలి మదుసూధనరావు (నాని) తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎంతో కాలంగా తాడేపల్లిగూడెంలో రాజకీయాలలో ఉన్న ఆ కుటుంబ పరపతిని కాదని, అక్కడ గెలిచే అవకాశం ఎక్కువగా ఉన్న ఆయనకు తాడేపల్లి గూడెం టికెట్ ఇవ్వకుండా, ఎన్నికల పొత్తులో ఆ స్థానాన్ని కాస్తా భాజపాకి ధారాదత్తం చేసారు చంద్రబాబు!
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more