Still telangana fight is left says kcr

Still Telangana fight is left says KCR, Telangana reached interval KCR says, TDP, Congress, BJP, YSRCP, Polavaram project design,

Still Telangana fight is left says KCR, Telangana reached interval KCR says

తెలంగాణా రావటం ఇంటర్వెల్- క్లైమాక్స్ బాకీవుంది!

Posted: 03/20/2014 10:10 AM IST
Still telangana fight is left says kcr

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావంలో ఇంతవరకు జరిగింది ఇంటర్వెలని, క్లైమాక్స్ ఇంకా ఉందని అన్నారు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు.  కాంగ్రెస్, తెదేపాలు దుర్మార్గులు, వాళ్ళు చెయ్యరు, చెయ్యలేరు అంటూ మండిపడ్డ కెసిఆర్ తెలంగాణా ఆత్మగౌరవాన్ని తెదేపా ఆంధ్రాలోను, కాంగ్రెస్ ఢిల్లీలోను తాకట్టు పెట్టిందని అన్నారు కెసిఆర్.   సోనియా ఫోన్ చేస్తే తెలంగాణా కాంగ్రెస్ నేతలు కిక్కురుమనరని, చంద్రబాబు మనసేమే ఆంధ్రా మీదనే ఉందని ఆరోపించిన కెసిఆర్, చంద్రబాబు మనసు తెలంగాణా వైపుందంటే నమ్మలేమని అన్నారు.  మనకంటిని మన వేలితోనే పొడవాలని చూస్తున్న చంద్రబాబు సింగపూర్, మలేషియా దేశాలలో తిరిగి వాటిలాగా రాష్ట్రాన్ని మారుస్తామని అంటున్నారు కానీ, ఆయనే మారిపోయారని, పిచ్చి లేచి మెంటల్ ఖరాబై పిచ్చి పిచ్చి కూతలు కూస్తున్నారని కెసిఆర్ వ్యాఖ్యానించారు.

మరోసారి పార్టీల వైఖర్లను స్పష్టం చెయ్యమంటున్న కెసిఆర్

అంతకు ముందు రాష్ట్ర విభజన విషయంలో తెదేపా, కాంగ్రెస్, వైకాపాలను తమ వైఖర్లేమిటో స్పష్టం చెయ్యాలని అడుగుతూ వచ్చిన కేసిఆర్ ఇప్పుడు నదీజలాలు, ఉద్యోగుల విషయంలో తెదేపా, భాజపా, కాంగ్రెస్ పార్టీల వైఖరి ఏమిటో చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

పోలవరం ప్రాజెక్ట్ ని ప్రస్తుతమున్న డిజైన్ లో కట్టనివ్వం, ఆంధ్రా ఉద్యోగులకు ఆప్షన్లుండవ్.  ఆంధ్రాలోనే పనిచెయ్యాలి.  తెలంగాణ ఉద్యోగులు తెలంగాణలనే పనిచేస్తరు తెలంగాణ ప్రాజెక్ట్ లలో నీళ్ళు నిండాకనే ఆంధ్రకు నీళ్ళొదుల్తం.  ఇది మా పార్టీ వైఖరి.  చంద్రబాబూ నీ పాలసీ ఏమిటో చెప్పు.  వెంకయ్య నాయుడు రాజ్యసభలో తెలంగాణకు అడ్డు పడటం టివిలో అందరూ చూసింరు.  పోలవరం విషయంలో భాజపా వైఖరేమిటో చెప్పాలంటూ కెసిఆర్ డిమాండ్ చేసారు. 

తెలంగాణాను అభివృద్ధి చెయ్యటానికి కాని, నీళ్ళు ఉద్యోగాలు పోలవరం విషయంలో పోరాటం చెయ్యటానికి కాని తెలంగాణా రాష్ట్రంలో తెలంగాణా రాష్ట్ర సమితి అధికారంలో ఉండవలసిందేనంటూ కెసిఆర్ వాదించారు. 
రేపు ఎన్నికల్లో 16 స్థానాల్లో టిఆర్ఎస్ ని గెలిపించాలి.   అప్పుడే బిడ్డా మా వాటా మాకు అక్కడ పెట్టి పొండి అని కేంద్రాన్ని నిలదీయొచ్చు, నీళ్ళు నిధులు జాతీయ ప్రాజెక్ట్ లను కొట్లాడి తీసుకోవచ్చు అని అన్న కెసిఆర్, మన తలరాతలు మనమే మార్చుకోవాలని, కొత్త రాష్ట్రం, కొత్త పంథా, కొత్త నాయకత్వం రావాలని పిలుపునిచ్చారు.

ఆటో డ్రైవర్లకు అభయ హస్తం

తెలంగాణా రాష్ట్ర సమితి వస్తే తెలంగాణా రాష్ట్రంలో ఆటో డ్రైవర్లకు మూడునెలలకోసారి కట్టే రవాణా పన్నుకి మినహాయింపు ఉంటుందని, వాళ్ళు పూర్తిగా కట్టాల్సిన అవసరమే లేకుండా చేస్తామని, వాళ్ళకి పోలీసులు, రవాణా శాఖలనుంచి వేధింపులు లేకుండా చూస్తామని, తెలంగాణాలో 10 జిల్లాలలో ఉన్న 2 లక్షల ఆటో డ్రైవర్ల సంక్షేమంలో జీవన భద్రత, ఆరోగ్య బీమా చేయిస్తామని కెసిఆర్ వాగ్దానం చేసారు.

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles